(Published in 'SURYA' telugu daily in it's edit page on 10-05-2015, SUNDAY)
నెహ్రూ గారు ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో నాటి సోవియట్ యూనియన్ అధినాయకుడు కృశ్చెవ్ అధికార పర్యటనపై ఢిల్లీ వచ్చారు. పాలం విమానాశ్రయంలో స్వాగతం పలకడానికి నెహ్రూ స్వయంగా వెళ్ళారు. అనంతరం విదేశీ అతిధిని వెంట బెట్టుకుని జవహర్ లాల్ నెహ్రూ కారులో నగరానికి వస్తున్నారు. మార్గ మధ్యంలో అక్కడక్కడా కొందరు పౌరులు ముంగాళ్ళ మీద కూర్చుని కాలకృత్యాలు తీర్చుకోవడం కృశ్చెవ్ కంట పడింది. అదేమిటని అడిగిన కృశ్చెవ్ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పడానికి నెహ్రూ గారికి తల కొట్టేసినంత పనయింది.
అప్పటినుంచి ఇప్పటివరకు ఏళ్ళకు
ఏళ్ళు గడిచిపోయాయి. పరిస్తితులు కాసింత మెరుగుపడ్డాయేమో కాని పూర్తిగా
మారిపోయిందని చెప్పలేని పరిస్తితి ఈనాటికీ మిగిలివుంది.
ఇన్నేళ్ళ కాలంలో తలెత్తుకుని
గర్వంగా చెప్పుకోగల అనేక ఘన విజయాలను ఎన్నింటినో స్వతంత్ర భారతం సాధించింది. అయినా
కానీ, పరిసరాల పరిశుభ్రత విషయంలో ఇంకా తలదించుకోవాల్సిన స్తితిలోనే వుంది.
సిగ్గుపడుతూ ఒప్పుకోవాల్సిన వాస్తవం ఇది.
విదేశాలకు వెళ్లి
ఉద్యోగాలు చేసేవారిని ఎవరినయినా కదిపి చూడండి. వాళ్ళు చెప్పేది ఒక్కటే.
'నిజమే. మంచి రోడ్లు
పడ్డాయి. మంచి సౌకర్యాలు వున్న భవంతులు కట్టారు. మంచి మంచి కార్లు మార్కెట్లో
దొరుకుతున్నాయి. మంచి నాణ్యత కలిగిన వస్తువులు దొరుకుతున్నాయి. అమెరికా వంటి
దేశాలతో పోటీగా మంచి మంచి జీతాలు ఇచ్చే కంపెనీలకు కూడా కొదవలేదు. అంతా మంచిగానే
వుంది. లేనిదల్లా స్వచ్చమైన వాతావరణం. పరిశుభ్రమైన పరిసరాలు. ఇవి గనక మన దేశంలో వుంటే ఇక విదేశాలను పట్టుకుని బయటే వేళ్ళాడే వాళ్ళు ఉంటారని ఎవ్వరం అనుకోవడం లేదు.'
అమెరికా వంటి దేశాల్లో
స్థిరపడ్డ యువతీ యువకులు అనేకమంది స్వదేశం తిరిగి రావడానికి విముఖత చూపుతూ చెప్పే
ప్రధాన కారణాల్లో ఇదొకటని తెలుసుకున్నప్పుడు
ఎంతో బాధ వేస్తుంది. ఒకానొక కాలంలో
ప్రపంచ దేశాలకు పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం ఎలాటిదో ప్రబోధించిన ఘనత భారత దేశానిది. ఇప్పుడదే అంశం దేశానికి తలవంపులు
తెచ్చే విషయంగా మారడం యెంత విషాదం.
విదేశాల్లో స్థిరపడ్డ మన
వారిని అలా వుంచండి.
'ఇక్కడికి రండి. అన్ని
సదుపాయాలు కల్పిస్తాం. పరిశ్రమలు పెట్టండి' అనే నినాదంతో మన నాయకులు రోజుకోదేశం
చుట్టబెడుతున్నారు.వారి ఆహ్వానాలు అందుకుని అలా
వద్దామని అనుకున్న వారికి కూడా మన దేశంలో 'చెత్త' సమస్యే ముందుగా అడ్డుపడుతోంది.
బహుశా భారత ప్రధాన
మంత్రి నరేంద్ర మోడీ 'మేక్ ఇన్ ఇండియా' నినాదం ఎత్తుకోవడానికి ముందుగా 'స్వచ్చ
భారత్' ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి కూడా ఇదే ప్రధాన కారణం అయివుంటుంది.
కొన్ని రోజులు హడావిడి
తరువాత ఆ ఉద్యమం కాస్త సద్దుమణిగిన ఛాయలు కానవచ్చే తరుణంలో తెలంగాణా ముఖ్యమంత్రి
కే. చంద్రశేఖరరావు దానికి కొత్త ఊపిరి ఊదే ప్రయత్నం మొదలు పెట్టారు.
హైదరాబాదును విశ్వనగరంగా
తయారు చేయాలంటే ఆకాశ హర్మ్యాలు, ఆరు లేన్ల రహదారులు వుంటే సరిపోదని, కాలుష్య రహిత
స్వచ్చ నగరంగా తీర్చిదిద్దినప్పుడే భాగ్య నగరానికి ఆ శోభ దక్కుతుందని గ్రహించి
కాబోలు, రెండు బృహత్తర కార్యక్రమాలను కేసీఆర్ తలపెట్టారు. అందులో ఒకటి ఆదిలోనే
అనేక విమర్సలకు దారి తీసింది. నగరం నడిబొడ్డున, దుర్గంధ కాసారంగా తయారయిన హుసేన్
సాగర్ సరస్సును మంచి నీటి తటాకంగా మార్చి
దానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న తెలంగాణా ముఖ్యమంత్రి అభిమతానికి అనుగుణంగా అధికారులు
తక్షణ చర్యలు ప్రారంభించారు. వెనువెంటనే, కొన్ని
రాజకీయ పరమైన ఆరోపణలు, మరి కొన్ని న్యాయపరమయిన చిక్కులు ఎదురయ్యాయి. హైకోర్టు
తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో ప్రభుత్వానికి కొంత ఊరట, ప్రభుత్వ ప్రయత్నాలకు కొంత బాసట దొరికింది. ఏళ్ళ
తరబడి హుసేన్ సాగర్ లోకి చేరుతున్న భయంకర రసాయనిక వ్యర్ధాలను తొలగించే క్రమంలో మరింత
వాతావరణ కాలుష్యం ఏర్పడి, ప్రజల
ఆరోగ్యానికి ముప్పువాటిల్లే ప్రమాదం వుండగలదని పర్యావరణ ప్రేమికుల అనుమానం. అందులో
కొంత నిజం ఉండవచ్చు. కానీ రసాయనిక వ్యర్ధాలు ఇప్పటి మాదిరిగానే ఆ సరస్సులో ఇలాగే పేరుకుపోతూ
వుంటే భవిష్యత్తులో ఆ సరస్సు ఉనికి మరింత ప్రమాదకారిగా మారే అవకాశాలు కూడా
వుంటాయి. వ్యాధికంటే చికిత్స ప్రమాదకరం అనే వాదన వున్నా, ప్రస్తుత పరిస్తితుల్లో
ప్రక్షాళనే ఉత్తమ పరిష్కారం అవుతుంది. సాధారణంగా పాలకులకు ఇటువంటి ఆలోచనలు కలగడమే అపూర్వం.
అలాటి ప్రతిపాదనలను మరింత మెరుగు పరచి ఏవైనా లోపాలు వుంటే సరిదిద్దే ప్రయత్నాలు
జరగాలి కానీ, అసలుకే మోసం వచ్చేలా మోకాలు అడ్డడం కూడా మంచిది కాదు. గతంలో హుసేన్
సాగర్లో గుర్రపు డెక్క సమస్య చాలామందికి గుర్తుండే వుంటుంది. నిర్విరామ కృషి
కారణంగా సాగర్ కు ఆ సమస్య శాస్వితంగా తొలగిపోయింది. ఇప్పుడు హుసేన్ సాగర్
ప్రక్షాళన కూడా అదేవిధంగా పూర్తయితే జంట నగరాలకు కొత్త అందాలు అద్దినట్టు
అవుతుంది.
స్వచ్చ నగరంగా మార్చాలనే
నే ప్రయత్నం యెంత మంచిదో ఆలోచన అంత భారీ స్థాయిలోనే వుంది. ప్రధాని మోడీ జాతికి
అందించిన స్వచ్చ భారత్ నినాదానికి కేసీఆర్ తన ఆలోచనలతో మరిన్ని మెరుగులు దిద్దారు.
మొత్తం తెలంగాణాను, ముందుగా రాజధాని నగరాన్ని కాలుష్య రహిత పరిశుద్ధ నగరంగా
రూపొందించాలని పధకాలు తయారు చేసారు. హైదరాబాద్ నగరాన్ని ఇందుకోసం 400 విభాగాలుగా చేసి ఒక్కొక్క దానికి గవర్నర్, ముఖ్యమంత్రి,
మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులను బాధ్యులుగా వుంచి ఒక నిర్ణీత
కాలవ్యవధిలో నగరంలో పేరుకు పోతున్న చెత్త సమస్యకు శాస్వితంగా ఒక మంచి పరిష్కారం
కనుగొనడం ఈ మొత్తం కసరత్తు లక్ష్యం. ఈ మహాయజ్ఞంలో స్వచ్చందంగా పాలుపంచుకోవడానికి
ముందుకువచ్చే పౌరులతో, చిన్న చిన్న
బృందాలు ఏర్పాటు చేస్తారు. నగరంలోని మారు మూల ప్రాంతాలలో పోగుపడిన చెత్తను గుర్తించే బాధ్యత ఈ బృందాలు
తీసుకుంటాయి. రెండు రోజుల్లో ఈ బృందాలు నివేదికలు ఇస్తాయి. ఈ నెల పదిహేనవ తేదీకల్లా నగర
నివేదిక తయారవుతుంది. ఆ మరునాడు అంటే పదహారో తేదీన స్వచ్చ హైదరాబాదు కార్యక్రమం
మొదలవుతుంది. రెండు మూడు రోజుల వ్యవధిలోనే నగరం మొత్తంలో పేరుకుపోయిన చెత్తను
తొలగించడం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చెత్తను తొలగించేందుకు
అవసరమైన వాహనాలను, సిబ్బందినీ నగర పాలక
సంస్థ సమకూరుస్తుంది. ఇళ్ళలో పోగుపడిన తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి పారవేయడానికి ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలను
ప్రభుత్వమే అందచేస్తుంది.
విశ్వనగరంగా మార్చే క్రమంలో హైదరాబాదును పరిశుద్ధ నగరంగా చేయాలనే
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనను ఎవ్వరూ తప్పుపట్టలేరు. వచ్చిన
చిక్కల్లా, ఆలోచనలకు, ఆచరణకు మధ్య పెరిగిపోతున్న దూరమే. అనుభవాలు తెలియచెప్పుతున్నది కూడా ఇదే. దీనికి తాజా ఉదాహరణ, మొన్నీ మధ్య నగరంలో
అట్టహాసంగా నిర్వహించిన టీ ఆర్ ఎస్ ఆవిర్భావ సభలే. ఆర్భాటంగా నగరాన్ని గులాబీ
తోరణాలతో ముంచెత్తి వేసారు. ఆ తరువాత వాటిని తొలగించే నాధుడే లేదు. చెత్త
పేరుకుపోవడానికి ఇలాటివి కూడా కారణాలే అన్న సంగతి మరువకూడదు.
గతంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్చ భారత్ ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పుడు
జరిగిన హడావిడి అందరికీ గుర్తే. వారణాసిలో ప్రధాని మొదలు పెట్టిన ఈ కార్యక్రమం
ఆసేతు హిమాచలం వెల్లువలా సాగింది. ఇంకా సాగుతోంది. కానీ
ఫలితాలు ఆ స్థాయిలో లేవన్నది మాత్రం నిర్వివాదాంశం. ఖరీదయిన దుస్తులు ధరించిన నాయకులు,
అధికారులు, సంఘంలో అత్యంత గౌరవ స్థానాల్లో వున్న ప్రముఖులు చేత చీపుర్లు పట్టి వీధుల్ని శుభ్రం చేస్తున్న
దృశ్యాలు కోకొల్లలుగా మీడియాలో కానవచ్చాయి. ఇళ్ళకు వెళ్ళగానే
వాళ్ళందరూ తమకంటిన మురికిని ఒదిలించుకునే వుంటారు. ఆ మురికితో పాటే ఇంత గొప్ప కార్యక్రమం కొనసాగింపు ఆలోచన కూడా ఒదిలిపోయేవుంటుంది.
స్వచ్చ భారత్ ఉద్యమం
ప్రజల భాగస్వామ్యంతో సాగించాలనేది నేతల
తలంపు. అసలీ ఉద్యమం ప్రజలనుంచి మొదలు కావాలి. అందుకు ప్రభుత్వ సహకారం కావాలి.
ఎవరింటిని వారు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి చేసే కృషిలో పదోవంతు తమ పరిసరాల
పరిశుభ్రత పట్ల కూడా కనబరిస్తే ఈ చెత్త సమస్య ఇంత చెత్తగా మారివుండేది కాదు.
సరే! చెత్తను
తొలగించాలనే కార్యక్రమం ఏ కోణం నుంచి చూసినా మంచి కార్యక్రమమే. ఇది ఏదో
మొక్కుబడిగా కాకుండా నిరంతరం జరుగుతూ పోతేనే
మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే, కంటికి కనబడే చెత్తను మాత్రమె కాదు, కనబడని
మానసిక కాలుష్యాన్ని కూడా ఏదో ఒక మేరకు
తగ్గించుకోగలిగితే సమాజానికి మరింత మేలు జరుగుతుంది.
ఉపశృతి: ఇద్దరు
సన్యాసులు అడవి మార్గాన వెడుతున్నారు. దారిలో యేరు అడ్డం వచ్చింది. కాలి గాయంతో అక్కడ కూలబడి వున్న ఓ
అందమైన యువతి వారికి కనిపించింది. ఇద్దరిలో ఒకడు ఆమెను రెండు చేతులతో ఒడిసిపట్టుకుని
యేరు దాటించి వొదిలివేసాడు. దగ్గరిలోవున్న గ్రామం చేరేవరకు ఉగ్గపట్టుకుని వున్న రెండో సన్యాసి తన మనసులో మాట బయట పెట్టాడు.
'నువ్వా అమ్మాయిని అలా మోసుకురావడం ఎందుకో నాకు అంత మంచిగా అనిపించ లేదు'
మొదటి సన్యాసి బదులు
చెప్పాడు.
'నేనా అమ్మాయిని అప్పుడే,
అక్కడే దించి వేశాను. నువ్వే ఇంకా ఆమెను
మనసులో పెట్టుకుని మోస్తున్నావు'
(09-05-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి