ఆ రోజులికరావు
‘యుద్ధం మీద మాట్లాడాలి, కారు పంపిస్తాను ఓ పది నిమిషాలు స్టూడియోకి వస్తారా’ అన్నాడు గెస్ట్ కో ఆర్డినేటర్ నేతాజీ ఫోన్లో. నాకు మంచి స్నేహితుడు కూడా. యుద్ధం మొదలయిన తర్వాత, చాలా టీవీల నుంచి ఇలా ఎన్నో ఫోన్లు. ‘తెలుసుకదా కాడి కింద పారేసానని’ చెప్పాను నేతాజీతో.
కాడి అంటే గుర్తుకు వచ్చాయి కొన్ని పాత రోజులు.
మా చిన్నతనంలో ఎడ్లబండిలో బరువు తూకంగా వుండాలనేవారు. బండిలో వెనక కూర్చున్న వాళ్ళు ముందుకు జరిగితే బండి తోలేవాడు చెప్పేవాడు, 'కాస్త వెనక్కి జరగండి, కాడి బరువు మోపవుతోంది'అని.
దాని అర్థం ఏమిటంటే ఆ బరువు బండిని లాగే ఎడ్లమీద పడుతుందని.
వేరే పార్టీల నుంచి అధికార పార్టీలోకి మూకుమ్మడిగా చేరేవారి విషయంలో కూడా ఈ కాడి బరువు ఉదాహరణ వర్తిస్తుంది.
'నిలకడగా నిల్వవున్న నీరు నాచు పట్టి నీచు వాసన వేస్తుంది. పారే నీరు పారదర్శకంగా స్వచ్చంగా కనబడుతుంది'
పార్టీ మార్పిడులను సమర్ధిస్తూ ఓ రాజకీయ నేత చేసిన వ్యాఖ్య ఇది. గుడ్డి సమర్ధనకు ఈ వ్యాఖ్యను పరాకాష్టగా తీసుకోవాలేమో.
మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ ఎస్ నుంచి ఇందిరా కాంగ్రెస్ కు వలసలు మొదలయ్యాయి. ఎన్నికలు ముగియగానే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఆయన వైపు మళ్లిపోతున్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్షంలో వున్న భాట్టం శ్రీరామ మూర్తి అన్నారు. 'చెన్నారెడ్డి గారి ఆకర్షణ శక్తి అమోఘం. ఎన్నికల్లో గెలిచిన వాళ్లు జమాఖర్చులు కూడా ఇంకా దాఖలు చేయలేదు. దానికి ముందే పరకాయ ప్రవేశాలా. ఈ తంతు చూస్తూ వుంటే మంగళ సూత్రాలతో, మధు పర్కాలతో పెళ్లి పీటల మీదనుంచి లేచిపోతున్నట్టుగా వుంది'
ఈ వ్యాఖ్య సభలో దుమారం రగిలించింది. పార్టీ మారిన వాళ్ళలో మహిళా సభ్యులు కూడా వున్నారు. లేచిపోవడం అనే పదానికి అభ్యంతరం తెలిపారు. అది సభలో వాడతగ్గ పదమా కాదా అన్న దానిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఏ ఫలితమూ రాకుండానే ముగిసింది. అది కాదు అసలు విషయం.
పార్టీ మార్పిళ్ళపై ఇంతటి ఘాటు వ్యాఖ్య చేసిన భాట్టం శ్రీరామ్మూర్తి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు.
2018 లో ఏపీలో జరిగిన మూకుమ్మడి పార్టీ మార్పిళ్ళపై ఆ రోజుల్లో అనేక టీవీ ఛానళ్ళు చర్చలు నిర్వహించాయి. ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలకూడదనే ఈనాటి రోజులు కావు కనుక, నేను నిక్షేపంగా వెళ్లి ఒకే రోజున ఏబీఎన్, సాక్షి, టీవీ-5, HMTV, మహా న్యూస్ ఛానళ్ళలో నా అభిప్రాయాలు చెప్పేశాను. ఆ రోజులు మళ్ళీ రావు.
కింది ఫోటోలు అవే:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి