'అరవై ఎనిమిదేళ్ళు వచ్చాయి. సొంత ఇల్లంటూ
వున్నట్టు లేదు. ఇలా ఎన్నాళ్ళు' అని శ్రేయోభిలాషులు తరచూ అడిగే ప్రశ్న. మా
పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర
వరసగా అయిదేళ్ళ పాటు పీఆర్వో గా పనిచేశారు. రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా,
ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పదవీవిరమణ చేసి, సొంత గూడంటూ
లేకుండా, సిటీ బస్సుల్లో తిరిగేవాడు. ఆయన
ముందు పిపీలికాన్ని నేనెంత? పిల్లలు బాగా చూసుకుంటున్నారు. అదే పదివేలు. పోతే, ఈ
ప్రశ్న ఎదురయినప్పుడల్లా ఎప్పుడో చదివిన ఓ ఇంగ్లీష్ కధ జ్ఞాపకం వస్తుంది.
"అనగనగా ఓ రాజుగారు. ఆ రాజుదగ్గర ఓ పనివాడు.
వాడిని చూసినప్పుడల్లా రాజుగారికి ఆశ్చర్యంతో కూడిన సందేహం. నాకింత హంగూ ఆర్భాటం
వుంది. లేదనేది లేదు. అయినా ఏదో లోటు ఎప్పుడూ తొలుస్తూనే వుంటుంది. వీడేమిటి ఎప్పుడూ
చూసినా మొహంలో అంత నిశ్చింత. రేపు యెలా గడుస్తుంది అన్న బాధ కనిపించదు. ఏవిటి వీడి
వ్యవహారం?"
రాజుగారి చింత మంత్రిగారు కనిపెట్టాడు.
రాజుగారికి చెప్పి తొంభయ్ తొమ్మిది బంగారు
మొహరీలు తెప్పించాడు. వాటిని ఓ సంచీలో వుంచి ఆ పనివాడి గుమ్మం ముందు వొదిలి పెట్టి
రమ్మని భటులను ఆదేశించాడు.
తెల్లారి లేచిన తరువాత పనివాడికి తన గుమ్మం ముందు
పడివున్న సంచీ కనబడింది. లోపలకు తీసుకు వచ్చి విప్పి చూశాడు. కళ్ళు జిగేల్ మన్నాయి. అన్నీ
బంగారు కాసులు. లెక్కబెట్టాడు. 99 వున్నాయి. అనుమానం వచ్చి
మళ్ళీ లెక్కించాడు. పొరబాటు ఏమీ లేదు. 99 నాణేలు మాత్రమే
వున్నాయి. మరి ఆ ఒక్క మొహరీ ఏమైంది?
పనివాడికి మరోపని
లేకుండా పోయింది. మరో ఆలోచన లేకుండా పోయింది. ఎలాగైనా ఆ ఒక్క నాణెం సంపాదించి
మొత్తం నూరు నాణేలు సొంతం చేసుకోవాలి అన్న ధ్యాస పెరిగింది. ఈ యావలో పడి పెళ్ళాం
పిల్లలతో అచ్చట్లు ముచ్చట్లు తగ్గిపోయాయి. సర్వం కోల్పోతున్న భావన. తెలియని
దిగులుతో నిద్ర పట్టేది కాదు. అన్నం సయించేది కాదు.
పనివాడిలో కనబడుతున్న
మార్పు రాజుగారు గమనించాడు. మంత్రిగారు వచ్చి టీకా తాత్పర్యం చెప్పకుండానే ఆయనకు
విషయం బోధపడింది.
ఏవీ లేనప్పుడు అ
పనివాడికి ఏ చింతా లేదు. 99 నాణేలు సొంతం కాగానే
వాటిని నూరు చేయాలన్న తాపత్రయం బాగా పెరిగిపోయింది. ఆశ దురాశగా మారితే మనుషులు
యెలా మారిపోతారన్నది రాజు గారికి తెలిసివచ్చింది."Note: Courtesy image Owner
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి