(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN IT'S EDIT PAGE ON 14-05-2015, THURSDAY)
ఇప్పుడు దేశంలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ఇప్పుడు దేశంలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
సుమారు
ఒక వారం రోజుల వ్యవధిలో మూడు రాష్ట్రాలలో మూడు న్యాయస్థానాలు దాదాపు ఒకే రకమైన న్యాయాన్ని ప్రసాదిస్తూ తీర్పులు ఇచ్చాయి. వాటి
మంచి చెడులను ఎంచడం ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం కాదు. వింతగొలిపేలా వున్న ఈ తీర్పుల
నేపధ్యంలో చరిత్ర పుటల మాటున దాగిన మరికొన్ని తీర్పులను చదువరుల దృష్టికి
తీసుకురావడానికే ఈ ప్రయత్నం.
కాలమాన
పరిస్తితులను బట్టి చట్టం ప్రకారం నేర స్వభావాలు నిర్ధారించడం జరుగుతుంది.
రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉన్నరోజుల్లో అత్యంత సమర్ద్గుడయిన ఒక బ్యాంకు
అధికారి తన వాహనంలో మద్యం సీసాతో పోలీసులకు పట్టుబడి కొద్ది రోజులు జైల్లో
వుండాల్సివచ్చింది. ఆ అవమానం భరించలేక ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆ తరువాత కొద్ది రోజులకే మద్యనిషేధం ఎత్తి
వేసారు. కానీ ఆయనకు జరిగిన నష్టాన్ని
ఎవ్వరూ పూడ్చలేరు. ఆరోజుల్లో తాగడం తప్పు.
ఇప్పుడు ఖజానా నింపడం కోసం పట్టిబట్టి జనాలచేత అదేపనిగా తాగిస్తున్నారు.
మారిన పరిస్తితులను బట్టి తప్పు ఒప్పుగా
ఒప్పు తప్పుగా మారిపోతున్నాయి. ఈ
మార్పులను అతి సహజంగా సమాజం పరిగణిస్తోంది.
మాదక
ద్రవ్యాలతో పలుకుబడిన పెద్దలు పోలీసులకు పట్టుబడిన వార్తలు అప్పుడప్పుడు
వింటుంటాము. అదే నేరానికి థాయిలాండ్ వంటి దేశంలో మరణశిక్ష విధించే వీలుంది.
మానభంగాలు సరేసరి. సకాలంలో విచారణ పూర్తయి నిందితులకు శిక్షపడితే అబ్బురం
అనుకోవాలి. అదే కొన్ని మధ్య ప్రాచ్య దేశాల్లో ఈ నేరానికి పాల్పడ్డ వారికి చేతులు
నరికేస్తారు. మానభంగం ఒక్కటే కాదు, దొంగతనం కూడా ఆ దేశాల్లో పెద్ద నేరమే. ఆనేరం ఘోరం అనుకునేవారికి ఆ శిక్ష
తప్పనిపించదు. అయ్యో పాపం అనుకునేవారికి అంత శిక్ష అవసరమా అనిపిస్తుంది.
చిన్న
నేరాలకు చిన్న శిక్షలు పెద్ద నేరాలకు పెద్ద శిక్షలు వేయడం కొన్ని దేశాల్లో
సంప్రదాయం అయితే, చిన్న నేరానికి కూడా పెద్ద శిక్ష వేయడం కొన్ని దేశాల్లో
అనూచానంగా వస్తోంది. జీవిత ఖైదు అంటే జీవితాంతం జైల్లో ఊచలు లెక్క పెట్టనక్కరలేదు.
సత్ప్రవర్తనతో బయట పడేవాళ్ళు కొందరయితే రాజకీయ ఔదార్యాలతో శిక్షాకాలం
పూర్తికాకుండానే ఇళ్ళకు చేరేవారు చాలామంది. చైనాలో మాత్రం జీవిత ఖైదు అంటే బతికి
ఉన్నంత కాలం కారాగారంలోనే వుండాలి. ఎలాటి మినహాయింపులు రాయితీలు వుండవు. అమెరికాలో
కూడా దాదాపు ఇంతే. కాకపోతే శిక్షాకాలం తగ్గించే అధికారం ప్రెసిడెంటు ఒక్కరికే
వుంటుంది.
రాజకీయ
కారణాలతో ఏళ్ళ తరబడి జైళ్లలో మగ్గినవారు అనేకమంది వున్నారు. దక్షిణాప్రికాలో
నెల్సన్ మండేలా సుదీర్ఘకాలం అంటే ఇరవై ఏడేళ్ళపాటు జైల్లోనే గడిపారు.
పాలస్తీనా
జాతీయుడు నేల్ బార్గౌతి ఏకంగా అక్షరాలా ముప్పయి ఒక్క ఏళ్ళుగా ఇజ్రాయెల్ జైల్లో
ఉంటున్నాడు. ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు
ఆయన వయస్సు ఇరవై ఒకటి. స్వేచ్చాజీవిగా కంటే ఖైదీగా ఆయన పదేళ్ళు ఎక్కువ
గడిపాడన్నమాట. ఆయనకు శిక్షవేసిన న్యాయమూర్తి ఇన్నేళ్ళని శిక్షాకాలాన్ని నిర్దారించకపోవడం
వల్ల ఎప్పుడు విడుదలయ్యేది ఆయనకీ తెలియదు.
ఇది మరో విషాదం.
బర్మా(మియన్మార్)
లో సైనిక ప్రభుత్వం తమ విధానాలను
వ్యతిరేకించిన బొమిన్ యోకో అనే ఇరవై ఒక్క ఏళ్ళ వ్యక్తికి ఏకంగా నూట నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వేసి తన
కక్ష తీర్చుకుంది.
పొతే,
ఇది జరిగింది అమెరికాలో. 2006 లో జార్గియాలోని ఒక న్యాయస్థానం ఇద్దరు నేరస్తులకి
ఏడేసి చొప్పున జీవితకాలపు జైలు శిక్షలను
విధించింది. అంతటితో వారిని ఒదిలిపెట్టలేదు. అదనంగా ఒక్కొక్కరికీ రెండువందల అరవై
అయిదేళ్ళు చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. ఇంత పెద్ద శిక్ష వేయడానికి వారు చేసిన గొప్ప నేరాలు
ఏమిటంటే సాయుధ దొంగతనాలకు పాల్పడడం.
దీన్ని
మించిన శిక్షను ఒక ఇరాన్ న్యాయమూర్తి వేసారు.
1969 లో ఇద్దరు నేరస్తులను విచారించిన ఆ న్యాయమూర్తి
వారికి ఒక్కొక్కరికీ ఏడువేల నూట తొమ్మిదేళ్ళు జైలు శిక్ష విధించి నేరగాళ్లకు సింహస్వప్నంగా
మారారు.
ఇలా
ఏళ్ళకు ఏళ్ళు జైలు శిక్షలు వేసే క్రమంలో అమెరికా న్యాయమూర్తి ఒక రికార్డు
నెలకొల్పారు. 1981 లో అలబామా రాష్ట్రంలో డుడ్లె వెన్ కైజర్ అనే వ్యక్తీ
ఉబుసుపోక తన భార్యను హత్య చేసాడు. అడ్డం పడ్డ అత్తగారినీ హతమార్చాడు. పనిలోపనిగా తన
నేరాన్ని చూసిన ఒక కాలేజీ కుర్రవాడిని కూడా ప్రాణాలతో ఒదిలిపెట్టలేదు. న్యాయస్థానం
కూడా కైజర్ మహాశయుడ్ని ఒదలలేదు. పదివేల సంవత్సరాల జైలు శిక్ష వేసి మొత్తం అమెరికా
న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక రికార్డు తన ఖాతాలో వేసుకుంది.
పొతే,
అసలు విషయానికి వస్తే కోర్టు శిక్షలనుంచి బయటపడ్డ ప్రముఖులు వున్నారు. వాటిని
తప్పించుకోలేక జైళ్లల్లో మగ్గుతున్న గొప్పవారూ వున్నారు.
రెండేళ్ళక్రితం అమెరికాలోని వర్జీనియా మాజీ గవర్నర్ రాబర్ట్
మెక్డోనెల్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని విలువైన కానుకలు స్వీకరించాడు అనే
అభియోగాన్ని విచారించిన న్యాయమూర్తి ఆయన్ని దోషిగా నిర్ధారించి కటకటాల్లోకి పంపాడు. కానుకల వ్యవహారం కనుక సహజంగానే అయన గారి భార్యకు సంబంధం వుండే
వుంటుందన్న కోణంలో విచారించి ఆవిడను కూడా భర్తతో పాటు జైలుకు సాగనంపారు.
సరే! నేరం చేసి జైలుకు వెళ్ళడం మామూలే. తెలిసీ తెలియని చిన్నతనంలో
చిన్ననేరాలు చేసి జైలు పాలయి తరువాత జీవితంలో చాలా గొప్పవాళ్ళయిన వాళ్ళు కూడా
వున్నారు.
ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ పేరు తెలియని వాళ్ళు వుండరు. అయితే ఆయన్ని
గురించి చాలామందికి తెలియని విషయం ఒకటుంది. బాల్యంలో ఆయన ఒక రాత్రల్లా జైల్లో
ఉండాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఆ రాత్రి జైలు వాతావరణం, పోలీసుల ప్రవర్తన చూసిన
హిచ్ కాక్ కు ఆ భయం జీవితాంతం వెంటాడుతూ వచ్చింది.
వినడానికి విచిత్రం అనిపించవచ్చు కానీ ప్రపంచం మొత్తంలో అతి సంపన్నుడయిన వ్యక్తి బిల్ గేట్స్ కి కూడా జైలు ఊచలు
లెక్కబెట్టక తప్పలేదు. 1977లో మాంచి యవ్వనంలో వున్న గేట్స్
సరయిన లైసెన్సు లేకుండా కారు నడిపిన నేరానికి పోలీసులు పట్టుకున్నారు. లైసెన్సు
లేకపోవడం అటుంచి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్ర దీపం వెలుగుతున్నా పట్టించుకోకుండా
పోవడం ఆయన చేసిన మరో తప్పిదం. ఆ తప్పులకు గాను అయన కొన్ని గంటల సేపు నిర్భంధంలో
వుండాల్సివచ్చింది. అంతకుమందు 1975 లో
కూడా బిల్ గేట్స్ ని లైసెన్సు లేకుండా కారు నడిపినందుకు, అలాగే 1989
లో న్యూ మెక్సికో సిటీలో మద్యం సేవించి
కారు నడుపుతున్నారనే అనుమానంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేసారు.
ఉపశృతి :
అనగనగా ఒక రాజ్యం. దాన్ని ఒక నియంత పాలిస్తున్నాడు. ఆ నియంతకు వ్యతిరేకంగా
హాస్యోక్తిగా మాట్లాడుకోవడం కూడా శిక్షార్హమైన నేరం. అలాటి దేశంలో -
ఒక
న్యాయమూర్తి ముద్దాయికి శిక్ష వేసి
కడుపుబ్బా నవ్వుకుంటూ కోర్టు హాలు నుంచి బయటకు వస్తున్నాడు.
వెంట
వున్న ఆయన స్నేహితుడు అడిగాడు ఎందుకలా నవ్వుతున్నారని.
'జీవితంలో
ఇంత గొప్ప జోకు నేనెన్నడూ వినలేదు అందుకే ఇంతలా నవ్వొస్తోంది'
'ఏమా
జోకు? నాకూ చెప్పండి ఆనందిస్తాను' అన్నాడు
మిత్రుడు.
'అలా ఎలా.
ఆ జోకు చెప్పినందుకే కదా అతగాడికి పదేళ్ళు
జైలు వేసింది'
(12-05-2015)
రచయిత ఈ
మెయిల్: bhandarusr@gmail.com మొబైల్
: 98491 30595
NOTE: Courtesy Image owner
2 కామెంట్‌లు:
"మారిన పరిస్తితులను బట్టి తప్పు ఒప్పుగా ఒప్పు తప్పుగా మారిపోతున్నాయి" అన్న మీ వాక్యం, అలాగే మీ ఉపశృతి కూడా చూస్తే మునుపటి సోవియెట్ యూనియన్ మీద జోకొకటి గుర్తొచ్చింది. మీరు సోవియెట్ లో కొంతకాలం పనిచేసారు కాబట్టి ఈ జోక్ మీకు తెలిసినదేనేమో.
-------------------
కృశ్చేవ్ ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన పద్ధతులంటే పడని ఓ పౌరుడు ఓ మీటింగులో "డౌన్ విత్ కృశ్చేవ్" అని అరిచాడట. వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారు, జడ్జీ గారు పదేళ్ళ జైలుశిక్ష విధించాడు. ఇకనుంచీ జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకుని, శిక్షాకాలం పూర్తయి బయటకి రాగానే "లాంగ్ లివ్ కృశ్చేవ్" అని అరిచాడట. వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారట(అప్పటికి కృశ్చేవ్ పదవిలో లేడు).
------------------------
(గుర్తున్నంతవరకూ వ్రాసాను, చదివి చాలాకాలం అయింది. అప్పట్లో " ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా " లో వచ్చిందనుకుంటాను.)
శిక్ష సంస్కరించేందుకు ఉండాలి. నేరం జరగకుండా ఉండే పరిస్తితులను కల్పించేందుకు తీర్పులు సూచికలుగా ఉండాలి. అర్ధం పర్ధం లేని అస్తవ్యస్థ అయోమయ తీర్పులు వ్యవస్థలలోని లోపాలను తెలియజేస్తున్నాయి. మనిషి మంచి అలవాట్లకు నిరంతరం లోబడేలా, నిరంతరం మంచి అలవాట్లను నేర్చుకునేలా వ్యవస్థలు ఉండాలి. ఆ దిశగా ఆలోచించేందుకు ఇలాంటి వ్యాసాలు ఉపకరిస్తాయి. చట్టం-న్యాయం లను సంస్కరించేందుకు గట్టి ప్రయత్నాలే జరగాలని చారిత్రక సత్యాలెన్నో చెపుతున్నాయి. ఆర్టికల్ బాగుంది బండారు గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి