21, జనవరి 2016, గురువారం

“నవ మిధునం”


(దెబ్బయ్యవ దశకంలో పురాణం సుబ్రమణ్య శర్మగారి సంపాదకత్వంలోని ‘ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితం)
(నలభై అయిదేళ్ళ క్రితం రాసిన నా తొలి రచనల్లో ఇదొకటి.
ఇది నాటకం కాదు, నాటికా కాదు. కధా కాదు, కధానికా కాదు. దీన్ని ‘సంభాషణ’ అనవచ్చేమో. ఇందులోని పాత్రలకు ప్రత్యేకంగా పేర్లేమీ లేవు. కొత్తగా పెళ్ళయిన ఒక భర్తా, ఒక భార్యా, కోడల్ని వెనకేసుకొచ్చే ఒక అసాధారణ అత్తగారు. వారి రోజువారీ మాటలు, ముచ్చట్లే ఇతివృత్తం. మూడు పాత్రలే కాబట్టి ఎక్కడా పేర్లు వుండవు. సందర్భాన్ని బట్టి ఎవరి ‘పలుకో’ అర్ధం చేసుకోవచ్చు)


ఒకరోజు, అది ఏ రోజయినా కావచ్చు, వాళ్ళింట్లో తెల్లవారింది.
“ఇలా అయితే నేనిక్కడ ఉండను బాబూ”
“ఏం...ఎక్కడికి వెడతావేమిటి?”
“ఇంకెక్కడికి? హాయిగా అత్తయ్య దగ్గరికి..”
“ఓహో! ఆవిడ దగ్గరయితే రాణీ వారికి జరిగినట్టు జరుగుతుందనా? ఇటు పుల్ల తీసి అటు పెట్టనివ్వదు, ఈ ముద్దుల కోడలు ఎక్కడ అరిగిపోతుందో అని”
“ఆవిడనేం సాధించనక్కరలేదు. ఆవిడ చాలా మంచిది. ఇలా ప్రతిదానికీ, వెక్కిరింతలు, వేళాకోళాలు వుండవు”
“అయితే నేను మంచివాడిని కానంటావు”
“అలా అని ఎవరన్నారు? నాకు వంట చేయడం సరిగా రాదని పెళ్ళికి ముందు మీకు తెలియదా? అబద్దాలు చెప్పి నన్నేమి కట్టబెట్టలేదు కదా!”
“ఓహో! రాణీగారికి కోపం వచ్చినట్టుందే. అబ్బే నీకు వంట రాదని ఎవడా గూస్ కూసింది. నీ వంటకేం బ్రహ్మాండం. హోటల్ వాళ్ళు నీ దగ్గర ట్రిక్స్ నేర్చుకుంటే ప్రతిరోజూ ‘ఈ రోజు స్పెషల్’ బోర్డులు పెట్టుకోవచ్చు”
“ఛీ! పొండి”
“పోతున్నాలే ఎలాగూ టైమయింది కదా!”
“అయ్యయ్యో! అలా వెడుతున్నారేమిటండీ, వంటయిపోవచ్చింది. భోంచేసి వెళ్ళండి”
“ఎప్పటికి, సాయంత్రానికా? ఇప్పటికే లేటయింది, వస్తాను”
“సాయంత్రం కాస్త పెందలాడే ఇంటికి రాండి, ఏ అర్ధరాత్రికో దయచేయకుండా”
“చిత్తం మహారాణీ!”


“సుబ్బమ్మ గారూ....ఓ సుబ్బాయమ్మ గారు”
“ఏవిటండీ ఆ గావు కేకలు..అవతల....”
“చిత్తం తమరు చెప్పినట్టు అయిదు కొట్టగానే వచ్చేశాను సుబ్బమ్మ గారు”
“నన్ను ఆ పేరుతొ ఏమీ పిలవనక్కరలేదు... నాకు అంత అందమైనది కాకపోయినా మంచి పేరే పెట్టారు మా వాళ్ళు”
“అల్లాగా! అసలు సుబ్బాయమ్మ పేరులో వున్న   గొప్పతనం నీకేం తెలుసు. వంట మనుషులందరికీ అలాంటి పేరే వుంటుంది. అలా పిలిస్తేనన్నా నీకు కాస్త వంట  చేయడం వంట పడుతుందేమో అని భవదీయుడి ఆశ”
“మళ్ళీ గాలి నా వంట మీదకే తిరిగింది. మీతో వేగడం తెలియక  చస్తున్నాను”
“వంట గదిలో గిన్నెల్ని చూస్తె తెలుస్తుంది నీతో వేగడం యెంత కష్టమో. సొట్టు పడ్డ గిన్నెలు, కొప్పులిరిగిన కప్పులు, మూతల్లేని జాడీలు. వీటిని అడిగితే నీ కధ చక్కగా చెబుతాయి”
“మీ ఆగడం రోజురోజుకూ మితిమీరుతోంది. చూడండత్తయ్యా మీ అబ్బాయి...”
“అత్తయ్యా!..... ఏం కలవరిస్తున్నావా? అయితే  నిన్ను తప్పకుండా మా అమ్మదగ్గరికి పంపాల్సిందే”
“దాన్నెందుకురా పంపడం? ..నేనే  వచ్చేశాను మి మ్మల్ని చూడాలనిపించి”
“అమ్మా! నువ్వా? నువ్వెప్పుడు వచ్చావే! చూసావా నువ్వు వచ్చినట్టు ఒక్క ముక్క నాతొ చెప్పలేదు”
“ఏదీ నన్ను చెప్పనిస్తేనా! ఎంతసేపూ సుబ్బమ్మా, సుబ్బాయమ్మా ఆ గొడవే కాని”
“ఇందాకటి నుంచి  అంతా వింటున్నాను లేరా! అయినా చిన్న పిల్ల, కొత్త చోటు. అల్లా ప్రతిదానికీ వెక్కిరిస్తుంటే మనసు బాధ పెట్టుకోదు? నెమ్మదిగా చెప్పుకోవాలి కానీ ఇలా కసురుకుంటే ఎల్లారా”
“ఇంకేం. డిఫెన్స్ లాయరు కూడా వచ్చేసింది. నా  పని  ఖాళీ!”


“అమ్మా! సాయంత్రం సినిమాకి పోదాం రెడీగా వుండండి”
“నేనెందుకురా! నువ్వూ అమ్మాయి వెళ్ళండి”
”తను కూడా వస్తున్నది కనుకనే ఇప్పుడు చెప్పడం. ఆమె సింగారం పూర్తయి కనీసం సెకండ్   షోకన్నా అందుకోలేక పోతామా అని”
“చూడండత్తయ్యా! ఇదీ మీ అబ్బాయి వరస. నాదే ఆలస్యం అని దెప్పుతారు కానీ, సినిమాకు పోదాం అని చెప్పిన సంగతి ఆఫీసుకు వెళ్ళేదాకా గుర్తుంటే అదృష్టమే”
“అది కాదేఅమ్మా! ఒకసారి ఏం చేసిందో తెలుసా! ఇలాగే సినిమాకు వెడదామని అయిదుగంటల కల్లా  ఇంటికి వచ్చాను. ఇప్పుడే ఒక నిమిషం ఒక నిమిషం అంటూ అద్దం ముందు కూర్చుని మూడు ఝాములు చేసింది. తీరా వెడితే రిక్షా దిగాల్సిన అవసరం లేకపోయింది. అదే రిక్షాలో పడి ఇంటికి చేరాం”
“అదేమిట్రా! టిక్కెట్లు దొరకలేదా!”
“ఇంకేం టిక్కెట్లు రెండో ఆట కూడా ఒదిలారు”
“మరీ చోద్యం చెబుతారు. సినిమా నుంచి వచ్చేసరికి పొద్దు పోతుందని ఏకంగా వంట పని ముగించుకు వెడదామని మొదలు పెట్టాను. ఏదీ చేయనిస్తేగా”
“పప్పు చారులో పోపు ఎలా పెట్టాలో పక్కింటి పిన్ని గారిని అడిగి వచ్చేలోగా పొయ్యి మీద పెట్టిన పప్పు మాడి కూర్చుంది”
“మీరు అక్కడే వున్నారు, కాస్త కనిపెట్టి చూస్తారు అనే ధైర్యంతో వెళ్ళాను. తెలిసీ తెలియక పోపు పెడితే తినేటప్పుడు అది తక్కువయింది  ఇది ఎక్కువయింది  అని వంకలు పెడతారని వెళ్ళాను కానీ,  పప్పు మాడిపోతుందని నేనేమన్నా కలకన్నానా”
“నేను మాత్రం ఆరోజు నీ వంట తిన్నానా ఏమిటి? చివరికి హోటల్లోనే కదా భోజనం”
“”ఆహా. మీ తిండి సంగతి అక్కడ చూసాను లెండి. రూపాయలు తగలేసి రావడమే కాని నాలుగు మెతుకులు కూడా గతికినట్టులేదు”
“డబ్బులు ఇస్తున్నాము కదా అని బకాసురుడిలా మెక్కుతామేమిటి”
“బకాసురుడిలా తినమన్నా తినబుద్దేస్తుందేమిటి హోటల్ తిండి. ఒక కారం లేదు, ఒక ఉప్పు లేదు, వట్టి చప్పిడి మెతుకులు”
“ఇంతకీ ఆ వంటకంటే నీ వంటే నయమంటావ్ అంతేనా”
“అరేయ్! ఏమిట్రా ఈ వాదనలు. ఆఫీసుకు పోయే పనేమీ లేదా ఈ పూట.”
“ఎందుకు లేదమ్మా! నీ ముద్దుల కోడలితో వాదం పెట్టుకుంటే ఇక ఆ రోజుకు అన్నం, ఆఫీసు రెండూ వుండవు”
“సరే కానీ, ఇదిగో టిఫిన్ బాక్సు,  పట్టుకెళ్లండి”
“టిఫినా! చచ్చాన్రా భగవంతుడా! పేరు తెలియకపోతే మానె. తీపో కారమో చెప్పు, ఆఫీసులో బతికిపోతాను”
“అదేమిట్రా అలా అంటావు”
“అవునమ్మా! ప్రతి రోజూ ఉదయమంతా కుస్తీ పట్టి, నామ,రూప, రుచి రహితమైన ఒక బ్రహ్మ పదార్ధం చేసి  టిఫిన్ బాక్సులో పెట్టి ఇస్తుంది. లంచ్ టైంలో   వెధవాయిలందరూ చుట్టూ చేరతారు. ఇక ఒకటే గోల. ‘రంగు వుండి రుచి వాసనా  లేని పదార్ధాన్ని ఏమంటారురా అవధాన్లూ’  అంటాడు ఒక సన్నాసి వెధవ. ‘ఒరేయ్ మనవాడు పెట్టి పుట్టాడురా. వీడి భార్య రోజూ ఒక కొత్త వంటకం తయారుచేసి ఇస్తుంది’ అంటాడు మరో కొక్కిరాయి. ‘ఏరా! ఆ  వారపత్రికలో ఇలా చేసి మాడండి రాసేది మీ ఆవిడేనట్రా’ అని ఇంకోడు జోకుతాడు.  ఇలా అంతా కలిసి నా దుంప తెంపుతారనుకో”
“ఈరోజు ఆ ఇబ్బందేమీ వుండదు, పట్టుకెళ్లండి”
“ఏవిటో ఈరోజు విశేషం”
“విశేషాలు, ససేషాలు ఏవీ లేవు. నన్నసలు వంటింటి ఛాయలకే రానివ్వడం లేదు అత్తయ్య. వంటంతా ఆవిడే చేసారు”
“ఇంకేం నువ్వు తీరిగ్గా పుస్తకాలూ పత్రికలూ చదువుకుంటూ కాలక్షేపం చేద్దువు కాని. రాకరాక ఆవిడ వస్తే గరిట చేతికిచ్చి పైగా ఆమె రానివ్వడం లేదు అంటావా! అమ్మా ఎక్కువ చనువివ్వకే. నా  నెత్తి మీది నుంచి నీ నెత్తి మీదికి ఎక్కుతుంది”
“అందుకేకదరా నేనిక్కడికి వచ్చింది. అదిప్పుడు ఉత్త మనిషి కూడా కాదు. ఎత్తుకెత్తుగా చూసుకోవాలి ఇక నుంచి. చాకిరీ చేయించాలనే ముచ్చట వుంటే రేపు పుట్టబోయే బిడ్డ చేత  చేయిద్దువుగానిలే”
“అమ్మ దొంగా! యెంత విషయం దాచావు.  వుండు నీ సంగతి చెబుతాను. ఏదీ ఎటు వెళ్ళింది. సరేలే సాయంత్రం సిద్ధంగా వుండండి సినిమా చూసి హోటల్లో భోంచేసి వద్దాము”



“సినిమా ఎలా వుంది?”
“నా మొహంలా వుంది”
“తెలుగు సినిమా నీ మొహంలా వుంటే రోజుకొకటి చూసేవాడిని”
“ఏం నేను అంత బాగున్నానా”
“నేకేం అప్సరసలా వున్నావు. అందులో అమ్మవు కాబోతున్నావు. అన్నట్టు మరచిపోయాను. నీ మీద నాకు కోపం వచ్చింది కదా! నీతో అస్సలు మాట్లాడను”
“మళ్ళీ ఇదేం  తిక్క. నామీద కోపం ఎందుకు”
“ఎందుకా! నాకు చెప్పకుండా కొన్ని దాచిపెడితే కోపం రావాలా అక్కరరాలేదా”
“నాతొ మాట్లాడన్నారు కదా మరి”
“మరచిపోయానని ముందే చెప్పాగా”
“ఇంకేం సమస్యే లేదు. అటు తిరిగి పండుకోండి”
“సరే కాని..”
“కాణీలు అర్ధణాలు లేవన్నానా”
“అదికాదు. ఇంత మంచి వార్త తెలిసింది కదా!  నీకు బహుమతి కావద్దూ”
“ఇప్పుడు వద్దు. పాపాయి  నిద్ర పోతోంది”
“అలా  కుదరదు....”
“ఉష్! ఏమిటా మొండితనం? బయట అత్తయ్య పడుకున్నారు”

(1970)
NOTE: Courtesy Image Owner   

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

i want 5 minutes of my life back.