కంచి పరమాచార్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కంచి పరమాచార్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, మార్చి 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (285) : భండారు శ్రీనివాసరావు

‘జిహ్వాగ్రే మిత్ర బాంధవావః జిహ్వాగ్రే బంధన ప్రాప్తి: జిహ్వాగ్రే మరణం ధృవం’ అన్నారు. జిహ్వ అంటే నాలుక. ఇక్కడ నాలుక అంటే మాట. మాట వల్లనే స్నేహాలు, బాంధవ్యాలు. మాటను బట్టే మరణం కూడా. మాటకు వున్న అసలు శక్తి ఇది. సంచలనాలు సృష్టించడం కాదు.
అందుకనే అంటారుకదా! నోరా వీపుకు తేకే అని.
మొన్న ఉగాది పండుగ రోజున మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారింటికి భోజనానికి వెళ్లాను. మా అన్నగారి ముగ్గురు పిల్లలు, కోడళ్ళు, మనుమరాళ్ళతో, ఇల్లంతా పండగ సందడి. పెద్ద కోడలు, మేనకోడలు కూడా అయిన రేణు సుధ స్వయంగా చేసిన వంటలు, పిండి వంటలతో మృష్టాన్న భోజనం సరే సరి.
సరే! ఇవన్నీపండగ పూట అందరిండ్లలో మామూలే.
భోజనాల అనంతరం మా అన్నయ్య ఎప్పటివో పాత సంగతులు చెప్పుకు వచ్చారు. ఆయన ధారణ శక్తి గొప్పది.
మాటల్లో నడిచే దేవుడిగా ప్రసిద్ధి చెందిన కంచి పరమాచార్య స్వామి వారి ప్రసక్తి వచ్చింది. వారిని దర్శించి పాద నమస్కారం చేసుకునే అదృష్టం తనకు ఒకసారి అనుకోకుండా దక్కిందని చెప్పారు.
స్టేట్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ గా బ్యాంక్ పనిమీద వెళ్లి కారులో హైదరాబాదు తిరిగి వస్తుండగా, కర్నూలు దగ్గర రోడ్డు పక్కన పొలాల మధ్య కొన్ని చిన్న చిన్న గుడారాలు కనిపించాయి. ఆరా తీస్తే కంచి పరమాచార్య వారు పరివారంతో అక్కడ బస చేస్తున్నారని తెలిసింది. మార్గమధ్యంలో సంధ్యా సమయానికి అనుష్టానాలు ముగించుకోవడానికి బావి సౌకర్యం వున్న ఏదైనా ప్రదేశం వద్ద ఆగి అక్కడే బస చేయడం ఆనవాయితీ. రెండు మూడు పెట్రోమాక్స్ లైట్లు మినహా పూర్తి నిర్మానుష్య ప్రదేశంలో ఒక చిన్న పాక వంటి టెంటులో అంతటి మహానుభావుడు బస చేయడం మా అన్నగారికి చాలా ఆశ్చర్యం కలిగించింది. కంచి పీఠానికి వున్న ఆస్తిపాస్తులతో పోల్చి చూసుకుంటే ఆయన అంత నిరాడంబరంగా వుండడం మామూలు విషయం కాదు.
ఆ రాత్రి కర్నూలులో వుండిపోయి మరునాడు, స్వామివారి చాతుర్మాస్యమండల దీక్ష మొదలవుతుంది కనుక అ రాత్రి కర్నూలులో వుండి స్వామి వారి దర్శనం చేసుకుని వెడితే బాగుంటుందని బ్యాంకు అధికారి ఒకరు చెప్పడంతో మా అన్నగారు అలాగే అని మరుసటి ఉదయం స్వామి దర్శనం చేసుకున్నారు. పాద నమస్కారం చేసుకున్నారు.
స్వామివారి నిరాడంబరత, వాగాడంబరం లేని ఆయన ప్రవచనాలు, మెల్లగా, మృదువుగా మాట్లాడే తీరు ఇవన్నీ తనను బాగా ఆకట్టుకున్నాయని, స్వామివారిపై గౌరవ ప్రతిపత్తులు రెట్టింపు అయ్య్యాయని గుర్తు చేసుకున్నారు.
తదుపరి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి (ఇప్పుడు లేరు ) వారి తరువాత పీఠం అధిష్టించాల్సిన విజయేంద్ర సరస్వతి స్వామి కూడా పరమాచార్య వెంట వున్నారు. అప్పటికి ఆయన వయసులో చాలా చిన్నవారు. పసితనపు ఛాయలు వీడని వయసు. కానీ అసాధారణ ధారణ శక్తి. దీన్ని మా అన్నయ్య కళ్ళారా చూసారు. పెద్ద స్వామి వారు సుదీర్ఘమైన సంస్కృత శ్లోకాలను, వేద పనసలను మంద్ర స్థాయిలో మెల్లగా చదువుతుంటే, వాటిని మననం చేసుకుంటూ ఆ బాల స్వామి అప్పటికప్పుడే ఏమాత్రం తొట్రు పడకుండా, స్పష్టంగా వల్లెవేయడం గమనించి అక్కడి జనం నివ్వెరపోయారు. నాటి బాలస్వామే నేటి కంచి పీఠాధిపతి.
మరునాడు హైదరాబాద్ వస్తుంటే, మార్గమధ్యంలో మరో పీఠాధిపతి వాహన శ్రేణి ఎదురుపడింది. ఆ వాహనానికి ముందు పలానా పీఠం అనే పెద్ద బోర్డు, ముందూవెనుక పతాకాలతో పటాటోపంగా అనేక వాహనాలు.
ఇదీ వరుస.
“సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తి:”
మంచి మనసున్న మనుషులతో సాంగత్యం మనసుపై మంచి సానుకూల ప్రభావం చూపుతుంది. ఆది శంకరాచార్యులు తన భజగోవింద స్త్రోత్రంలో చెప్పిన ఈ శ్లోకం అంతరార్ధం ఇదే.
మంచి భోజనం చేసి, మంచి మాటలు విని ఇంటికి చేరి టీవీ పెడితే రకరకాల ఛానళ్ళలో రకరకాల ప్రోగ్రాములు, ఉగాది పంచాంగ శ్రవణాల పునః ప్రసారాలు. వాగాడంబర విన్యాసాలు. ఎప్పుడో ఏడాది రెండేళ్ల క్రితం ఒక ప్రవచన కర్త నోటివెంట వెలువడిన పలుకులపై విమర్శలు, ప్రతి విమర్శలు.
శంకరభగవత్పాదులు చెప్పిన దేమిటి? జరుగుతున్నదేమిటి?
మాటకు వున్న ‘పవర్’ ఏమిటో నేటి తరం రాజకీయ నాయకులకు బాగా తెలుసు. మాటను ఎలా తిప్పి ఒదిలితే అది మీడియా దృష్టిని ఆకట్టుకుంటుందో వారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ నడుమ సక్సెస్ మీట్ల పేరుతో, సినీ జనం నిర్వహించే కార్యక్రమాల్లో కూడా నలుగురు వింటున్నారని, చూస్తున్నారనే సోయ లేకుండా సినీ నటులు చేస్తున్న వికృత వ్యాఖ్యలు ఈ కోవలోకే చేరుతున్నాయి. వారి పలుకులు ములుకుల్లా మీడియాలో పేలాలి. పేలుడు ఫలితాలు వారికి అక్కరలేని విషయం. ఇదీ ఇప్పటి లోకం తీరు.
‘వెలది, జూదంబు, పానంబు, వేట,పలుకు ప్రల్లదనం’ అంటూ ‘చేయకూడని’ కార్యాల జాబితాలో కూడా ‘చెడు పలుకు’ను చేర్చింది అందుకే.
అంచేత మాట మాట్లాడే ముందే ఆలోచించుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఆలోచించి ప్రయోజనం శూన్యం. జనాన్ని ఆకర్షించడం కోసమో, చమత్కారం కోసమో నోరు తెరిస్తే మాత్రం ఇంతే సంగతులు.

(ఇంకావుంది) 

21, మార్చి 2022, సోమవారం

మహనీయుల హాస్య చతురత – భండారు శ్రీనివాసరావు

చక్కటి హాస్యం ఉద్రిక్తతలను తగ్గిసుంది. వాతావరణాన్ని తేలికచేస్తుంది. అహంకారాన్ని తగ్గించుకోవడానికి చక్కని మార్గం కూడా. మనమీద మనం జోకులు వేసుకుంటూ మనసు చల్లబరచుకుంటే అహం ఉపశమిస్తుంది. హాస్యం, ఆధ్యాత్మికత ఒకదానికొకటి పొసగవని భావించే వారున్నారు కాని ఈ అభిప్రాయం తప్పని చెప్పిన మహర్షులు, మహానుభావులు కూడా వున్నారు. చాలామంది మహనీయులు తాము బోధించేది సామాన్య జనాలకు సులభంగా అర్ధం కావడానికి హాస్యం రంగరించి మరీ చెప్పేవారు. కంచి పరమాచార్య, రమణ మహర్షి, స్వామి చిన్మయానంద, దయానంద సరస్వతి మొదలయిన సద్గురువుల సంభాషణల్లో, అనుగ్రహభాషణల్లో హాస్యం చిప్పిల్లుతూ వుండేది.

ఓసారి చెన్నైలో గీతాజ్ఞాన యజ్ఞం నిర్వహించడానికి సరయిన ప్రదేశాన్ని ఎంపికచేసే ప్రయత్నంలో వున్నారు స్వామి చిన్మయానంద. ఆ నగరంలో అనేక దేవాలయాలు వున్నా, ఎక్కడా కూడా గీతాజ్ఞానయజ్ఞం నిర్వహణకు వీలుపడలేదు. ఆ సమయంలో ఈ యజ్ఞం నిర్వహణకోసం ఖాళీగా పడివున్న తన బంగళాను ఇవ్వడానికి ఒకరు సిద్ధపడ్డారు. కాకపొతే అతడు మహమ్మదీయుడు. ఆ బంగళాను చాలాకాలం ఖాళీగా వుంచడానికి కారణాన్ని కూడా అతడు ముందే చెప్పేసాడు. ‘దెయ్యాలు కాపురం వుండడం వల్లె దాన్ని పాడుపెట్టడం జరిగింద’న్నాడు. దానికి స్వామి ఇలా అన్నారు. “అలాగా! నేను ఇన్నాళ్లబట్టి దెయ్యాలను గురించి వినడమే కాని ఎన్నడూ చూడలేదు. ఇన్నాల్టికి వాటిని చూసే అవకాశం లభించింది. పదండి పోదాం”

రమణ మహర్షి ప్రతిరోజూ ఉదయం వేళల్లో అరుణాచలం కొండవరకు నడిచివెళ్ళేవారు. ఒకరోజు అలా వొంటరిగా నడిచివెడుతున్న మహర్షిని దారినవెడుతున్న ఒక వ్యక్తి గమనించాడు. అతడు ఎన్నాళ్ళనుంచో మహర్షి దర్శనం కోసం తహతహలాడిపోతున్నాడు. అందుకని వేగంగా నడిచి మహర్షిని దాటుకుని వెళ్ళి ఆయన మార్గానికి అడ్డంగా నిలబడి “ ఈరోజు యెంత పుణ్యం చేసుకున్నానో నాకు మీరు దర్శనం అనుగ్రహించారు. జన్మ ధన్యం అయింది స్వామీ” అని ఏదేదో చెబుతుండగా రమణ మహర్షి అతడ్ని వారించి ఇలా అన్నారుట, “ నేను నీకు దర్శనం ఇవ్వడం ఏమిటి? నువ్వే నా ఎదుట నిలబడి నాకు నీ దర్శనం అనుగ్రహించావు”

స్వామి దయానంద సరస్వతి మాటల్లో కూడా చక్కని హాస్యం ఉట్టిపడుతుండేది. ఆయన ఒకరోజు తన శిష్యులకు ఓ కధ చెప్పారు. “ ఓ డాక్టరు గారు తన పేషెంట్లలో ముగ్గురి పరిస్తితి బాగాలేదని, వారికి రోజులు దగ్గర పడ్డాయని గ్రహించి వారితో వున్న విషయం చెప్పి ఆఖరి కోరికలు ఏమన్నా వుంటే చెప్పమని అడిగాడు. మొదటివాడు చనిపోయేలోగా దైవ దర్శనం చేసుకోవాలని కోరాడు. రెండో వాడు తన కుటుంబ సభ్యులను చూడాలనివుందన్నాడు. వారికి సరే అని చెప్పి డాక్టర్ మూడో అతడ్ని వాకబు చేసాడు.

వేరే డాక్టర్ కి నన్ను చూపించండి” అన్నది అతగాడి సమాధానం.

కంచి పరమాచార్య వద్దకు ఒక పండితుడు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు. భగవద్గీత ప్రవచనంలో తనకు అద్భుతమైన అనుభవం వుందనీ, పది రోజులపాటు గీతను బోధించడానికి ఏదైనా స్థానిక దేవాలయంలో వసతి కలిపిస్తే తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తానని చెప్పాడు. స్వామి అలాగే అన్నారు. మొదటి రోజు సుమారు యాభై మంది దాకా ఆయన ఉపన్యాసం వినడానికి వచ్చారు. మరునాడు సగం తగ్గిపోయారు. మూడో నాడు వచ్చిన జనం వేళ్ళమీద లెక్కబెట్టే విధంగా అతితక్కువగా వున్నారు. ఆ పండితుడు పరమాచార్యను కలిసి చెప్పాడు. “ఏమి కాంచీపురం అండీ ఇది. ఇంతకష్టపడి భగవద్గీతను చెబుదామని వస్తే మొదటి రోజు పట్టుమని యాభై మంది కూడా రాలేదు. మర్నాడు ఇంకా పలచపడ్డారు. వరస చూస్తుంటే రేపు ముగ్గురు కూడా వచ్చేట్టు లేరు.”

స్వామి మందహాసం చేసి ఇలా అన్నారు. “నువ్వు అదృష్టవంతుడవే! కృష్ణ పరమాత్మ భగవద్గీత బోధించినప్పుడు వినడానికి వున్నది వొకే వొక్కడు. అందుకు సంతోషించు” 

NOTE: Courtesy Image Owner

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

పరమాచార్య పావనగాధలు

కుర్రవానిలో గురుదర్శనం
(ఆదిశంకరాచార్యుల తరువాత అంతటి భగవదంశ కలిగిన మహానుభావుడు కంచి కామకోటి పీఠానికి 68 వ ఆచార్యుడయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి. 'నడిచే దేవుడి'గా ప్రసిద్దులయిన వారి గురించి మా అన్నయ్య, కీర్తిశేషులు  భండారు పర్వతాలరావు గారు 'పరమాచార్య పావనగాధలు' పేరుతొ ఒక చిరు పొత్తం రచించారు. ఆ పుస్తకం ఆధారంగా అందిస్తున్న పావన గాదాశతి ఇది)

"స్వామినాధన్ తమిళనాడులో దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విలుప్పురం గ్రామంలో 1894 మే 20న జన్మించారు. తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి. తల్లి మహాలక్ష్మి.  స్వామినాధన్ చిన్నతనంలో వారింటికి శాస్త్రి గారి స్నేహితుడు వచ్చారు. వృత్తిరీత్యా న్యాయవాది అయినా ప్రవృత్తిరీత్యా జ్యోతిష్యుడు. పిల్లవాడి  జాతకాన్ని పరిశీలిస్తూ ఆయన,  తల్లిని ఓ చెంబుతో నీళ్ళు తెమ్మని అడిగారు. తెచ్చిన నీళ్ళతో ఆయన,  స్వామినాధన్  కాళ్ళు కడిగి సాష్టాంగ నమస్కారం చేయడం చూసి తలిదండ్రులు నిర్ఘాంతపోయారు. శాస్త్రి గారు ఆశ్చర్యం నుంచి తేరుకుని 'అదేం పని! పెద్దవాడివి నువ్వు. పిల్లవాడిముందు సాగిలపడడం ఏమిటి?' అని మందలిస్తున్నట్టు అన్నారు. అప్పుడా న్యాయవాది నవ్వుతూ, 'నేనెంత! ఈ ప్రపంచం అంతా ఈ చిన్నవాడి పాదాలకు ప్రణమిల్లే రోజు రాబోతోంది. కానీ అప్పటికి నేనుంటానో, వుండనో తెలియదు కదా! అందుకని ఈ రోజే ఆ పనిచేసి తరించా' అన్నాడు.

ఆయన జోస్యమే నిజమయింది.            

7, జూన్ 2013, శుక్రవారం

మహర్షుల హాస్య చతురత

చక్కటి హాస్యం  ఉద్రిక్తతలను తగ్గిసుంది. వాతావరణాన్ని తేలికచేస్తుంది. అహంకారాన్ని తగ్గించుకోవడానికి చక్కని మార్గం కూడా.   మనమీద మనం జోకులు వేసుకుంటూ మనసు చల్లబరచుకుంటే అహం ఉపశమిస్తుంది. హాస్యం, ఆధ్యాత్మికత ఒకదానికొకటి పొసగవని భావించే వారున్నారు కాని ఈ అభిప్రాయం తప్పని చెప్పిన మహర్షులు, మహానుభావులు కూడా వున్నారు. చాలామంది మహనీయులు తాము  బోధించేది సామాన్య జనాలకు  సులభంగా అర్ధం కావడానికి హాస్యం రంగరించి మరీ చెప్పేవారు. కంచి పరమాచార్య, రమణ మహర్షి, స్వామి చిన్మయానంద, దయానంద సరస్వతి మొదలయిన సద్గురువుల సంభాషణల్లో, అనుగ్రహభాషణల్లో హాస్యం చిప్పిల్లుతూ వుండేది.
ఓసారి చెన్నైలో గీతాజ్ఞాన యజ్ఞం నిర్వహించడానికి సరయిన ప్రదేశాన్ని ఎంపికచేసే ప్రయత్నంలో వున్నారు స్వామి చిన్మయానంద. ఆ నగరంలో  అనేక దేవాలయాలు వున్నా, ఎక్కడా కూడా గీతాజ్ఞానయజ్ఞం నిర్వహణకు వీలుపడలేదు. ఆ సమయంలో  ఈ యజ్ఞం నిర్వహణకోసం  ఖాళీగా పడివున్న  తన బంగళాను ఇవ్వడానికి ఒకరు సిద్ధపడ్డారు. కాకపొతే అతడు మహమ్మదీయుడు. ఆ బంగళాను చాలాకాలం ఖాళీగా వుంచడానికి కారణాన్ని కూడా  అతడు ముందే చెప్పేసాడు. ‘దెయ్యాలు కాపురం వుండడం వల్లె దాన్ని పాడుపెట్టడం జరిగింద’న్నాడు. దానికి స్వామి ఇలా అన్నారు. “అలాగా! నేను ఇన్నాళ్లబట్టి దెయ్యాలను గురించి వినడమే కాని ఎన్నడూ చూడలేదు. ఇన్నాల్టికి వాటిని చూసే అవకాశం లభించింది. పదండి పోదాం”
రమణ మహర్షి ప్రతిరోజూ ఉదయం వేళల్లో అరుణాచలం కొండవరకు నడిచివెళ్ళేవారు. ఒకరోజు అలా వొంటరిగా నడిచివెడుతున్న మహర్షిని దారినవెడుతున్న ఒక వ్యక్తి గమనించాడు. అతడు ఎన్నాళ్ళనుంచో మహర్షి దర్శనం కోసం తహతహలాడిపోతున్నాడు. అందుకని వేగంగా నడిచి మహర్షిని దాటుకుని వెళ్ళి ఆయన మార్గానికి అడ్డంగా నిలబడి “ ఈరోజు యెంత పుణ్యం చేసుకున్నానో నాకు మీరు దర్శనం అనుగ్రహించారు. జన్మ ధన్యం అయింది స్వామీ” అని ఏదేదో చెబుతుండగా రమణ మహర్షి  అతడ్ని వారించి ఇలా అన్నారుట, “ నేను నీకు దర్శనం ఇవ్వడం ఏమిటి? నువ్వే నా ఎదుట నిలబడి నాకు నీ దర్శనం అనుగ్రహించావు” 
స్వామి దయానంద సరస్వతి మాటల్లో కూడా చక్కని హాస్యం ఉట్టిపడుతుండేది. ఆయన ఒకరోజు తన శిష్యులకు ఓ కధ చెప్పారు. “ ఓ డాక్టరు గారు తన  పేషెంట్లలో ముగ్గురి పరిస్తితి బాగాలేదని, వారికి రోజులు దగ్గర పడ్డాయని గ్రహించి వారితో వున్న విషయం చెప్పి ఆఖరి కోరికలు ఏమన్నా వుంటే చెప్పమని అడిగాడు. మొదటివాడు చనిపోయేలోగా దైవ దర్శనం చేసుకోవాలని కోరాడు. రెండో వాడు తన కుటుంబ సభ్యులను చూడాలనివుందన్నాడు. వారికి సరే అని చెప్పి డాక్టర్ మూడో అతడ్ని వాకబు చేసాడు.
“వేరే డాక్టర్ కి నన్ను చూపించండి” అన్నది  అతగాడి సమాధానం.
కంచి పరమాచార్య వద్దకు ఒక పండితుడు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు. భగవద్గీత ప్రవచనంలో తనకు అద్భుతమైన అనుభవం వుందనీ,  పది రోజులపాటు గీతను బోధించడానికి ఏదైనా స్థానిక దేవాలయంలో వసతి కలిపిస్తే తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తానని చెప్పాడు.  స్వామి అలాగే అన్నారు. మొదటి రోజు సుమారు యాభై మంది దాకా ఆయన ఉపన్యాసం వినడానికి వచ్చారు.  మరునాడు సగం తగ్గిపోయారు. మూడో నాడు వచ్చిన జనం వేళ్ళమీద లెక్కబెట్టే విధంగా అతితక్కువగా వున్నారు.  ఆ పండితుడు పరమాచార్యను కలిసి చెప్పాడు. “ఏమి కాంచీపురం అండీ ఇది. ఇంతకష్టపడి భగవద్గీతను చెబుదామని వస్తే మొదటి రోజు పట్టుమని యాభై  మంది కూడా రాలేదు. మర్నాడు ఇంకా పలచపడ్డారు. వరస  చూస్తుంటే రేపు ముగ్గురు  కూడా వచ్చేట్టు లేరు.”

స్వామి  మందహాసం చేసి ఇలా అన్నారు. “నువ్వు అదృష్టవంతుడవే! కృష్ణ పరమాత్మ భగవద్గీత బోధించినప్పుడు వినడానికి వున్నది వొకే వొక్కడు. అందుకు సంతోషించు” (07-06-2013)