25, జనవరి 2016, సోమవారం

పాత్రనుబట్టే గాత్రం


పూర్వం తెలుగు సినీ సామ్రాజ్యాన్ని ఎన్టీఆర్, ఏఎన్నార్ అనే ఇద్దరు నటదిగ్గజాలు ‘ద్విచక్రాధిపత్యం’గా ఏలుతున్న రోజుల్లో, ఘంటసాల అనే గాయక చక్రవర్తి, పాటలకు సంబంధించి వారిద్దరికీ గాత్ర దానం చేస్తుండేవారు. వారు విడివిడిగా నటించిన సినిమాల్లోనే కాకుండా ఇద్దరూ కలిసి కలివిడిగా వేషాలు వేసిన చిత్రాల్లో కూడా ఘంటసాల వారి వారి గాత్రాలకు తగ్గట్టుగా పాటలు, పద్యాలు  పాడి, నిజంగా వారే పాడుతున్నారా అనే  భ్రమ కల్పించేవారు. పాత్రనుబట్టి గాత్ర సౌలభ్యం ప్రదర్శించడం అనే ఈ  ఘంటసాల ప్రక్రియను నేటి రాజకీయ నాయకులు అంది పుచ్చున్నారేమో అనిపిస్తుంది, అనేక సందర్భాలలో వాళ్ళు చేస్తున్న ప్రకటనలను గమనిస్తే. అధికారంలో వున్నప్పుడు ఒకరకంగా, లేనప్పుడు మరో రకంగా. ఇందుకు ఎవ్వరూ మినహాయింపు కారు. అన్నీ ఆ తానులో ముక్కలే అని అనిపించక మానదు, వాటిని సూక్షంగా పరిశీలిస్తే.
ఉపశ్రుతి: ఒకానొక పత్రికలో అనుదినం  రాశిఫలాలు రాసే ఒకానొక జ్యోతిష్కుల వారు అనివార్యకారణాల కారణంగా ఒకసారి సమయానికి వాటిని అందించలేకపోయారు. ఆ విషయాన్ని సంబంధిత సిబ్బంది సంపాదకుడి చెవిన వేశారు. అప్పుడాయనగారు ఏమాత్రం కంగారు పడకుండా,
అర్ధనిమీలిత నేత్రాలతో ఇలా ఆర్డరు వేశారు. ‘నిన్న మేషానికి రాసింది ఈరోజు  వృషభానికి తగిలించండి. వున్నవి పన్నెండు రాశులు, వాటి ఫలితాలనే అటూఇటూ మార్చి రాయండి. ఈ రోజుకు పని అయిందనిపించండి’

   
NOTE: COURTESY IMAGE OWNER

కామెంట్‌లు లేవు: