2, మే 2015, శనివారం

పురుషులు : పుణ్య పురుషులు



(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY IN IT's EDIT PAGE ON 03-05-2015,SUNDAY)

ఒకానొక కాలంలో జిల్లాను  మొత్తం తమ కనుసన్నల్లో శాసించే  జిల్లా కలెక్టర్లకు తమ జిల్లాలో తిరగడానికి జీపు సౌకర్యం మాత్రమే వుండేది. అదీ టార్పాలిన్  పట్టాలు అటూ ఇటూ టపటపా కొట్టుకుంటూ వేళ్ళాడే పాతతరం జీపులు.
అలాటి కాలంలో, ఒకానొక  జిల్లాలో,  కలెక్టర్ గా పనిచేస్తున్న ఓ ఐ.ఏ.ఎస్. అధికారి జీపు తీసుకుని  ఓ రోజు ఉదయం ఏదో గ్రామానికి టూరుకు వెళ్లి తిరిగి వస్తుంటే జీపు టైరు పంక్చర్ అయింది. సెల్ ఫోన్లు లేని రోజులాయె. డ్రైవర్ పంక్చర్ వేయించుకుని రావడానికి కొన్ని మైళ్ళ దూరంలో వున్న మరో పెద్ద  వూరికి వెళ్ళాడు. కలెక్టర్ గారి వెంట వున్న బిళ్ళ బంట్రోతు, అయ్యగారికి చెట్ల నీడన వున్న ఒక మోరీ చూపించి అక్కడ కూర్చోపెట్టాడు. డ్రైవర్ రావడానికి బాగా వ్యవధి వుంది. అటూ ఇటూ చూస్తున్న  కలెక్టర్ గారి దృష్టికి దగ్గరలో ఓ వూరు జాడ కనిపించింది. కొందరు ఆడవాళ్ళు బిందెలు చంకన పెట్టుకుని వస్తూ  కానవచ్చారు. ఆయన వారిని పలకరించి, 'నీళ్ళ కోసం  ఇంత దూరం ఎందుకు పడుతూ లేస్తూ వస్తున్నారు, మీ వూళ్ళో మంచి నీటి  బావి లేదా?' అని ప్రశ్నించారు. 'నువ్వేమన్నా ఆర్చేవాడివా, తీర్చేవాడివా' వంటి చొప్పదంటు   ప్రశ్నలు వాళ్ళు వేయకుండా, 'వూళ్ళో బావులకేం చాలా వున్నాయి, కానీ మమ్మల్ని అక్కడ నీళ్ళు తోడుకోనివ్వరు' అని బదులు చెప్పారు. కలెక్టర్ సాలోచనగా తలపంకించి ఊరుకున్నారు. ఈలోగా టైరు పంక్చర్ వేయించుకుని డ్రైవర్  తిరిగివచ్చాడు. కలెక్టర్ తన మానాన తాను పొతే కధే లేదు. ఆయన అల్లాంటి ఇల్లాంటి అధికారి కాదు కాబట్టి ఏం చేయాలో వెంటనే ఆలోచించి పెట్టుకున్నాడు. డ్రైవర్ ని నేరుగా  జిల్లా కేంద్రానికి పంపించి తాను ఆ మోరీ మీదనే కూర్చుండిపోయాడు. ఈలోగా ఆయన మౌఖిక ఆదేశాలు అందుకున్న కలెక్టర్ గారి సిబ్బంది, స్థానిక తాసిల్దారు  టైప్ రైటర్లు, కలెక్టర్ గారి అధికారిక ముద్రిక తదితరాలతో సహా అక్కడికి వచ్చారు. ఊళ్ళోకి కబురు పంపి గ్రామ సర్పంచుని రప్పించారు. ఈ హడావిడి అంతా చూసి ఊరిజనం అంతా అక్కడ పోగయ్యారు. వూరి వెలుపల నుంచి మంచి నీళ్ళు తెచ్చుకునే వారికి వారి గూడెం లోనే ఒక మంచి నీటి బావి మంజూరు చేయాలని  సర్పంచు నుంచి ఓ అభ్యర్ధన పత్రం తీసుకున్నారు. దానికి అక్కడికక్కడే స్థానిక అధికారి నుంచి ఆమోద ముద్ర వేయించారు. తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకుంటూ అందుకు అవసరమైన నిధులను తక్షణమే  మంజూరు చేస్తూ ఆ మోరీ మీదనే  కూర్చుని సంతకం చేసి, కింద స్టాంపు వేసారు.  ఆ వెనువెంటనే  కూలీలను పిలిపించారు. బావి తవ్వకానికి ఆయనే స్వయంగా గడ్డపారతో మొదటి పలుగు వేసి స్వీకారం చుట్టారు. ఝాము పొద్దెక్కక ముందే ఝామ్మని బావి  పని మొదలయింది. అంతకుముందు ఆ ఊరిజనం ఇలాటి అధికారిని చూడలేదు సరికదా కనీసం వినికూడా వుండలేదు. అందుకే అందరి మొహాల్లో నిండుకున్న నిబిడాశ్చర్యం. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వారి వూరిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శుభారంభం జరిగింది. పొద్దుగూకే సమయానికి బావిలో సమృద్ధిగా జలపడింది. ఆ వూరి గూడెం జనానికి కొత్త పొద్దు పొడిచింది.
ఆ జిల్లా ఖమ్మం జిల్లా. ఆ వూరు రెబ్బారం అని అందరూ పిలుచుకునే రెబ్బవరం. ఆ కలెక్టర్ గారి పేరు ఆర్. పార్ధసారధి. ఆయన ఇప్పుడు జీవించి లేరు.  కానీ ఆ గూడెం ప్రజల మనస్సులో ఇంకా జీవించే వున్నారు.  
పురుషుల్లో పుణ్యపురుషులు వేరయా అన్నట్టు అధికారుల్లో కూడా పుణ్యమూర్తులయిన అధికారులు వుంటారు అని చెప్పడానికే ఈ సోదాహరణ.           
ఈ యాభై ఏళ్ళలో అనేక మార్పులు వచ్చాయి. జిల్లాకు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి మాత్రమె వుండే  పద్దతి మారి జిల్లాకు ముగ్గురు నలుగురు వచ్చారు. టార్పాలిన్ పట్టాలు వున్న జీపులు పోయి అధునాతన వాహన శ్రేణి వచ్చి చేరింది. జిల్లా మొత్తంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో తెలియచెప్పే సమాచార  వ్యవస్థ చేతికి అంది వచ్చింది. సిబ్బంది పెరిగారు. జనం ఇబ్బందులూ పెరిగాయి. మరీ అంతలా కాకపోయినా, రాజకీయ అవరోధాలను అధిగమించి, పదిమందికి పనికి వస్తాయని తాము అనుకున్న మంచి పనులను అనుకున్న రీతిలో చేసి పెట్టె అధికారులు కూడా మన మధ్యనే వున్నారు.

(సురేష్ చందా)

ఇప్పుడు అలాటి ఓ మంచి అధికారి చేసిన ఓ మంచిపని గురించి రెండు రోజులుగా మీడియాలో మంచి మంచి కధనాలు వస్తున్నాయి.
సురేష్ చందా అనే ఆ అధికారి తెలంగాణా సచివాలయంలో ఒక ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో ఆరోగ్య, వైద్య సేవలు ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలా అందుతున్నాయో పర్యవేక్షించే ఐ.ఏ.ఎస్. అధికారి. యువకుడు  కావడం వల్ల కంప్యూటర్ పరిజ్ఞానం హెచ్చుగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అంచేత తన శాఖ పని తీరు మెరుగుపరుచుకోవడానికి ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలని ఆయన భావించారు. తెలంగాణాలో పేరొందిన గాంధి ఆసుపత్రితో మొదలు పెట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అనుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఏమూల ఏం జరుగుతున్నదో  సచివాలయంలోని తన చాంబర్ నుంచే కనిపెట్టి చూసే ఉద్దేశ్యంతో ఆ ఆసుపత్రిలో సుమారు రెండువందల నిఘా కెమెరాలను అమర్చాలని తలపెట్టారు. కిందవాళ్ళు చేసే పనులను కనిపెట్టి చూడడం ఆయన  బాధ్యతల్లో ఒకటి. కానీ, తాను  ఎలా పనిచేస్తున్నది కూడా  నలుగురికీ తెలియాలి కదా! అందుకని ఈ ప్రయోగాన్ని ఆయన తనతోనే ప్రారంభించారు. చడీచప్పుడూ కాకుండా తన కార్యాలయంలో ఒక నిఘా కెమెరాను ఏర్పాటు చేసుకున్నారు. తన గదిలో ఏం జరిగేది, తనను కలుసుకోవడానికి ఎవరెవరు వచ్చేది, ఏం మాట్లాడేది రికార్డు చేయడం కోసం ఈ కెమెరా. అయితే ఈ కెమెరా రికార్డు చేసేది తను ఒక్కరే కాకుండా ఎవరయినా సరే  చూడగలిగేలా ఇంటర్నెట్ తో దాన్ని  అనుసంధానం చేయడం ఇందులోని ఒక ప్రత్యేకత. 'సమాచార చట్టం ప్రకారం ప్రజలకు తెలుసుకునే హక్కు వచ్చింది. వాళ్ళు అడిగితె ఇవ్వడం కాకుండా అడక్కుండానే యావత్ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచితే తప్పేమిట'నేది ఈ అధికారి అభిప్రాయం. తన దృష్టికి వచ్చిన ఫైళ్ళపై తాను  రాసిన నోట్ వివరాలను కూడా వెంటవెంటనే ఆయన ఇంటర్నెట్లో పెడుతుంటారని  పత్రికల్లో చదివినవారికి ఒకింత ఆశ్చర్యం కలగడం సహజం. అవసరానికి మించిన గోప్యతను అధికారులు పాటించడం వారికో అలవాటని జనంలో ఒక అభిప్రాయం బలంగా నాటుకుని ఉండడమే ఇందుకు కారణం. తాము చెప్పినది సావకాశంగా విని, కోరిన సమాచారం ఓ మేరకయినా అధికారులు అందించగలిగితే, తమ సమస్య సగం పరిష్కారం అయిందని సంతోషించే సామాన్యుల సంఖ్య కూడా అధికమే.
'అనుమతి లేకుండా పురుగు కూడా ప్రవేశించలేని అతి శీతల గదుల్లో కూర్చుని అధికారులు ఏం చేస్తుంటారు?' అనే అనుమానం సాధారణ జనంలో వుంది. అ అధికారుల గదుల్లోకి కనీసం తొంగి చూడడానికి కూడా వీలుపడని  వారికి సురేష్ చందా అనే ఈ అధికారి చేస్తున్నది అబ్బురం అనిపించడంలో సందేహం లేదు.    
అడగగానే మెచ్చి వరాలు ఇచ్చే దేవుళ్ళకు మన పురాణాల్లో కొదవలేదు. అడగకుండానే సమాచారం ఇవ్వాలనే అభిమతం కొందరు అధికారుల్లో అయినా ఊపిరి పోసుకోవడం  అభిలషణీయం. ఆహ్వానించదగ్గ పరిణామం .
మొత్తం పరిపాలన ఇలా ప్రజల  కళ్ళ ముందు జరగడం అంటూ జరిగితే పాలకుల పట్ల ప్రజల్లో పేరుకుపోతున్న అసహనం ఓ మేరకయినా తగ్గడం కూడా  ఖాయం.   (02-05-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

నా దృష్టిలో కలెక్టర్ పార్థసారథి చేసింది తప్పు . ఊరి బావి నుండి నీటిని తీసుకు వెల్లనివ్వని వారిని శిక్షించే అధికారం కలిగి ఉండి కూడా వేరే బావిని తవ్వించడం గొప్పపని కాదు.