15, మే 2015, శుక్రవారం

బుక్ షెల్ఫ్ - 5 ఎనభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు


(శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రచించిన 'హైదరాబాదు - నాడు, నేడు' నుంచి)
"నిజాము గారికి మనుమడు పుట్టాడు. మొజంజాహి అని పేరు పెట్టారు. మనుమడి పేరుతొ నగరంలో ఒక మార్కెట్ నిర్మించారు కూడా.
నిజాము రాజ్యంలో ప్రజలు దొంగతనాలు ఎరుగరు. పోట్లాటలు ఎరుగరు. నిజాము దగ్గర రెవెన్యూ, పోలీసు విభాగాలు పర్యవేక్షించిన రాజా బహదూర్ సర్ కిషన్ ప్రసాద్, కొత్వాల్ వెంకట్రామరెడ్డి ఇందుకు ప్రధాన కారకులు.  
"ఆబిడ్స్ లోని జమ్రుద్ మహల్ సినిమాహాల్లో దేవకీ రాణి కధా నాయికగా నటించిన  'జవానీకి హవా ' అనే సినిమా చూడడానికి నిజాము ముచ్చటపడి వెళ్ళారు.
"ఆ రోజుల్లో జమ్రుద్ మహల్ పెద్ద సినిమాహాలు. అప్పుడప్పుడు అందులో పాట కచ్చేరీలు కూడా జరుగుతూ ఉండేవి. నేను ముసునూరి సుబ్రహ్మణ్యం గారి కచేరీ అక్కడే విన్నాను.
"ఆబిడ్స్ కార్నర్ లో ప్యాలెస్ అనే కొత్త టాకీసు కట్టారు. సుల్తాన్ బజారులో మోతీ మహల్, రాయల్ టాకీసు అనే రెండు థియేటర్లు ఉండేవి. మోతీ మహల్లో చార్లీ చాప్లిన్ మోడరన్ టైమ్స్, సైగల్ దేవదాసు చూసాను. కొన్నాళ్ళ తరువాత అగ్ని ప్రమాదంలో మోతీ మహల్ పూర్తిగా తగులబడి పోయింది. అప్పుడందులో లేడీ డాక్టర్ సినిమా ఆడుతోంది. సులోచన హీరోయిన్. మంటల నుంచి తప్పించుకోలేక అనేకమంది స్త్రీలూ, పిల్లలూ చనిపోయారు. తర్వాత చూస్తె నాలుగయిదు నెలల చంటి పిల్ల పైన పల్లకీ బొంగు మాదిరి వంగిన తల్లి శవం కనిపించింది. చావులో కూడా తల్లికి పిల్ల మీద యెంత ప్రేమో. ఆ పసిబిడ్డ మాత్రం ప్రాణాలతోనే వుంది. తల్లి ప్రేమ తల్లి ప్రేమే.
"గౌలీగూడాలో ఒక మూకీ హాలు వుండేది. దానికి తెర లేదు. తెల్లని గోడ మీదే సినిమా బొమ్మలు నడిచేవి. స్టంట్ సీన్లు వచ్చినప్పుడు హాలు యజమానులు మనుషుల్ని పెట్టి డప్పులు వాయించేవారు.



(ఇంకా వుంది)     

కామెంట్‌లు లేవు: