5, ఏప్రిల్ 2014, శనివారం

వినదగునెవ్వరు చెప్పిన.....


మన వైఖరిలో లేదా నడతలో ఏదైనా బలహీనత వుంటే అది మన వ్యక్తిత్వంలో కూడా ప్రస్పుటమవుతుంది.  
కొందరు మంచి జరిగినప్పుడు ఆనందంతో మందహాసం చేస్తారు. తామ్ము నవ్వినప్పుడే మంచి జరుగుతుందని మరికొందరు విశ్వసిస్తారు.
చక్కటి మానవ సంబంధాలను దెబ్బతీయడానికి కావలసిన ఏకైక వనరు ఒక్కటే. అదే అహంకారం.
రాత్రికి రాత్రే లక్ష్యాలను మార్చుకుంటూ పోవడం సమర్ధనీయం కాదు. కానీ ఆ లక్ష్యసాధనకోసం అనుసరించాల్సిన మార్గాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోవచ్చు.
అసంబద్ధం అయిన విషయాలు చెప్పి మిమ్మల్ని నమ్మించేవాళ్ళు మీచేత అకృత్యాలు చేయించినా ఆశ్చర్యపోనక్కరలేదు.  
విజయం సాధించినప్పుడు అది మీకు స్వాభావికం అనుకోవాలి. వోటమి ఎదురయినప్పుడు మార్పుకోసం దాన్ని ఆస్వాదించగలగాలి.
నిరాశావాది ఎదురుగాలి గురించి ఆందోళన చెందుతాడు. ఆశావాది ఆ వ్యతిరేక పవనాలను  తనకు సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు.
అద్భుతం అంటే అదేదో అరుదుగా జరిగే అద్భుతం  అనుకోకండి. చూడకలిగే  కళ్ళు వుంటే మన చుట్టూ కనబడే ప్రతిదీ ఒక పరమాద్భుతమే.   
ప్రతిదీ భగవంతుడి మీద భారం వేసి ప్రార్ధన చేయండి. కానీ పని చేసేటప్పుడు మాత్రం అన్నీ మీమీదే, మీ కృషి మీదే ఆధారపడివున్నాయన్న విశ్వాసంతో మొదలుపెట్టండి.  
మీ చుట్టు వున్న లోకాన్ని మార్చడానికి చాలా కాలం పడుతుంది. కానీ ముందు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. దానికి కావాల్సింది సమయం కాదు, పట్టుదల, నిబద్ధత.   

మీకు మంచి నైపుణ్యం వుంది అనుకున్న రంగంలో మరింత మెరుగయిన కృషి చేయక పోతే మీ ఎదుగుదల అసాధ్యం  
జీవితం, సమయం మనకు మంచి ఆచార్యులు. సమయాన్ని యెలా వాడుకోవాలో జీవితం నేర్పితే, జీవితపు విలువ ఏమిటో సమయం బోధిస్తుంది.
పొద్దున్న నిద్ర లేవడం అన్నది ఒక మంచి ఆలోచనతో మొదలయితే చాలు, ఇక ఆ రోజంతా మీకు చాలా ఆనందంగా ఆహ్లాదంగా  గడిచిపోవడం ఖాయం.
పనిచేయడం, ప్రయత్నించడం రెండు వేర్వేరు విషయాలు. ప్రయత్నించడం  అంటే జరుగుతుందని  ఆశ పడడం. పని పూర్తి చేయడం అంటే ఫలితాన్ని సాధించడం.
ఏదో సాధించాలి అన్న తపనే మీరు  ఈరోజున్న స్థానానికి మిమ్మల్ని  చేర్చింది అన్న విషయం ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి.  
ఈ క్షణంలో ఏదయినా బాగా చేయగలిగితేనే అది మరు క్షణంలో మిమ్మల్ని మరో మంచి స్థానంలోకి చేరుస్తుంది.
ఆశావాది మరచిపోవడానికి నవ్వుతాడు. నిరాశావాది నవ్వడమే మరచిపోతాడు.
ఇంట్లో ఆహ్లాదకరమైన  వాతావరణం కావాలంటే కావాల్సినవి ఎయిర్ కండిషనర్లు కాదు. మంచి మనసులు,  మంచి  మనుషులు.
ఆకాశంలో అంత ఎత్తున ఎగిరే బెలూన్లు కూడా  మంచి పాఠం బోధిస్తాయి. జీవితంలో అలా  పైపైకి ఎదుగుతూ పోవాలంటే 'సరుకు' వుండాల్సింది బయట కాదు, లోపల  అని.

కామెంట్‌లు లేవు: