19, జనవరి 2016, మంగళవారం

రచయితలు- సంపాదకులు (ఎవరి బాధలు వారివి)


రచయిత ఏం చేస్తాడు?
మరీ చచ్చు ప్రశ్న. ఏంచేస్తాడు ? రాస్తాడు. రాసింది నలుగురు చదవాలని ఆశ పడుతూ రాస్తూ పోతుంటాడు. పత్రికలకి పంపిస్తాడు. వాళ్ళు వేస్తె వేస్తారు. లేకపోతే లేదు. వెయ్యకపోతే మరో పత్రిక్కి పంపిస్తాడు. వెనుకటి మాదిరిగా పోస్ట్ చేయడాలు, తిప్పి పంపడానికి  తగినన్ని తపాలా బిళ్ళలు జతచేయడాలు వంటి బాదరబందీలు ఈనాడు లేవు. రాసేసి ఎంచక్కా ఒక్క క్లిక్కు నొక్కితే చాలు. కానీ ఇదొక్కటే చాలదు కదా! సంపాదకుడు చూడాలి, మెచ్చాలి. వెయ్యాలి. ఈలోపు సంపాదకులు మరో  రిటర్న్ క్లిక్కు నొక్కి మీ రచన అందింది’ అని కబురు ఏమన్నా చేస్తారా అంటే అదీ లేదు. మరి వారు సంపాదకులాయే. అంత  త్వరగా నిర్ణయాలు తీసుకోవడం వారికి కుదరక పోవచ్చు. మరి రచయితకు తన రచన ‘కాకిపిల్ల కాకికి ముద్దు’ సామెత మాదిరి. అంచేత మరో పత్రిక్కి క్లిక్కు మనిపిస్తాడు. ఏదో జంధ్యాల సినిమాలో మూడును బట్టి మార్కులు వేసే ధర్మవరపు సుబ్రహ్మణ్యం మేష్టారిలా ఆ రచన ఆ రెండో పత్రిక సంపాదకుడి మూడును బట్టి నచ్చి కూర్చుంటుంది. అయన వేసేస్తాడు. ఈలోగా మొదటి ఎడిటర్ గారి మూడు కూడా మారి ఆయనా తన పత్రికలో వేసేస్తాడు. రచయిత పని నక్కతోక తొక్కిన చందంగా మారుతుంది. ఒక్క క్లిక్కుకు రెండు పక్షులు.
సరే. ఈ పత్రిక ఎడిటర్ ఆ పత్రిక చదవడు. చదివినా పైకి ఏమీ అనలేని పరిస్తితి. కాకపొతే ఇంకోసారి ఆ రచయిత రచనలు ఆ పత్రికలో వెలుగుచూడక పోవచ్చు. సరఫరా, గిరాకీ సిద్దాంతం ప్రకారం ఇప్పటివరకు రచయితల మీద సంపాదకులదే పైచేయి. ఫేస్ బుక్ , బ్లాగర్  వంటి సాంఘిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తరువాత వర్ధమాన రచయితలు చెలరేగిపోయి అద్భుతంగా రాస్తున్నారు. ఇప్పటిదాకా పత్రికలకే పరిమితమై ఇంతో అంతో పేరు తెచ్చుకున్న రచయితలు కూడా ఈ వైపే మళ్ళారు. అయితే ఈ మీడియంలో స్వపర బేధాలు లేవు. పోస్ట్ అయిన ప్రతి రచన మీద ఎవరికివారు సర్వస్వామ్యాలు తీసేసుకుంటున్నారు. ఒకరి రచనను మరొకరు కాపీ కొట్టడం అనేది సర్వసాధారణం అయిపొయింది. ‘కాపీ రైట్’ అంటే ‘కాపీ కొట్టే రైట్’ అనుకుంటున్నారు. ఇంత పురాణ కాలక్షేపం ఎందుకంటే:
మొన్నీ నడుమ శ్యాం రావు గారు అనే ప్రముఖ జర్నలిష్టు కన్ను మూశారు. ఆయనతో సన్నిహిత పరిచయం వున్న మరో జర్నలిష్టు మిత్రుడు (ఆయన ఇంగ్లీష్ పేపర్లో పనిచేసే తెలుగు జర్నలిష్టు) శ్యాం రావుగారి గురించి చక్కటి  ఆంగ్ల కధనం ఒకటి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. మరునాడో, ఆ మరునాడో తెలియదు కాని , అదే  కధనానికి  మక్కికి మక్కి తెలుగు అనువాదం రెండు ప్రధాన దినపత్రికల్లో ఒకే రోజున వచ్చింది. ఆ వ్యాస రచయిత కూడా సామాన్యుడు కాదు. విదేశాల్లో చాలా పేరొందిన సీనియర్ జర్నలిష్టు.
ఫేస్ బుక్ లో రాసిన జర్నలిష్టు తల్లి గారికి  తెలుగు పత్రికలు చదవడం అలవాటు. ఆవిడ  చదివి కొడుకుతో చెప్పింది. ఆయన  పత్రికల వారిని సంప్రదిస్తే ఒక పత్రిక ఈరోజు ‘ఆ వ్యాస రచయితను నేను!’ అనే శీర్షిక పెట్టి సవరణ కాని సవరణ రూపంలో ఒక వివరణ ఇచ్చింది. కింద ఫోటో అదే.  


          

 రచయితలు – సంపాదకులు అని రాసి పక్కన బ్రాకెట్లో ‘ఎవరి బాధలు వారివి’ అని ఎందుకు రాసానో అర్ధం అయిందనుకుంటాను.     

కామెంట్‌లు లేవు: