అనగనగా ఓ ఏకాంబరం అడివి దారిన ఒంటరిగా
వెడుతుంటే గడ్డాలు మీసాలు పెంచుకున్న ఓ స్వామి హఠాత్తుగా ఎదురుపడి అతడి చేతిలో ఓ మకిలి పట్టిన రాగి దీపం వుంచి, ఎలా వచ్చాడో అలా మాయం
అయిపోయాడు. ఆశ్చర్య పోతున్న ఏకాంబరం ఎదుట దీపం భూతం ప్రత్యక్షమయింది. అడగగానే అది అన్ని
కోరికలు తీరుస్తుందని ఏకాంబరం సంబరపడబోతే ఆ భూతం వారించి ఇలా అంది.
‘నువ్వనుకుంటున్నట్టు నేను చందమామ కధలోని భూతాన్ని కాదు. నేను మరో టైపు. నాకు
అబద్ధం చెప్పేవాళ్ళంటే అస్సలు గిట్టదు. నాముందు ఎవరయినా అబద్దం చెప్పారంటే ఊరుకోను.
పైగా చెంప చెల్లుమనిపిస్తాను జాగ్రత్త’
అంది.
ఏకాంబరం ఆ భూతం దీపాన్ని జాగ్రత్తగా
ఇంటికి తీసుకుపోయి భార్యాపిల్లల ముందు దాన్ని పరీక్షించాలని అనుకున్నాడు. రాత్రి
భోజనాలు అయిన తరువాత భార్యను, కొడుకును దగ్గర కూర్చోబెట్టుకుని దీపం భూతాన్ని
పిలిచాడు. పిలవగానే ప్రత్యక్షమయింది భూతం.
ఏకాంబరం కొడుకుని అడిగాడు ‘ఈరోజు
స్కూలుకి వెళ్ళావా?’ అని.
‘వెళ్లాను, ఈరోజు లెక్కల మాస్టారు రాకపోతే సైన్సు మాస్టారు ఆ
క్లాసు తీసుకున్నాడు’ అని కొడుకు చెప్పాడు. భూతం అతడి చెంప చెళ్ళుమనిపించింది. ‘లేదు
లేదు స్కూలు ఎగ్గొట్టి కృష్ణావతారం సినిమాకు వెళ్ళాన’న్నాడు ఆ కుర్రాడు. అ జవాబు
విని భూతం మళ్ళీ అతడి గూబ గుయ్యిమనిపించింది. అబద్ధం చెబితే అది ఊరుకునే రకం కాదని
గ్రహించిన ఆ పిల్లాడు, ‘లేదు లేదు,
స్కూలుకు డుమ్మా కొట్టి నా ఫ్రెండ్స్ తో
కలిసి ‘లేచి పోదాం రా’ సినిమా చూసాను’ అని నిజం చెప్పేసాడు.
తండ్రి కల్పించుకుని ‘ఇంత లేవు,
అప్పుడే అడల్ట్ సినిమాలు కావాల్సి వచ్చాయా? కాలేజీలో చేరే దాకా సినిమాలే చూడలేదు’ అన్నాడు.
అతడి మాట ముగిసేలోగానే భూతం ఏకాంబరం చెంప పగలగొట్టింది.
ఇదంతా చూస్తూ తల్లి అంది, ”నేనెప్పుడు
చెబుతుంటాను చూశారా అదే నిజమయింది, మన పిల్లాడికి అన్నీ మీ బుద్దులే.”
ఈసారి ఆగదిలో మరోసారి చెంప చెల్లుమన్న శబ్దం వినిపించింది. ఏకాంబరం తేరుకుని చూసేసరికి,
భార్య కందిన తన చెంప నిమురుకుంటూ కనిపించింది.
(ఓ ఇంగ్లీష్ గల్పికకు చేసిన
స్వేచ్చానువాదం)
NOTE: Courtesy Image Owner
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి