22, మార్చి 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (285) : భండారు శ్రీనివాసరావు


‘జిహ్వాగ్రే మిత్ర బాంధవావః జిహ్వాగ్రే బంధన ప్రాప్తి: జిహ్వాగ్రే మరణం ధృవం’ అన్నారు. జిహ్వ అంటే నాలుక. ఇక్కడ నాలుక అంటే మాట. మాట వల్లనే స్నేహాలు, బాంధవ్యాలు. మాటను బట్టే మరణం కూడా. మాటకు వున్న అసలు శక్తి ఇది. సంచలనాలు సృష్టించడం కాదు.
అందుకనే అంటారుకదా! నోరా వీపుకు తేకే అని.
మొన్న ఉగాది పండుగ రోజున మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారింటికి భోజనానికి వెళ్లాను. మా అన్నగారి ముగ్గురు పిల్లలు, కోడళ్ళు, మనుమరాళ్ళతో, ఇల్లంతా పండగ సందడి. పెద్ద కోడలు, మేనకోడలు కూడా అయిన రేణు సుధ స్వయంగా చేసిన వంటలు, పిండి వంటలతో మృష్టాన్న భోజనం సరే సరి.
సరే! ఇవన్నీపండగ పూట అందరిండ్లలో మామూలే.
భోజనాల అనంతరం మా అన్నయ్య ఎప్పటివో పాత సంగతులు చెప్పుకు వచ్చారు. ఆయన ధారణ శక్తి గొప్పది.
మాటల్లో నడిచే దేవుడిగా ప్రసిద్ధి చెందిన కంచి పరమాచార్య స్వామి వారి ప్రసక్తి వచ్చింది. వారిని దర్శించి పాద నమస్కారం చేసుకునే అదృష్టం తనకు ఒకసారి అనుకోకుండా దక్కిందని చెప్పారు.
స్టేట్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ గా బ్యాంక్ పనిమీద వెళ్లి కారులో హైదరాబాదు తిరిగి వస్తుండగా, కర్నూలు దగ్గర రోడ్డు పక్కన పొలాల మధ్య కొన్ని చిన్న చిన్న గుడారాలు కనిపించాయి. ఆరా తీస్తే కంచి పరమాచార్య వారు పరివారంతో అక్కడ బస చేస్తున్నారని తెలిసింది. మార్గమధ్యంలో సంధ్యా సమయానికి అనుష్టానాలు ముగించుకోవడానికి బావి సౌకర్యం వున్న ఏదైనా ప్రదేశం వద్ద ఆగి అక్కడే బస చేయడం ఆనవాయితీ. రెండు మూడు పెట్రోమాక్స్ లైట్లు మినహా పూర్తి నిర్మానుష్య ప్రదేశంలో ఒక చిన్న పాక వంటి టెంటులో అంతటి మహానుభావుడు బస చేయడం మా అన్నగారికి చాలా ఆశ్చర్యం కలిగించింది. కంచి పీఠానికి వున్న ఆస్తిపాస్తులతో పోల్చి చూసుకుంటే ఆయన అంత నిరాడంబరంగా వుండడం మామూలు విషయం కాదు.
ఆ రాత్రి కర్నూలులో వుండిపోయి మరునాడు, స్వామివారి చాతుర్మాస్యమండల దీక్ష మొదలవుతుంది కనుక అ రాత్రి కర్నూలులో వుండి స్వామి వారి దర్శనం చేసుకుని వెడితే బాగుంటుందని బ్యాంకు అధికారి ఒకరు చెప్పడంతో మా అన్నగారు అలాగే అని మరుసటి ఉదయం స్వామి దర్శనం చేసుకున్నారు. పాద నమస్కారం చేసుకున్నారు.
స్వామివారి నిరాడంబరత, వాగాడంబరం లేని ఆయన ప్రవచనాలు, మెల్లగా, మృదువుగా మాట్లాడే తీరు ఇవన్నీ తనను బాగా ఆకట్టుకున్నాయని, స్వామివారిపై గౌరవ ప్రతిపత్తులు రెట్టింపు అయ్య్యాయని గుర్తు చేసుకున్నారు.
తదుపరి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి (ఇప్పుడు లేరు ) వారి తరువాత పీఠం అధిష్టించాల్సిన విజయేంద్ర సరస్వతి స్వామి కూడా పరమాచార్య వెంట వున్నారు. అప్పటికి ఆయన వయసులో చాలా చిన్నవారు. పసితనపు ఛాయలు వీడని వయసు. కానీ అసాధారణ ధారణ శక్తి. దీన్ని మా అన్నయ్య కళ్ళారా చూసారు. పెద్ద స్వామి వారు సుదీర్ఘమైన సంస్కృత శ్లోకాలను, వేద పనసలను మంద్ర స్థాయిలో మెల్లగా చదువుతుంటే, వాటిని మననం చేసుకుంటూ ఆ బాల స్వామి అప్పటికప్పుడే ఏమాత్రం తొట్రు పడకుండా, స్పష్టంగా వల్లెవేయడం గమనించి అక్కడి జనం నివ్వెరపోయారు. నాటి బాలస్వామే నేటి కంచి పీఠాధిపతి.
మరునాడు హైదరాబాద్ వస్తుంటే, మార్గమధ్యంలో మరో పీఠాధిపతి వాహన శ్రేణి ఎదురుపడింది. ఆ వాహనానికి ముందు పలానా పీఠం అనే పెద్ద బోర్డు, ముందూవెనుక పతాకాలతో పటాటోపంగా అనేక వాహనాలు.
ఇదీ వరుస.
“సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తి:”
మంచి మనసున్న మనుషులతో సాంగత్యం మనసుపై మంచి సానుకూల ప్రభావం చూపుతుంది. ఆది శంకరాచార్యులు తన భజగోవింద స్త్రోత్రంలో చెప్పిన ఈ శ్లోకం అంతరార్ధం ఇదే.
మంచి భోజనం చేసి, మంచి మాటలు విని ఇంటికి చేరి టీవీ పెడితే రకరకాల ఛానళ్ళలో రకరకాల ప్రోగ్రాములు, ఉగాది పంచాంగ శ్రవణాల పునః ప్రసారాలు. వాగాడంబర విన్యాసాలు. ఎప్పుడో ఏడాది రెండేళ్ల క్రితం ఒక ప్రవచన కర్త నోటివెంట వెలువడిన పలుకులపై విమర్శలు, ప్రతి విమర్శలు.
శంకరభగవత్పాదులు చెప్పిన దేమిటి? జరుగుతున్నదేమిటి?
మాటకు వున్న ‘పవర్’ ఏమిటో నేటి తరం రాజకీయ నాయకులకు బాగా తెలుసు. మాటను ఎలా తిప్పి ఒదిలితే అది మీడియా దృష్టిని ఆకట్టుకుంటుందో వారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ నడుమ సక్సెస్ మీట్ల పేరుతో, సినీ జనం నిర్వహించే కార్యక్రమాల్లో కూడా నలుగురు వింటున్నారని, చూస్తున్నారనే సోయ లేకుండా సినీ నటులు చేస్తున్న వికృత వ్యాఖ్యలు ఈ కోవలోకే చేరుతున్నాయి. వారి పలుకులు ములుకుల్లా మీడియాలో పేలాలి. పేలుడు ఫలితాలు వారికి అక్కరలేని విషయం. ఇదీ ఇప్పటి లోకం తీరు.
‘వెలది, జూదంబు, పానంబు, వేట,పలుకు ప్రల్లదనం’ అంటూ ‘చేయకూడని’ కార్యాల జాబితాలో కూడా ‘చెడు పలుకు’ను చేర్చింది అందుకే.
అంచేత మాట మాట్లాడే ముందే ఆలోచించుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఆలోచించి ప్రయోజనం శూన్యం. జనాన్ని ఆకర్షించడం కోసమో, చమత్కారం కోసమో నోరు తెరిస్తే మాత్రం ఇంతే సంగతులు.



(ఇంకావుంది) 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఔను. గుడ్డూ బ్యాడూ ఆలోచించుకుని మాట్లాడుట శ్రేయస్కరం. గుడ్డనుకున్నది కూడా గడ్డు గా మారవచ్చు.