23, మే 2015, శనివారం

మోడీ ఏడాది పాలన, ఒక పరిశీలన




(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 24-05-2015, SUNDAY)  


మనిషిది  నూరేళ్ళ జీవితం అంటారు. అంచేత అందులో  ఓ ఏడాది కాలం చెప్పుకోతగ్గది కాకపోవచ్చు. కానీ,  ప్రజాస్వామ్య దేశంలో  ఎన్నికల్లో తీర్పు ద్వారా ఆయా రాజకీయ పార్టీలకి  ప్రజలిచ్చిన అయిదేళ్ళ అధికారంలో  ఒక సంవత్సరం  గడిచిపోయిందంటే మాత్రం  అది అంత  చిన్నా చితకా సమయం అయితే కాదు. ఇక మిగిలింది కేవలం నాలుగేళ్లే అన్నది ఏలికలు గుర్తుపెట్టుకోవాలి. అయితే మిగిలున్న ఈ సమయం, అధికారంలోకి రాగానే చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పినవాటిని కానీ, అధికారంలోకి రాగానే కొత్తగా జోడించిన తాజా వాగ్దానాలను లేదా సరికొత్త  పధకాలను కానీ  నూటికి నూరు శాతం అమలుచేయడానికి  సరిపోయేదయితే  కాదు.
నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రిగా పగ్గాలు చేతిలోకి తీసుకుని ఈ నెల ఇరవై ఆరుకి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. ఈ రెండు రోజుల్లో కొత్తగా సాధించి చూపించే వ్యవధానం ఎటూ లేదు కాబట్టి అయన పరిపాలనను అంచనా వేసే ప్రయత్నం కొంత ముందుగా చేస్తే తప్పేమీ కాదు. ఏడాది స్వల్ప సమయంలోనే  'ఎన్నో చేశాం' అని చెప్పుకోవడం పాలక పక్షాలకు, ఏడాది గడుస్తున్నా 'సర్కారు ఒరగబెట్టింది ఏమీ లేదు' అని ఎద్దేవా చేయడం ప్రతిపక్షాలకూ  అనూచానంగా వస్తున్న ఆచారమే . ప్రతిపక్ష హోదా దక్కకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సరిగ్గా ఇదే వ్యాఖ్య చేసారు. అమేథీలో మాట్లాడుతూ, మోడీ ఏడాది పాలనకు తాను సున్నా మార్కులు వేస్తున్నట్టు చెప్పారు. పైగా ఉత్త సున్నా కాదు పెద్ద గుండు సున్నా అని ఎద్దేవా కూడా చేసారు. కాంగ్రెస్ యువ నాయకుడి విమర్శలను బీజేపీ సీనియర్ నాయకులు తిప్పికొట్టారు. అమేథీలో యువ గాంధీ మీద పోటీ చేసి ఓడిపోయి తరువాత మోడీ క్యాబినెట్లో మంత్రిగా చేరిన స్మృతి ఇరానీ కాస్త పదునైన ప్రతి వ్యాఖ్యలు చేసారు. మోడీ ఏమీ చేయలేదంటున్న రాహుల్ గాంధీ, తనను గెలిపించిన అమేథీ నియోజక వర్గానికి ఈ ఏడాది కాలంలో చేసింది సున్నా కంటే తక్కువ అన్నారు. పదేళ్ళ యూపీయే పాలన, ఏడాది రాహుల్ పార్లమెంటు సభ్యత్వ కాలం పరిగణనలోకి తీసుకుంటే సున్నకు సున్నా,హళ్లికి హళ్లి అని కొట్టిపారేశారు.  మోడీ ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ వంటి ప్రధాన శాఖకు మంత్రిగా వున్న అరుణ్ జైట్లీ కూడా తన పాత్రకు తగ్గట్టే మాట్లాడారు. అవినీతి రహిత పాలన అంటే ఎలా వుంటుందో దేశ ప్రజలకు ఈ ఏడాది కాలంలో ప్రదర్శించి చూపామని అన్నారు. యూపీఏ పాలనలో దేశ ప్రజల్లో అలముకున్న నిరాశను పోగొట్టామనీ, కొత్త ఉత్సాహాన్ని నింపామని తమకు తామే కితాబు ఇచ్చుకున్నారు. ముందే చెప్పినట్టు ఏ గూటి చిలక ఆ గూటి పాట పాడడం సహజం.          
అందుకే, ఈ  ఏడాది కాలంలో పాలకులు  'ఏం మంచి చేసారు, ఏం  చేయలేదు, అలా చేసి వుండాల్సింది కాదు' అనే మూడు మూడు అంశాలను మాత్రమే  తీసుకుని  మోడీ ప్రభుత్వం పనితీరును స్థాలీపులాకన్యాయంగా విశ్లేషించి ఒక అంచనా వేయడానికే  ఈ ప్రయత్నం.
మోడీ అనే ఈ రెండు అక్షరాలు  భారత రాజకీయాన్ని కొత్త మలుపు తిప్పి ఇంకా ఏడాది కాలేదు. మోడీ మాయ  అప్పట్లో దేశాన్ని  కమ్మివేసింది. ఆ మాయ ఇంకా పూర్తిగా తొలగిపోయిన దాఖలాలు కానరావడం లేదు. దేశంలోని  నవ తరం యువజనుల్లో అధిక శాతం మందిని  ఆ మాయ ఇంకా కమ్ముకునే వుంది. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి  మాధ్యమాల్లో మోడీ ప్రభలు ఇంకా విరజిమ్ముతూనే వున్నాయి. విదేశాల్లో చెప్పనక్కరేలేదు.
ఒక్క ఏడాదిన్నర వెనక్కి వెళ్లి చూస్తె భారత రాజకీయాల్లోనే కాదు, సొంత పార్టీ బీజేపీలో సయితం నరేంద్ర మోడీ ఒక సాధారణ నాయకుడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక జాతీయ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో నేతృత్వం వహించే పరిస్తితి నాడు మోడీకి వుందని వారి పార్టీ వారికే నమ్మకం లేదు. ప్రధాని అభ్యర్ధిగా మోడీ పేరు  ప్రకటించడానికి బీజేపీలో ఎంతగా మల్లగుల్లాలు పడ్డదీ తెలుసుకోవడానికి చరిత్రను తవ్వితీయనక్కర లేదు. అయితే, దరిమిలా సంభవించిన రాజకీయ పరిణామాలన్నీ మోడీకి కలసి వచ్చాయి. రెండో విడత పాలన ముగియవస్తున్న సమయానికి యూపీయేకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పీకల లోతు అవినీతి ఊబిలో కూరుకుపోయింది. జైట్లీ అన్నట్టు ప్రజలు నిరాశలో వున్నారు. నిస్పృహకు గురై వున్నారు. కాంగ్రెస్ పట్ల అత్యధిక ప్రజానీకం పట్టరాని కోపం పెంచుకునివున్న  స్తితిలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకు వచ్చాయి. బలహీన పడ్డ  కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి నిజానికి  బీజేపీ పెద్ద కష్టపడే పరిస్తితి లేదు. మోడీ అవసరం అంతకన్నా లేదు. కానీ,  ప్రధాని అభ్యర్ధిగా పార్టీలో అడ్డంకులు తొలగిపోవడంతో ఎన్నికలకు ముందు మోడీ చెలరేగిపోయారు. తన వాగ్ధాటితో, తన ఆహార్యంతో, తన నేపధ్యంతో దూసుకుపోయారు. మోడీ తమలో ఒక్కరు  అని సామాన్యులు అనుకునేలా ప్రచారం సాగించారు. అన్నీ కలసివచ్చిన  మోడీ, ఎన్డీయే కూటమికి, అంతకు మించి బీజేపీకి తిరుగులేని విజయం సమకూర్చి పెట్టారు. ఎదురులేని నాయకుడిగా ఎదిగారు.     
కొన్నేళ్ళ క్రితం వరకు నేపధ్యంలోనే నిశ్శబ్దంగా వుండి, హఠాత్తుగా వెలుగులు విరజిమ్ముతూ దూసుకువచ్చి, అదే వేగంతో నేలరాలి పోతుందని  ఇంటా (అంటే వారి సొంత పార్టీలో) బయటా (అంటే ఎదుటి పక్షాల్లో)  అందరూ అనుకున్న తరుణంలో నిలదొక్కుకుని నిలబడ్డ  'నక్షత్రం'  నరేంద్ర మోడీ. వ్యక్తులకంటే వ్యవస్థ ప్రధానం అంటూ అన్ని పార్టీలు వల్లె చేస్తుంటాయి కాని వ్యక్తుల ప్రభావంతో ఆయా రాజకీయ పార్టీల భవితవ్యాలు నిర్ధారణ అవుతూ వుండడం భారత రాజకీయాల్లో కొత్త విషయం ఏమీ కాదు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, జయప్రకాష్ నారాయణ్, రాజీవ్ గాంధీ, వాజ్ పాయ్ వంటివారు జాతీయ స్థాయిలో తమదైన, బలమైన ముద్ర వేసి నాయకులు అనిపించుకున్నారు. అలాగే, ఆయా రాష్ట్రాల్లో కూడా స్థానిక నాయకుల ప్రభావం కూడా తక్కువేమీ కాదు.  గుజరాత్ ముఖ్యమంత్రిగా  అంటుకున్న మరకలు, తన రాజకీయ భవిష్యత్తును అంధకారమయం చేస్తున్నాయన్న  ఆందోళన ముసురుకుంటున్న తరుణంలో వచ్చి పడిన సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని  మోడీ రాజకీయ జీవితం  ఊహాతీతమైన మలుపు తిరిగింది. నిరుడు జరిగిన  ఎన్నికలకు కొద్ది వారాలు ముందు నుంచీ మొదలయిన మోడీ ప్రభావం ఇప్పటివరకు ప్రజలపై గణనీయంగానే వుందని సర్వేలు చెబుతున్నాయి.  ఓ ఏన్నర్ధం క్రితం బీజేపీ అగ్రనాయకుడు అద్వానీని సయితం తోసిరాజని మోడీ నేతృత్వంలో ఎన్నికల రణరంగంలో కాలుమోపాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించినప్పుడే ఆ పార్టీ పగ్గాలను  మోడీ దొరకబుచ్చుకున్నారు. ప్రధానిగా మోడీ అభ్యర్దిత్వానికి సొంత  పార్టీలోనే మొగ్గ తొడిగిన అసమ్మతి, ముదిరి పాకాన పడకముందే ఎన్నికలు ముంచుకు రావడం మోడీకి మంచి మేలే చేసింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ను మట్టికరిపించి 'నభూతో నభవిష్యతి' అనే తీరులో ఓ అపూర్వ విజయాన్ని 'బీజేపీ' ఖాతాలో జమ చేయడంతో మోడీ ప్రభలు దేశ విదేశాల్లో వెలుగులు విరజిమ్మాయి.
'కనిష్ట స్థాయిలో ప్రభుత్వ పెత్తనం, గరిష్ట స్థాయిలో ప్రజా పాలన' అనే కొత్త నినాదంతో అధికార పీఠం అధిరోహించిన మోడీ,  తొలినాళ్ళలో మూటగట్టుకున్న ప్రజాభిమానమే  దరిమిలా జరిగిన కొన్ని  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా  బీజేపీ  విజయపరంపర కొనసాగడానికి దోహదం చేసింది. నల్లధనం వంటి ఒకటి రెండు ఎన్నికల వాగ్దానాలు మినహా ప్రజలకు మాటిచ్చి తప్పిన అపరాధభావం అంతగా లేని పాలనావకాశం మోడీకి దొరకడం ఒక రకంగా  ఆయన అదృష్టం. 'ఒకనాటి చాయ్ వాలా ఈనాటి దేశ ప్రధాని' అనే కొత్త  ప్రచారం ఆయనకు బాగా కలిసి వచ్చింది. గతంలో వీసా ఇవ్వడానికి సయితం నిరాకరించిన అమెరికా వంటి అగ్రరాజ్యంలో మోడీ భారత ప్రధాని హోదాలో అధికార పర్యటన జరపడం దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని కొండంతగా పెంచింది. ప్రధాని అయిన తదాదిగా మోడీ జరిపిన విదేశీ పర్యటనలు, ఆ సందర్భంగా ఆయన ఆహార్యం ఓమేరకు  విమర్శలకు  గురయినప్పటికీ, నానాటికీ పెరిగిపోతున్న మోడీ ప్రభావం ముందు అవన్నీ వెలవెల పోయాయి. 'స్వచ్చ భారత్, మేక్ ఇన్ ఇండియా' వంటి నినాదాలు మోడీ ఆకర్షణను మరింత పెంచాయి.
అయితే, ఎన్ని చేసినా, ఎన్నో చేసామని బీజేపీ నాయకులు పదే పదే తమ నాయకుడ్ని స్తోత్ర పాఠాలతో ముంచెత్తుతూ వున్నా, ఈ ఏడాది కాలంలో మోడీ చేసిన ఒక్క మంచి పని ఏమిటంటే గట్టిగా  చెప్పుకోవడానికి స్వచ్చ భారత్ కార్యక్రమం మినహా మరొక్కటి కానరాని పరిస్తితి. ఇంకా ఏమైనా వున్నాయని చెప్పుకున్నా, అవన్నీ మోడీ  ఏడాది పాలనలో సాధించినట్టు చెప్పుకునే  ఘనకార్యాలను కీర్తించే ప్రభుత్వ ప్రకటనలకు మాత్రమే  పరిమితం.
ఇక మోడీ అభిమానులు సయితం బాధ పడే అంశం ఒకటుంది. తిరుగులేని సంఖ్యాబలం అందించి జనం ఆయన్ని గద్దె ఎక్కించారు. ఆయనకు కానీ, ఆయన నేతృత్వంలోని ఎండీఏ సర్కారుకు కానీ ముంచుకు వచ్చే ముప్పేమీ కనుచూపు మేరలో లేదు. అయినా కానీ, ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండా ఆర్డినెన్సు తరహా పాలనకు పూనుకోవడం నిజానికి మోడీ వంటి నాయకుడి నుంచి ప్రజలు ఎన్నడూ కోరుకోరు. ఆర్డినెన్సుల పాలనకు స్వస్తి పలకాలని ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు,  అధికార పీఠం ఎక్కగానే వాటితోనే పాలనకు స్వీకారం చుట్టడం ప్రజాస్వామ్య ప్రియులకు మింగుడు పడడం లేదు.                              
ఇక, చెప్పి చేయని అంశం నల్ల ధనం. ఈదిశగా ఏదయినా చేసామని చెప్పుకున్నా అవి నేలబారు ప్రకటనలే. మునుపటి మన్మోహన్ ప్రభుత్వం ఇలా చేసి వుండాల్సిందని నాడు ఎన్డీయే నాయకులు చెప్పిన దాంట్లో ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదు. దురదృష్టం ఏమిటంటే నల్లదనం వంటి అంశాలు వున్నవాళ్ళకే కాని సామాన్యులకు అంటని విషయాలు. కనుక ప్రస్తుతానికి ఈ అంశం మోడీ మెడకు బిగుసుకుపోయే అవకాశాలు తక్కువ.
లోకం చుట్టిన వీరుడు అని పేరు తెచ్చుకుంటున్న మోడీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రధానమంత్రి హోదా వున్నప్పుడు, విదేశీ ప్రభుత్వాల  ఆహ్వానాలు, దేశ విదేశాల్లో పర్యటనలు, ఎర్ర తివాచీ స్వాగతాలు, మీడియాలో ప్రచారాలు ఇవన్నీ సహజాతిసహజం. వాటివల్ల సొంతగడ్డకు యెంత మేలు జరిగిందన్నదే ప్రధానం.
ఏడాదిగా స్వచ్చమైన పాలన అందించామని ఎన్డీయే నాయకులు చెబుతున్న దాంట్లో వాస్తవం వుంది. అయితే యూపీఏ మొదటి విడత మన్మోహన్ సింగ్ పాలన కూడా ఇలాగే స్వచ్చంగా సాగిందన్న నిజాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. పతనం మొదలు కాకూడదు. మొదలయితే ఆ వేగం వడీ యెంత ఉధృతంగా ఉంటాయనేది యూపీయే రెండో విడత పాలన మనకు విడమరచి చెబుతోంది.
గత ప్రభుత్వాల  వైఫల్యాల పాత  జాబితాలను పదేపదే వల్లె వేస్తూ పొతే, ప్రజలు కొంతకాలంపాటే అరాయించుకుంటారు. ఏడాది గడిచిన తరువాత కూడా పాత పల్లవే అందుకుంటూ వుంటే, జైట్లీ గారు సెలవిచ్చినట్టు  ప్రజలు విసిగిపోయి, మరొకర్ని  పల్లకీ ఎక్కించే ఆలోచన మొదలు పెడతారు.      
రాజకీయాల్లో వున్నవాళ్ళు రాజకీయం చేయక తప్పదు. కానీ ప్రజలు, పరిపాలన కూడా పాలకులకు అంతే ప్రధానం. ఈ సత్యం ఎరుకలో వుంచుకుంటే పాలకులకూ మంచిది, ప్రజలకూ మంచిది. (23-05-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595  


1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

ఆంధ్రప్రజానీకానికి శుష్కప్రియాలు శూన్యహస్తాలు అందించారు. మాట ఇచ్చి మోసం చేయటం అవినీతి క్రిందికి రాదు అన్న ఉద్దేశం మోదీ సర్కారుకు ఉండబట్టే వారు అవినీతి మచ్చుకు కూడా లేదని తమ జబ్బలు తామే చరచుకుంటున్నారు. ఈయన సర్కారు ఒరగబెట్టిందేమిటీ అని లెక్కలు కూడా వేసే ఉద్దేశం నాకు లేదు. ఆ అవసరం కనిపించటం లేదు. ఆయన సాదాసీదా మోసకారీ రాజకీయనాయకుడు కాదు. గొప్ప చాకచక్యం గల మోసకారీ రాజకీయ నాయకుడు. అంతే తేలింది.