1, ఏప్రిల్ 2015, బుధవారం

మిషన్ కాకతీయ


(Published by 'SURYA' telugu daily in it's Edit page on 02-04-2015, THURSDAY)

చెరువుకు వూరికి అవినాభావ సంబంధం.
అందుకే చెరువులు లేని ఊళ్ళు సకృత్తుగా కనబడతాయి. చెరువు అనగానే సాధారణంగా పంట పొలాలకు సేద్యపు నీళ్ళు, తాగడానికి మంచి నీళ్ళు  అందించే వనరుగా మాత్రమె పరిగణిస్తారు. నిజానికి ఊళ్ళల్లో చెరువులకు చారిత్రిక ప్రాధాన్యతతో పాటు సాంస్కృతిక నేపధ్యం కూడా వుంది. దసరా వంటి పండుగ దినాల్లో చెరువులు ఆయా గ్రామాలకు తీర్ధ క్షేత్రాలుగా మారిపోతాయి. ప్రత్యేకించి తెలంగాణా ప్రాంతంలో ఆడపడుచుల 'బతుకమ్మలాటకు' వూరి చెరువే ప్రధాన వేదిక.
డెక్కన్ పీఠభూమిగా చరిత్రపుటలకెక్కిన  తెలంగాణా ప్రాంతంలో చెరువులకు యెనలేని ప్రాముఖ్యం వుంది. జీవనది గోదావరి తెలంగాణలో మైళ్ళ కొలది దూరం పారుతున్నా, నైసర్గికమైన కారణాలవల్ల ఆ నది నీటిని సంపూర్ణంగా వినియోగించుకోవడానికి సహజసిద్ధమైన వీలు లేకుండా పోతోంది. అందుకే,  ఆ ప్రాంతం ఎక్కువగా చెరువులవంటి జలవనరులపైనే ఆధారపడాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఈ కారణం వల్లనే అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలోని వ్యవసాయం చెరువుల కిందనే సాగుతూ వచ్చింది. గతంలో దట్టమైన అటవీ సంపద కారణంగా విస్తారంగా కురిసే వర్షాలు, చెరువుల్ని నిండు కుండలుగా తయారుచేసేవి. ఒక్కసారి చెరువు  నిండిందంటే చాలు ఇక ఆ ఊరివారికి సాలు పొడవునా సేద్యపు నీరు లభిస్తుందనే భరోసా వుండేది. కాలక్రమంలో అడవుల విస్తీర్ణం క్షీణిస్తూ రావడం, వర్షపాతం శాతం తగ్గుతూ రావడం చెరువుల పాలిట శాపాలుగా మారాయి. ఇంతే కాకుండా, పట్టణీకరణ ప్రభావం కూడా చెరువులపై పడుతూ వచ్చింది. భూములకు విలువ పెరగడం, వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవడం మొదలైన అంశాలు తెలంగాణా ప్రాంతంలో చెరువుల స్తితిని దయనీయంగా మార్చాయి. చెరువుల్లో నీరు చేరే మార్గాలు మూసుకుపోవడం, చెరువల విస్తీర్ణం నానాటికీ కుంచించుకుపోవడం చెరువుల  భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి.


ఈ నేపధ్యంలో, తెలంగాణా సాంస్కృతిక పరిరక్షణ అనండి, పునరుద్ధరణ అనండి, కొత్తగా ఏర్పడిన తెలంగాణా ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు తలపెట్టిన అనేక కార్యక్రమాల్లో ప్రధాన  భూమిక  'మిషన్ కాకతీయ' అనే పేరుతొ మొదలు పెట్టిన చెరువుల పునరుద్ధరణ పధకం పోషిస్తోంది. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తులో వున్న తెలంగాణా భూములకు ఆ ప్రాంతంలో పారే నదీ జలాలను ఉపయోగించుకునే సాంకేతికత కొరవైన కాలంలో నాటి కాకతీయ ప్రభువులు చెరువుల కింద సేద్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కారణంగానే తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పధకానికి 'మిషన్ కాకతీయ' అని నామకరణం చేసింది.
ఈ పధక నిర్మాతలు చెప్పే కారణం కూడా సులభగ్రాహ్యం. బచావత్ ట్రిబ్యునల్  వల్ల తెలంగాణకు కృష్ణా గోదావరి నదులనుంచి 275 టీ.ఎం.సీ. ల నీరు వాడుకునే వీలుంది. కానీ అంత నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు లేదు. అందుచేత, రానున్న అయిదేళ్ళ కాలంలో కురిసే ప్రతి వర్షపు బొట్టుని ఒడిసిపట్టి తెలంగాణాలోని  గ్రామాల్లో వున్న ప్రతి ఒక్క చెరువునీ నింపగలిగితే కరవురక్కసి కోరలనుంచి రైతులకు శాశ్విత విముక్తి కలిగించవచ్చన్నది వారి ఉద్దేశ్యం.
తెలంగాణా గ్రామీణ ప్రాంతాలలో పడబాటు పద్దతి ఒకటుంది. చెరువులోని నీటిని తూముల ద్వారా కింద పొలాలకు ఒదులుతారు. వరి పైరు పొట్టకు వచ్చేవరకు పొలంలో నిలవవుండే నీరే దానికి ప్రాణాధారం. పొట్టకు వచ్చిన తరువాత నీరు అలాగే నిలవవుంటే అసలు  పైరుకే ముప్పు. వరికాండం కుళ్లిపోయే ప్రమాదం వుంటుంది. అందుకే ఆ సమయంలో ఆ నీటిని మరో పంటకు పనికి వచ్చేలా ఒదిలిపెడతారు. అలాగే చెరువు నిండినప్పుడు అలుగు ద్వారా నీటిని బయటకు ఒదులుతారు. ఆ నీళ్ళు పొరుగున వున్న మరో వూరి చెరువును నింపడానికి ఉపయోగపడతాయి. అంటే ఒక రకంగా నదుల అనుసంధానం మాదిరిగా చెరువుల అనుసంధానం అన్నమాట.
చెరువుల పూడిక తీయడంలో రైతులు స్వచందంగా సహకరించే వీలుంది. ఎందుకంటె పూడిక తీయడం ద్వారా లభించే మట్టి అత్యంత సారవంతమైనది. పొలాలకు ఎరువుగా వాడుకోవచ్చు. కుమ్మరులు కుండలు చేసుకోవడానికి అదే మట్టి ఉపయోగపడుతుంది. చెరువులు సమృద్ధిగా వర్షపు నీటితో నిండితే గ్రామంలో మంచి నీటి  కొరత తీరుతుంది. భూగర్భ జల మట్టాలు పెరుగుతాయి. పూడికలు సక్రమంగా తీయగలిగితే చెరువులో నిలవచేసే నీటి  పరిమాణం బాగా పెరుగుతుంది. తద్వారా, చెరువుకింద సాగయ్యే సాగు భూముల విస్తీర్ణం ఇతోధికంగా పెరుగుతుంది. చెరువుల పునరుద్ధరణ అనేది గ్రామస్తుల కళ్ళ ఎదుట జరుగుతుంది కాబట్టి,  పూడికలు తీయడంలో జరిగే ప్రతి పనికీ సోషల్ ఆడిట్ వుండే అవకాశం వుంటుంది.             
రాజకీయాలను దరి రానీయకపోతే నిజానికి చెరువుల పునరుద్ధరణ అనేది తెలంగాణకు ఓ వరం వంటిది. పెద్ద ప్రాజెక్టుల వల్ల పెద్ద పెద్ద ప్రయోజనాలు ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే వాటి ఫలితాలు గ్రామాల్లోని రైతులదాకా చేరడానికి ఏళ్ళతరబడి వేచి వుండాలి. పైగా పెట్టుబళ్ళు కూడా  అంతే  భారీ స్థాయిలో అవసరమవుతాయి. వేలాది ఎకరాలు ముంపుకు గురవుతాయి. అదే స్థాయిలో ఇళ్లూ, పొలాలు పోగొట్టుకుని ప్రజలు నిరాశ్రయులవుతారు. ప్రభుత్వాలు ఇవ్వచూపే పరిహారం కోసం  చకోరపక్షుల్లా ఎదురు చూడాల్సి రావచ్చు.
'మిషన్ కాకతీయ' తెలంగాణా అవసరాల ప్రాతిపదికగా రూపొందించిన పధకం. రాష్ట్రంలో ఆక్రమణలకు గురయిన వాటిని మినహాయిస్తే దాదాపు నలభయ్ వేల పై చిలుకు చెరువులు వున్నాయని ఓ అంచనా. ఏడాదికి ఇరవై శాతం చొప్పున అయిదేళ్ళలో మొత్తం చెరువుల సంప్రోక్షణ పూర్తిచేయాలని సర్కారు సంకల్పం.
సంకల్పం బాగుంది. పెట్టుకున్న లక్ష్యం ఆచరణాత్మకంగానే వుంది. అయితే చిత్తశుద్ధిపైనే సందేహాలు, సంకోచాలు.
ఈ యావత్ 'కాకతీయ మిషన్' కేవలం టీ.ఆర్.యస్. నాయకులు, కార్యకర్తల కడుపులు  నింపడానికేకాని, చెరువులను నీటితో నింపడానికి కాదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజలకు  మేలు చేయడమే పరమావధిగా ప్రభుత్వాలు పధకాలకు రూపకల్పన చేస్తాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అవి అవినీతి వూటలుగా మారిపోతాయి. ఇది చాలా ఏళ్ళుగా ప్రజలు గమనిస్తూ వస్తున్న వాస్తవం.
ప్రభుత్వాలు ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే చివరికి సందేహాలే  నిజమవుతాయి. మొత్తం పధకం స్పూర్తే దెబ్బతింటుంది. ఈ వాస్తవం గుర్తెరిగి వ్యవహరిస్తే మంచి పేరు సర్కారు ఖాతాలో పడుతుంది. లెక్క  చేసేది లేదు అనుకుంటే తదనంతర కాలంలో వీటన్నిటి  లెక్కలు చూసే అవకాశం ప్రజలకే ఇచ్చినట్టు అవుతుంది.
'మిషన్ కాకతీయ' విజయవంతం అయితే మేలు జరిగేది ఒక్క తెలంగాణాకే కాదు, ఈ స్పూర్తిని అంది పుచ్చుకోవడానికి ఇతర రాష్ట్రాలకు వీలుంటుంది. తద్వారా ఒనగూరే  సత్ఫలితాలు యావత్ దేశ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. దేశానికి ఆదర్శంగా నిలుస్తాయి.        
(01-04-2015)
Courtesy Image Owner 

కామెంట్‌లు లేవు: