28, జూన్ 2014, శనివారం

అగ్గి పుల్ల గీస్తే అడవి తగలడి పోతుందా!


అలాగే వుంది కోన సీమ దుర్ఘటన గమనిస్తే. ఈ అంశంపై సాక్షి టీవీ, ఈరోజు (28-06-2014)ఉదయం ఏడుగంటలకు హెడ్ లైన్ షో. యాంఖర్ హరి. నాతో పాటు మాజీమంత్రి శ్రీ విశ్వరూప్, విశాఖ నుంచి చమురు వ్యవహారాల నిపుణులు శ్రీ సీ.వీ.రామన్ చర్చలో పాల్గొన్నారు.



"గతంలో జరిగిన బ్లో అవుట్ కు, నిన్నటి సంఘటనకు తేడావుంది. అది ప్రమాదం. నిన్నటిది మానవ తప్పిదం. సహజవాయువుకు రంగూ, రుచీ వాసనా వుండవంటారు.  పైప్ లైన్ పగిలి గ్యాస్ గాలిలో కలిసి వ్యాపిస్తున్నా, మృత్యువు పాకివస్తున్నట్టు, పక్కనే పొంచి వున్నట్టు అగ్గిపుల్ల గీసే దాకా తెలియదు. కొన్ని నెలలక్రితం మా ఇంట్లో గ్యాస్ లీకయింది. పిర్యాదు చేస్తే గ్యాస్ కంపెనీ సిబ్బంది తాపీగా వచ్చి, 'అప్పుడప్పుడూ  సిలిండర్ పైపు  మార్చుకోవాలని చదువుకున్న వాళ్లు మీకు కూడా తెలియకపోతే యెట్లా' అని లెక్చర్ ఇచ్చిపోయారు. మరి ఇప్పుడు కోనసీమను మరుభూమిగా మార్చిన సంఘటనలో, అధికారులు చెప్పే ఈ సుద్దులు ఎక్కడికి పోయాయో. గ్యాస్ పైప్ దుస్తితి  గురించి స్థానికులు పిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటున్నారు. గ్యాస్ నిల్వలు వెలికి తీసే ప్రాంతం అంటే వంద ఆటం బాంబులు పెట్టుకుని పైన పక్క వేసుకుని పడుకున్నట్టు. అంత ప్రమాదం ఎల్లవేళలా పొంచి వుంటుంది. గ్యాస్ లీక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా  సరపరా నిలిచిపోయేలా అందుబాటులో వున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నట్టు లేదు. కనీసం, జనావాసాల మధ్య పైపు  లైన్లు వేసినప్పుడు ముందు జాగ్రత్త బోర్డులు కూడా పెట్టలేదు. చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా, ముగ్గురు సబ్యులతో విచారణా సంఘం ఏర్పాటు, నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు. అన్నీ రొటీన్ ప్రకటనలు. ఇవన్నీ సరే. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామనే ఆ ఒక్క మాట అన్నా నిలబెట్టుకుంటే అదే పదివేలు"         

కామెంట్‌లు లేవు: