రామారావును నేను చిన్నప్పటినుంచీ ఎరుగుదును.
చిన్నతనంలో బొద్దుగా ముద్దుగా వుండేవాడు. వున్న వూళ్ళో స్కూలు లేక పట్నంలో బావ గారింటికి చేరాల్సివచ్చింది. వేసవి సెలవులివ్వగానే సొంతూరు మీద గాలిమళ్ళేది. అంతే. బస్సెక్కి తుర్రున వాళ్ల వూరు బయలుదేరేవాడు. ఆ రోజుల్లో బస్సు టిక్కెట్టు- అందులో అరటిక్కెట్టాయె - నాలుగణాలు పోను అక్కయ్య ఇచ్చిన రూపాయిలో ఇంకా ముప్పావలా జేబులో మిగిలేది. మరో అణా పెట్టి కట్టె మిఠాయి, ఇంకో అణా పెట్టి జీళ్ళు కొనుక్కుని కాలవగట్టెక్కేవాడు. ఇక అక్కడినుంచి ఒకటే పాటలు, పద్యాలు. టైం తెలిసేది కాదు. మాయాబజారులో వివాహభోజనంబు పాట పదమూడోసారి ఎత్తుకునేలోపల వూరొచ్చేసేది. మూడు మైళ్ళు మూడంగల్లో దాటి వచ్చిన ఫీలింగు. ఆహా అనుకునేవాడు. తన గొప్పే అనుకునేవాడు. చూసి నవ్వుకునేవాడిని.
పల్లెటూళ్ళో రాజభోగం. వేడి వేడి అన్నం. వెన్న కాచిన నెయ్యి. అరచేతి మందాన మీగడ. ముద్దపప్పు. వూటలూరే కొత్తావకాయ. ఓహో ఏమి రుచి. రాళ్ళు తిని హరాయించుకునే ఆరోగ్యం తనదని మురిసి ముక్కచెక్కలయ్యేవాడు. రామారావుని చూసి జాలితో నవ్వుకునేవాడిని.
రామారావు పెరిగాడు. ఎదిగాడు. సన్నగీత గీసినట్టు మీసకట్టు. నిగనిగలాడే జుట్టు. ఎగదువ్విన క్రాఫు. ఎవరో అచ్చు నాగేశ్వర్రావులావుంటావన్నారు. నిజమే కాబోలనుకున్నాడు. నవ్వుకోవడం నా వంతయింది.
రామారావుకు పెళ్లయింది. పిల్లలు పుట్టారు. అయినా చిన్న కుర్రాడిలానే వున్నాడు. తోటివారిలా బొజ్జ రాలేదు. బరువు పెరగలేదు. జుట్టు నెరవలేదు. బట్ట తల రాలేదు. కంటి చూపు తగ్గలేదు. ముప్పయ్యేళ్ళ క్రితం ఎలావున్నాయో ముప్పయి రెండు పళ్ళు అలాగే గట్టిగా పటిష్టంగా వున్నాయి. ‘నాది పెగ్గుల లెక్క కాదు జగ్గుల లెక్క’ అంటూ మూడు సీసాలు ఆరు సోడాల మాదిరిగా సాయంకాలక్షేపాలు చేసేవాడు. ‘చూశారా నా స్పెషాలిటీ’ అన్నట్టు రొమ్ము విరుచుకు తిరిగే వాడు. రామారావుని చూస్తుంటే నాకిక నవ్వు రావడం లేదు. జాలి కలుగుతోంది.
చూస్తుండగానే రామారావుకు ఏళ్ళు మీదపడడం మొదలయింది. కొంచెం కొంచెంగా వెంట్రుకలు చెప్పాపెట్టకుండా రాలిపోతున్నాయి. వెనుకనుంచి చూసేవారికి జుట్టు మధ్యలో గచ్చకాయ మందంలో ఖాళీ కనబడుతోంది. నెలల తేడాలోనే బెల్ట్ సైజ్ పెరిగింది. ముందు పొట్ట కనబడి తరువాత రామారావు కనబడుతున్నాడు. దళసరి కళ్ళజోడు మొహం మీద చేరింది. మరీ ముదుసలిలా కాకపోయినా ముడుతలు కనబడుతున్నాయి. అతికించినట్టు పెదాలపై చిరునవ్వు. అయితే అందులో నాకు జీవం కనబడ్డం లేదు.
రామారావుకు క్రమంగా సృష్టి రహస్యం అర్ధం అవుతున్నట్టు అనిపిస్తోంది. శాశ్వితం అనుకుంటున్నవేవీ నిజానికి శాశ్వితం కావు. ఈ నిజం తెలుసుకున్న రామారావుని చూసినప్పుడు నాకు నవ్వు రాలేదు. జాలీ వెయ్యలేదు. గర్వంగా అనిపించింది.
ఎందుకంటె నా పేరు ‘వయస్సు’ కనుక.
Photo courtesy image owner
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి