20, జూన్ 2014, శుక్రవారం

ఐ న్యూస్ న్యూస్ వాచ్


ఈరోజు (29-06-2014) ఉదయం ఐ న్యూస్ ఛానల్ న్యూస్ వాచ్ కార్యక్రమంలో యాంఖర్ ప్రసన్న ప్రస్తావించిన అంశాలకు నా స్పందన సంక్షిప్తంగా:



" గతంలో విద్యుత్ బోర్డ్ వుండేది. చైర్మన్ తప్పిస్తే లైన్ మన్ వీరిద్దరే పవర్ ఫుల్ అని చెప్పుకునేవాళ్ళు.విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, డిస్కం లు, విద్యుత్ నియంత్రణ సంస్థలు ఇవన్నీ ఆర్ధిక సంస్కరణల నేపధ్యంలో పుట్టుకొచ్చినవి. ఈనాడు  చర్చల్లో లేవనెత్తుతున్న సాంకేతిక అంశాలతో ప్రజలకు నిమిత్తం లేదు. వాళ్లకు అవసరమైనదల్లా నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా. వాళ్లు ఎన్నుకున్న ప్రభుత్వాలే  ఈ బాధ్యత యెలా నిర్వర్తించాలి అన్న విషయాలను చూసుకోవాలి. అనవసరమైన చర్చలకు తెర తీయడం అంటే సంఘర్షణలకు తలుపులు తెరవడమే అవుతుంది. పరస్పర ఆరోపణల కన్నా సత్వర కార్యాచరణ ప్రధానం. సవాళ్లు, ప్రతిసవాళ్లు మానుకుని సమస్య పరిష్కార మార్గాలను అన్వేషించాలి"       
"ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ పాత పేరుతొ పాత అసెంబ్లీ భవనంలో తొలి సమావేశాలు ప్రారంభించింది. నీలం సంజీవ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న వంటి దిగ్గజాలు కొలువు తీరిన అసెంబ్లీ భవనం అది. నలభై ఏళ్ళక్రితం ఆకాశవాణి విలేకరిగా వరసగా అనేక సంవత్సరాలపాటు అసెంబ్లీ కార్యకలాపాలను రిపోర్ట్ చేసే అదృష్టం నాకు లభించింది. పదుల సంఖ్యలో అనేకమంది కొత్త సభ్యులు ఇప్పుడు అదే సభలో కుడి పాదం మోపారు. సభను సజావుగా నడుపుకోవడంలో సీనియర్లు వారికి ఆదర్శంగా నిలవాలి"
"అఖిల భారత స్థాయి పోటీ పరీక్షల్లో తెలుగు తేజాలు వికసించడం ఆహ్వానించతగ్గ పరిణామం. పిల్లల్ని మంచిగా చదివించాలనీ, అదే వాళ్లకు తాము  ఇచ్చే ఆస్తిపాస్తులన్న స్పృహ,  కలిగినవాళ్లల్లోనే కాకుండా కూలీ నాలీ చేసుకునే బీదాబిక్కీలో కూడా పెరుగుతుండడం దీనికి  కారణం. పెడదారి పట్టించే పలు మార్గాలు అందుబాటులో వున్నా చదువుకు  పెద్దపీట వేస్తున్న పిల్లలు అభినందనీయులు. చక్కగా చదువుకున్న సమాజం భద్రమైన భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది"

కామెంట్‌లు లేవు: