13, జనవరి 2016, బుధవారం

మార్పు మంచిదే


సూటిగా......సుతిమెత్తగా.........

(TO BE PUBLISHED IN TELUGU DAILY "SURYA" ON 14-01-2016, THURSDAY)

“ఈ బుద్ది బుధవారం దాకా వుంటే బూరెలు వొండి పెడతా”  అన్నదట ఓ ఇల్లాలు.
ఎప్పుడూ చిటపటలాడే మొగుడు చిద్విలాసంగా నవ్వడం చూసి అబ్బురపోయిన భార్య వ్యక్తం చేసిన భావం  అది.
ఇప్పుడీ సామెతల ప్రస్తావన ఎందుకంటే దానికి కారణం వుంది. దయచేసి చిత్తగించండి.
“నాదీ హైదరాబాదు కాదు. సిద్ధిపేట నుంచి వచ్చా. ఆ మాటకొస్తే నేనూ సెటిలర్నే”
ఈమాటలన్నది ఎవరో కాదు, తెలంగాణా ఐ.టీ.శాఖామంత్రి, కేసీఆర్ తనయుడు కే. తారక రామారావు.
“రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు. ఈ రెండూ కలిసికట్టుగా అభివృద్ధిలో ముందుకు సాగాలి. ఏపీ లాగే తెలంగాణా కూడా వెనుకబడిన రాష్ట్రమే. దానికి కూడా వీలైనంత సాయం చేయాలని కేంద్ర మంత్రులకు చెబుతుంటా”  ఈమాటలు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.
టీఆర్ ఎస్ అగ్రనాయకుడు కేటీఆర్,  టీడీపీ అధినాయకుడు చంద్రబాబు వెలిబుచ్చిన ఈ అభిప్రాయాలపై మీడియాలో విస్తృత చర్చలు జరిగాయి.
కేటీఆర్ ఏమిటీ అలా మాట్లాడడమేమిటి అని కొందరు మెటికలు విరిచారు. హైదరాబాదులో వున్న  సెటిలర్లపై ఇంతటి అవ్యాజ ప్రేమ ఒలకబోయడానికి కారణం జీహెచ్ఎం సీ ఎన్నికలే అని ఆరోపించారు. గతంలో హైదరాబాదులోని సెటిలర్లను అననిమాట లేదు, ఇప్పుడు ఈ విధంగా మాట మార్చి మాట్లాడడం కేవలం రాజకీయ లబ్ది కోసమే అని ప్రత్యర్ధుల ఉవాచ.
మరోపక్క నాలుగు మంచి మాటలు చెప్పిన చంద్రబాబుకు కూడా విమర్శలే మిగిలాయి. తెలంగాణా మీద ఆయనకు ఎక్కడలేని అభిమానం వెల్లువెత్త డానికి కారణం ఎన్నికలు తప్ప వేరు కారణం కాదు పొమ్మన్నారు. అంతేకాదు, బహిరంగ సభ, అందులోనూ ఎన్నికల ప్రచార ప్రారంభసభలో పాలక పక్షం  టీఆర్ఎస్  పై కానీ, ఆపార్టీ అధినేత  కేసీఆర్ పై కాని పల్లెత్తు మాట అనకుండా, బాబు ప్రసంగం చప్పగా సాగడానికి నోటుకు ఓటు కేసే కారణమని అన్నవారుకూడా లేకపోలేదు.


కాసేపు, వారి వాదనతోనే ఏకీవభించి చూద్దాం. కేటీఆర్ చెప్పే మాటలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అనుకుందాం. కారణం ఏదైతేనేం ఆ మార్పునే కదా ఆయన ప్రత్యర్ధులు లోగడ కోరుకున్నది. హైదరాబాదులో స్థిరపడ్డ   సీమాంధ్రులను తెలంగాణా ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూడాలనే కదా వారు గతంలో కోరుకున్నది. మరి అటువంటి మార్పును టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ స్వయంగా  ప్రదర్శించి చూపుతున్నప్పుడు అభ్యంతర పెట్టాల్సిన అవసరం ఎక్కడ వుంది.    అల్లాగే చంద్రబాబు నాయుడు,  టీఆర్ఎస్ అధినేతపై సూటిపోటి బాణాలు విసరకుండా తన ప్రసంగం ముగించి ఉండవచ్చు. గతంలో ఆయన ప్రత్యర్ధులు ఆయన నుంచి కోరుకున్న మార్పు అదే కదా! అయినా దాన్ని తప్పుపట్టడంలో అర్ధం ఏమిటి?
నిజానికి, నిప్పూ, ఉప్పూ లాంటి ఈ ఉభయ పార్టీలు గిల్లికజ్జాలు మానుకుని, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు మంగళం పాడితే బాగుంటుందని లోగడ బలంగా కోరుకున్న వాళ్లకు కూడా వారిలో వచ్చిన ఈ సానుకూల మార్పు రుచించినట్టు లేదు. గతంలో టీఆర్ఎస్  నాయకులు సీమాంధ్రుల విషయంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ చేస్తున్న ప్రకటనలే ఇందుకు సాక్ష్యం. తెలంగాణా వ్యతిరేకి అని లోగడ చంద్రబాబుకు ముద్రవేసిన వాళ్ళు, ఇప్పుడు అదే బాబు తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడడం, టీఆర్ ఎస్ పై లోగడ మాదిరిగా ఒంటి కాలుమీద లేవకపోవడం చూసి, గతాన్ని తవ్వుకుంటూ వ్యాఖ్యలు చేస్తున్నారే కానీ స్వభావంలో వచ్చిన సానుకూల మార్పును స్వాగతిస్తున్నట్టు లేదు. మానవ మనస్తత్వం లోని చమత్కారం ఇదే. మనకు ఇష్టం లేని మనుషులు మారాలని కోరుకుంటాం. మారితే, ఏదో వారి అవసరం కోసం మారారు కాని, అది నిజమైన మార్పు కాదని మరో తీర్పు ఇచ్చేస్తాం.
ఎన్నికల ప్రచారం అంటేనే మాటల ఈటెలు విసురుకోవడంగా మారిన ఈ రోజుల్లో, కారణాలు ఏవైనా ఇద్దరు నాయకులు సంయమనంతో ప్రసంగాలు చేయడం ఆహ్వానించతగ్గ  పరిణామం. అయితే అగ్రనాయకులు సంయమనం పాటించినంత మాత్రాన ద్వితీయ శ్రేణి నాయకులు నోరు కుట్టేసుకుంటారు అనుకోవడం కూడా భ్రమ. నిజాం కాలేజీ మైదానంలో టీడీపీ, బీజేపీ కలిసి నిర్వహించిన బహిరంగ సభలో ఇతర వక్తల ప్రసంగాలు సాగిన తీరే ఇందుకు నిదర్శనం. ప్రచార పర్వం ప్రధమ అధ్యాయమే ఇంత ‘కసి’వత్తరంగా మొదలయిందంటే ఇక ముందు ముందు నాయకుల  ఎన్నికల  ప్రసంగాలు ఎంతటి వికృత పోకడలకు పోతాయో ఊహించడం కష్టం. ఒకరు ఒక మాట అంటే, ప్రత్యర్ధులు లెక్కపెట్టి మరో  పది అంటించే రోజుల్లో జీవిస్తున్నాము. తమలపాకుతో ఒకరు సున్నితంగా అంటే ఎదుటివాళ్ళు తలుపు చెక్కతో నాలుగు తగిలిస్తున్నారు. ఏతావాతా సమాజంపై  ఈ వికృత ప్రచార పోకడల ప్రభావం పడుతోంది. ప్రచార కాల  వ్యవధిని కుదిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, దానికి కారణాలు ఏవైనా, అందరూ దాన్ని స్వాగతించడానికి కారణం దూషణ పర్వానికి  కొంతయినా అడ్డుకట్ట పడుతుందనే ఆశతోనే. 
నాయకుల్లో వచ్చిన ఈ మార్పు తాత్కాలికమే కావచ్చు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలకోసమే కావచ్చు.  ఈ మార్పు వారికి తాత్కాలిక లాభాలు తెచ్చిపెట్టవచ్చు, కానీ ప్రజలకు మాత్రం శాశ్విత ప్రయోజనం కలిగిస్తుంది. వారి మనసులు కలుషితం కాకుండా చూస్తుంది.  
ఉద్యమ కాలంలో హైదరాబాదులో ఒక వర్గం వారు ఖేద పడే సంఘటనలు ఎన్నోజరిగాయి. మనసులకు తగిలిన ఆ గాయాలు ఇప్పుడిప్పుడే  మానుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కొందరి మనస్సుల్లో గూడుకట్టుకుని భయపెట్టిన సందేహాలు, ఈ ఇరవై మాసాల వ్యవధిలో పటాపంచలు అయ్యాయని చెప్పలేము కానీ, అవి నిజం కాలేదన్న ఊరట వారికి కలుగుతున్న మాటయితే వాస్తవం. రాష్ట్ర విభజనకు పూర్వం, తెలంగాణా రాష్ట్రము ఏర్పడ్డ తొలినాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడున్న వాతావరణం వేయి రెట్లు నయం. టీఆర్ ఎస్ లో అందరూ కోరుకున్న మార్పు ఇదే. ఆ మార్పు వచ్చినప్పుడు దాన్ని స్వాగతించడం కనీస ధర్మం.
ఈ మార్పు శాస్వితమా, పరమ తాత్కాలికమా అంటే దానికి జవాబు చెప్పాల్సింది కాలమే. కాలమే అన్ని సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. ఎప్పటికప్పుడు పాత సంగతులను గుర్తు చేసుకుంటూ వుంటే కాలం కూడా ఏమీ చేయలేదు. “బుద్ది బుధవారం దాకా  వుంటే......” అన్న సామెతను మొదట్లోనే ప్రస్తావించడానికి ఇదే కారణం.
అయితే సగటు మనిషి ఆశాజీవి. మనం ఎక్కాల్సిన రైలు టైముకు వస్తుందనీ, ఎదురు చూసే బస్సు వెంటనే వస్తుందనీ, ఆటోవాడు ఎగస్ట్రా డబ్బులు అడగకుండా వస్తాడని ఆశపడకపోతే సామాన్యుడు జీవితంలో నెగ్గుకు రావడం అతి కష్టం.
అల్లాగే, రాజకీయులు, వారి రాజకీయాలు మంచి దిక్కుగా మారతాయనీ, ఆ మార్పు కూడా మారిపోకుండా కలకాలం  నిలబడుతుందనీ ఆశ పడక తప్పదు. లేకుంటే, బతుకు బస్టాండు అంటారు చూసారు, అదే జరిగేది. అదే మిగిలేది.
ఉపశ్రుతి: ఓ సినిమా నిర్మాత రచయితను పిలిచి రెండర్ధాలు వచ్చేట్టు డైలాగులు రాయమని అడిగాడట. ఆ రచయిత చిద్విలాసంగా ఓ నవ్వు  నవ్వి, “ఇప్పుడలా రాసేవాళ్ళు ఫీల్డులో ఎవ్వరూ లేరు, అందరూ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు” అన్నాట్ట.
ఇది ఎన్నికల వేళ.  అలా పరోక్షంగా రెండర్ధాలు వచ్చేట్టు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. యెంత చండాలమయినా  ఏకంగా ప్రసంగాలలో కక్కేయవచ్చు.

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

కామెంట్‌లు లేవు: