28, ఏప్రిల్ 2015, మంగళవారం

నేపాల్ భూకంపం : నేర్చుకోవాల్సిన పాఠాలు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY IN IT'S EDIT PAGE ON 30-04-2015, THURSDAY)

నేపాల్ భూకంపం మానవాళికి కొత్త పాఠం బోధిస్తోంది.
ఆధునిక విజ్ఞానం అందించిన సాధన సంపత్తితో ప్రకృతిని జయింఛామని విర్రవీగడాన్ని మించిన అజ్ఞానం మరోటి లేదని. ప్రకృతి ప్రకోపిస్తే రోదసిని దాటివేసిన అడుగులు కూడా నిరర్ధకమనీ మానవులకు నూతన సూక్తులను ప్రబోధిస్తోంది.  చంద్రుడి మీద పాదం మోపి, గగనాంతర సీమల్లో విహారాలు సలిపి, గ్రహాంతర వీధుల్లో సంచారాలు చేసి వచ్చిన మనిషి ప్రతిభాపాటవాలు  ప్రకృతి శక్తికి ఏమాత్రం దీటు రావని, సాటి కావని మరోమారు తెలియచెప్పుతోంది.


నాగరీకత ధ్యాసలో మునిగి,  ఆధునికత ఆశలో కూరుకుపోయి అవివేకంగా వేస్తున్న అడుగులే సమస్త మానవాళికి ముప్పు తెస్తున్నాయన్న హెచ్చరికలను లెక్కచేయకుండా  పక్కనబెట్టి చేస్తున్న పనులే ప్రకృతి వైపరీత్యాలకు కారణభూతం అవుతున్నాయన్న ఎరుక కరువై, మనిషి  కొని తెచ్చిపెట్టుకున్న కష్టాల జాబితాలో భూకంపాలు కూడా వున్నాయి. అడ్డూ అదుపూ లేకుండా మానవులు సాగిస్తున్న ప్రకృతి విధ్వంసం, అడవుల నాశనం, చమురు వెలికితీతలు, సమతుల్యాన్ని దెబ్బతీసే తవ్వకాలు ఇలాటి   వైపరీత్యాలకు హేతువులు అవుతున్నాయి.  సుద్దులు, సూక్తులు  తలకెక్కక పోవడం వల్లనే అకారణ, అవాంఛిత మరణాలకు, ఆస్తుల విధ్వంసానికి  దారితీస్తున్నాయి.
కొన్ని ప్రకృతి వైపరీత్యాలు ముందస్తుగా చెప్పివస్తే, మరి కొన్ని పసికట్టేలోగానే తమ ప్రతాపం చూపిస్తాయి. కళ్ళు మూసి తెరిచేలోగా ఏదో విధ్వంసక శక్తి తన మంత్రం దండానికి పని చెప్పినట్టు మేడలు మిద్దెలు పేక మేడల్లా నిమిషాల్లో కూలిపోతాయి. జీవితం యెంత క్షణ భంగురమో తెలిసివచ్చేలా అంతవరకూ నీడ ఇచ్చిన ఇంటి శిధిలాల్లోనే ఇంటిల్లిపాది చిద్రం అయిపోవడం ఇటువంటి సందర్భాల్లో అనుభవైకవేద్యం. చనిపోయిన వారు పోగా ప్రాణాలతో మిగిలివున్నవారు అయినవారినందరినీ  కళ్ళముందేపోగొట్టుకున్న వేదనతో కొంతా,  మృత్యు ముఖంలోకి వెళ్ళివచ్చిన భయపు ఛాయలు వదలక మరికొంతా జీవచ్చవాలుగా మారుతారు. నేపాల్ లో జరిగిన భూకంపం కలిగించిన ఉత్పాతాన్ని కళ్ళారా చూసిన గర్భవతులయిన అక్కడి మహిళలు మానసిక ఆందోళనతో గర్భ విచ్చిత్తి పొందినట్టు వస్తున్న వార్తలు ఇందుకు తార్కాణం.
అతి చిన్న దేశానికి అతి పెద్ద కష్టం వచ్చి పడింది. అంతర్జాతీయ సమాజం పెద్ద మనసుతో తన వంతు బాధ్యత పోషిస్తోంది. ఐక్యరాజ్య సమితి స్వయంగా రంగంలోకి దిగింది. నేపాల్ కు పెద్దన్న అనే పేరు వున్న భారత దేశం ఆపన్న దేశానికి సహాయ హస్తం అందించింది. అనేక భారతీయ విమాన సంస్థలు, టెలికాం సంస్థలు, వస్తు ఉత్పత్తి సంస్థలు నేపాల్ విషయంలో కనీవినీ ఎరుగని భారీ రాయితీలు ప్రకటించాయి. జరగరానిది జరిగినప్పుడు జరగాల్సినవన్నీ యాంత్రికంగా జరిగిపోతూనే వుంటాయి. పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేకపోయినా, జరిగిన నష్టాన్ని  పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోయినా ఓ మేరకయినా సాయం అందుతుంది. అదో ఊరట. మానవత్వం ఇంకా వూపిరితోనే వుందని ఓ భరోసా.
సందర్భం కాబట్టి కొన్నేళ్ళ క్రితం జరిగిన  ఓ విషయాన్ని మననం చేసుకోవడం సందర్భోచితమే అవుతుంది. అందుకే ఈ పునశ్చరణ.
అది 2011 సంవత్సరం. అది  జపాన్ దేశం.
                             

ఉవ్వెత్తున లేచిన సముద్రపు అలలు చెలియలికట్టదాటి అంతెత్తున ఎగసిపడి మిన్నూ మన్నూ ఏకం చేస్తూ తమ ఉగ్రరూపాన్ని ప్రదర్శించినప్పుడు

ప్రకృతి ప్రకోపానికి గురయి, మానవ నిర్మిత కట్టడాలన్నీ పేకమేడల్లా కూలిపోతున్నప్పుడు,

పొంగి పొరలిన సంద్రపు నీటిలో పెద్ద పెద్ద కార్లూ, విమానాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోతున్నప్పుడు-

యుగాంతంవంటి హాలీవుడ్ సినిమాల్లో చూపించిన గ్రాఫిక్ దృశ్యాలను తలదన్నే విధంగా ప్రకృతి ప్రదర్శించిన విలయతాండవం ముందు మనిషి మరుగుజ్జుతనం మరోసారి ప్రపంచానికి వెల్లడయింది.

మూడింట రెండువంతులు నీరు ఆవరించివున్న ఈ భూమండలంలో జపాన్ అనేది అనేకానేక చిన్న చిన్న దీవుల సమూహం. ఈ దీవుల్లో హోన్షూ, షికోకు, హూక్కై దో, క్యుషూ అనేవి ప్రధానమైనవి.

అయితే బయట ప్రపంచానికి తెలిసిన జపాన్ అంటే హోన్షూ నే. ఎందుకంటె, జపాన్ అనగానే అందరికీ తటాలున గుర్తొచ్చే టోకియో, ఒసాకా,నగాయో,క్యోటో నగరాలు హోన్షూ అనే ఈ ప్రధాన భూభాగం లోనే వున్నాయి. జపాన్ జనాభాలో అత్యధిక భాగం హోన్షూ లోనే నివసిస్తూవుండడం కూడా మరో కారణం. పైగా, దేశ ఆర్ధిక వ్యవస్తకు ఇది గుండెకాయ లాటిది. విస్తీర్ణం దృష్ట్యా పెద్దదే అయినా, ప్రపంచపఠంలో చూస్తే మాత్రం హోన్షూ దీవి ఒక అరటి పండు మాదిరిగా కనిపిస్తుంది. పసిపిక్ మహా సముద్రం మధ్య వున్న ఈ దీవి, యావత్ ప్రపంచంలో ఒక సంపన్నదేశంగా జపాన్ ఆవిర్భావానికి దోహదం చేసింది. ఎలెక్ట్రానిక్, మోటారు పరిశ్రమలతో మొత్తం ప్రపంచ దేశాలలోనే పేరుపొందిన జపాన్ సునామీలు, భూకంపాలకు కూడా పెట్టింది పేరు.

వారికి మరో మంచి పేరు కూడా వుంది. అదే ఈ వ్యాసానికి ప్రేరణ. అన్ని దేశాలకు అనుసరణీయం. ఇలాటి ఉపద్రవాలపట్ల ఆ దేశం సాధించిన సంసిద్ధతే ఆ దేశానికి ఈ మంచి పేరు కట్టబెట్టింది.  ఈ విషయంలో జపాన్ కు సరితూగగల మరో దేశం ప్రపంచంలో లేదనడం అతిశయోక్తికాదు. ఎందుకంటె సునామీలు, భూకంపాలు ఆ  దేశానికి కొత్తకాదు. అక్కడి ప్రజలు వాటితో సహజీవనం చేయాల్సిన పరిస్తితి. నిజానికి సునామీ, (త్సునామీ ) టైఫూన్ అనే పదాలు జపాన్ భాషకు చెందినవేనంటారు. ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఏమి చేయాలన్నది పైనుంచి కింద దాకా అన్ని స్తాయిల్లోని వారికి కరతలామలకం.

ప్రజలందరికీ ఈ విషయంలో చక్కని అవగాహన వుంటుంది. మిన్ను విరిగి మీద పడే సందర్భాలలో సయితం నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను గురించి అతి తక్కువ స్తాయిలోని ఉద్యోగికి కూడా తెలిసివుంటుంది. ముఖ్యంగా గత అనేక  సంవత్సరాల కాలంలో అక్కడి నిపుణులు ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో తక్షణం స్పందించాల్సిన తీరు గురించి శాస్త్రీయ పద్ధతుల్లో ఒక నిర్దిష్టమయిన విధానాన్ని రూపొందించుకున్నారు. ఈ  దుర్ఘటనలో జన నష్టం నివారణకు అది బాగా ఉపయోగపడిందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో వారు అధునాతన కంప్యూటర్ వ్యవస్తను కూడా చక్కగా వాడుకుంటున్నారు. ఈ కోణం దృష్ట్యా ఆలోచిస్తే, ఆ దేశం నుంచి ఇతర దేశాలు నేర్చుకోవాల్సింది ఎంతో వుందనిపిస్తోంది.

భూకంపాలవంటి విపత్తులు ముంచుకొచ్చినప్పుడు ప్రతి పౌరుడు ఎలాటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించడం వల్ల ఒకరినుంచి ఆదేశాలు కానీ, సూచనలు కానీ అందుకోవాల్సిన అవసరం లేకుండా అందరూ ఎవరికివారు పరిస్తితికి తగ్గట్టుగా వెంటనే స్పందించగలిగారని ఒక ప్రత్యక్ష సాక్షి కధనం.

ప్రకృతి  వైపరీత్యం గురించిన అనుమానం తలెత్తగానే ఎవరికి వారు ముందు తమ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం  ఇవ్వాలనేది శిక్షణలో నేర్పే తొలి పాఠం. ఆ జాగ్రత్త తీసుకున్న తరువాత  ఆ సమాచారాన్ని ఇతరులకు తక్షణం తెలియచెప్పాలన్నది రెండో పాఠం. అదేసమయంలో తోటి వారి భద్రతకు ఏం చెయ్యాలని ఆలోచించాలి. మిన్నువిరిగి మీదపడే సందర్భాలలో సయితం ఇలా స్థితప్రజ్ఞతతో ఆలోచించగల నైపుణ్యాన్ని జనాలకు కలిగించడం ఈ శిక్షణ లక్ష్యం.

ఉదాహరణకు ఒగాకీ నగరాన్ని తీసుకుందాము. అక్కడి జనాభా లక్షా యాభయ్ వేలు. ఇంగ్లీషు మాట్లాడే దేశాలనుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పట్టుమని పాతికమంది కూడా వుండరు. అయినా ఇంగ్లీష్ అనువాదకుల జాబితా అధికారుల వద్ద సిద్ధంగా వుంటుంది. విపత్కర పరిస్తితులను ఎదుర్కోవడానికి ఈ రకమయిన సంసిద్ధత చాలా అవసరమని జపానీయులు నమ్ముతారు.

అలాగే, ఇంటర్ నెట్ ను ఇలాటి సందర్భాలలో వినియోగించుకుంటున్న తీరు కూడా అమోఘం. సాధారణంగా ఈ సదుపాయాన్ని వాడుకునే వారి సంఖ్య ఆ దేశంలో చాలా అధికం. విద్యార్ధి దశ నుంచే అక్కడి వారు దీన్ని బాగా ఉపయోగిస్తారు. అక్కడి విద్యాసంస్తలు విద్యార్ధులతో అనుసంధానం కావడానికి ప్రత్యేక పోర్టల్ ఉపయోగిస్తాయి. విద్యార్ధులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తరగతి షెడ్యూల్ సరి చూసుకోవడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ప్రకృతి వైపరీత్యాల సమాచారాన్ని వెనువెంటనే తెలియచేయడానికి ఇది వారికి బాగా అక్కరకు వస్తోంది. ఈ పోర్టల్ లో ముందు కానవచ్చేదే ఎర్రటి పెద్ద అక్షరాలతో కూడిన హెచ్చరిక. ఈ రోజు తరగతిలో ఏఏ పాఠాలు బోధించబోతున్నారనే విషయం తెలుసుకోవడానికి ఆతృతతతో పోర్టల్ తెరిచిన విద్యార్ధులకు ఆ దుర్ఘటన జరిగిన రోజు కనబడిన హెచ్చరిక ఏమిటో తెలుసా? “తరగతి సంగతి మరచిపోండి. సునామీ విరుచుక పడబోతోంది. వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపొండి

ఈ విధమయిన ఏర్పాట్లు అన్ని కార్యాలయాలలో, సంస్తలలో వుండే విధంగా ఆ దేశంలో అనేక చర్యలు తీసుకున్నారు. అందుకే, సెకన్ల వ్యవధిలోనే సమాచారం దేశంలోని నలుమూలలకు చేరిపోయింది. జనాలను గాభరా పెట్టేందుకు కాక అప్రమత్తం చేసే ఉద్దేశ్యంతో చేసిన ఈ హెచ్చరికలు సత్ఫలితాలను ఇచ్చాయని అక్కడివారు చెబుతున్నారు.

పాట్రిక్ అనే సిస్టం ఇంజినీర్ తన అనుభవం గురించి చెప్పిన వివరాలు వింటే యుద్ధ ప్రాతిపదికఅని తరచుగా వినబడే మాటకు అసలుసిసలు అర్ధం బోధపడుతుంది.

భూకంప ప్రకంపనలకు సంబంధించిన తొట్టతొలి సూచనను గమనించిన ఆ ఇంజినీర్ పంపిన సమాచారం రెండు సెకన్ల వ్యవధిలోనే చేరాల్సిన చోటికి చేరిపోయింది. తూర్పు జపాన్ తీరానికి దగ్గరలో తీవ్రమయిన భూకంపం సంభవించిందన్న ప్రభుత్వ సమాచారం వేలమైళ్ళ దూరంలో వున్నవారికి సయితం చేరడానికి మరో రెండు సెకన్ల కంటే ఎక్కువ వ్యవధి పట్టలేదు. మరో రెండు సెకన్లలో భూకంపం సంభవించిన ప్రాంతాలతో టెలిఫోన్ సంబంధాలు తెగిపోయిన సమాచారం అందింది. అయితే, వెనువెంటనే రిమోట్ ద్వారా ఎమర్జెన్సీ కాంటాక్ట్ సదుపాయాన్ని పునరుద్ధరించిన కబురు అందింది. ఇదంతా జరగడానికి పట్టిన సమయం కేవలం తొంభయ్ సెకన్లు. మరోపక్క సహోద్యోగులు, ఇరుగుపొరుగువారి రక్షణ బాధ్యతను ఎవరికివారు స్వచ్చందంగా భుజాన వేసుకున్నారు. ఎవరు ఎక్కడ వున్నారు అన్న సమాచారాన్ని క్షణాల మీద తెప్పించుకుని వారిని అప్రమత్తం చేసారు.

ఇదేమాదిరి సన్నివేశాలు ఆ రోజు జపాన్ దేశమంతటా కానవచ్చాయంటే ఇలాటి సందర్భాలలో ఆ దేశ సంసిద్ధత ఎలావున్నదన్నది వూహించుకోవచ్చు.

ఆ ఇంజినీర్ మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియచేసారు.

నేనున్న చోట ఆ రోజు భూమి కంపించడం మొదలయింది. బాగా గాలి వీస్తోంది కాబట్టి భవనం వూగుతోందని ముందు భ్రమ పడ్డాను. మా దేశం భూకంపాలకు నిలయం కనుక వాటిని తట్టుకునేలా భవనాలను నిర్మించుకోవడం ఇక్కడి పధ్ధతి. అందుకోసం ప్రచండమయిన గాలులు వీచినప్పుడు భవనాలు కదిలిపోయేలా వాటిని నిర్మిస్తారు.భూకంపాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం వీలయినంత తగ్గించడానికి ఈ విధమయిన నిర్మాణ పద్ధతులను అనుసరిస్తున్నారు.

ఆ రోజు నేను వున్న భవనం వూగిపోవడం మొదలుకాగానే, కిటికీ నుంచి బయటకు చూసాను. దాపున వున్న రైల్వే స్టేషన్ నుంచి ఓ రైలు బయటకు వస్తోంది. వున్నట్టుండి ఆ రైలుకు బ్రేకులు పడ్డాయి. కీచుమని శబ్దంచేస్తూ పట్టాలపై ఆగిపోయింది. బహుశా, భూకంపం గురించిన సమాచారం తెలిసినవారెవ్వరో రైలు డ్రయివర్ కు ఇంటర్నెట్ ద్వారా ఆ కబురు చేరవేసివుంటారు. అందువల్లనే రైలును వెంటనే నిలిపివేసారు. ఎందుకు ఆపాల్సి వచ్చిందో ప్రయాణీకులకు లౌడ్ స్పీకర్ల ద్వారా తెలియచేసివుంటారు. అది వేరే విషయం. ఈ దేశంలో ఇవన్నీ సర్వ సాధారణం.

గంటకు నూట యాభయ్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్న రైళ్ళు కూడా, ముందస్తు సమాచారం అందుకున్న కారణంగా ఎక్కడికక్కడ నిలచిపోయాయి. వాటిల్లో వున్న ప్రయాణీకులందరూ క్షేమంగా వున్నారు. ఇలాటి ఏర్పాట్లు సమగ్రంగా వున్నందువల్ల ఎక్కడా రైళ్ళు పట్టాలు తప్పలేదు. సునామీ సమయంలో జపాన్ రైల్వే వ్యవస్థ పనిచేసిన తీరు అమోఘం. మొత్తం మీద హోన్షూదీవిలో ప్రతిచోటా ఇదే దృశ్యం.  విమానాలు గాలిలో ఎగిరాయి. భవనాలు కూలకుండా నిలిచాయి. ప్రజాజీవనం అస్తవ్యస్తం కాలేదు.

ఒగాకీ నుంచి రైల్లో నగోవా వెడుతున్నప్పుడు అనేక కర్మాగారాలు కానవస్తాయి. వీటిల్లో చెప్పుకోదగింది బీరు తయారుచేసే ఓ కర్మాగారం. పైకి పెద్ద పెద్ద బీరు సీసాల మాదిరిగా కానవచ్చే ట్యాంకుల్లో విపరీతమయిన వొత్తిడి మధ్య బీరు నిలవచేస్తారు. ఈ ఫాక్టరీలలో ప్రమాదకరమయిన రసాయనాలు వుంటాయి. నిజానికి ట్రిగ్గర్ లేని దారుణమయిన ఆయుధాల వంటివి ఈ కర్మాగారాలు. కానీ, వీటిల్లో ఏ ఒక్కటీ పేలిపోలేదు. ఎందుకంటె, సునామీలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తట్టుకోవడానికి వీలయిన వ్యవస్తలను జపాన్ సిద్ధంచేసి పెట్టుకుంది. సమయానికి ఆ వ్యవస్తలు అనుకున్నవిధంగా పనిచేశాయి. కనీవినీ ఎరుగని విపత్తు వాటిల్లినప్పుడుకూడా లక్షలాదిమంది ప్రాణాలు నిలబడ్డాయంటే, ముందే పకడ్బందీగా నిర్మించుకున్నఈ వ్యవస్తలన్నీ అనుకున్నవిధంగా పనిచేయడమే కారణం. ఇందులో అతిశయోక్తి ఏమీలేదు. నిజంగా వ్యవస్థ పనిచేసింది. ఇది మానవ నాగరిక సమాజం సాధించిన విజయం. జపాన్ లోని ప్రతి ఇంజినీరు ఈ విపత్కర సమయంలో తన దేశం కోసం, తన తోటివారికోసం కష్టించి పనిచేసాడు. అయితే, ఇది అప్పుడే గట్టిగా పైకి చెప్పుకోలేని పరిస్తితి. ఎందుకంటే జరగాల్సినంత స్తాయిలో దారుణం జరగకుండా నిరోధించగలిగినామన్న సంతోషం మాకెవరికీ మిగలలేదు. జరగకూడనిది జరిగిపోయింది. అనేకమంది మరణించారు. ఇంకా అనేకమంది జాడ తెలియడం లేదు. వారి కుటుంబాలు రోదిస్తున్నాయి. మిగిలిన మేమందరం వారందరికీ బాసటగా నిలవాల్సిన తరుణం ఇదిఅని ఆ ఇంజినీర్ తన భావాలను పంచుకున్నాడు.

అంత నిబ్బరంగా కర్తవ్యాలను నిర్వర్తించిన జపాన్ ప్రజలు సర్వదా అభినందనీయులు. చూసినదానినుంచీ, విన్నదానినుంచీ నేర్చుకోవడాన్నే విజ్ఞానం అంటారు. లేకపోతే మిగిలేది అజ్ఞానమే. (28-04-2015)

రచయిత మొబైల్: 98491 30595, ఈమెయిలు:  bhandarusr@gmail.com

NOTE: Courtesy Image Owner  

కామెంట్‌లు లేవు: