11, ఏప్రిల్ 2015, శనివారం

సంపన్నులు, సబ్సిడీలు

  
(Published in 'SURYA' telugu daily in it's edit page on 12-04-2015, SUNDAY)

ఇప్పుడు దేశంలో ఒక విప్లవాత్మకమైన పరిణామం నిశ్శబ్దంగా చోటుచేసుకుంటోంది.


సంపన్నులు గ్యాస్ సబ్సిడీని  స్వచ్చందంగా ఒదులుకోవాలని ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన పిలుపుకు చక్కటి స్పందన కనబడుతోంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఈ సబ్సిడీని ఒదులుకోవాలంటూ తమ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసాయి. ఉదాహరణకు టాటా గ్రూపుకు  దేశవిదేశాల్లో దాదాపు వంద కంపెనీలు వున్నాయి. వీటిల్లో అయిదు లక్షల ఎనభయ్ వేల పైచిలుకు సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో అత్యధిక శాతం మన దేశంలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. టాటా గ్రూపులో ఉద్యోగి ఎవరయినా సరే, గ్యాస్ సబ్సిడీని నిక్షేపంగా త్యాగం చేయగల జీత భత్యాలు సంపాదిస్తుంటారనేది నిర్వివాదాంశం. యాజమాన్యం పిలుకు స్పందించి వారిలో అత్యధికులు సబ్సిడీ ఒదులుకుంటే ప్రభుత్వానికి ఒనగూడే ప్రయోజనం కూడా అదే  స్థాయిలో వుంటుంది. ఈ ప్రయోజనాన్ని  త్యాగం చేయాలని కోరుకునే వారి సౌలభ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 'గివ్ ఇట్ అప్' (www.giveitup.in)  అనే పేరుతొ ఒక పోర్టల్ రూపొందించింది. సంపన్నులయినవారు మాత్రమే కాకుండా స్వచ్చందంగా ఈ సబ్సిడీని ఒదులుకోవడానికి ముందుకు వచ్చేవారు కూడా  ఇందులో తమ వివరాలు నమోదు చేసుకుని ఈ  బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు. ఇంతవరకు ఈ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకున్నవారి సంఖ్య మూడు లక్షలు దాటిపోయింది కూడా. ప్తభుత్వరంగ పెట్రోలియం కంపెనీల్లో పనిచేసే అధికారులందరూ సబ్సిడీ  ఒదులుకోవడానికి సంసిద్ధతత తెలిపారు. దేశంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వాడుకుంటున్న పదిహేను కోట్ల ముప్పయి లక్షల మంది వినియోగదారుల్లో కనీసం కోటి  మంది అయినా సబ్సిడీ ఒదులుకుంటారని ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో వుంది.
ఒక్క టాటా కంపెనీ మాత్రమే కాదు ప్రధానమంత్రి పిలుపుకు  దిగ్గనాధీరులయిన అనేకమంది పారిశ్రామికవేత్తలు స్పందించారు. ఆనంద్ మహీంద్రా, అనిల్ అగర్వాల్, గౌతమ్ అదాని, సజ్జన్ జిందాల్, ఉదయ్  కోటక్ మొదలయిన వారు తమ సిబ్బందికి టాటా  కంపెనీ తరహాలోనే వ్యక్తిగత విజ్ఞప్తులు పంపారు.
ఫలితంగా ఇంతవరకు ఈ ఖాతాలో వందకోట్ల రూపాయల  వరకు ప్రభుత్వం మీద భారం తగ్గిపోయింది.  
సరే! ఇదంతా ఘనంగా చెప్పుకోవాల్సిన ముచ్చటే.
ఇదిలా వుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్యక్షుడు అమిత్ షా సయితం తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులకు కూడా ఇదేవిధమైన విజ్ఞప్తి చేశారు. స్పందన ఎలా వుందనే వివరాలు తెలియరాలేదు.
ఈ సందర్భంగా సామాన్యుల్లో కలిగే సందేహం ఒక్కటే. సబ్సిడీ ఒదులుకోమని పిలుపు ఇచ్చింది సాక్షాత్తు ప్రధానమంత్రి. ఏ త్యాగమైనా ఇంటి నుంచి మొదలు కావాలంటారు.
దాన్ని ముందు పార్లమెంటు నుంచి మొదలుపెట్టాలి. పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు వచ్చే జీతభత్యాల విషయం రహస్యమేమీ కాదు. 'దేశం మొత్తంలో అత్యంత చౌక ధరలకు అత్యంత నాణ్యమైన ఆహార పదార్ధాలు ఎక్కడ దొరుకుతాయి అంటే పార్లమెంటు క్యాంటీనులో మాత్రమె'   అని జవాబు వచ్చేలా అనేక కధనాలు నెట్లో నిత్యం సంచారం చేస్తున్నాయి. ఆ  క్యాంటీనులో  వాడుతున్న గ్యాస్ సిలిండర్లు సబ్సిడీవే అయినప్పుడు ఇతరులను సబ్సిడీ ఒదులుకోమని చెప్పడం అసంగతం అవుతుంది. ఒకవేళ సబ్సిడీ లేని సిలిండర్లు అయితే ఆవిషయానికి విస్తృత ప్రచారం కల్పించి వుంటే బాగుండేది.
అదీ కాక సబ్సిడీ భారంగా పరిణమిస్తోంది అని ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు ఈ రకమైన విజ్ఞప్తులు, పిలుపుల పద్ధతికి స్వస్తి పలకాలి. దేశంలో సంపన్నుల జాబితా ప్రభుత్వం వద్దనే సిద్ధంగా వుంటుంది. 'పలానా తేదీ నుంచి అలాటివారందరికీ సబ్సిడీ ఎత్తి వేస్తున్నాం' అని ఒక ప్రకటన చేస్తే సరిపోయేది. గ్యాస్ సిలిందర్లపై ప్రభుత్వం నుంచి పొందుతున్న సబ్సిడీ మొత్తానికి కనీసం కొన్ని వందల రెట్లు తమ కుక్క పిల్లల ఆలనాపాలనాపై ఖర్చు పెట్టగలిగిన ఖామందుల సంఖ్య మన దేశంలో తక్కువేమీ కాదు. దుష్టాంగాన్ని తొలగించి శిష్టాంగాన్ని కాపాడమన్నట్టుగా అనర్హులయిన వారిని సబ్సిడీ జాబితా నుంచి తొలగించి అవసరమైన పక్షంలో సబ్సిడీ మొత్తాన్ని  మరింత పెంచి అర్హులైన పేదలకు అందిచగలిగితే అది నిజమైన సంక్షేమ ప్రభుత్వం అనిపించుకుంటుంది.     
అభివృద్ధి చెందుతున్న  దేశాల్లో సబ్సిడీలు తప్పనిసరి. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ విధానం అమల్లో వుంది. ఎందుకంటె పెరిగే సంపద సక్రమంగా అన్ని చోట్లా సమానంగా పెరగదు. సంపన్నత పెరిగే కొద్దీ సమాజంలో అసమానతలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తాయి. వృద్ధాప్యం, అనారోగ్యం మొదలయిన అంశాలు వ్యక్తిగత ఆదాయాలపై ప్రభావం చూపుతాయి. అంచేతే సిరి సంపదలు పుష్కలంగా వున్న దేశాల్లో కూడా ఆహార సబ్సిడీలు, ఆరోగ్య సబ్సిడీలు  ఘనంగానే ఉంటున్నాయి. కాకపోతే సబ్సిడీల విషయంలో ఆయా  దేశాల ప్రజలు స్వచ్చందంగా  పాటించే కొన్ని నియమ నిబద్ధతతల కారణంగా అవి దుర్వినియోగం కావడం లేదు. సంపన్నులయినవాళ్ళు సబ్సిడీలకోసం ఆరాటపడని మంచి  సమాజాలను వారు సృష్టించుకున్నారు. మన దేశంలో అలాటి ప్రయత్నం మొదటి నుంచీ  జరగలేదనే చెప్పాలి. సబ్సిడీల భారం అపరిమితంగా పెరిగిపోవడానికి దోహదం చేసిన అనేక కారణాల్లో ఇదొకటి. సబ్సిడీ బియ్యం నుంచి  ఆరోగ్యశ్రీ కార్డు వరకు ఇదే తంతు.
స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ ప్రతిదానికీ ప్రభుత్వం మీద ఆధారపడే మనస్తత్వం పెరిగిపోతూ వచ్చింది. అంతా ఉచితంగా లభించాలనే భావన అందులోనుంచే పుట్టుకు వచ్చింది. అనేకానేక కారణాలతో ప్రభుత్వాలు కూడా ఈ ధోరణి పెరగడానికి తమ వంతు సాయం చేస్తూ వచ్చాయి. ఫలితం కొండలా పెరిగిపోతున్న సబ్సిడీల భారం. జీవితంలో ప్రతిదాన్నీ ఉచితంగానో, లేదా చాలా చౌకగానో పౌరులకు సమకూర్చిపెట్టిన సోవియట్ యూనియన్ లో ఏం జరిగిందో  గుర్తు పెట్టుకోవాలి. ఉత్పత్తి ఖర్చుకు మించి తక్కువ ధరకు సరఫరా చేయడం ఎల్లకాలమూ సాధ్యం కాదన్న సత్యాన్ని సోవియట్  అనుభవం గుర్తు చేస్తోంది.
మరో విచిత్రం అయిన విషయం ఏమిటంటే, ఉత్పత్తి ఖర్చుకంటే అనేక వందల రెట్లు అమ్మకం ధర వుండే వస్తు  సామాగ్రి కొనడానికి పరుగులు తీసే వారే సబ్సిడీ ధరలకు ప్రభుత్వం అన్నీ సరఫరా చేయాలని పట్టుబడుతుంటారు. సబ్సిడీ తగ్గించినప్పుడల్లా గోల  చేస్తుంటారు.
ప్రభుత్వ వ్యవస్థను గాడిన పెట్టడానికి కొన్ని  కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పుకాదు. అయితే అటువంటి నిర్ణయాల అమలు ప్రభుత్వాధినేతల నుంచే మొదలు కావాలి. పొదుపు చేయండని పిలుపు ఇచ్చేవాళ్ళు దాన్ని ఆడంబరంగా చేయకూడదు. సబ్సిడీ ఒదులుకోవాలని  పిలుపు ఇచ్చిన ప్రధాని మోడీ గారింట్లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వాడడం లేదు అనే విషయం  తెలుసుకోగోరేవారుంటే అలాటి వారిని అనుమానంగా చూడాల్సిన అవసరం లేదు. పైగా అలాటి అనుమానాలను నివృత్తి చేయగలిగితే మరింత బాగుంటుంది.
గతంలో లాల్ బహదూర్ శాస్త్రి  ప్రధాన మంత్రిగా వున్నప్పుడు దేశంలో ఏర్పడ్డ తిండిగింజల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ప్రతి సోమవారం ఒక పొద్దు మాత్రమే భోజనం చేయాలని ఇచ్చిన పిలుపుకు అపూర్వ స్పందన లభించింది. ఎందుకంటె ఆయన ఆ నియమాన్ని అయన  బతికున్నంతవరకు పాటించారు. ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి స్వల్పకాలమే మనగలగడం మన  జాతి చేసుకున్న దురదృష్టం.        
అధికారం ప్రదర్శించాల్సిన  తరుణం వచ్చినప్పుడు దృఢచిత్తంతో వ్యవహరించండి. అయితే అధికారం ఉందికదా అని అహంకారం చూపకండి. చేతిలో వున్న అధికారాన్ని సౌమ్యంగా, సాధ్యమైనంత మృదువుగా వాడండి. అదెలా వుండాలంటే,  మనస్సు ఏమాత్రం నొచ్చుకునేలా  వుండకూడదు. పువ్వు నుంచి భ్రమరం తేనె తాగుతున్నంత  సుకుమారంగా  వుండాలి.  
ఏ ప్రభుత్వానికయినా విజ్ఞులు ఇచ్చే సలహా ఇదే !

(రచయితే మొబైల్ నెంబరు : 98491 30595  మెయిల్: bhandarusr@gmail.com)

కామెంట్‌లు లేవు: