నేటి సాక్షి దినపత్రిక (03-06-2014) ఎడిట్ పేజీలో ప్రచురితం
మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన
ఘట్టం చరిత్రలో చోటుచేసుకుంది. చాలా ఏళ్ళుగా నలుగుతూ, సలుపుతూ వచ్చిన ఒక
సమస్యకు'ముగింపు' దొరికింది. పడింది 'శుభం' కార్డా, మరో సమస్యకు అంకురార్పణా అన్న చర్చ అనవసరం. దాన్ని కాలమే
తేలుస్తుంది.
ఎందుకంటే 1956 లో మొట్టమొదటి భాషా
ప్రయుక్త రాష్ట్రంగా 'ఆంధ్రప్రదేశ్' ఏర్పాటయినప్పుడు ఇలాగే సంతసించినవాళ్ళు వున్నారు. సందేహించినవాళ్లు
వున్నారు. ఆనాడు సంశయం వ్యక్తం చేసిన వాళ్ల భయాలే నిజం అయ్యాయని ఈనాడు విభజనను
గట్టిగా కోరుతున్నవారు ఎంతో గట్టిగా వాదించిన సందర్భాలు వున్నాయి. అంచేత
సందేహిస్తున్నవారి భయాలను తేలిగ్గా కొట్టివేయడం కూడా తగదు.
ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్రత్యేక
తెలంగాణా స్వప్నం సాకారం అయింది. ఈ సమయంలో గెలుపు వోటముల ప్రసక్తిని పక్కనబెట్టాలి. యుద్ధాల్లో, క్రీడల్లో మాత్రమే ఈ మాటలు వినబడతాయి. ఇంతకాలం జరిగింది యుద్ధమూ కాదు, ఆటా కాదు.ఉభయప్రాంతాల
జనంలో వున్న ఆకాంక్షకు చక్కని అభివ్యక్తీకరణ మాత్రమే. కొందరు రాజకీయులు
దీనికి అగ్గి రాజేసారు. వారిని గురించి పట్టించుకోవాల్సిన అగత్యం ఎంతమాత్రం లేదు.
ఇకనుంచయినా సరే, రెండు ప్రాంతాల ప్రజలు రాజకీయుల చేతుల్లో పావులు కాకుండా తమ
ప్రాంతాల సత్వర అభివృద్ధిలో స్వయంగా భాగస్వాములు కావాలి.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అన్న నగ్న సత్యాన్ని రాజకీయ నాయకులకు
ఎరుకపరచాలి.
నిజమే. సుదీర్ఘ కాలం సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో
హింసాత్మక ఘటనలు తక్కువే కావచ్చు. 1969 నాటితో పోలిస్తే
మొత్తం మీద ఉద్యమం శాంతియుతంగా జరిగిందని దానికి నాయకత్వం వహించిన వాళ్లు
చెప్పుకోవచ్చు. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం తపనపడి , ప్రత్యేక రాష్ట్రం
ఇక తీరని కలేమో అని అపోహపడి, ఆ నిర్వేదంలో
అనేక మంది యువకులు చేసిన బలిదానాల మాటేమిటి? ప్రాంతీయంగా విడిపోయినా మానసికంగా కలిసివుందామని కోరుకునే వారి నడుమ
రాజకీయులు తమ స్వార్ధం కోసం రగిల్చిన సంఘర్షణల మాటేమిటి? ఆత్మహత్యలు చేసుకున్నపిల్లల తలిదండ్రుల మానసిక క్లేశాలకు ఖరీదు కట్టే
షరాబులు దొరకరు. అంచేత అలాటివారికి స్వాంతన కలిగించడం తెలంగాణా నాయకుల ప్రధమ
కర్తవ్యం.
ప్రజల మనసులకు తగిలిన గాయాలు నయం కావడానికి
కొంత సమయం పడుతుంది. వాటిని తమ మాటలు, చేతలతో మరింత ముదిరేలా
చేసి వ్రణాలుగా తయారు చేయకపోతే అదే పది వేలు.
రైలు ప్రయాణంలో కలిసిన ప్రయాణీకులే విడిపోయేటప్పుడు
ఎంతో బాధ పడతారు. అలాటిది దాదాపు అరవై ఏళ్ళక్రితం కలిసిపోయి, ఇన్నేళ్ళుగా కలిసి మెలిసి వుండి విడిపోయే తరుణంలో బాధపడని వారు వుండరు.
విడిపోవడం తప్పనిసరి అయినప్పుడు కలిసివున్నప్పటి రోజుల్లోని అనుబంధాలను గుర్తు
చేసుకుని వాటిని పదిలపరచుకోవడం, మరింత పెంచుకోవడం
విజ్ఞుల లక్షణం.
మరో వారం తిరగగానే తెలుగు ప్రజల చరిత్రలో ఇంకో
నూతన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణా పది జిల్లాలు పోను మిగిలిన పదమూడు
జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అనే పాత పేరుతోనే మరో కొత్త రాష్ట్రం రూపుదిద్దుకోబోతోంది.
వేరే వెతుక్కోకుండా తెలంగాణాకు, వడ్డించిన విస్తరి
మాదిరిగా అన్ని హంగులతో కూడిన రాజధానీ నగరం వుంది. అటుపక్క ఆంధ్ర ప్రదేశ్ లో
మాత్రం అన్నీ మొదటి నుంచీ మొదలు పెట్టాలి. బుడి బుడి అడుగులతో నడక
ప్రారంభించాలి. అదీ వేగంగా సాగాలి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల దూరదృష్టి లోపం
కారణంగా అభివృద్ధి యావత్తూ హైదరాబాద్, దాని చుట్టుపక్కల
మాత్రమే కేంద్రీకృతం అయింది. అంతర్జాతీయ స్థాయి కలిగిన విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, విద్య, వైద్యాలయాలు అన్నీ కట్టగట్టుకుని ఒక్కచోటునే మఠం వేశాయి. చదువుల కోసం,
వైద్యం కోసం, ఉద్యోగాలు, ఉపాధుల కోసం రాష్ట్రం నలుమూలలనుంచి హైదరాబాదు రావడానికి అలవాటు పడిన
వారికి ఇప్పుడు కొన్నేళ్ళ పాటు ఇబ్బందే. సీమాంధ్ర ప్రాంతంలో ఈ సౌకర్యాలు ఓ మోస్తరు
స్థాయిలోనే అభివృద్ధి చెందాయి. ఆ ప్రాంతంలో కొలువు తీరబోతున్న నూతన ప్రభుత్వ
వ్యవస్థకు ఎదురయ్యే తొలి సవాలు ఇదే.
అభివృద్ధి బంతి ఇప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహించే
వారి కోర్టులో వుంది. ఒక రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి. మరో రాష్ట్రాన్ని
పునర్నిర్మించుకోవాలి. వున్న వ్యవధానం చాలా తక్కువ. ఐదేండ్ల పుణ్యకాలం ఇట్టే
గడిచిపోతుంది. కాబట్టి, లేనిపోని
గిల్లికజ్జాలతో, ఆరోపణలు ప్రత్యారోపణలతో
అనుదినం పొద్దుపుచ్చకుండా, ప్రజలకు ఇచ్చిన మాటల్ని
నిలబెట్టుకుంటూ, వారి ఆశలకు ఆకాంక్షలకు
అనుగుణంగా నడుచుకుంటూ, సత్వర కార్యాచరణకు
నడుం కట్టాలి. మాటలు చెప్పి, గీతలు గీసి విభజించడం
అంత సులభం కాదు కొత్త రాష్ట్రాలను సుసంపన్నంగా తీర్చిదిద్దడం. పెనుభారంతో కూడిన ఈ
బాధ్యతను రెండు ప్రభుత్వాలు అత్యంత శ్రద్ధాసక్తులతో, గరిష్ట నిష్టతో
నిర్వహించ గలిగితేనే రాష్ట్ర విభజన వల్ల సానుకూల ఫలితాలు రెండు ప్రాంతాలకు
సిద్ధిస్తాయి. లేకుంటే పాఠ్య పుస్తకాల్లో మ్యాపులుగా మాత్రమే ఈ రెండు రాష్ట్రాలు
మిగిలిపోతాయి.(02-06-2014)
7 కామెంట్‌లు:
"ఈ సమయంలో గెలుపు వోటముల ప్రసక్తిని పక్కనబెట్టాలి"
ఇది సరి కాదు. ఖచ్చితంగా తెలంగాణా ప్రజానీకం మహత్తర విజయం సాదించింది. ఈ వాస్తవాన్ని ఒప్పుకోవడం అందరికీ మంచిది. కాకపొతే సీమాంధ్ర ప్రజలు ఓడిపోలేదు, పాలక వర్గాలు మాత్రమె ఓడిపోయాయి అన్న మాట కూడా అక్షర సత్యం.
"ప్రజల మనసులకు తగిలిన గాయాలు నయం కావడానికి కొంత సమయం పడుతుంది"
ఇది ఇరు పక్షాలకు వర్తిస్తుంది. దశాబ్దాల పాటు సూటిపోటి మాటలతో, అవహేలనలతో సతమతయిన తెలంగాణా ప్రజలు వాటిని మర్చిపోవడానికి ఎంత సమయం పడుతుందో ఏమో?
"అటుపక్క ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అన్నీ మొదటి నుంచీ మొదలు పెట్టాలి"
1953 పరిస్తితి పునరావృత్తం అయింది. భాష సాకుతో తెలంగాణా మీద పడడం వల్ల ఆంధ్రుల సహజ సమస్యలకు ఒకంత తాత్కాలిక ఊరట దొరికినా వారి మౌలిక సమస్యలు అప్పటివే.
గెలుపు-ఓటమి అన్న మాటలు వాడినప్పుడు వాటిలో రెండు శత్ర్పక్షాలూ ఒక యుధ్ధమూ అన్న అర్థం ద్వనించి తీరుతుంది.
ఇది యుధ్ధమే అని ఒకపక్షంవారు నిరంతరం రణన్నినాదాలు చేసినతరువాత కూడా అదేం కాదు అనుకోవటం ఆత్మవంచనయే. అలా అనుకోమని ఇప్పదనటం నిర్మొగమాటంగా వంచనయే.
ఒకరు విజయం సాధించారు అన్నప్పుడు మరొకరు ఓడిపోయారు అని వేరే చెప్పాలా? అలా ఆవలిపక్షం ఓడిపోలేదు అని సర్ధిచెప్పే ప్రయత్నాలు వంచనాశిల్పాలే.
పాలకవర్గాలు ఓడిపోయాయి ప్రజలు కాదు అన్న మాటలు వినిపిస్తున్నవారు ఇన్నాళ్ళూ నేరుగా ప్రజల్నే గురిచేసి అవమానకరమైన మాటలు అనుక్షణం ఈటెల్లా విసిరినమాట అబధ్ధమా? అప్పుడు కేవలం పాలకులనే తప్పుబట్టి ఉంటే ప్రజలకు మనస్తాపం ఉండకపోను! ఇప్పుడు మేం విజయం సాధించేసాం - మీరూ మిమ్మల్ని మేము ఏమీ అనలేదని అనుకోండి - సంతోషంగా సహకరించండి మాతో అనటం నిస్సందేహంగా వాతపెట్టి వెన్నరాయటమే.
ప్రజలమనస్సులకు తగిలినగాయాలను కాలమే మాన్పాలి. కాని ఎంతసమయం పట్టినా సీమాంద్రులమనస్సులు తాము పడ్డమాటల్ని మరిచిపోగలరా? అద్దాన్ని బ్రద్దలుకొట్టి మళ్ళి యధాస్తితికి తీసుకురాలేరు - అది మీకి ఎంతగా అవసరం ఐనా సరే. "సీమాంధ్రలో పుట్టినవాళ్ళంతా తెలంగాద్రోహులే" అన్నది మరొక లక్షసంవత్సరాల తర్వాత కూదా సీమాంధ్రులు గుర్తుంచుకుంటారు. ఇటువంతి మాటలు చేసినవి కాలం కూడా నయం చేయలేని గాయాలు.
తెలంగాణా వచ్చి ఆంద్రామీద పడింది కాని తద్విరుధ్ధం కాదు. ఆంధ్రాతో కలవాలని హైదరాబాదు రాష్ట్రం తీర్మానం చేసిందా? హైదరాబాదుని కబళించాలని ఆంధ్రరాష్ట్రం తీర్మానం చేసిందా?
కొందరు రాజకీయస్వార్థపరులు తెలుగుజాతిని రెండు ముక్కలు చేసారు. మరికొన్ని ముక్కలైనా చేయాలనీ వీరు ఇంకా ప్రయత్నించే అవకాశమూ లేకపోలేదు.
ఈ రాజకీయచదరంగంలో ప్రజలు పావులుగా మాత్రమే పనికి వచ్చారు.
ఇంకా ఇంకా సీమాంధ్రమీద కడుపుమంట చల్లారని వారు నేటినుండి పిడుక్కీబియ్యానికీ ఒకటే మంత్రమన్నట్లు తెలంగాణావారికి ఏ సమస్యవచ్చినా అదేదో గతంలో సీమాంద్రతో కలిసి ఉండటం వల్ల వచ్చిందే అని గొంతులు చించుకుంటారు. దీనికి అంతేదీ?
*కాకపొతే సీమాంధ్ర ప్రజలు ఓడిపోలేదు, పాలక వర్గాలు మాత్రమె ఓడిపోయాయి అన్న మాట కూడా అక్షర సత్యం*
ఇది ఒక పొలిటికల్ కరెక్ట్ స్టేట్మెంట్. పాలకవర్గాలు మాత్రమే కాదు, సీమాంధ్ర ప్రజలు కూడా ఖచ్చితంగా ఓడిపోయారు. ఆ విషయం అర్థం కాకపోతే సీమాంధ్ర ప్రజలు ఆత్మవంచన చేసుకొంట్టున్నారనుకోవాలి. సీమాంధ్రపాలక వర్గాలు, ప్రజలు వేరు వేరు కాదు. తెలంగాణ ప్రజలందరు దాదాపు ఏకత్రాటి పై వచ్చి కెసియార్ కి మద్దతుగా నిలచారు. కారణాలు ఎవైనా,చివరి నిముషంలో కూడా సీమాంధ్రులు అలా సంఘటితం కాలేకపోయారు. ఎవరి కేంపును వాళ్లు నడుపుకొంట్టు పై పై మాటలతో ఆన్ని పార్టిల వారు ప్రజలను మభ్యపెట్టారు. సీమాంధ్ర ప్రజలు రాజకీయ నాయకులపై తెచ్చిన ఒత్తిడి ఎమైనా ఉందా? అన్నిరాజకీయపార్టిలు ఏకమై ఉద్యమించాలని కూడా, వాళ్ల రాజకీయనాయకులకు బలంగా చెప్ప లేకపోయారు. తెలంగాణా వారితో పోలిస్తే వారికి రాజకీయ చైతన్యం లేదు. కుల పార్టిలకు వంత పాడుతూ, వాళ్లనెత్తిన వరే చెయ్యిపెట్టుకొన్నారు. వాళ్ల నాయకులు సరైన సమయంలో, సరైన నిర్ణయాలను తీసుకోవటంలో తప్పులు చేశారు. వాళ్లు మునిగారు, ప్రజలను ముంచారు. ఆ తప్పులను కప్పి పుచ్చుకోవటానికి, మొన్న జరిగిన ఎన్నికలలో తెదే వర్సెస్ వై.కా.పా. హోరాహోరిగా పోరాడారు, ఆ గోల లో ప్రజలు విభజన వైఫల్యాలను మరచిపోయేటట్లు కన్వీన్స్ చేశారు. వారి తప్పులను కప్పిపుచ్చుకోవటానికి వీలు దొరినపుడల్లా బిజెపి పార్టిని నిందించటం కూడా వీరి ఎత్తుగడలలో లో ఒక భాగం. ఇంత జరిగాక రెండు పార్టిలు ఎమి నేర్చుకోలేదు. జాతీయ పార్టిలు గా అవతరించామని ఇంకా ప్రజలను మభ్యపెడుతున్నారు.
@జై,
మీరు రాసే వ్యాఖ్య ను చదివితే స్వాతంత్రం పోరాట సమయంలో ని ఆంధ్రా నాయకులను ఎగతాళి చేసే విధంగా ఉంట్టున్నాయి. మీరు రాసే వన్ని నిజాలు అని నమ్మలేము. మీలాంటి గొప్ప మేధావులతో అందరు వాదించలేకపోవచ్చు. మీరు ఆంధ్రభూమి పేపర్ లో యం.వి.ఆర్.శాస్త్రి రాసే ఆంధ్రాయణం కాలం చదువుతున్నారనుకొంటాను. మీరొకపని చేయండి, మీ ఆరోపణలన్నిన్టిని శాస్త్రి గారికి పంపి, ఆయన వివరణ అడిగి మీ బ్లాగులో ప్రచూరించకుడదా? ఆ తరువాత మీరు పాత తరం నుంచి కొత్త తరం వరకు ఆంధ్ర నాయకులు తిట్టినా మీ మాటలను నమ్ముతారు.
@శ్యామలీయం:
"అలా ఆవలిపక్షం ఓడిపోలేదు"
You can choose to call yourself a loser. I did not do so nor have I ever done so.
"మరొక లక్షసంవత్సరాల తర్వాత కూదా సీమాంధ్రులు గుర్తుంచుకుంటారు"
అలాగే కానివ్వండి. కరుణశ్రీ బిరుదాంకితుడు "తెలంగాణము దక్షిణ పాకిస్తానము" అన్న విషయాన్ని కూడా గుర్తించుకునే వారు గుర్తించుకుంటారు. కాళోజీ ఆనాడే అన్నట్టు "నాకు భాష రాదన్నోడు, నా యాసను ఎక్కిరించినోడు సిగ్గు లేకుండా కలిసి ఉందామన్నాడు". ఇవన్నీ మామూలే లెండి. చిత్రమేమిటంటే తిట్టుకొనే వాళ్ళు విడిపోవాలనుకోవడం బాగుంది కానీ తిట్టుకుంటూ కలిసి ఉందామనడం చోద్యం.
"ఆంధ్రాతో కలవాలని హైదరాబాదు రాష్ట్రం తీర్మానం చేసిందా?"
హైదరాబాదు శాసనసభలో తీర్మానంపై వోటింగ్ జరగలేదు. ఇకపోతే ఆంద్ర శాసనసభ రెండు తీర్మానాలు పాస్ చేసింది. రెంటిలోనూ తెలంగాణా వారికి హామీలు (ఉ. జనాభా ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఉద్యోగాలు) గుప్పించారు.
"మరికొన్ని ముక్కలైనా చేయాలనీ వీరు ఇంకా ప్రయత్నించే అవకాశమూ లేకపోలేదు"
మాకెందుకు లెండి. ప్రజలు వాళ్ళంతట వాళ్ళే అడిగితె అప్పుడు చూద్దాం. సాటి భారతీయులగా సాయం చేయగలిగితే మావంతు ఉడతా భక్తి చేస్తాము. అయినా శ్రీబాగ్ ఒడంబడిక ఏలిన వారు మర్చిపోయారు లెండి.
@UG SriRam:
బలవంతంగా కలిసి ఉండడం అసాధ్యమే కాదు అవివేకం కూడా. కలిసి ఉండాలని ఆంధ్రలో "ఉద్యమం" చేసే బదులు తెలంగాణా వారిని ఒప్పించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. విడిపోతే మేము నష్టపోతాము కాబట్టి మీరు మాతో కలవాలనే లాజిక్ ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి.
మీరు చెప్పే శాస్త్రి గారు నాకు తెలీదు. నా లాంటి అనామకుడికి వారు సమాధానం ఇస్తారనే ఆశ నాకు లేదు. ఇకపోతే నేను ఆంద్ర నాయకులను తిట్టలేదు & తిట్టబోను కాబట్టి ఆయనను కెలకాల్సిన అవసరం లేదు.
స్వాతంత్ర్య సమరయోధులు కూడా మామూలు మనుషులే పైగా అందరూ రాజకీయాలలో దిగారు. మీరు 50వ దశాబ్దపు పత్రికలు చూస్తె ఒకరి మీద ఒకరు ఎంత బురద జల్లుకున్నారో (ఉ. టంగుటూరి ప్రకాశం గారిపై కళా వెంకటరావు గారి కలెక్షన్ ఆరోపణలు) స్పష్టంగా తెలుస్తుంది.
@jai
*మాకెందుకు లెండి. ప్రజలు వాళ్ళంతట వాళ్ళే అడిగితె అప్పుడు చూద్దాం*
చూడబోతే రాష్ట్రలను విడదీయటం ఏలా అనేదాని మీద కన్సల్టెన్సి పేట్టేసేటట్లున్నారు :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి