(Published by 'SURYA' telugu daily in it's edit page on
16-04-2015)
http://www.suryaa.com/pdf/display.asp?edition=0&page=4
పుట్టిన ప్రతిమనిషికీ ఒక
పుట్టిన రోజు వుంటుంది. కొందరి పుట్టిన రోజులకు వారి వారి హోదాలనుబట్టి గుర్తింపు
లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికీ,
ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికీ పుట్టిన రోజులు గుర్తుపెట్టుకుని జరిపేవారు
అప్పటికప్పుడు పుట్టుకొస్తుంటారు కూడా.
ఎనభయ్యవ దశకం
ప్రధమార్ధంలో టంగుటూరి అంజయ్య ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుమారు పదహారు
మాసాలపాటు పనిచేశారు. ఆయన 1929
లో పుట్టారని తెలుసుకానీ, ఏరోజున పుట్టారో అయన
పేషీలో ఎవరికీ తెలవదు. ముఖ్యమంత్రి అన్నాక ఇష్టం వున్నా లేకపోయినా పుట్టిన రోజంటూ జరుపుకోవాలి. అధికారులూ, అనధికారులూ,
అభిమానులూ వరుసలు కట్టి వచ్చి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలపడం ముఖ్యమంత్రుల
దర్బారుల్లో ఓ ఆనవాయితీ. దానికి భంగం
వాటిల్లరాదని భావించిన ఆయన పేషీలోని ఓ అధికారి, కృష్ణుడు పుట్టిన జన్మాష్టమి నాడే అంజయ్య గారు పుట్టారనీ, అదే అయన జన్మదినమనీ నిర్ణయించడం,
తగు విధంగా ఆ ఏడాది కృష్ణ జన్మాష్టమి నాడు
ముఖ్యమంత్రిగారికి పుట్టినరోజు అభినందనలు
తెలిపే కార్యక్రమాలు నిర్వహించడం జరిగిపోయాయి. రాజీవ్ గాంధీ పుణ్యమా అని ఆయన్ని
అర్ధాంతరంగా పదవినుంచి తొలగించడం వల్ల అంజయ్య గారు రెండో ఏడాది కూడా వరసగా తన పుట్టిన రోజును ముఖ్యమంత్రి
హోదాలో జరుపుకునే అవకాశం లేకుండా పోయింది.
సరే అదొక కధ.
అధికారంలో వున్నవాళ్ళు
పుట్టిన రోజులు జరుపుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ
క్రమంలో అభిమానులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడం ఒక్కటే ప్రశ్నార్ధకమవుతోంది.
హైకోర్టు ధర్మాసనం కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియా వార్తలు
తెలుపుతున్నాయి.
ఏ రాజకీయ పార్టీ నాయకుడి
పుట్టిన రోజు అయినా సరే, చనిపోయిన నాయకుల జయంతులు, వర్ధంతులు అయినా సరే, నగరంలో కూడళ్ళు, వీధులు అన్నీ రంగు రంగుల ప్లాస్టిక్
బ్యానర్లతో, ఫ్లేక్సీలతో, హోర్దింగులతో నిండిపోతాయి. ఏ నాయకుడి గౌరవార్ధం వాటిని
కడుతున్నారో ఆ నాయకుడి పట్ల వారికెలాంటి మర్యాదా మన్ననా లేదన్న విషయం ఉరితాళ్ళతో
గొంతుకు ఉరి బిగించినట్టు కానవచ్చే రంగురంగుల ప్లాష్టిక్ తోరణాలు చూసిన వారికి ఇట్టే తెలిసిపోతుంది. వాటిని కట్టేటప్పుడు
ప్రదర్శించే ఉత్సాహం తొలగించేటప్పుడు జావకారిపోతుంది. ఇదే హైకోర్టు ఆగ్రహానికి
కారణం.
ఈ అంశం హైకోర్టు గడప
దాకా రావడానికి ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దోహదపడింది. 2008 లో మురళీ కృష్ణ అనే వ్యక్తి, ప్రకాశం జిల్లాలో ముక్తి
నూతల పాడు, గుడిమిల్ల పాడు నడుమ రోడ్డును ఆక్రమిస్తూ ఓ విగ్రహ ప్రతిష్టాపనకు
ప్రయత్నం జరుగుతోందని ఓ 'పిల్' దాఖలు చేసారు. గతంలో దాన్ని విచారించిన ధర్మాసనం, పనిలో
పనిగా, పర్యావరణానికి హాని కలిగిస్తున్న
ఫ్లేక్సీలను తొలగించాలని రెండు తెలుగు రాష్ట్రాల అధికారులను ఆదేశించింది. రెండు ప్రభుత్వాలనుంచి వివరణలు
అందుకున్న హైకోర్టు ధర్మాసనం వాటిని పరిశీలించింది.
రాజకీయ నాయకుల
జన్మదినోత్సవాల సందర్భంలో ఏర్పాటు చేసే ఫ్లేక్సీలు, కటౌట్ల తొలగింపు కష్ట సాధ్యం
అవుతోందన్న తెలంగాణా ప్రభుత్వ వాదనతో ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతి సేన్
గుప్తా, న్యాయమూర్తి సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఏకీభవించలేదు. బహిరంగ
ప్రదేశాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వెలసిన కటౌట్లు, ఫ్లేక్సీలు, బ్యానర్లు,
హోర్దింగులను తొలగించాలని గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం
చేసింది. ఒకవేళ ఈ ఆదేశాలను అమలు చేయలేకపోతే ఆ విషయం తమకు చెప్పాలని, తామే వాటిని
తొలగించి చూపుతామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఫ్లేక్సీలు, కటౌట్లను తొలగిస్తున్నట్టు
అధికారులు పైకి చెబుతున్నారు కానీ క్షేత్ర స్థాయిలో తమ అనుభవం భిన్నంగా వుందని
వారన్నారు. తమ ఆదేశాల అమలుకు ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని మరోమారు ఆదేశించిన
ధర్మాసనం విచారణను ఈ నెల
17 కు
వాయిదా వేసింది.
వాస్తవానికి బహిరంగ
ప్రదేశాల్లో ఏర్పాటు చేసే హోర్డింగులు, ఫ్లెక్సీలు మొదలయినవి మునిసిపల్ వ్యవస్థలకు
అదనపు ఆదాయ వనరు. అయితే, రాజకీయ నాయకుల పుట్టిన రోజులు పురస్కరించుకుని ఏర్పాటు
చేసే బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు వాటికి అదనపు ఖర్చు. వీటివల్ల పైసా ఆదాయం
లేకపోగా వాటిని తొలగించడానికి అదనపు శ్రమతో పాటు అదనపు వ్యయం తోడవుతుంది. ఖర్చంటే ఏదో తంటాలు పడతారు కానీ ఇందులో పైకి
చెప్పుకోలేని మరో మతలబు వుంది. అధికారంలో వున్న వ్యక్తుల కటౌట్లు, బ్యానర్లు
తొలగించి చెత్తకుప్పల్లో వేయాలంటే లేని
తలనొప్పిని తెచ్చి పెట్టుకోవడమే అవుతుంది. ఇవన్నీ హైకోర్టుకు తెలియనివి కావు.
కాకపోతే ఈ విషయంలో ధర్మాసనం ఓ వైఖరి తీసుకుంది. దాన్నే మరోమారు స్పష్టం చేసింది.
పైగా, 'మీకు చేతకాకపోతే చెప్పండి, అదేదో
మేము చేసి చూపిస్తాం' అని కూడా అంటోంది. డబ్బూ, సిబ్బందీ వున్న కార్పోరేషన్ వాళ్ళే
ఆ పని చేయలేకపోతే ఆ రెండూ లేకుండా
హైకోర్టు వారు ఎలా చేస్తారని అనుమానం
రావచ్చు. అయితే అలా ఖరాఖండిగా చెప్పడం
అంటే తాము ఈ విషయంలో యెంత పట్టుదలగా ఉన్నదీ అధికారులకి అర్ధం అయ్యేలా చెప్పేందుకే
ధర్మాసనం ఆ వ్యాఖ్యలు చేసిందని కొందరు
అన్వయం చెబుతున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో
నాయకుల పుట్టిన రోజుల సందర్భంలో ఏర్పాటు చేస్తున్న ఇటువంటి కటౌట్లు, బ్యానర్ల వల్ల
పర్యావరణ కాలుష్యం సంగతి అటుంచి కొన్ని సందర్భాలలో అవి ప్రమాదహేతువులుగా తయారవుతున్నాయి. పైపెచ్చు నగర సౌందర్యాన్ని ఓ
మేరకు చెడగొడుతున్నాయి. అందుకే ఈ అంశంపై హైకోర్టు గతంలో స్పందించినప్పుడు
పౌరులనుంచి సానుకూల ప్రతిస్పందనలు వెలువడ్డాయి.
ఒకటి మాత్రం వాస్తవం.
పెట్టిన ఫ్లెక్సీలు తొలగించడం ఒక పరిష్కారం కావచ్చు కానీ అది శాశ్విత పరిష్కారం
కాబోదు. నాయకుల దృష్టిలో పడడంకోసం కొందరు చోటా నాయకులు చేసే ప్రచారంకోసం ఇలా ఒక పద్దతి అంటూ లేకుండా
ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయకుండా చూస్తే కొంత ప్రయోజనం వుంటుంది.
ఇటువంటి నిషేధపు ఉత్తర్వులు సరిగా అమలు కావాలంటే నాయకమ్మన్యులు సయితం కాసింత త్యాగనిరతి
చూపాలి. ఎటువంటి పరిస్తితుల్లో కూడా తమకు ఇలాటి ఆర్భాటాలు సమ్మతం కావని స్పష్టం చేయాలి. అప్పుడే ఈ కాలుష్య సంస్కృతికి
అడ్డుకట్ట పడుతుంది. ఇది ఎలా సాధ్యమో అర్ధం కావాలంటే గతానికి సంబంధించిన రెండు
ఉదంతాలను గుర్తు చేసుకోవాలి.
టీ.ఎన్. శేషన్
గుర్తున్నారా! ఒకప్పుడు భారత ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ గా పనిచేసి అన్ని రాజకీయ
పార్టీలకు గుండెల్లో దడ పుట్ట్టించిన అధికారి. ఆయనకు పూర్వం, ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా వూళ్ళల్లోని గోడలన్నీ
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ప్రచార నినాదాలతో నిండిపోయేవి. ఈనాడు దేశంలో
ఎక్కడన్నా అలాటి గోడ రాతలు కనబడుతున్నాయా? అంటే ఏమిటన్న మాట. చిత్తశుద్ధి ఉండాలే
కానీ సాధించలేనిది ఏమీ వుండదు.
రెండో ఉదాహరణ రాజకీయ
పార్టీల కార్యకర్తలకు సంబంధించింది. అంజయ్య గారితో మొదలయింది కాబట్టి ఆయనతోనే ఈ
వ్యాసానికి ముగింపు పలకడం సముచితంగా
వుంటుంది.
అంజయ్య గారు ఆంద్ర
ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ కుమారుడు
రాజీవ్ గాంధీ హైదరాబాదు వస్తున్నారని తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు బేగంపేట విమానాశ్రయం
నుంచి నగరంలో దారి పొడవునా భారీ కటౌట్లు,
బ్యానర్లు ఏర్పాటు చేసారు. ఇప్పట్లా వీటిని తయారు చేయడం, వాటిని వీధుల్లో అమర్చడం
అంత సులభం అయిన సంగతి కాదు. అయినా వచ్చేది సాక్షాత్తు ప్రధానమంత్రి కొమరుడు
కాబట్టి ఎంతో కష్టపడి విమానాశ్రయం నుంచి గాంధీ భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు వాటిని
ఏర్పాటు చేసారు. హైదరాబాదులో జరుగుతున్న హడావిడిని అంజయ్య గారి
ప్రత్యర్ధులు ఢిల్లీకి మోశారు. అప్పటికే ముఖ్యమంత్రి మార్పు విషయం పరిశీలిస్తున్న
కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ కబురు కలిసివచ్చింది. యువకుడయిన రాజీవ్ కు
ఇటువంటి హంగులూ, ఆర్భాటాలు అసలు గిట్టవనీ, హోర్దింగులూ, బ్యానర్లూ ఖుద్దున
తొలగించాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు అందాయి. దాంతో యుద్ధప్రాతిపదిక మీద ఏర్పాటయిన వాటన్నిటినీ మెరుపు వేగంతో తొలగించారు. దరిమిలా సంభవించిన రాజకీయ
పెనుమార్పుల్లో భాగంగా అంజయ్య గారిని పదవి నుంచి కూడా తొలగించారు. అదో కధ. నిజానికి ఆ కధే రాష్ట్ర రాజకీయాలను ఓ
పెద్ద మలుపు తిప్పింది. తెలుగు దేశం అనే పేరుతొ కొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భావానికి
బీజం వేసింది.
సరే! విషయానికి వస్తే, ఇప్పుడు నడుస్తున్న 'ఫ్లెక్సీల
కధ'కి సరయిన ముగింపు దొరక్కపోదు. కాకపొతే ఆ శక్తి ఒక్క రాజకీయ నాయకుల చేతుల్లోనే వుంది. ఉచితంగా
లభిస్తున్న ప్రచారాలను స్వచ్చందంగా ఒదులుకోగల వారి ధీమంతంలో వుంది. (15-04-2015)
రచయిత మొబైల్: 98491 30595 - ఈమయిల్: bhandarusr@gmail.com
1 కామెంట్:
ఇప్పుడు ఫ్లేక్సీలు తయారు చేయడం సులువు & సస్తా. దీనితో చంచాలకు పండగే పండగ.
మా నియోజక వర్గం ఎంఎల్యే గారు ఒక్క రోజూ కనిపించరు, ఒక్క పని చేసిన పాపానా పోలేదు. అయినా వారు ప్రజలకు సుపరిచితులు అవడానికి కారణం ఏమిటంటే ఆయన నెలకు కనీసం ఒకటిరెండు సార్లు (పండుగలు, పార్టీ సదస్సులు/విశేష దినాలు, అది నాయకుడి పుట్టిన రోజు/ప్రయాణం వగైరా) రోడ్డులలో కూడళ్ళలో ఫ్లేక్సీలు పెట్టడమే. ఆయనకు టికెట్ రావడానికే కాక గెలవడానికి అవే దోహదం చేసాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి