27, జూన్ 2014, శుక్రవారం

జేబులో రాజీనామా


1971 లో బెజవాడ  ఆంధ్ర జ్యోతిలో సబ్ ఎడిటర్ గా  చేరడానికి వెళ్లాను. ఎడిటర్ నార్ల వేంకటేశ్వర రావు గారు.
ఏదీ నీ రాజీనామా?’ అన్నారు. ఒక్క క్షణం గతుక్కుమన్నాను. ఇంతలో ఆయనే జర్నలిస్టు అనేవాడు తన జేబులో రాజీనామా సిద్ధంగా వుంచుకోవాలి.తెలిసిందాఅన్నారు.
నాలుగున్నర ఏళ్ళదాకా నాకు రాజీనామా అవసరం పడలేదు. తరువాత ఆంధ్రజ్యోతికి సలాం చెప్పి హైదరాబాదు ఆలిండియా రేడియోలో విలేఖరిగా చేరాను. నేను చిక్కడపల్లిలో వుండేవాడిని.


(తొంభయ్యవ దశకంలో ఫోటో. ఎడమవైపు శ్రీ కృష్ణ, శ్రీ రోశయ్య, వెనుక పచ్చ చొక్కాలో నేను) 

కలం కూలీ జీ.కృష్ణ గారి నివాసం రాం నగర్లో. బెజవాడలో వుండగా మా అన్నయ్య పర్వతాలరావు గారి ద్వారా కృష్ణ గారు పరిచయం. తరువాత హైదరాబాదులో ఆయన ఇండియన్  ఎక్స్ ప్రెస్ లో, నేను రేడియోలో విలేఖరులం. రాజకీయాలతో సంబంధం లేని అనేకమంది ప్రముఖులను ఆయన ద్వారా కలుసుకునే అవకాశం దొరికింది. కృష్ణ గారి ధారణ శక్తి అపూర్వం. ఎన్నెన్నో పాత సంగతులను చెబుతుండేవారు. ఎందరో ప్రముఖులతో ఆయనకు వ్యక్తిగత పరిచయాలు వుండేవి. ముఖ్యమంత్రి వెంగళరావు గారిని ఏం వెంగళరాయా!అని సంబోధించేవారు. అనేక పత్రికల్లో పనిచేసిన అనుభవం ఆయనది. ఎక్కడా కాలునిలవని తత్వం. నార్లగారు చెప్పిన సూత్రాన్ని అక్షరాలా పాటించిన జర్నలిస్టు. అనేక పర్యాయాలు రాజీనామా చేసి పెద్ద పెద్ద పేపర్లలో పెద్ద పెద్ద పదవులను వొదులుకున్నారు.
అనేక దశాబ్దాల క్రితం కొంతకాలం ఢిల్లీలో పనిచేశారు. ఆనాటి ఆయన జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.
ఢిల్లీలో నేను సరిగా ఇమడలేకపోయాను. అక్కడ తక్కువ జీతగాళ్ళు వుంటారు  కాని తక్కువ జీతంపైన వుండలేం.
ఢిల్లీలో తమిళులు ఒక స్వయం సమృద్ధవర్గం. వాళ్ల పురోహితులు వాళ్ల వాళ్ళే. వాళ్ల హోటళ్ళు వాళ్ళవే. ఒక తమిళుడు కుంభకోణంలోని తన స్నేహితుడికి ఇలా రాశాడట. ఢిల్లీ మనదే. కాకపోతే ఇక్కడ అనవసరంగా ఉత్తరాదివాళ్ళు వచ్చిపడ్డారు.’  బెంగాల్ వాళ్ళది మరోతీరు. వాళ్లు తాము అందరికన్నా కనీసం ఒకరోజు ముందు ఆలోచించగలం అన్నది వాళ్ల ధీమా. అప్పట్లో నెహ్రూ నెల జీతం 2,500. దానిపై బెంగాలీల వ్యాఖ్య.- నెహ్రూ గారు తన యోగ్యతకు మించి నెలకు 2,500 ఎక్కువగా జీతం పుచ్చుకుంటున్నారని"
తోక ముక్క:  మన దేశంలో పత్రికా యజమానుల రాజకీయాలు సరేసరి. విలేఖరుల రాజకీయాలు కూడా వుంటయ్యి.కృష్ణ గారి ఉవాచ.

కామెంట్‌లు లేవు: