చిన్నప్పుడు మా వూరికి దగ్గరలో ఓ చిన్న రైలు స్టేషన్ వుండేది.
చిన్నప్పుడు వున్నది ఇప్పుడు లేదా అంటే
నిజంగానే లేదు. ఖర్చులు కూడా గిట్టుబాటు
కావడం లేదని ఎత్తేశారు. అదన్నమాట. ఆ
స్టేషన్ ని ఆనుకుని ఒక ఎత్తయిన భవనం వుండేది. నిజానికి అది అన్ని వసతులువున్న భవంతి
కాదు. రైల్వే వాళ్ళ సిగ్నల్ కేబిన్. అక్కడ పనిచేసేవాళ్ళని మచ్చిక చేసుకుని ఇనుపమెట్ల మీదుగా పైకెక్కి చూసేవాళ్ళం. తుపాకులు వరసగా తిరగేసిపెట్టినట్టు
ఇనుప కమ్మీలు ఉండేవి. వాటిని గట్టిగా లాగి
పెడితే ఎక్కడో దూరంగా వున్న రైలు పట్టాలు
విడిపోవడమో, కలుసుకోవడమో జరిగేది. రైలు వెళ్ళే మార్గాన్ని మార్చడానికి అదో ఏర్పాటు.
ఇప్పటికీ అలాగే ఉండవచ్చు. అక్కడ పనిచేసేవాళ్ళు రాత్రీ పగలూ తేడా లేకుండా పనిచేస్తూ
ఆ దోవన వెళ్ళే రైళ్ళు, ఒకదానితో మరొకటి డీ
కొట్టుకొట్టుకోకుండా, సరయిన ప్లాటుఫారాలమీదికి చేరేలా చూసేవాళ్ళు. ఏమాత్రం
ఏమరుపాటుగా వున్నా ఇక అంతే సంగతులు.
ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, మనలో
చాలామందిమి రైలు ప్రయాణాలు చేస్తూనే ఉంటాము. రైల్వే వాళ్ళు ఇచ్చిన రగ్గులు
కప్పుకుని, బెర్తులపై ఎంచక్కా ముడుచుకుని పడుకుని,
కింద
పట్టాలపై రైలు పరుగెడుతున్న చప్పుడు వింటూ నిద్రలోకి జారుకుంటాము. ఏదైనా
రైలు స్టేషన్ దగ్గర పడ్డప్పుడు, రైలు వేగంగా
ఊగిపోతూ దడదడ లాడుతూ పట్టాలు మారుతున్న చప్పుడు విన్నప్పుడు గుండె
కూడా అలాగే దడదడ లాడడం కద్దు. అర్ధరాత్రి వేళ జనం, అలా హాయిగా, వెచ్చగా ఏం భయం లేకుండా ప్రయాణాలు
చేస్తున్నారు అంటే అలాటి కేబిన్ లలో పనిచేసే సిబ్బంది తమ నిద్ర మానుకుని పనిచేయడమే
కారణం.
పొద్దున్నే లేచి వేడివేడి కాఫీ తాగుతూ
పేపరు తిరగేస్తాం. మనకోసం ఎవరో ఒకరు, డబ్బులకే కావచ్చు, తెల్లవారుఝామున్నే నిద్ర
లేచి, తెలతెలవారుతుండగానే, పాల ప్యాకెట్లు,
పత్రికలు తెచ్చి, మన గుమ్మం ముందు
వేయడం వల్లనే మనకీ వైభోగం అన్న సంగతి ఆ క్షణంలో
గుర్తు రాదు.
ఇలా ఎందరో మహానుభావులు, వారి వారి
జీవిక కోసమే కావచ్చు, వారి సుఖాలను ఒదులుకుని వేరేవాళ్ళు సుఖంగా బతకడం కోసం రేయింబవళ్ళు
కష్టపడుతున్నారు. అదంతా మర్చిపోయి, హాయిగా కాలు మీద కాలు వేసుకుని, ‘ఈ దేశంలో
ఎవ్వరూ కష్టపడడం లేదు, నేను తప్ప’ అనే తప్పుడు స్టేట్ మెంట్లు ఇవ్వడం నిజంగా తప్పే
కదా!
(29-01-2016)
NOTE: Courtesy Image Owner
1 కామెంట్:
చాలా బాగా చెప్పారు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి