14, మే 2015, గురువారం

ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు




(నిన్నటి మాటో మొన్నటి ముచ్చటో కాదు చాలా చాలా  పాతకాలం కబుర్లు. నేను పుట్టడానికి పదేళ్ళ ముందు, శిష్ట్లా లక్ష్మీ పతి శాస్త్రిగారు అనే ఓ పెద్ద మనిషి, 1935 లోనే  కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు నుంచి చదువుకోసం హైదరాబాదు చేరారు. ఏళ్ళతరబడి హైదరాబాదు నగరంతో తాను  పెంచి పోషించుకున్న అనుబంధాన్ని తన అనుభవాలతో రంగరించి ఆ పెద్దాయన, 'హైదరాబాదు, నాడు - నేడు' అనే పేరుతొ తొంభయ్ పేజీల  పుస్తకం రాసారు. 2008 లో అది ముద్రణకు నోచుకుంది. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారికి అందులో ఎన్నో విషయాలు అచ్చెరువు గొలిపేలా వున్నాయి. చిన్న పుస్తకం. కానీ అందరూ చదవదగ్గ గొప్ప పుస్తకం. ప్రతులకు, విశాలాంధ్ర బుక్ హౌస్ అని అందులో రాసారు. వెల యాభయ్ రూపాయలు. అందులోని విషయాలు యెంత ఆసక్తికరంగా ఉన్నాయంటే, ఏది ఒదలాలో, ఏది చేర్చాలో తెలియనంత అయోమయంలో పడిపోయాను. పుస్తకంలో అన్నీ మెరుపులే. కానీ బ్లాగు పరిమితుల దృష్ట్యా కుదించి రాయాల్సి వస్తోంది. లక్ష్మీ పతి శాస్త్రి గారి మూల భావానికి న్యాయం చేయడానికే చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. అయినా ఏదో లోపం చేసానేమో అన్న అనుమానం   నన్ను బాధిస్తూనే వుంది.  వారికి క్షమాపణలతో కూడిన ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు)
ఇక ఇక్కడి నుంచి మాటా పలుకూ అన్నీ శాస్త్రిగారివే:





"అది జూన్ నెల ఇరవయ్యవ తారీఖు, 1935 వ సంవత్సరం. గుడ్లవల్లేరులో వున్న మా ఇంటికి హైదరాబాదులో వున్న మా బావగారి నుంచి టెలిగ్రాం వచ్చింది.
"23వ తేదీతో స్కూళ్ళలో ఎడ్మిషన్లు అయిపోతవి. చిక్కాయిని వెంటనే పంపండి"
"చిక్కాయి నా ముద్దు పేరు.
'చిక్కడు సిరి కౌగిటిలో, చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, చిక్కడు శృతి లతికావలి, చిక్కెనతడు తల్లి చేతన్ రోలన్' అనే పోతన పద్యంతో మా అమ్మ నన్ను అలరిస్తూ వుండేది.
"మా నాన్నగారు కోర్టు పనిమీద మద్రాసు వెళ్ళారు. మా అమ్మ దగ్గర దమ్మిడీ లేదు. మర్నాడు రైలు ఎక్కితేకాని హైదరాబాదు చేరలేను. అమ్మ అప్పుచేసి అయిదు రూపాయలు చేతిలో పెట్టింది. పప్పులూ, ఊరగాయలు, పాత్ర సామానులు వున్న రెండు పెద్ద మూటలు కూడా ఒప్పచెప్పింది. రైల్లో ఆ రాత్రి బెజవాడ చేరి మర్నాడు ఉదయం నైజాం బండి ఎక్కాను. సికింద్రాబాదుకు రైలు టిక్కెట్టు మూడు రూపాయల పదమూడు అణాలు.
"కాసేపట్లో ఎర్రుపాలెం వచ్చింది. ఆ రోజుల్లో పద్నాలుగు ఏళ్ళు దాటని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయకూడదని శారదా యాక్టు వుండేది. నైజాంలో అది చెల్లదు. అంచేత పిల్ల పెద్దమనిషి కాకపూర్వమే వివాహం చేయాలనుకునే పూర్వాచారం వారు 'ఎర్రుపాలెం శరణంభవ' అనుకుంటూ అక్కడ ఆ తంతు పూర్తికానిచ్చేవాళ్ళు.
"మహబూబాబాదులో ఎవరో ఒకాయన (ముస్లిం లు ధరించే) ఎర్ర కుచ్చు టోపీతో రైలెక్కాడు. నుదుట రూపాయి కాసంత బొట్టుతో లక్ష్మీ దేవిని తలపిస్తూ పక్కన  ఓ ముత్తైదువ. ఇదేమిటబ్బా అని ఆశ్చర్యపోతుండగా ఆ పెద్దమనిషి టోపీ తీసి పక్కనబెట్టాడు. పిలకున్న బ్రాహ్మణుడాయన.  నిజాం ప్రభుత్వోద్యోగులందరూ ఏదో ఒక  టోపీ ధరించాలి. 'సర్ పే లాల్ టోపీ'
"వరంగల్ స్టేషన్ లో ఆగినప్పుడు దిగి కాణీ పెట్టి  ఓ చక్కిలం కొనుక్కున్నాను. అణా ఇస్తే చిల్లర ఒక కాణీతో పాటు యేవో గీతల మాదిరి అక్షరాలు వున్న రాగి నాణెం ఇచ్చాడు. అది హాలీ అర్ధణా. హాలీ అంటే నిజాం సిక్కా. అక్కడ బ్రిటిష్ సర్కారు సిక్కా, నిజాం సిక్కా రెండూ చెల్లుతాయట. సర్కారు నూరు రూపాయలకు హాలీ నూట పదహారు రూపాయలు. అదీ లెక్క.    
"సికిందరాబాదు చేరిన తరువాత నానా ప్రయాసపడి ఎట్టకేలకు మలక్ పేట లోని మా అక్కయ్య ఇంటికి చేరాను. హైదరాబాదు నగరంతో నా సుదీర్ఘ అనుబంధం నాటి నుంచి,  నా పన్నెండేళ్ళ వయస్సులో మొదలయింది"

(ఇంకా వుంది)

12 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

> సర్కారు నూరు రూపాయలకు హాలీ నూట పదహారు రూపాయలు. అదీ లెక్క.

అవునండి. అదే తెలుగులో నూటపదహార్లు బహుమానంగా ఇవ్వటం అనే ఆచారానికి తెరతీసింది. ఆంధ్రప్రాంతపు కళాకారులు నైజాం వచ్చి ప్రదర్శనలు ఇచ్చి బహుమానంగా నూటపదహార్లు స్వీకరించేవారు. వాటిని సర్కారు రూపాయలలోనికి మర్చుకుంటే నూరు వచ్చేవి. ఈ సంగతిని నేను చాలామార్లే వివిధ వ్యాఖ్యల్లోనూ అప్పట్లో తొంభైల్లో తెలుసా వేదిక మీదా వ్రాసాను. ఇప్పుడు నూటపదహార్లు అనే మాట వినబడటం లేదు లెండి.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

బావున్నాయండీ శిష్టా వారి అలనాటి హైదరాబాద్ విశేషాలు. డిసెంబర్ 2014 లో "పాతైదరాబాదు" అనే పోస్ట్ లో కూడా ఈ పుస్తకం గురించి కొంచెం చెప్పినట్లున్నారు మీరు. ఇప్పుడు మరిన్ని విశేషాలు వివరిస్తూ కొనసాగిస్తే బాగుంటుంది.

Arun చెప్పారు...

చాలా మంచి విషయాలు చెప్పారు.
@శ్యామలీయం గారు, మీకు చెప్పగలిగినంత వాడిని కాదు కానీ నూట పదహార్ల దక్షిణ గురించి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది ఇలా ఉంది: భగవంతుడిని 108 పేర్లతో ఆరాధిస్తాము, గురువుగారికి మరొక ఎనిమిది పేర్లు కలిపి 116 పేర్లతో స్తోత్రం చెయ్యాలి! ఒక్క గురువు గారికే 116 దక్షిణ అయినా 116 నామ సంకీర్తనమైనా అన్యులకు ఆ అర్హత లేదు అని చెప్పారు. పూర్తి వివరాలు సరిగ్గా గుర్తులేదు, ఈసారి గురువుగారిది ఆ ప్రవచనం విన్నప్పుడు కొద్దిగా వింటాను

Arun చెప్పారు...

హైదరాబాద్ గురించి, నిజాం రాజుల గురించి నరేంద్ర లూథర్ అనే మాజీ సివిల్ సర్వెంట్, రచయిత "హైదరాబాద్ – మెమొయిర్స్ ఆఫ్ ఎ సిటి" అనే పుస్తకం రాశారు, నిజాం రాజుల చరిత్ర, ఆఖరి నిజాం పొదుపు/పీనాసితనం, ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు

అజ్ఞాత చెప్పారు...

చాల బాగుంది , కినిగే లో దొరుకుతుందా ఈ పుస్తకం.
మన ప్రాంత చరిత్ర మనకి ఎప్పుడు ఆశక్తికరంగానే ఉంటుంది .
దయచేసి మరిన్ని పోస్టు లు రాయండి
.

శ్యామలీయం చెప్పారు...

అరుణ్ గారూ, వినదగు నెవ్వరు చెప్పిన అన్నారు. పెద్దల మాటలను ఉటంకిస్తూ మీ రెందుకు సంకోచించటం. శ్రీచాగంటివారు చెప్పింది బాగుంది. అది పారమార్థిక మైన కారణం. కాని భగవన్నామాలకు అదనంగా గురువుగారికి మరికొన్ని నామాలు చేర్చి ఆధిక్యతను ఆపాదించటం అన్నది నాకు సందేహాస్పదంగానే అనిపిస్తోంది. ఐనా బాగా పరిశీలించవలసిన విషయం. ఇకపోతే నేను చెప్పినది కేవలం లౌకికమైన సంగతి. అందుచేత భిన్నమైన కారణాలు - భిన్నమైన సందర్భాలు. చిక్కేమీ లేదు. నేను చెప్పిందైనా వేరెవరో వ్రాసినది చదివి తెలుసుకున్నదే కదా.

Jai Gottimukkala చెప్పారు...

స్వాతంత్ర్యం పూర్వం దేశంలో మూడే మింటులు ఉండేవి. రెండు మింటులు బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో ఉండగా స్వదేశీ రాష్ట్రాలలో ఏకైక మింటు హైదరాబాదులో నెలకొల్పారు.

హైదరాబాదు తప్ప ఇతర ఎ రాష్ట్రానికీ సొంత కరెన్సీ లేదు. ఇది ఖచ్చితంగా మన రాష్ట్రానికి దేశంలో ఉన్న స్థాయికి నిదర్శనంగా చెప్పవచ్చు.

ఆపరేషన్ పోలో తరువాత కూడా (హైదరాబాద్ రాష్ట్రం భారత రాజ్యాంగాన్ని 1950లొ ఆమోదించే వరకు) హాలీ సిక్కా చెలామణీలో ఉండేది.

అజ్ఞాత చెప్పారు...

మంచి పుస్తకం పరిచయం చేశారు. ధన్యవాదాలు

అజ్ఞాత చెప్పారు...

మంచి పుస్తకం పరిచయం చేశారు. ధన్యవాదాలు

శ్యామలీయం చెప్పారు...

> మన రాష్ట్రానికి దేశంలో ఉన్న స్థాయికి నిదర్శనంగా చెప్పవచ్చు.

జైగారూ, ఇప్పుడు నాకైతే 'మన రాష్ట్రం' అంటూ చెప్పుకోవటానికి ఏ రాష్ట్రమూ లేదు కదా అని తమాషాగా అనిపిస్తోంది. ఇంకా దేవుడి దయవలన మన దేశం అనుకుందుకో నాకొక దేశం మిగిలే ఉన్నట్లుంది. పోనివ్వండి, కాలో దురతిక్రమణీయః

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

పాత హైదరాబాద్ రాష్ట్రానికి వారసత్వ రాష్ట్రం తెలంగాణా అని నా ఉద్దేశ్యం.

అజ్ఞాత చెప్పారు...

"పాత హైదరాబాద్ రాష్ట్రానికి వారసత్వ రాష్ట్రం తెలంగాణా అని నా ఉద్దేశ్యం."

Old Hyderabad state included Guntur, Bandar etc at one point of time, not to speak of Vidarbha and North Karnataka. What has current Telanana got to do with that ?