16, జూన్ 2014, సోమవారం

చిక్కుల్లో ఇంజినీరింగ్ ... జెమినీ న్యూస్ ఛానల్ చర్చ

చిక్కుల్లో ఇంజినీరింగ్ ... జెమినీ న్యూస్ ఛానల్ చర్చ
ఈరోజు (16-06-2014) సాయంత్రం నాలుగున్నర గంటలకు జెమినీ న్యూస్ ఛానల్, 'పబ్లిక్ వాయిస్' ప్రోగ్రాంలో  ఇంజినీరింగ్ విద్యార్థుల ఫీజ్ రీ ఇంబర్స్ మెంట్ విషయం చర్చకు పెట్టింది. యాంఖర్ సోమరాజు సంధానకర్తగా వ్యవహరించారు. లేవనెత్తిన అంశాలపై నా అభిప్రాయాలు సంక్షిప్తంగా:


" ఓ  నలభయ్ ఏళ్ళక్రితం  రాష్ట్రం మొత్తంలో నాలుగయిదు ఇంజినీరింగు కాలేజీలు వుండేవి. ఇప్పుడవి జిల్లాకు నాలుగయిదుకు పైగా విస్తరించాయి. మంచి నాణ్యత కలిగిన కాలేజీల్లో  సింహభాగం హైదరాబాదు చుట్టుపక్కలే ఏర్పాటయ్యాయి. అప్పటికి రాష్ట్రం విడిపోలేదు. అంచేత రాష్ట్రం లోని అనేక ప్రాంతాలనుంచి విద్యార్ధులు వాటిల్లో చేరారు.
"ఫీజ్ రీ ఇంబర్స్ మెంట్ కాలేజీ యాజమాన్యాలకు, పేద విద్యార్ధుల తలితండ్రులకు వరంగా మారితే, ప్రభుత్వాలకు మాత్రం పెను భారంగా పరిణమించింది. ఫీజ్ రీఇంబర్స్ మెంటు అనేది గత ప్రభుత్వ పధకం. ఏదో ఒక విధంగా వొదిలించుకోవాలనే ఆలోచనలు కూడా చేశారు. కాని తాత్కాలికంగా కొన్ని నిబంధనలు  మార్పుచేసి  సర్దుకున్నారు.     
"అయితే, ఈ పధకాన్ని నమ్ముకుని వేలాదిమంది కాలేజీల్లో చేరారు. ఈ నేపధ్యంలో  రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఇందులో ఆ విద్యార్ధుల ప్రమేయం లేదు. కానీ,  ఆ పధకం అమలు  విషయంలో కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వాలకు ఆసక్తి వుంటుందని అనుకోలేము.
"తెలంగాణా ప్రాంతంలోని కాలేజీల్లో చదువుకునే ఆంధ్ర విద్యార్ధులకు ఫీజ్ రీఇంబర్స్ మెంటు యెందుకు ఇవ్వా లన్నది ఆ ప్రభుత్వం వాదన. వాదనలో బలం వున్నా విద్యార్ధుల పరిస్తితిని గమనంలో పెట్టుకుని  మరో ప్రత్యామ్న్నాయాన్ని అన్వేషిస్తే బాగుంటుంది. ఫీజ్ రీఇంబర్స్ మెంటు భారం విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సంప్రదించుకుని పరిష్కారం కనుగొనాలి కాని సంఘర్షణలకు దిగి విద్యార్ధులను గాలికి వొదిలి వేయడం సరికాదు. ఒకవేళ తెలంగాణా ప్రభుత్వంపై అనవసర భారం పడుతుంది అనుకుంటే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వానికి  రీఇంబర్స్ చేయాలి. కాదు కూడదు మా ప్రాధాన్యతలు వేరు అనుకుంటే ఈ పధకం విషయంలో తమ విధానాలను స్పష్ట పరచాలి. ప్రజలు తప్పనిసరిగా అర్ధం చేసుకుంటారు. అంటే కాని అసంగ్దిగ్దతకు తావివ్వరాదు." 

2 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

"ఈ నేపధ్యంలో రాష్ట్రం రెండుగా విడిపోయింది"

విడిపోయింది, ముక్కలయింది లాంటి మాటలు ఒక ప్రాంతంలో ఆవేశం రెచ్చగొడతాయి. ఇలాంటివి మానుకోవడం మంచిది. Neutralగా "తెలంగాణా ఏర్పడింది" అంటే బాగుంటుంది.

"ఇందులో ఆ విద్యార్ధుల ప్రమేయం లేదు"

నిజమే అయితే విద్యార్తుల చర్యలలో తెలంగాణా వారికీ ప్రమేయం లేదు.

"రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సంప్రదించుకుని పరిష్కారం కనుగొనాలి"

నష్టపోతున్న తమ ప్రజల అవసరం దృష్ట్యా ఆంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అంతేతప్ప తెలంగాణాను ఆడిపోసుకోవడం తప్పు.

"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వానికి రీఇంబర్స్ చేయాలి"

మళ్ళీ తెలంగాణా ప్రభుత్వాన్ని లాగడం అనవసరం. వారే నేరుగా కాలేజీలకు ఇస్తే సరి. లేకపోతె మేము తెలంగాణకు ఇచ్చాం వారు పట్టించుకోలేదు అంటూ డ్రామాలు మొదలయ్యే అవకాశం ఉంది.

చివరిగా ఒక ప్రశ్న. రోశయ్య కిరణ్ ప్రభుత్వాలు నెలల తరబడి బకాయిలు పెట్టి పిల్లల జీవితంతో చెలగాటం ఆడినప్పుడు లేని స్పందన ఈరోజు రావడానికి కారణం ఏమిటి?

అజ్ఞాత చెప్పారు...

జై గొట్టిముక్కల : [విడిపోయింది, ముక్కలయింది లాంటి మాటలు ఒక ప్రాంతంలో ఆవేశం రెచ్చగొడతాయి ] అవునా ?ఏ ప్రాంతంలో? దానికి ఆధారాలు ఏవన్నా ఉన్నాయా ? ఆ రెండు ముక్కలు అంత ఆవేశం రెచ్చగొడితే మరి తమరి విద్వేషపు కామెంట్ల విషయం ఏంటి ? అవి ఎంత ఆవేశం రెచ్చగొట్టాలి? కాబట్టి తమరి ప్రీచింగ్స్ పక్కన పెడితే కొంచెం చూడటానికి బావుంటుంది.

డ్రామాలు చేసి చూసి బాగా అలవాటు అయినట్లుంది, దాంతో అందరూ అదే పని చేస్తారు అని భుజాలు తడుముకున్నట్లుగా ఉంది. తెలంగాణాని ఆడిపోసుకోవటం, డ్రామాలు చేసే కార్యక్రమాలు చేయాల్సిన గతి ఆంధ్రప్రదేశ్ కి పట్టలేదు, పట్టబోదు.

పైనేమో ఆవేశాలు రెచ్చగొడతాయి అని సుద్దపూస కబుర్లు , అదే కామెంట్లో చేతికి వచ్చిన రాతలు. ఎవరు అన్నా అనక పోయినా అసలు సంగతి అందరికీ తెలుసు కానీ తెలంగాణా ఏర్పాటు గురించి మసి పూసి మారేడు కాయ చేసే సన్నాసి కబుర్లు ఇక ఆపేస్తే బావుంటుంది.