17, మే 2015, ఆదివారం

బుక్ షెల్ఫ్ - 7 ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు


మళ్ళీ కాసిన్ని చాదర్ ఘాట్ స్కూలు కబుర్లు. ముళ్ళపూడి వారి 'కోతి కొమ్మచ్చి' మాదిరిగా కాస్త ముందుకూ, కాస్త వెనక్కూ.
(శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రచించిన 'హైదరాబాదు - నాడు, నేడు' నుంచి)
"మా ఇంగ్లీష్ టీచరు పబ్బరాజు సుబ్బారావు గారు ఓ రోజు ఇంగ్లీష్ పాఠం తీసి పైకి చదవమన్నారు. చాలా కుంట్లు పడుతూ చదివాను. అంతవరకూ నాది తెలుగు మీడియం. ఇంగ్లీష్ సరిగ్గా చూచి చదవలేని పరిస్తితి.. నా మీద నాకే సిగ్గేసింది.
"ఐదో ఫారంలో మా క్లాసు టీచరు జుల్ఫ్ కార్ ఆలీఖాన్. మంచీ ఒడ్డూ పొడుగూ, సినిమా స్టార్ లా ఉండేవాడు. కేంబ్రిడ్జ్ లో ఇంటర్ మీడియట్ చదివి వచ్చాడు. అదే ఆయన యోగ్యత. ఆయన తప్పుల్ని పిల్లలు దిద్దుతుండేవారు.

"మా క్లాసు పిల్లలు నిజంగా సిసింద్రీలు. వాళ్ళ ఇంగ్లీష్ ఇప్పటి ఎం.ఏ. వారికన్నా బాగుండేది. ముఖ్యంగా నరసింహన్   అయ్యంగార్, రామచంద్రారెడ్డి, అబ్దుల్ అజీజ్, ఆజ్మల్ ఖాన్, రాఘవన్ - వీళ్ళు  ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎంతో గొప్పగా వుండేది. రాఘవన్ బేబీ ఆస్టిన్ కార్లో స్కూలుకు వచ్చేవాడు. లెక్కల టీచరు  అబీద్ ఆలీ గారు. ఆయనకు పల్చటి గడ్డం వుండేది. అంచేత ఆయనకు కొత్తిమీర్ కట్ట అని కొంటే పేరు పెట్టారు పిల్లలు.  ఫిజిక్స్  మహమ్మద్ ఆలీ గారు చెప్పేవారు.ఆయనకు దుబ్బుగా పొడవాటి గడ్డం. అందుకని ఝాడుకట్ట అని పేరు.  హిస్టరీ జాగ్రఫీలు వామన్ రావు చెప్పేవారు. టీచర్లకు పేర్లు పెట్టె విషయంలో బందరు పిల్లలు కూడా ఏమీ తక్కువ తినలేదు. 'కాంతా వల్లభరాజులుంగారు' అనబడే మునిమాణిక్యం నరసింహారావు గారు  మా క్లాసు టీచరు. ఆయనకు కళ్ళు పుసులు కారే జబ్బు. ఆయన్ని  చిమ్మెట్ట గారని ఆట పట్టించేవారు. సైన్సు టీచరు సోమజాజులు గారికి మెడ పొడవు.  బీకరు అనేవారు. అనంత శర్మగారికి మెడ పొట్టి. మనిషి లావు. ఆయన్ని మెట్ట  వంకాయ్ అని పిలిచేవాళ్ళు. హెడ్ మాస్టర్ వెంకట రామయ్య గారు 'పాండు రంగడు'. పెద్ద పెద్ద మీసాలు వున్న తాళ్ళూరి నారాయణ రావు గార్ని బొద్దింక మాస్టారు అనే వాళ్ళు. ఆయన తండ్రి చనిపోయిన కారణంగా కర్మకాండలో మీసాలు తీసేశారు. ఇక బొద్దింక గొడవ ఉండదని ఆయన అనుకున్నారు. మీసాలు లేని ఆయన్ని చూసి బోడి బొద్దింక వచ్చిందిరా అనడంతో ఆయన చిన్నబుచ్చుకునేవారు. అలా ఉండేవి చిన్నతనంలో సరదాలు"


 (ఇంకా వుంది)       

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

టీచర్లకి నిక్కునేములు పెట్టడంలో అప్పటివాళ్ళూ అమాయకుండలు కారన్నమాట,హత్తెరికీ!
అదేంటో మరి,యెప్పటికప్పుదు మాకాలంలో ఇట్లా లేదని గూడా వాళ్ళే అంటారు,యెందుకో?