16, జూన్ 2014, సోమవారం

సమీక్షల్లో విచక్షణ అవసరం

ఈ రోజు (16-06-2014) ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటలవరకు ఐ న్యూస్ టీవీ ఛానల్ న్యూస్ వాచ్  కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రస్తావనకు వచ్చిన కొన్ని అంశాలు. ప్రసన్న యాంఖర్ గా వ్యవహరించారు  

  
"కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు పాత ప్రభుత్వాల పధకాలను సమీక్షించడం, సవరించడం సాధారణంగా జరిగేదే. అయితే ఈ  విషయంలో కొంత విచక్షణ చూపాలి. పేద విద్యార్ధులకు ఫీజు రీ ఇంబర్స్ మెంట్  పధకం ప్రవేశ  పెట్టినప్పుడు రెండు రాష్ట్రాలు లేవు. హైదరాబాదు రాజధాని కావడం వల్ల ఇంజినీరింగ్ కాలేజీలు చుట్టుపక్కలే ఎక్కువగా ఏర్పాటయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్ధులు వచ్చి చేరారు. పొరుగు రాష్ట్రం భారం యెందుకు మోయాలన్న వాదన వినడానికి బాగుండవచ్చు. భారం అనుకుంటే ఆ పొరుగు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని విషయం సర్దుబాటు చేసుకోవాలి. అంతే  కాని విద్యార్ధులకు అన్యాయం చేయకూడదు.
"అలాగే హైదరాబాదులో చారిత్రిక కట్టడాల పరిరక్షణ కోసం మెట్రో మార్గంలో మార్పులు చేసే విషయం. భావావేశంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. తల తీసి కోట గుమ్మానికి వేలాడగట్టండి అనే తరహాలో కాకుండా సంబంధిత నిర్మాణ సంస్థతో ఉన్నత స్థాయిలో చర్చలు జరపాలి. యెలా చేస్తే తక్కువ స్థాయిలో నష్టం జరుగుతుందో సాంకేతికంగా ఆలోచించి చూడాలి. అసలు ఇలాటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలకు ఆస్కారం లేకుండా, చారిత్రిక కట్టడాల పరిరక్షణ గురించి ముందస్తు ఆలోచన చేసి సలహాలు ఇచ్చే శాశ్విత యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. మెట్రో మార్గం యెలా వుండాలి అనే ఆలోచన చేసే రోజుల్లోనే ఇటువంటి ఏర్పాటు వుండి వుంటే బాగుండేది. కానీ ఆలశ్యం జరిగింది. ఇప్పుడు మరో తొందరపాటు నిర్ణయం చేసి ప్రాజక్టు ఆలశ్యం చేసుకోవడం వల్ల నష్టపోయేది ప్రజలే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.
"తెలంగాణా రాష్ట్రం తొలి శాసన సభ సమావేశాలు ముగిసాయి. గత నాలుగయిదేళ్ల కాలంలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుతెన్నులు గుర్తుచేసుకుంటే ఇటీవలి సమావేశాలు చాలా వూరట కలిగించేవిగా వున్నాయి. వాయిదాలతో సమయం వృధా చేసుకోలేదు. ఈ సంప్రదాయాన్ని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ కూడా కొనసాగించాలి. తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ నేతలు మంచి విషయాల్లో పోటీతత్వంతో వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారు."

4 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

ఫీజు రీ ఇంబర్స్ మెంట్: పొరుగు రాష్ట్రానికి చెందినా వారికి మన పన్నుల నుండి లబ్ది చేయాలనే వాదన తప్పు. ఆ రాష్ట్రం ప్రభుత్వానికి ఆసక్తి ఉంటె వారే ముందుకు రావాలి. ప్రతి విషయానికి తెలంగాణా వారినే తప్పు పెట్టాలనే మనస్తత్వం మానుకోవడం మంచిది.

మెట్రో: పాలకులు హైదరాబాదు చారిత్రిక/భౌగోళిక వైవిధ్యాన్ని, మిశ్రమ సంస్కృతిని నాశనం చేయడానికి ఎంతో శ్రమ పడ్డారు. ఇకనైనా దీన్ని ఆపాలని కోరడం చాలా మంచి పరిమాణం. కొన్ని తాత్కాలిక ఇబ్బందులు వస్తాయని వినాశ ప్రవృత్తిని కొనసాగించాలనే పిడివాదన ఎవరికీ ప్రయోజనం చేకూర్చదు.

"తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ నేతలు మంచి విషయాల్లో పోటీతత్వంతో వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారు"

దేశంలో మిగిలిన 28 రాష్ట్రాల లాగే వీరితో కూడా పోటీ, సహకారం రెండూ ఉంటాయి. దీన్ని ప్రత్యేకించి ఉటంకించడం అనవసరం.

అజ్ఞాత చెప్పారు...

// పాలకులు హైదరాబాదు చారిత్రిక/భౌగోళిక వైవిధ్యాన్ని, మిశ్రమ సంస్కృతిని నాశనం చేయడానికి ఎంతో శ్రమ పడ్డారు. ఇకనైనా దీన్ని ఆపాలని కోరడం చాలా మంచి పరిమాణం //
వైవిధ్య మిశ్రమ సంస్కృతి అంటే ? ఎలా నాశనం చేసారు ? ఎప్పుడు నాశనం చేసారు ?

మీరు చెప్పేది పాతబస్తీ గురించి ఐతే ? అది గత యాబై/వంద సంవత్సరాల నుండి అలానే ఉన్నాది , దాన్నెవరు నాశనం చేయలేదు . చేయలేరు కూడా .



Jai Gottimukkala చెప్పారు...

@అజ్ఞాత:

పాతబస్తీ ఒక్కటే కాదు, నగరమంతా పోలిక లేనంతగా మారింది.

అజ్ఞాత చెప్పారు...

సార్ ప్రొఫైల్లో Hyderabad, Telangana State(TS), India అని మారుస్తే బాగుంటుంమో ఆలోచించండి.