29, ఏప్రిల్ 2014, మంగళవారం

'ఒరేయ్ నేను శారదని....'

క్షమించాలి నేను గీసుకున్న గీతను నేనే దాటి వస్తున్నందుకు. కానీ సరయిన కారణం వుంది. ఇందులో నాకు రాజకీయం కనబడలేదు. ఈ ఫోటోలో వున్నది మా రెండో అక్కయ్య. ఆవిడకు వోటు ఖమ్మంలో వుంది. కానీ మూడు నెలల క్రితం వాళ్ల అబ్బాయి దగ్గరకు వచ్చి ఆరోగ్యకారణాల రీత్యా హైదరాబాదులోనే వుండిపోవాల్సివచ్చింది. రేపు ఇక్కడ వోట్ల రోజు అన్న సంగతి తెలుసుకుని ఈ రోజు పొద్దటి నుంచి అందర్నీ ఫోనులో పలకరించి వోటు వేసి రమ్మంటోంది. అంతే కాదు వేసి వచ్చిన తరువాత ఆ విషయం మళ్ళీ ఫోను చేసి చెప్పమని మాట తీసుకుంటోంది. తొంభయ్ ఏళ్ళ వయస్సులో ఆవిడ పడుతున్న ఆత్రుత చూసిన తరువాత ఇక దీన్ని షేర్ చేయాలన్న ఆత్రుత నాలో పెరిగిపోయింది. అందుకే వొట్టు తీసి గట్టున పెట్టేసాను.మన్నించాలి. - భండారు శ్రీనివాసరావు
మా మేనకోడలు భండారు రేణు సుధ కధనం:



(శ్రీమతి కొలిపాక శారద)

ఫోను కలపవే చిన్నమ్మాయ్!
" పొద్దున్నే లచ్చుబాబు నుంచి ఫోను. ఒక్కసారి వచ్చివెళ్ళవే అమ్మ అడుగుతోంది"
'ఆర్చుకుని తీర్చుకుని జూబిలీ హిల్స్ నుంచి బయలుదేరి వెళ్లేసరికి పదకొండు దాటింది. అమ్మ కిందటి నెలలోనే ఖమ్మం నుంచి హైదరాబాదు పటాన్ చెర్వు సమీపంలో వున్న మా చిన్నన్నయ్య ఇంటికి వచ్చింది. తొంభయ్ ఏళ్ళ మనిషిని అలా కదిలించడం నిజంగా సాహసం అనిపించింది కాని తప్పలేదు. మేముంటోంది జూబిలీ హిల్స్ లో. వారానికో పది రోజులకో వెళ్ళి చూసి వస్తుంటాను. ఎర్రటి ఎండలో పడివచ్చానని ఇంట్లో అంతా అనుకుంటుంటే అమ్మ మాత్రం తాపీగా 'ఫోను కలపవే చిన్నమ్మాయి' అంటోంది. అప్పటికే మా లచ్చుబాబు అన్నయ్య, గాయత్రి ఒదినె, వాళ్ల పిల్లల వరస అయిపోయినట్టుంది. ఆవిడ మంచం మీద కూర్చుని, హైదరాబాదులోని చుట్టపక్కాలు అందరికీ ఫోను కలిపి ఇవ్వమంటుంటే ఏమిటో అనుకున్నాను. తీరా చూస్తే. ఈ వయస్సులో ఎవరయినా అలా చేస్తారా అని అనిపించింది కూడా.
ఆవిడ పుట్టింది కాంగ్రెస్ వాదుల ఇంట్లో. మెట్టింది కాంగ్రెస్ కుటుంబాన్ని. పెళ్ళయిన కొత్తల్లోనే భర్త అంటే మా నాన్నగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్ర రావు గారు, స్వాతంత్ర సమర యోధుడిగా, గర్భిణి అయిన అమ్మను వొదిలి పద్దెనిమిది మాసాలు జైల్లో వున్నారు. తొలి చూరు బిడ్డని పుట్టిన వెంటనే చూసుకునే అదృష్టం కూడా లేదు. జైలు నుంచి వచ్చిన ఎన్ని నెలలకో కళ్ళారా చూసుకున్నారు. స్వతంత్రం వచ్చిన దరిమిలా మొదటిసారి ఎన్నికలు జరిగినప్పటి నుంచి క్రితంసారి ఎన్నికల వరకు దేన్నీ విడిచిపెట్టకుండా ప్రతిసారీ వోటు వేసి రావడం మా అమ్మకు అలవాటు. ఈసారి తనకు వోటు లేని హైదరాబాదులో వున్నప్పుడు ఈ వోట్ల పండుగ వచ్చిపడింది. వోటు వేయాలని ప్రాణం యెంత కొట్టుకులాడిపోతున్నా చేతకాని స్తితి. వీలులేని పరిస్తితి. అందుకని కొడుకునీ, కోడల్నీ, మనుమల్నీ పక్కన కూర్చోపెట్టుని అందరికీ ఫోన్లు కలపమని చెబుతూ, 'వొరేయ్ నేను శారదని, రేపు మరిచిపోకుండా వోటు వేసి రండి. వేసి వచ్చిన తరువాత నాకు ఫోను చేసి చెప్పండి.' అంటోంది.
ఇదంతా వింటూ నాకు కళ్ళు తిరిగాయో తెలియదు కాని తెరిపిళ్ళు పడ్డాయి. - భండారు రేణు సుధ

28, ఏప్రిల్ 2014, సోమవారం

తాత్కాలిక విరామం



బ్లాగర్, ట్విట్టర్,  ఫేస్ బుక్ సయితం ప్రభావవంతమైన సోషల్ మీడియా అయినందువల్ల  ఈరోజు సాయంత్రం ఆరుగంటల నుంచి ఎల్లుండి ముప్పయ్యవతేదీ సాయంత్రం పోలింగు ముగిసేవరకు రాజకీయ సంబంధమైన వార్తలు, వాటిపై వ్యాఖ్యలు, లేదా రాజకీయ కార్టూన్లు షేర్ చేయడం, లేదా వాటికి వ్యాఖ్యానాలు జత చేయడం, ఇతరులు పోస్ట్ చేసిన రాజకీయ  అంశాలపై స్పందించడం మొదలయిన వాటన్నిటికీ దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాను.ఇది నాకు నేనుగా స్వచ్చందంగా తీసుకున్న నిర్ణయం.- భండారు శ్రీనివాసరావు       

27, ఏప్రిల్ 2014, ఆదివారం

ఏ నిమిషానికి ఏమిజరుగునో ........


మంథా భానుమతి గారు 'హ్యాపీ మూమెంట్స్' రాయడం మొదలు పెట్టిన తరువాత అలా అందరూ తలా ఓ చేయివేస్తే అంతా హాయిగా చదువుకోవచ్చు కదా అనిపించింది. కానీ మళ్ళీ ఆవిడే రాశారు తెలిసిన వాళ్ళెవరో పోయారు, విషాద వార్తను పంచుకోవాల్సివచ్చిందని. పోతే, మా కధ.
ఆదివారం అన్నీ లేటే! కాఫీలు టిఫిన్లు.
వంటావిడ వచ్చి చేసిన ఇడ్లీలు తిని, పొద్దున్న (ఛానళ్ళ కోసం) చదివిన పత్రికల్నే మళ్ళీ తీరిగ్గా  చదవడానికి గదిలోకి వెళ్లాను. మా ఆవిడ పూల కుండీల్లో నీళ్ళు పోశారో లేదో చూడడానికని బయటకు వెళ్ళింది. మావాడు సంతోష్  పెట్టిన టిఫిన్ చల్లారిపోతున్నా పట్టించుకోకుండా 'వాట్సప్' లో మునిగితేలుతున్నాడు.
ఇంతలో భళ్ళున చప్పుడు. తలుపులు విరిగి విసురుగా దూరాన పడ్డ శబ్దం. బయటకు వచ్చి చూస్తే వంటిల్లు రణరంగంలా వుంది. కిచెన్ ప్లాట్ ఫారం కింద గ్యాస్ క్యాబిన్ తలుపులు దూరంగా పడివున్నాయి. సిలిండర్ రెగ్యులెటర్ నుంచి మంటలు వస్తున్నాయి. మావాడు మంచినీళ్ళబాటిళ్లలోని నీళ్ళతో ఆ మంటలపై చల్లుతున్నాడు.    
అవి ఓ పట్టాన కంట్రోల్ కావడం లేదు. ఎలారా అని అనుకుంటున్న సమయంలో 'లక్కు' అనేది మాకూ , జరగబోయే బీభత్సానికి నడుమ అడ్డుగోడలా నిలిచింది. మంటలు ఆరిపోయాయి. సిలిండర్ తీసి బయట పడేశాము.
ప్రస్తుతం మా ఆవిడ పర్యవేక్షణలో సంప్రోక్షణ జరుగుతోంది.
మావాడు కిచెన్ కు సెలవు ప్రకటించాడు. బహుశా ఈ పూట మధ్యాహ్నభోజనం బయట హోటల్లోనేమో!
కధ సుఖాంతం 


26, ఏప్రిల్ 2014, శనివారం

?????????


ఈ రెండు నెలలు అసెంబ్లీని యెందుకు వుంచినట్టు. యెందుకు రద్దుచేసినట్టు. కారణం తెలియదని కాదు ఈ ప్రశ్న వేయడం. రాష్ట్రపతి పాలన విధించినప్పుడే రద్దు చేసి వుంటే ఎమ్మెల్యేల జీత భత్యాల భారం తప్పేది కదా అని.



పల్లెకు పోదాం


"Back to village"

'పల్లెకు పోదాం పదండి' అని నేను 2005 లో  రిటైర్ కావడానికి ముందే రాశాను. ఒక్క దేవినేని మధుసూదనరావు గారనే పెద్ద మనిషి వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు  మాత్రమే ఈ పని చేసి చూపించారు.  హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తికాగానే వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ,   పుస్తకాలతో సాహితీ సేద్యం చేస్తూ హాయిగా వుంటున్నారు.  చదువులకోసమో, ఉద్యోగాలకోసమో బస్తీలకు వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా,  స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే బస్తీలమీద ఇంత భారం ( జనాభా, నీళ్ళు, వాహనాలు, విద్యుచ్చక్తి వగయిరా రూపంలో) పడదని నా వాదన. కానీ ఏం లాభం జీవితంలో ఎన్నో అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.


(మా స్వగ్రామంలో మా ఇల్లు)


25, ఏప్రిల్ 2014, శుక్రవారం

ఏకంగా నా పోటీ జంధ్యాల మీదే!


డెబ్బయ్యవ దశకానికి ముందు మా అన్నయ్య పర్వతాలరావు గారికి ఖమ్మం నుంచి బెజవాడ బదిలీ కావడం వల్ల నేను ఎస్సారార్  కాలేజీలో,  బీ కామ్ మొదటి సంవత్సరంలో చేరాను. చేరిన కొత్తల్లోనే విద్యార్ధి సంఘం ఎన్నికల్లో భాగంగా లాంగ్వేజ్ అసోసియేషన్ ఎన్నిక జరిగింది. మా క్లాసులో శతమానం భవతి అన్నట్టు వంద మంది. అదే కాలేజీలో బీ ఎస్సీ చదువుతున్న నా మేనల్లుడు తుర్లపాటి సాంబశివరావు పూనికపై నేను కూడా పోటీ చేస్తున్నట్టు పేరు ఇచ్చాను. మాచవరం నుంచి ఇద్దరం రిక్షాలో కాంగ్రెస్ ఆఫీసు రోడ్డులోని తెలిసిన సైక్లోస్టైల్ షాపుకు వెళ్ళి తెలుగులో అక్కడికక్కడే ఒక గేయం రాసి టైపు చేయించి కాలేజీకి  తిరిగి వచ్చి వాటిని క్లాసులో పంచిపెడుతుండగానే గంట మోగింది. వందలో నాకు పదిహేడు ఓట్లు వచ్చినట్టు జ్ఞాపకం. దండిగా ఓట్లు తెచ్చుకుని గెలిచినదెవరంటే జేవీడీఎస్ శాస్త్రి. అంటే ఎవరో కాదు మనందరి అభిమాన ఆహ్లాద సినీ రచయిత, దర్శకుడు జంధ్యాల.


ఆ 'ఒక్కక్షణం' అనే  గేయం ఇలా సాగుతుంది.
"ఒక్క క్షణం తొందరపడి ఓటు వృధా చేయకు - నిప్పుకణికెలాంటిదది నిర్లక్ష్యము చేయకు - మాటలాడబోవుముందు ఒక్కసారి యోచించు - ఓటు వేయబోవుముందు కొద్దిగ ఆలోచించు - స్నేహితునకు ఇవ్వదగిన బహుమానము కాదు ఓటు - శత్రువైన సరే నీకు! అర్హతున్నవానికేయి - చేతులు కాలిన పిమ్మట ఆకులకై  వెదుకకు - మంచికైన చెడుకైన నీదే బాధ్యత మరువకు -  అర్హుడైన వాని గెలుపు నిజము సుమ్ము నీ గెలుపే"

ఎందుకో మా తరగతిలో చాలామంది నా మాట మన్నించారు. చివరి పాదంలో చెప్పినట్టు జంధ్యాలను గెలిపించారు.               

1973 లో అగ్గిపెట్టె పదిపైసలు

మా పాత డైరీల్లో రాసుకున్న పాత విషయాలు
న్యూ ఇయర్  గిఫ్ట్ లకింద జర్బలిష్టులకు యెంత ఖరీదయిన డైరీలు వచ్చినా వాటిల్లో చాలామంది (వారి భార్యలు) రాసుకునేవి కిరాణా పద్దులే. ఎందుకంటే రాసేదంతా ఆఫీసులోనే రాసి వస్తారు కాబట్టి ఇక సొంత గోల రాసుకోవడానికి ఓపికా వుండదు. రాయడానికి విషయాలు వుండవు.
అలా 1973 లో మార్చి నెల 31  వ తేదీన మా ఆవిడ డైరీలో రాసిన ఒక రోజు ఖర్చు చిట్టా ఇది. (అంటే సుమారుగా నలభయ్ ఏళ్ళకిందటి మాట)
నూనె : Rs.3-25
నెయ్యి:Rs. 2-75
పెరుగు: Rs.0-20
టమాటాలు:Rs. 0.55
అగ్గిపెట్టె: Rs. 0.10
సబ్బు: Rs.1-00
రిక్షా: Rs. 0-50
వక్కపొడి పొట్లం: Rs. 0-10
(NOTE: నూనె, నెయ్యి కూడా రోజువారీగా కొని సంసారం నడిపిందేమో తెలవదు. ఎందుకంటే జర్నలిష్టులకు ఇల్లు పట్టదు. అంతా ఐ నో సీ ఎం - ఐ నో పీఎం బాపతు)

24, ఏప్రిల్ 2014, గురువారం

యస్ సర్ నో సర్ - భండారు శ్రీనివాసరావు


ముప్పయ్ అయిదేళ్ళ క్రితం చండప్రచండుడిగా పేరు తెచ్చుకున్న ఒక ముఖ్యమంత్రిగారి పేషీలో  ఎస్.ఆర్. రామమూర్తి గారనే ఐ.ఏ.ఎస్. అధికారి వుండేవారు. చెప్పిన పని వెంటనే చేయకపోయినా, నలుగురిలో వుండగా ఏదయినా ఫైల్ విషయంలో కుదరదని (నో) చెప్పినా ఆయన ఎగిరిపడతారని ఆ అధికారికి బాగా తెలుసు. అందుకని ఎవరయినా పనిమీద సీఎంని కలిసి ఏదయినా అడిగితె,  అప్పటికి 'యస్ సర్' అనేవారు. తరువాత ఆ ఫైల్ సీఎం పేషీకి   వచ్చినప్పుడు ఎవరూ లేకుండా చూసి దాన్ని యెందుకు ఆమోదించకూడదో వివరంగా చెప్పి 'నో సర్' అంటూ 'నో'  చెప్పేవారట. అందులో విషయం వుందని అర్ధం చేసుకున్న ముఖ్యమంత్రి కూడా మారుమాట లేకుండా ఆ అధికారి చెప్పిన దాన్ని వొప్పుకునేవారట. అందుకని (ఎస్సార్ ) రామమూర్తి గారిని తోటి అధికారులు 'ఎస్ సర్ రామమూర్తి', 'నో సర్ రామమూర్తి' అనేవారట. (తదనంతర కాలంలో రామమూర్తి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు)    

23, ఏప్రిల్ 2014, బుధవారం

"రెండు నిమిషాలు నాకు దానం ఇవ్వండి"

పరమాచార్య పావన గాధలు - భండారు పర్వతాలరావు


"మీరందరూ నా వద్దకు అనేక కానుకలు తీసుకువస్తున్నారు. పుష్పఫలాదులు తెస్తున్నారు. ధనమిస్తున్నారు. వీటిని వేటినీ నేను కోరుకోవడం లేదు.
"దినానికి రెండు నిమిషాలు మాత్రం నాకివ్వండి. ఆ రెండు నిమిషాలు భక్తితో పరమేశ్వరుని ధ్యానించండి. అదే నాకు అత్యంత ప్రీతికరమైన కానుక.
"దినమంతా మీరు లౌకిక వ్యాపారాలతో గడుపుతారు. ఓ రెండు నిమిషాలు ఈ బీద సన్యాసికి దానమివ్వలేరా!
"నాకు కావలసింది అంతే!"
-పరమాచార్య 

21, ఏప్రిల్ 2014, సోమవారం

పరమాచార్య పిడికెడు బియ్యం పధకం

పరమాచార్య పావన గాధలు - భండారు పర్వతాలరావు


"వంట చేయడానికి బియ్యం కడిగేటప్పుడు ఒక పిడికెడు బియ్యం వేరే ఒక పాత్రలో రోజూ వేయండి. అందులో ఒక చిల్లర డబ్బు కూడా వుంచండి. మీ పేటవాసులంతా ఒక సంఘంగా ఏర్పడి అల్లా పోగుపడే బియ్యాన్ని సేకరించండి.మీ పేటలోని ఏ ఆలయంలోనైనా  ఆ బియ్యంతో పేదలకు అన్నదానం చేయండి. చిల్లరడబ్బులను వంట చెరకు, ఇతర  అధరువులు కొనడానికి ఉపయోగించవచ్చు. పిడికెడు బియ్యంతో ఆకలిగొన్న పేదవాడి కడుపు నింపవచ్చు. నిష్కామంగా మీరు చేసే ఈ సేవకు భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది " - కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి అనుగ్రహభాషణ

ఎన్నికల్లో ధన ప్రవాహం - దాని ప్రభావం


ఏ ఛానల్లో చూసినా ఇదే చర్చ. అసలు ఎన్నికల్లో పెట్టే ఖర్చు ఏవిధంగా వుంటుంది. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు, మీటింగులు, రోడ్డు షోలు, జనాల తరలింపులు, పత్రికల్లో టీవీల్లో ప్రకటనల ప్యాకేజీలు, ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు చూసారు అదే వోట్ల కొనుగోళ్ళు. చిత్రం ఏమిటంటే ముందు జాబితాలో  పేర్కొన్న అంశాలపై  పెట్టే ఖర్చుతో పోలిస్తే చివరి ఐటంపై పెట్టేది అంతవుండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాని కాకి గోలంతా దీని గురించే కావడం విచిత్రం.


ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు చివరివీ కావు ఇవే మొదటివీ కావు. నిజం చెప్పాలంటే మన రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుంచీ ఏవో ఎన్నికలు జరుగుతూనే వున్నాయి. ప్రతి ఎన్నికలో ఈ డబ్బు ప్రసక్తి వస్తూనే వుంది. వోటు అమ్ముకోవద్దు అనే నీతి వాక్యాలు ప్రతిసారీ వినబడుతూనే వున్నాయి. అదేదో సినిమా పాటలో చెప్పినట్టు 'మీలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి' అన్నట్టు, పైకి ఒప్పుకోకపోయినా,  ప్రతి పార్టీ వోట్ల కోనుగోలు విషయంలో ఎంతో కొంత ఖర్చు చేస్తూనే వస్తోంది.
వోటు కొనుగోలు అంటే అర్ధం ఏమిటి? డబ్బు తీసుకున్నవాడు దానికి ప్రతిఫలంగా డబ్బు ఇచ్చిన అభ్యర్దికో లేదా పార్టీకో వోటు వేయడం. అలా జరిగితే అందరూ గెలవాలి కదా! కొందరే యెందుకు గెలుస్తున్నారు. అంటే అర్ధం ఏమిటన్న మాట. ఓటుకు ఇంత అని డబ్బు తీసుకున్న ఓటరు కూడా తనకు నచ్చినవాడికే ఓటు వేస్తున్నాడు అనుకోవాలి. లేకపోతే ఎమర్జెన్సీ తరువాత ఇందిరా గాంధి ఓడిపోయేదా! ఆ తరువాత గద్దె ఎక్కిన జనతా పార్టీ కుమ్ములాటల్లో చిక్కుకుని వున్నప్పుడు వచ్చిన ఎన్నికల్లో యెందుకు ఓడిపోయింది. ఎన్టీయార్ తెలుగుదేశం ఇందిరా ప్రభంజనాన్ని అడ్డుకుని గెలవకలిగి వుండేదా! ఆ తరువాత కొన్నేళ్లకు అదే ఎన్టీయార్ పరాజయాన్ని యెలా మూటగట్టుకున్నారు.  ఓడించిన ప్రజలతోనే తిరిగి కిరీటం యెలా పెట్టించుకోగలిగారు. చంద్రబాబు, వాజ్ పాయ్ కాంబినేషన్ కు  జనం బ్రహ్మరధం యెలా పట్టారు. తరువాత పదేళ్లు తిరక్కముందే వారిని యెలా తిప్పికొట్టారు. ఓటర్లు కేవలం డబ్బుకు ప్రలోభపడి వుంటే ఇవన్నీ సాధ్యం అయివుండేవా!
దీనర్ధం ఓట్ల  కొనుగోలును సమర్ధిస్తున్నట్టు ఎంతమాత్రం కాదు. ఎన్నికల్లో ధన ప్రవాహం వుండొచ్చు కానీ దాని ప్రభావం ఎన్నికల ఫలితాలమీద వుండకపోవచ్చు అని మాత్రమే!
మనతోపాటు స్వాతంత్రం వచ్చిన అనేక ఇరుగు పొరుగు దేశాల్లో, ఎప్పుడో ఒకప్పుడు, ఎంతో కొంత కాలం ప్రజాస్వామ్యం మరుగున పడి, అవి సైనిక నియంతృత్వ  పాలనలోకి మళ్ళిన దృష్టాంతాలు వున్నాయి. ఒక్క మనదేశంలోనే వోటరు,  ఓటుద్వారా తనకు నచ్చిన వారికి పట్టం కడుతున్నాడు. నచ్చకపోతే గద్దె నుంచి దింపుతున్నాడు. వారిలో ఎక్కువమంది నిరక్ష్యరాస్యులు వుండవచ్చు. కానీ వారి పరిణతి చాలా గొప్పది.
NOTE: Courtesy cartoonist 

20, ఏప్రిల్ 2014, ఆదివారం

అన్యోన్య 'డాం'పత్యం


(మహీధర్ వల్లభనేని గారు ఇంగ్లీష్ లో షేర్ చేసిన దానికి స్వేచ్చానువాదం)
భార్యాభర్తలు ఒక మాట అనుకుని దానిమీద చిత్తశుద్దితో నిలబడితే అన్యోన్య దాంపత్యం అసాధ్యం కాదన్నది ఏకాంబరం అభిప్రాయం.
యెలా అన్నది లంబోదరం సందేహం.
ఇలా అన్నది ఏకాంబరం వివరణ.
పెళ్ళయిన కొత్తల్లోనే ఏకాంబరం ఆయన భార్య ఒక అంగీకారానికి వచ్చేసారు. బాధ్యతలు పద్దతిగా  పంచుకోవాలని. అలా పంచుకున్న వాటిలో రెండో వారి జోక్యం యెంత మాత్రం వుండరాదని.
ఎంతయినా మొగుడు ముండావాడిని  కదా పెద్ద నిర్ణయాలు తనకు వొదిలెయ్యాలని ఏకాంబరం కోరాడు. చిన్న విషాయాలు అన్నీ భార్యకు అప్పచేప్పేసాడు.
'ఏం కొనాలి ఏం తినాలి సెలవుల్లో ఎక్కడికి వెళ్ళాలి  నెలవారీ ఇంటి ఖర్చులు ఎలావుండాలి  పనిమనిషిని పెట్టుకోవాలా అక్కరలేదా ఇలాటి చిన్నాచితకా బాధ్యతలన్నీ భార్యవి.
ఇక-
ఇరాక్ ఇరాన్ యుద్ధం వస్తే ఎవరి పక్షం వహించాలి,  ఎన్నికల తరువాత పొత్తులు అవసరం అయితే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఎవరిని కలుపుకు పోవాలి ఇలాటి కీలక అంశాల్లో ఏకాంబరం చెప్పేదే ఫైనల్. భార్య తాను ఏం చెబితే దానికి వొప్పుకుని తీరాలి'
ఇలా గీసుకున్న గీతను ఇద్దరిలో ఎవ్వరూ దాటకపోవడం వల్ల వారి దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతోందని ఏకాంబరం ఉవాచ 
ప్రలోభమనగానేమి?
"ఓటర్లని ప్రలోభపెడితే ఏడాది జైలు"
వీనుల విందైన మాట చెప్పారు సీ.యీ.సీ. సంపత్ గారు.
ప్రలోభపెట్టడం అంటే పూర్తి వివరణ పత్రికల్లో రాలేదు. అర్ధం అయినంతవరకు అది ఓటర్లని డబ్బుతో ఆకట్టుకోవాలని ప్రయత్నించడం అని బోధపడుతోంది.


అయితే,
'పేద ఆడపిల్లల్ని బడికి పంపిస్తే తల్లి ఖాతాలో నెలనెలా వెయ్యి రూపాయలు'
'ఇరవై వేలకోట్ల రూపాయల డ్వాక్రా రుణాల మాఫీ'
'ఆడపిల్లలందరికీ సెల్ ఫోన్లు'
'ఇంటింటికీ ఉచితంగా ఇరవై లీటర్ల మంచి నీళ్ళు'
'లక్ష రూపాయల వరకు రుణాల రద్దు'
'ఆడపిల్ల పుడితే ఎకరం పొలం'
'రెండు పడక గదుల ఇళ్ళు'
-ఇవన్నీ ప్రలోభాలు కాదా! పైగా వీటికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వ ఖజానా మీద పడేది.
అభ్యర్దులు సొంత డబ్బుతో జనాలను ఆకట్టుకోవడం ప్రలోభమా?
పార్టీలు ప్రజల డబ్బుతో పధకాలు ప్రకటించడం ప్రలోభమా?
విజ్ఞులకే తెలియాలి.

ఎండా వానకు పెళ్ళంట!


ఒక పక్క పెటపెట లాడించే వేసవి ఎండ. మరో పక్క అదేసమయంలో జనం తడిసి ముప్పందుం అయ్యేలా రాజకీయుల వాగ్దాన వర్షాలు.  ఇదీ స్థూలంగా  ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణ పరిస్తితి.


నామినేషన్ల పర్వం ముగియడంతో నేతలు చెలరేగిపోతున్నారు. నోటికి వచ్చిన వాగ్దానాలను జనంమీద జడివానలా కురిపిస్తున్నారు. నరం లేని నాలుకతో కల్లబొల్లి కధలు చెబుతున్నారు. అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. ఈరోజు చెప్పిన మాటలు కనీసం ఈ సాయంత్రానికి గుర్తుంటాయో లేదో ఆ పరాత్పరుడికే ఎరుక.

19, ఏప్రిల్ 2014, శనివారం

మరో బ్రేకొస్తే ఏమవుతుందో!


యాంఖర్ : ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ చర్చాకార్యక్రమం మొదలు పెట్టేముందు, ఈనాడు హాజరయిన అతిధుల్లో పలానా వారు పలానా పార్టీ అని పరిచయం చేసాము. అయితే ఇంతకుముందు బ్రేక్ ఇచ్చిన సమయంలో వారు పార్టీ మారి వేరే పార్టీలో చేరుతున్నట్టు తెలియచేసారు. ఈ మార్పు గమనించ ప్రార్ధన.

తిక్క కుదురుతుంది


"ఎండ పొడ అంటే ఏమిటో తెలియని నాయకులు ఇలా ఎండనపడి తిరుగుతూ, దోవలో బట్టలు ఇస్త్రీ చేస్తూ, మిర్చి బజ్జీలు వేయిస్తూ, కొబ్బరి బోండాలు కొడుతూ, గడ్డాలు చేస్తూ చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ మీడియాలో దర్శనం ఇస్తుంటే ఏమనిపిస్తుంది?"
"నిజంగా నిజం చెప్పమంటారా! ఈ ఎలక్షన్లు ఇలా మరో ఆరునెలలు పెడుతూ పోతే బాగుంటుందని"

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

పరమాచార్య పావనగాధలు

కుర్రవానిలో గురుదర్శనం
(ఆదిశంకరాచార్యుల తరువాత అంతటి భగవదంశ కలిగిన మహానుభావుడు కంచి కామకోటి పీఠానికి 68 వ ఆచార్యుడయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి. 'నడిచే దేవుడి'గా ప్రసిద్దులయిన వారి గురించి మా అన్నయ్య, కీర్తిశేషులు  భండారు పర్వతాలరావు గారు 'పరమాచార్య పావనగాధలు' పేరుతొ ఒక చిరు పొత్తం రచించారు. ఆ పుస్తకం ఆధారంగా అందిస్తున్న పావన గాదాశతి ఇది)


"స్వామినాధన్ తమిళనాడులో దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విలుప్పురం గ్రామంలో 1894 మే 20న జన్మించారు. తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి. తల్లి మహాలక్ష్మి.  స్వామినాధన్ చిన్నతనంలో వారింటికి శాస్త్రి గారి స్నేహితుడు వచ్చారు. వృత్తిరీత్యా న్యాయవాది అయినా ప్రవృత్తిరీత్యా జ్యోతిష్యుడు. పిల్లవాడి  జాతకాన్ని పరిశీలిస్తూ ఆయన,  తల్లిని ఓ చెంబుతో నీళ్ళు తెమ్మని అడిగారు. తెచ్చిన నీళ్ళతో ఆయన,  స్వామినాధన్  కాళ్ళు కడిగి సాష్టాంగ నమస్కారం చేయడం చూసి తలిదండ్రులు నిర్ఘాంతపోయారు. శాస్త్రి గారు ఆశ్చర్యం నుంచి తేరుకుని 'అదేం పని! పెద్దవాడివి నువ్వు. పిల్లవాడిముందు సాగిలపడడం ఏమిటి?' అని మందలిస్తున్నట్టు అన్నారు. అప్పుడా న్యాయవాది నవ్వుతూ, 'నేనెంత! ఈ ప్రపంచం అంతా ఈ చిన్నవాడి పాదాలకు ప్రణమిల్లే రోజు రాబోతోంది. కానీ అప్పటికి నేనుంటానో, వుండనో తెలియదు కదా! అందుకని ఈ రోజే ఆ పనిచేసి తరించా' అన్నాడు.

ఆయన జోస్యమే నిజమయింది.            

ఆ మూడు పత్రికలు


ఆ మూడు పత్రికలను నేను కొని చదువుతాను. గత కొన్ని దశాబ్దాలుగా నాకిది అలవాటు. ఇదే రంగంలో పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న నాకు - ఈరోజు ఒకే వార్తను ఈ పత్రికలు ప్రచురించిన తీరు చూసిన తరువాత ఉదయం లేవగానే అనూచానంగా చేసుకున్న పత్రికాపఠనానికి ఇక స్వస్తి చెప్పటం మంచిదా అనే ఆలోచన కలిగింది. డెబ్బయ్యవ దశకం మొదట్లో నార్ల గారి సంపాదకత్వంలో వెలువడిన నాటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉపసంపాదకుడుగా చేరినప్పుడు గొప్ప వృత్తిలో ప్రవేశిస్తున్నాను అన్న ఆనందంతో వొళ్ళు పులకరించిన మాట వాస్తవం. మరి ఇన్నేళ్ళ తరువాత పత్రికలే చదవకూడదు అన్న నిర్వేదంలోకి యెందుకు జారిపోతున్నట్టు.
సరే! అసలు విషయానికి వద్దాం.
నామినేషన్ల సందర్భంగా అభ్యర్ధులు తమ ఆస్తులు అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్లు సమర్పించడం ఒక నిబంధన. వాటిని ప్రజలకు తెలియచెప్పడం పత్రికల బాధ్యత.  ఈ క్రమంలో శ్రీ చంద్రబాబు నాయుడు, శ్రీ జగన్ మోహన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ల వివరాలను అన్ని పత్రికలు ప్రచురించాయి. కానీ ఈ మూడు పత్రికలు వాటికి తమదైన రీతిలో వ్యాఖ్యానాలను కూడా జతపరిచాయి. ఆ పత్రికలకు ఈనాటి పరిస్థితుల్లో అలాటి సమాచారం ప్రచురించడం ఒక అనివార్యత కావచ్చు. కానీ నా కెందుకో వార్త రూపంలో ఆ పత్రికలు తమ మనసులోని మాటని చెప్పే ప్రయత్నం చేసాయని అనిపించింది.
ఈరోజు తాపీగా ఇంట్లో కూర్చుని నీతులు చెబుతున్నానని అనిపించవచ్చు  కానీ ఎందుకో ఏమిటో నాకది  సబబుగా అనిపించలేదు.

యేమో! నేను కూడా ఏదయినా పత్రికలో పనిచేస్తూ వున్నట్టయితే  ఆ వాలువేగంలో నేనూ కొట్టుకుపోతూ వుండేవాడినేమో! ఎవరికి ఎరుక?            

16, ఏప్రిల్ 2014, బుధవారం

గాలి వార్త


ఇలా అంటున్నారు అలా అనుకుంటున్నారు అని గాలి పోగుచేసి వార్త వండడం ఏరకంగా చూసినా పాత్రికేయ విలువలకు తగినది కాదు. సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా ఈ వృత్తిలో వుంటున్న నాకు ఈ విషయం తెలవంది కాదు. కానీ ఛానల్స్ లో చర్చలకు వెళ్ళినప్పుడు బ్రేక్ సమయంలో ఆయా పార్టీల నాయకులు మాట్లాడుకునే విషయాలు చెవినపడుతుంటాయి. సాధారణంగా ఒక చెవితో  విని రెండో చెవితో వొదిలేయాల్సినవే. నిజమెంతో అబద్ధమెంతో తెలవని విధంగా, నిర్ధారించడానికి ఆధారాలు లేకుండా సాగుతాయి ఈ వూహాగానాలు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల పెట్టే ఖర్చు గురించి అంతా కాకపోయినా కొంతలో కొంతయినా పేపర్లలో వస్తూనే వుంటాయి వివరాలు. ఇప్పుడు మరోరకం పెట్టుబడి వ్యయం గురించి చెప్పాడొకాయన.
"ఇన్నాళ్ళుగా కోట్లు ఖర్చు చేసి  నియోజకవర్గాన్ని  సాక్కుంటూ వచ్చాను. ఇప్పుడు టిక్కెట్టు లేదంటే యెట్లా" అని గొడవ పెట్టుకునే వార్తలు వింటూనే వున్నాం. "ఇదేమన్నా వ్యాపారమా ఇలా ముందస్తు పెట్టుబడులు పెట్టి లాభాలు ఆశించడానికి" అని సామాన్యులు అనుకున్నా వారిని లక్ష్యపెట్టేవాళ్ళు వుండరు. ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా అలాటిదే.

"పొత్తుల్లో సీటు పోయిన ఒకాయన, సీటు దక్కించుకున్న శాల్తీని నువ్వెలా గెలుస్తావో చూస్తాను. ఇండిపెండెంటుగా వేసి నీ అంతు  చూస్తాను" అని పత్రికలకు ఎక్కాడట. "ఇదేమిటి మీ వాడు ఇలా బెదిరిస్తున్నాడు అని అవతల పార్టీ అభ్యర్ధి ఇవతల పార్టీ నాయకుడ్ని ఆశ్రయిస్తే,  'ఏదో సర్దుబాటు చేసుకోవాలి. ఖర్చు అయిందంటున్నాడు కదా ఆ విషయం ఏదో మీరూ మీరూ చూసుకోండి'అని సలహా చెప్పాడట. సర్దుబాటు చేసుకున్నారు  అంటే  కోట్లు చేతులు మారినట్టే అనుకోవాలి. ఇలాటివాళ్ళు  కూడా వుంటారా అంటే వుంటారేమో రాజకీయం అన్నది ఇంత ధనమయం అయినప్పుడు.      

ప్రముఖ అందాల సినీ తార ఇలా చెబుతున్నారు

వార్త :
"పలానా చోట ఒక పార్టీ అభ్యర్దినీ, మరో చోట మరో పార్టీ అభ్యర్దినీ, ఇంకో చోట ఇంకో పార్టీ అభ్యర్దినీ బలపరుస్తాను" టీవీ స్క్రోలింగుల్లో  సినీ నటుడు పవన్ కళ్యాణ్


వ్యాఖ్య :  
ప్రముఖ అందాల సినీ తార ఇలా చెబుతున్నారు
"నేను నా ముఖ సౌందర్యం కోసం లక్స్  టాయిలెట్ సబ్బుని వాడతాను.
"హస్త లావణ్యం కోసం హమామ్ సబ్బుని వాడతాను.
"పాద సౌకుమార్యం కోసం మార్గో సబ్బుని వాడతాను
"మీరూ నాలాగే రకరకాల సబ్బులని రోజూ వాడి చూడండి"  

ఎప్పుడూ ఇంతే!


"మీరేమో ఇలా కంప్యూటర్ దగ్గర కూర్చుని వోటు వెయ్యండి, అది మీ జన్మహక్కు అంటూ మెసేజిలు పెట్టుకుంటూ కూర్చున్నారు. అవతల పుణ్యకాలం దాటిపోయి  పోలింగు టైం కూడా అయిపోయి కూర్చుంది"


(NOTE:COURTESY IMAGE OWNER)

15, ఏప్రిల్ 2014, మంగళవారం

పరిపూర్ణానంద స్వామి అమెరికా పర్యటన




సంస్కృతి సంప్రదాయాలకు కొత్త  భాష్యం చెబుతూ తన అద్భుత ప్రవచనాలతో, కార్యక్రమాలతో యువతీ యువకులను సయితం ఆధ్యాత్మికత వైపు ఆకర్షిస్తున్న శ్రీ పరిపూర్ణానంద స్వామి రేపు ఉదయం బయలుదేరి మూడు మాసాల పర్యటనపై అమెరికా వెడుతున్నారు. రేడియోలో, దూరదర్శన్ లో నా సీనియర్ సహచరులు శ్రీ ఆర్ వీ వీ కృష్ణారావు గారు స్వామి వెంట ఈ విదేశీ పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ లాబ్స్ లో ఈ సాయంత్రం స్వామీజీకి వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు శ్రీ కృష్ణారావు గారు తెలియచేశారు. శ్రీ పీఠం తరపున నిర్మించిన టెలీ సీరియల్ 'గోమాత' ప్రీవ్యూ కూడా వుంటుంది.        

నవ్వో నవ్వకనో వొదిలేయండి!


ఇది కధ కాదు కానీ మొన్నీమధ్య ఓ ఫంక్షన్లో కలిసిన ఓ పెద్దమనిషి చెప్పిన కధ ఇది.
ఆ పెద్దమనిషి గారింటికి ఈ నడుమ ఏదో దేశం నుంచి అక్కడ ఏనాడో సెటిలై పోయిన  మరో తెలుగు పెద్ద మనిషి గారు వచ్చారట. మొదటి రోజు నిద్రలేచేసరికి బయట ఆరుబయట పత్రికలు చదువుతూ కనబడ్డారట. రెండో రోజు ఆయన ధోరణిలో  మార్పు మొదలై మూడో రోజుకల్లా అది విపరీత ప్రవర్తనకింద మారిపోయిందట. ఎందుకిలా అయ్యిందని ఇంటాయన భయపడిపోతుంటే ఇల్లాలు కల్పించుకుని చెప్పిందట.



'నేను మొదట్లోనే చెబుదామనుకున్నాను. ఒకదానితో ఒకటి పొంతనలేని అన్ని తెలుగు పేపర్లు ముందు పడేస్తే ఇలాగే ఏదో అవుతుందని. మనమంటే అలవాటుపడి ముదిరిపోయాము.  కానీ, దేశం కాని దేశం నుంచి వచ్చిన ఈ పెద్దమనిషి ఏం హరాయించుకుంటాడో ఏవిటో అని. నేను  భయపడ్డంతా అయింది. ముందా పేపర్లు తీసి బయట పడేయండి. ఆయనే సర్డుకుంటాడు'     

మరవతగని మనిషి మరుపున పడుతున్నాడా!



యాభయ్ ఐదేళ్ల  పైమాటే. అప్పటికి ఆ పార్టీ పేరు జనసంఘ్. ప్రమిదె గుర్తు. బెజవాడలో ఎన్నికలప్పుడు ఏదో ఒక మూల గోడలమీద ఈ గుర్తు కనబడేది. కానీ జనం గుర్తు పెట్టుకునే వాళ్లు కాదు. ఆరోజుల్లో గాంధీనగరం మునిసిపల్ స్కూలు ఆవరణలో ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన వస్తున్నాడు, సాయంత్రం మీటింగు అంటూ వూళ్ళో టముకు వేసారు. తెలిసీ తెలియని వయసు. అయినా పెద్దవాళ్ళతో కలిసి వెళ్లాను. కాసేపటి తరువాత ఆ వచ్చినాయన మాట్లాడడం మొదలు పెట్టాడు. శుద్ధ హిందీ. ఒక్కరికీ అర్ధం అయినట్టు లేదు. మాటల జడివాన మొదలయింది. పిడుగులు పడ్డట్టుగా ప్రసంగం సాగింది. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా స్పీచ్ అంటే ఇలా వుండాలి అని అనిపించింది. వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆయనకు అప్పటికప్పుడే అభిమానులు అయిపోయారు. ఆయన ఎవరో కాదు, తదనంతర కాలంలో దేశానికి అయిదేళ్ళు సుస్తిర పాలన అందించిన ప్రధాని వాజ్ పాయ్.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సర్వేలు, రాజకీయ విశ్లేషకులు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపు తధ్యం అని కోడై కూస్తున్న సమయంలో ఒకనాడు అ పార్టీకి పెద్దదిక్కు అయిన వాజ్ పాయ్ ఇప్పుడు ఎక్కడ వున్నారు, యెలా వున్నారు అన్నది జనంలో చాలామందికి తెలియని విషయం.  తెలుసుకుంటే మరింత బాధ కలిగించే ఈ సంగతులను గత నెలలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రచురించింది. ఆ కధనాన్ని సంక్షిప్తం చేస్తే:
ఢిల్లీ లోని అశోకా రోడ్డులో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం వుంది. ఎప్పుడూ నాయకులు, కార్యకర్తలతో సందడిగా వుండే ఆ ప్రదేశానికి అయిదే అయిదు నిమిషాల నడక దూరంలో కృష్ణ మీనన్ మార్గ్ లోని ఓ  బంగ్లా  ఎస్పీజీ కాపలాలో కానవస్తుంది. అందులోకి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. బయటకు వచ్చేవాళ్ళు అంతే. నీరవ నిశ్శబ్ధం తాండవించే ఆ భవనంలో చక్రాల కుర్చీలో కూర్చుని ఒక వృద్ధుడు టీవీలో వార్తలు చూస్తూ, పత్రికల్లో ప్రధాన శీర్షికలు చదువుతూ కానవస్తారు. తన వాగ్దాటితో ప్రత్యర్ధులను ఆకట్టుకున్న ఒకనాటి నేత వాజ్ పాయ్ ఆయనే అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే.
ఆయన ఏదో కష్ట జీవితం గడుపుతున్నారని కాదు కానీ ఆయన  ప్రస్తుత జీవన శైలి గమనించినప్పుడు ఎవరికయినా మనసు కష్టపడుతుంది.



వాజ్ పాయ్ కవితలు రాస్తారు. వాటిని వినడానికి ఒకప్పుడు పార్టీ నాయకులు ఎగబడేవారు. ఇప్పుడు ఆ ఇంటి గడప తొక్కేవారే కరువయ్యారు. క్రమం తప్పకుండా వచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు వాజ్  పాయ్ కి అరవై ఏళ్ళుగా తెలిసిన ఎన్ ఎం గటాతే కాగా మరొకరు బీజేపీ మూలస్థంభాల్లో ఒకరయిన ఎల్ కే అద్వానీ.   పార్టీ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయిన బీ సీ ఖండూరీ కూడా అప్పుడప్పుడు వచ్చి వాజ్ పాయ్ ఆరోగ్యం గురించి ఆయన కుమార్తెను అడిగి తెలుసుకుంటూ వుంటారు. పోతే, మాజీ ప్రధాని జన్మదినాన్ని గుర్తుపెట్టుకుని వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి వెళ్ళే వ్యక్తి మరొకరు వున్నారు. ఆయనే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్.
వారానికి ఒకటి రెండు సార్లు వచ్చి వెళ్ళే ఆయన స్నేహితుడు గటాతే  చెప్పేదాని  ప్రకారం ప్రస్తుతం వాజ్ పాయ్ రోజువారీ దినచర్యలో  ఎక్కువ సమయం ఫిజియో తెరపిష్టులతో గడిచిపోతుంది. మాట సరిగా రాకపోవడం వల్ల సంభాషణల్లో పాలుపంచుకోలేరు. పత్రికలు చదవరు కానీ హెడ్ లైన్స్ తిరగేస్తారు.
భాష అర్ధం కాని  వారిని సయితం  తన వాగ్ధాటితో కట్టిపడేసిన ఆయనకు మాట పడిపోవడం ఏమిటో విధి వైచిత్రం కాకపొతే.

(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)

14, ఏప్రిల్ 2014, సోమవారం

ఇంకేం కావాలి సాక్ష్యం ?


'ఓటుకు నోటు తీసుకున్నా కేసు' - రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ( ఈరోజు ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ రెండో పేజీలో వార్త. ఆపక్కనే 'డబ్బులిస్తూ దొరికిపోయారు' అంటూ ఫోటోతో సహా మరో వార్త. మరి భన్వర్ లాల్  ఏంచేస్తారో చూడాలి)




పాత విన్నపమే మరో సారి : నేను సాధారణంగా పార్టీలు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించను. ఒక వార్త వచ్చినప్పుడు దానిపై వ్యాఖ్యకు మాత్రమే నా స్పందన పరిమితం. భన్వర్ లాల్ గారు నోటు తీసుకున్నా కేసు పెడతాం అన్నారు. ఇక్కడ ఇస్తున్న వారితో పాటు తీసుకున్నవారు కూడా చిత్రంలో వున్నారు.పైగా ఎక్కడ అన్నది కూడా వార్తలోనే తెలియచేసారు. ఇంత స్పష్టంగా వున్నప్పుడు ఒక్క కేసుని స్పెసిమన్ గా తీసుకుని చర్య తీసుకుంటే మళ్ళీ ఇలాటి వార్తలు, ఫోటోలు పత్రికల్లో చూసే దుస్తితి తప్పుతుందన్నది మాత్రమే నా ఉద్దేశ్యం.



సొరకాయల కొరత

ఇప్పుడే అందిన వార్త


వివిధ ప్రధాన రాజకీయ పక్షాలు తమ తమ ఎన్నికల ప్రణాలికలను విడుదల చేసిన నేపధ్యంలో రాష్ట్రంలో సొరకాయలకు విపరీతమైన కొరత ఏర్పడినట్టు మార్కెట్ వర్గాలు తెలియచేస్తున్నాయి.

13, ఏప్రిల్ 2014, ఆదివారం

మా మేనల్లుడు చెప్పిన మా బావగారి కధ


మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు గారు. ఖమ్మం జిల్లా రెబ్బవరం కాపురస్తులు. కొద్దికాలం అస్వస్థులుగా వుండి కన్ను మూశారు. గతించి కూడా చాలా కాలం అయ్యింది. స్వాతంత్రోద్యమ కాలంలో పద్నాలుగు మాసాలకు పైగా కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు కూడా ఆయనతో పాటే జైల్లో వున్నారు. ఈ ఇద్దరు గర్భంతో వున్న భార్యలను పుట్టింట్లో (అంటే మా వూర్లో మా అమ్మానాన్నల వద్ద వొదిలి) దేశం కోసం జైలుపాలయ్యారు. సరే! అది అలా వుంచితే -
ఈరోజు బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో మా మేనల్లుడు అంటే రామచంద్ర రావుగారి కుమారుడు ఓ వృత్తాంతం చెప్పాడు. మా బావగారు సుస్తీ చేసి ఆసుపత్రిలో వున్నప్పుడు ఆయన్ని అడిగాడట. 'నాన్నా! మీలాటివాళ్ళు లక్షల మంది నానా కష్టాలు పడితే ఈ స్వాతంత్రం వచ్చింది. మీరు నిజంగా కోరుకున్నది ఇలాటి దేశాన్నేనా'
ఆయన ఇలా జవాబు చెప్పారట.


(కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు)


'స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో  నెహ్రూ గారు ఆంధ్రాలో ఓ మీటింగులో మాట్లాడడానికి వచ్చారు. ఖమ్మం నుంచి నలభై యాభయ్ మంది బయలుదేరి రైల్వే స్టేషన్ కు వెళ్లాము. టిక్కెట్లు కొనడానికి వెడితే అక్కడి స్టేషన్ మాస్టారు అన్నారట నెహ్రూ గారి మీటింగుకు టిక్కెట్లు ఎందుకండీ అని. బహుశా ఆరోజు గట్టిగా కాదుకూడదు అని గట్టిగా వాదించి వుంటే దేశం ఈనాడు ఈ స్తితిలో వుండేదికాదేమో!  ఫ్రీ ఇండియా అంటే  జనాలకు  అన్నీ ఫ్రీ అనే భావన ప్రబలేది కాదు. ఇది మనదేశం దీని లాభనష్టాలన్నీ  మనవే అన్న అభిప్రాయం బలపడకుండా పోయింది. మేము కోరుకున్న దేశం ఇదా అంటే ఇది కాదని చెప్పగలను కానీ కోరుకున్న ఆ దేశం యెలా వస్తుందో, ఎప్పుడూ వస్తుందో  మాత్రం చెప్పలేను. బహుశా నేనయితే చూస్తానన్న ఆశలేదు'

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

వాహ్వ్

జంపుజిలానీల మీద, పార్టీ మార్పిళ్ళ మీద, తిరుగుబాటు అభ్యర్ధుల మీద  అనేకానేక జోకులు, కార్టూన్లు వస్తున్నాయి. వాటిల్లో ఉత్తమం అనతగ్గ ఓ కార్టూన్ ఈరోజు ఆంధ్ర జ్యోతిలో వచ్చింది. కార్టూనిష్ట్ 'సరసి' గారికి ధన్యవాదాలతో-