3, మార్చి 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (276) : భండారు శ్రీనివాసరావు

 

గుడిలో ఏముంది?
అప్పటికి ఉద్యోగపర్వం నుంచి రిటైర్ అయ్యాను.
ఒకసారి రవీంద్రభారతిలో ప్రోగ్రాం జరుగుతుంటే వెళ్లాను. ముందు వరసలో మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య గారు కనిపిస్తే వెళ్లి నమస్కారం పెట్టాను. ఆయన ‘రా! శ్రీనివాసరావ్! కూర్చో!’ అంటూ తన పక్క సీటులో కూర్చోబెట్టుకున్నారు.
ఇంకా సమయం వుండడంతో మాటామంతీ మొదలుపెట్టారు. మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలని అనిపించే మాటల చాతుర్యం ఆయన సొంతం.
‘మన రాష్ట్రమే తీసుకో! ఎవరిదగ్గర డబ్బు ఎక్కువ వుంటుందని నీ అంచనా! నువ్వు, ఇంకా చాలామంది అనుకున్నట్టు వేరే కులాల దగ్గర కాదు, డబ్బు కట్టలు మూలుగుతున్నది నిజానికి మా వాళ్ళ దగ్గర. (ఆయన కులం పేరు చెప్పారు కానీ దాన్ని ప్రస్తావించడం సంభావ్యం కాదు, అందరికీ తెలిసిందే) కానీ అవసరం అయితే కానీ తీయరు. దాతృత్వం తక్కువేమీ కాదు. కాలేజీలు, హాస్టళ్ళు చాలా కట్టారు. కానీ ఆచితూచి ఖర్చు పెడతారు. ఈ నాటి రాజకీయాల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లితే కానీ నెగ్గుకు రాలేని పరిస్థితులు. అది తెలిసి వచ్చిన తర్వాతనే నేను ప్రత్యక్ష ఎన్నికలకు దూరం జరిగాను.
‘సరే! ఇదలా ఉంచు. మరో విషయం తెలుసా? మన దగ్గరే కాదు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా రాములోరి గుడి, షావుకారు దుకాణం లేని ఊరు వుండదు. అంటే ఏమన్న మాట. కొన్ని ఊళ్ళల్లో అన్ని కులాలవారు వుండరు. కానీ పూజారి (బ్రాహ్మడు) షావుకారు ప్రతి ఊర్లో వుంటారు. అయినా ఆ కులాలకు ఈనాడు ఏమి విలువ వుంది చెప్పు’ (బహుశా ఆయన ఉద్దేశ్యం రాజకీయాల్లో కావచ్చు)
ఒక బహిరంగ ప్రదేశంలో, ఒక రాజకీయ నాయకుడు, అదీ పరిణతి చెందిన ఒక రాజకీయ వేత్త అలా కులాలు గురించి, మెల్లగానే అయినా, బాహాటంగా ప్రస్తావించడం నాకు చిత్రం అనిపించింది.
తమిళనాడు గవర్నరుగా నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రమాణ స్వీకారానికి పూర్వమే రాష్ట్ర ఆర్య వైశ్య సంఘం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమం అది. ఈలోగా నిర్వాహకులు వచ్చి రోశయ్య గారిని సగౌరవంగా వేదిక మీదకు తీసుకు వెళ్ళారు.
నేను కాసేపు కూర్చుని పంజాగుట్టలోని మా మేనల్లుడు డాక్టర్ రంగారావు (108, 104 పధకాల రూపశిల్పి) ఇంటికి వెళ్లాను. సాయంత్రం వేళల్లో అక్కడ చాలామందిమి కలుస్తూ వుండేవాళ్ళం.
మాటల మధ్యలో వృద్ధులు, పిల్లలు పౌష్టికాహారం ప్రసక్తి వచ్చింది. నేను రోశయ్య గారు చెప్పిన ప్రతి ఊరిలో రాములోరి గుడి గురించి చెప్పాను.
అప్పుడు డాక్టర్ రంగారావు, డాక్టర్ బాలాజీ చెప్పిన విషయాల్లో నాకు జ్ఞాపకం వున్నంతవరకు ఇక్కడ పేర్కొంటున్నాను.
మనిషికి ప్రధానంగా అవసరం అయింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే పాతరోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.
ఇక వూళ్ళల్లో వయోవృద్దులకు, అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధులకు, పింఛన్ల పేరుతొ నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుంటున్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని, వంటావార్పూ సొంతంగా చేసుకోలేని ఆ అభాగ్యులకు డబ్బు ఇస్తే ఏం ప్రయోజనం. వండి వార్చేవాళ్ళు లేని నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో, దద్దోజనమో మించింది ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి.
ఇప్పటికీ పెద్ద పెద్ద దేవాలయాల్లో అన్నదాన పథకాలు అమలు అవుతున్న మాట నిజమే. అయితే వాటిపై ఓ అపప్రధ వుంది. పేదలకు ఉచితంగా పంచాల్సిన ప్రసాదాలను అమ్ముకుంటూ, మరో పక్క వీ.ఐ.పీ.ల సేవలో తరిస్తున్నాయని.
ఈరోజుల్లో చదువుకునే పిల్లలకోసం ప్రభుత్వాలు ఎంతో డబ్బు ఖర్చు చేసి మధ్యాహ్న భోజన పధకాలు అమలు చేస్తున్నాయి.
పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా ఊరిలోని దేవాలయాలే ఈ పని చూసుకునేవి. నిలవవుండే పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన మధ్యాహ్న భోజనం ఏముంటుంది?
గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గుడిలో ఏముందీ అని వ్యంగ్యంగా పాటలు పాడుకునే అవసరం వుండదు.
అయితే, ప్రతిదీ రాజకీయమయమయిపోతున్న ఈ రోజుల్లో ఇది సాధ్యమా అంటే అనుమానమే.
ఇక్కడ గుడి అంటే దేవాలయం మాత్రమే కాదు, అది ఒక మసీదు కావచ్చు, ఒక చర్చి కావచ్చు, ఒక గురుద్వారా కావచ్చు. ఏదయినా అవి నెరవేర్చే సామాజిక బాధ్యత మాత్రం ఒక్కటే.
ఊరివారు తలచుకుంటే, ఆ సంకల్పానికి ప్రభుత్వ సాయం తోడయితే అన్నానికి మొహం వాచే వారంటూ ఏ వూరిలో మిగలరు.

కింది ఫోటో: మా స్వగ్రామం కంభంపాడులో రామాలయం




(ఇంకావుంది)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ప్రతి రోజు పులిహోర పాయసం తో పోషకాలు అందవు.

అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు ఇచ్చే ఐటమ్స్ కూర , సాంబారు అన్నం, పప్పు, పెరుగన్నం ఇస్తే బాగుంటుంది.

అనేక కర్ణాటక ఆలయాలలో మధ్యాహ్నం భోజనం అందిస్తాయి.

'ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధులకు, పింఛన్ల పేరుతొ నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుంటున్నాయి.' ఇప్పటికే పింఛను భారం ఎక్కువై పోయింది. ఇంకా చేయాలి అంటే సాధ్యం కాదు.