20, జనవరి 2014, సోమవారం

మాయమై పోతున్నవమ్మా!


ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో  స్నేహితుడొకడిచ్చాడని చెప్పి మా పిల్లలు  ఓ తెలుగు సినిమా క్యాసెట్ ఇంటికి పట్టుకొచ్చారు. కాసెట్ అయితే వుంది కానీ దాన్ని టీవీ (నలుపు తెలుపు) తెరపై చూడడానికి వీడియో క్యాసెట్ ప్లేయర్ (వీ సీ పీ ) లేదు. నాడా దొరికిందని ఘోడా కోసం వెదికినట్టు చిక్కడపల్లిలో ఓ షాపునుంచి దాన్ని గంటకు ఇంత అని రెంటుకు  తీసుకొచ్చి ఇంట్లో  ఆ సినిమా చూసాం. ఆ తరువాత అందరి  ఇళ్ళల్లో వీసీపీలు, వీసీఆర్ లు గృహప్రవేశం చేశాయనుకోండి. అది వేరే కధ.
మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత - మా బావగారి డెబ్బయ్యేడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1995 లో తీసిన  వీడియో క్యాసెట్ చూడాలనిపిస్తే -  వీసీఆర్ అనే పరికరం ఇళ్లల్లోనే కాదు షాపుల్లో కూడా మాయమై పోయింది. ఒకప్పుడు వీసీఆర్ ఇంట్లో వుంటే  ఘనంగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడా మాట చెబితే నమ్మేవాళ్ళు వుండరేమో. ఎందుకంటె ఈ నాటి పిల్లలకు ఆనాటి  వీడియో క్యాసెట్లు, వీడియో ప్లేయర్లు చూసివుండే అవకాశం లేదు కాబట్టి.
నిన్ననో మొన్ననో పేపర్లో ఓ వార్త చదివాను.
అందుబాటులోకి వచ్చిన  టెక్నాలజీ పుణ్యమా అని, ఉత్తరాలు చదవడం దగ్గరనుంచి, టెలిఫోన్ డైరెక్టరీ  చూడడం వరకు అనేక పనుల అవసరం ఇప్పుడు జనాలకు లేకుండా పోయిందని ఓ సర్వే తేల్చిందట. ఇలాటివి దాదాపు  యాభయ్ దాకా వున్నాయని కూడా  ఆ సర్వే సారాంశం.
వెబ్ ప్రపంచం ఆవిష్కృతమైన దరిమిలా,  లోగడ ప్రజలు అలవాటు  పడిన అనేక పనుల  అవసరం నేటి  ప్రపంచంలో లేకుండాపోయింది. వెనుక ఏదయినా ఫోను నెంబరు కావాల్సివస్తే, టెలిఫోన్  డైరెక్టరీ తో పనిపడేది. ఇప్పుడు వాటిని చూసేవారే లేరు. ఇంటర్ నెట్ వినియోగం  ఇంకా పూర్తిగా  వ్యాపించని కొన్ని దేశాల మాటేమో గాని ఇప్పుడు అనేకానేక దేశాల్లో ట్రావెల్ సంస్తల కార్యాలయాలకు వెళ్లి ప్రయాణాల టిక్కెట్లు కొనుక్కునే వారి సంఖ్య నామమాత్రం. పోస్ట్ కార్డులు, పబ్లిక్ టెలిఫోన్ బాక్సులు, ఫోటో ప్రింటింగ్, టెలిఫోన్ నెంబర్లను  గుర్తుగా రాసుకునే చిన్నిచిన్ని  పుస్తకాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి అని లండన్ కు చెందిన మొజి కంపెనీ చేసిన సర్వే తెలుపుతోంది. ఫిలిం షో టైమింగులు చెక్ చేసుకోవడానికి పేపర్లు తిరగేయడం కూడా బాగా తగ్గిపోతోంది.

నిన్న మొన్నటిదాకా కళ్ళముందు కదలాడిన వస్తువులు కళ్ళముందే కనుమరుగు అవుతూ వుండడం ఓ విషాదం.

గతం గుర్తులు చెరిగిపోతున్నాయి


ఈరోజు పత్రికల్లో రెండు చిన్న వార్తలు వచ్చాయి. ఒకటి, హైదరాబాదు నగరంలో అతివేగంగా  అమలవుతున్న మెట్రో రైలు  ప్రాజెక్టుపై  ప్రజలకు అవగాహన కలిగించే ఫోటో ప్రదర్శన గురించిన వార్త. నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దాన్ని ప్రారంభించడంలో ఉద్దేశ్యం నిర్వాహకులకే తెలియాలి. మెట్రో రైళ్ళను సాధారణంగా దిగువ, మధ్య తరగతి వాళ్ళతో పాటు సాధారణ ప్రజానీకం ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం వుంటుంది. ఫైవ్ స్టార్  సంస్కృతికి అలవాటుపడిన వారు ఏదో ఒకసారి సరదాకు మెట్రో ఎక్కుతారేమోకాని ‘కార్లు’ దిగిరారు. అలాటి పెద్ద హోటళ్ళలో  ఇలాటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వల్ల  ప్రయోజనం ఏముంటుందో అన్నది నిర్వాహకులకే తెలియాలి.  కానీ, మెట్రో నిర్మిస్తున్నది  అల్లాటప్పా సంస్థ కాదు. అలాటి  వాళ్లని ఫైవ్ స్టార్ హోటళ్ళు వొదిలిరమ్మనడం అత్యాశే అవుతుందేమో!


మెట్రో రైలు మార్గం నిర్మాణం కోసం నగరంలో అనేకచోట్ల పాత నిర్మాణాలను తొలగించేందుకు చర్యలను వేగవంతం చేస్తున్నారన్నది మరో వార్త. అభివృద్ధి వల్ల వాటిల్లే తప్పనిసరి సమస్యల్లో ఇదొకటి. పాత కట్టడాలను తొలగించడం తప్పనిసరి అయినప్పుడు వాటిని ఫోటోలు తీయించి భావితరాలకోసం భద్రపరచడం నిర్మాణ సంస్థల బాధ్యత. అభివృద్ధి కార్యక్రమాల కారణంగా అనేక నగరాల రూపురేఖలు అనూహ్యంగా అతివేగంగా మారిపోతున్నాయి. వెనుక నగరం ఇలా వుండేది అని చెప్పుకోవడానికి ఏమీ మిగిలేట్టు లేదు. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఒకరు వున్నారు. ఇప్పుడు దేశంలో వున్నారో, వాళ్ల పిల్లల వద్ద అమెరికాలో వున్నారో తెలియదు. ఆయన ఎవ్వరో కాదు విజయవాడ నగరం పూర్వ మేయర్ శ్రీ జంధ్యాల శంకర్. ఆయన బెజవాడ నగరానికి చెందిన అనేక పాత భవనాలను (రాజగోపాలచారి రోడ్డులోని లాయర్ చక్రవర్తి గారి ‘శ్వేత భవనం’ వాటిల్లో ఒకటి) ఫోటోలు తీయించి పెట్టారని విజయవాడ ఆకాశవాణిలో చాలాకాలం వార్తావిభాగం న్యూస్ ఎడిటర్ గా పనిచేసిన శ్రీ ఆర్.వీ.వీ. కృష్ణారావు చెప్పారు. మెట్రో నిర్మాణ సంస్థ తలచుకోవాలే కాని ఇదేమంత పెద్ద విషయం కాదు. నన్నడిగితే పాత నిర్మాణాలను కూలగొట్టి కొత్తవి నిర్మించేందుకు అనుమతులు కోరేవారు విధిగా పాత కట్టడం ఫోటో జత చేయాలని అధికారులు నిబంధన విధిస్తే బాగుంటుందేమో! (20-01-2014)

19, జనవరి 2014, ఆదివారం

గాయత్రి మంత్ర అంతరార్ధం


ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్

న గాయత్ర్యాః పరం మంత్రం నమాతు: పరదైవతం అన్నది జగత్ప్రసిద్ధమయిన వృద్ధవచనం

గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
ఆదిశంకరాచార్యులు తమ భాష్యములో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ అని పేర్కొన్నారు. గయలు అంటే ప్రాణములు అని అర్ధం. అలాగే త్రాయతే అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకర భాష్యం.

ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించుకోవడం జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.
గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహా మహిమాన్వితమైనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్ధం వుంది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను
స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన.
గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణంలో నుంచి పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సాంప్రదాయిక అనుసరణలలో ఈ మంత్రంలో దాగున్న శాస్త్రీయ ప్రాధాన్యత కొంత మరుగునపడిపోయిందనే అనుకోవాలి. 
ఆధునిక ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు. ఈ పాలపుంతలో మన భూమండలం కంటే లక్షల రెట్లు పెద్దవయిన లక్షల నక్షత్రాలు వున్నాయి. 
ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే. మళ్ళీ ఇందులో ఒక్కో నక్షత్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతుంటే, ఆ చంద్రుడితో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.
మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుంబం లోని ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్తానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై రెండు కోట్ల యాభయ్ లక్షల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో అవి కదులుతున్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం.
ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిద్దాం.
 
ఓం భూర్భు వస్వః - భూర్ అంటే భూమి, భువః  అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రాలతో కూడిన పాలపుంత (గెలాక్సీ)
ఇక్కడ ఓ చిన్న వివరణ  మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్ ఫాన్ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతాయి. ఆ వేగానికే అది చేసే చప్పుడు ఎలావుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే. అలాటిది, ఈ అనంత విశ్వంలో అంతులేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏవిధంగా వుంటుందన్నది ఊహాతీతం.
గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః  అనే ఈ బీజాక్షరాలు  ఈ చరాచర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓంకారాన్ని పోలివున్నదన్న వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి. 
సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునులకు దానిని గురించి తెలియచేసాడని ఐతిహ్యం. అప్పుడు వారందరూ కలసి ఈ ధ్వనికి ఓం అని నామకరణం చేశారు. త్రికాలాల్లో వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.
కాబట్టి నిరాకారుడు,నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరిగిందని విశ్వాసుల విశ్వాసం. అప్పటిదాకా 
భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.
గీతాకారుడు కూడా అదే చెప్పాడు.  ఓం ఏకాక్షరం బ్రహ్మ అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం. 
అందుకే, ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టారు. అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట.
ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు. అదేమిటంటే అనంత విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి ½ MV2 కైనెటిక్ ఎనర్జీ ని ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వం లోని గ్రహరాసులన్నీ కలిపి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతుల్యం కావడానికి ఇది దోహద పడుతోంది. దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తిచేసే ఎనర్జీకి స్టోర్ హౌస్ వంటిదన్నమాట.
తత్స వితుర్వరేణ్యం
తత్ అంటే ఆ (భగవంతుడు) సవితుర్ అంటే సూర్యుడు (నక్షత్రం) వరేణ్యం అంటే వందనానికి, గౌరవానికి అర్హత కలిగివుండడం.
ఒక వ్యక్తి రూపం, పేరుతొ సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే పలానా అని అవగతమవుతుంది. రూపం, నామం రెండూ తెలవడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడిని గుర్తించడానికి సరయిన పునాది దొరుకుతుందని విశ్వామిత్ర మహర్షి వాక్రుచ్చాడు. 
ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడు, నక్షత్రాలు) మనకు తెలియని, మనకు కనబడని నిరాకారుడయిన భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు.
ఇది యెలా అంటే- ఒక గణిత శాస్త్రజ్ఞుడు x2+Y2=4; if x=2 అనే కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు. అలాగే, ఒక ఇంజినీర్ నది వొడ్డున నిలబడి తనవద్దవున్న ఉపకరణాల సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న నైపుణ్యాన్ని బట్టి సాధ్యం అది అని ఎవరయినా ఒప్పుకుంటారు.  విశ్వామిత్రుడు మనకు చెప్పింది ఇదే. 
గాయత్రి మంత్రం లోని తరువాయి భాగాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు. 
భర్గో దేవస్య ధీమహి 
భర్గో అంటే కాంతి; దేవస్య అంటే దేవత; ధీమహి అంటే ఉపాసించడం.
అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారుడయిన భగవంతుడుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని జపిస్తూ
దేవుడిని పూజించాలని కూడా ఆయన చెప్పారు. 
ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ ఎల్లప్పుడు చంచలంగా వుండే
మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షే తెలియచేసాడు.
దియోయోనః ప్రచోదయాత్
ధియో (మేధావి), యో (ఎవరయితే),నః (మనమంతా), ప్రచోదయాత్ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ భగవంతుడా! సరయిన మార్గంలో నడిచేవిదంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయి.
ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ దృక్పధంలో చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది.
భూమి(భుర్) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః) అపరిమితమయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి కారణమవుతున్నాయి. నిరాకారుడయిన భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ (తత్) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్) రూపంలో తిరిగి ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు. 
కాబట్టి, మనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో) ని ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనాదంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం సరయిన మార్గంలో (ప్రచోదయాత్) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా చేయాలి. 
"ఆనోభద్రాః కృతవోయంతు విశ్వతః” రిగ్వేద)
 
(
అన్ని దిక్కులనుంచి మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక)


గ్రేట్ ఫెయిల్యూర్ స్టొరీ



పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి -ఆగష్టు నెల- ఇరయయ్యవ తేది.
విజయవాడ, లబ్బీపేట లోని 'ఆంద్ర జ్యోతి' కార్యాలయం.
అందులో అడుగు పెట్టి - ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారిని కలుసుకున్నాను.
ఆయన ఎగాదిగా చూసి, నా పరిచయం కనుక్కుని-
'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా! పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను పంపానని చెప్పు' అన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.
అదే నా తొట్ట తొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.
ఉపేంద్ర గారిని కలిసాను. కూర్చోమని సైగ చేసారు. గుర్రపు నాడా ఆకారంలో వున్నా బల్ల చివర్లో కూర్చున్నాను. పీ టీ ఐ , యు ఎన్ ఐ వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆ విధంగా మొదలయింది నా జర్నలిస్టు జీవితం.
ఉదయం ఎనిమిది గంటలకల్లా అన్నం తిని ఆంధ్ర జ్యోతి కి వెళ్ళే వాడిని. అన్నయ్య పర్వతాలరావు గారు ఇమ్మన్న రూపాయి నోటు వొదినె సరోజినీ దేవి నా చేతులో పెట్టేది. రాను పోను సిటీ బస్సుకు నలభై పైసలు. మధ్యాహ్నం ఆఫీసు కు ఎదురుగా వున్నా టీ స్టాల్లో ముప్పయి పైసలు పెట్టి ఒక సమోసా తిని టీ తాగేవాడిని. రోజుకు ము ప్పయి పైసలు మిగిలేవి. వేరే ఖర్చులు లేవు. అలా నెలకు సుమారు పది రూపాయలు ఆదా. అదే నా మొట్టమొదటి నెలసరి ఆదాయం.
అలా మూడు నెలలు గడిచాయి. జీతం విషయం నేను అడగను లేదు - వాళ్ళు చెప్పను లేదు. ఒక రోజు అటెండర్ నాగేశ్వరరావు నా దగ్గరకు వచ్చి ఎక్కవుంటేంట్ ని కలవమని చెప్పాడు. వెడితే- ఓ ఓచర్ మీద సంతకం చేయించుకుని పది- పది రూపాయల నోట్లు - వంద నా చేతిలో పెట్టారు. అదే నా తొలి వేతనం.
ఉద్యోగం తప్ప వేరే ధ్యాస లేని రోజులవి. రాసిన ప్రతిదీ మర్నాడు పేపర్లో రాకున్నా ప్రూఫ్ లో అచ్చయిన నా ఐటెంసుని నేనే చదువుకుని మురిసిపోయేవాడిని. నేను చేరిన కొత్తల్లోనే నార్ల గారు హైదరాబాద్ వెళ్ళిపోవడం - నండూరి రామమోహనరావు గారు బాద్యతలు స్వీకరించడం జరిగిపోయాయి.ఎందుకో ఏమోగానీ,దిన,వార పత్రికలకు సంబంధిoచిన అన్ని అంశాలలో నాకు తర్ఫీదు ఇచ్చారు. ప్రతిరోజూ ఎడిట్ పేజీలో కార్టూన్ తో కూడిన నాలుగు వాక్యాల గేయాన్ని 'వాక్టూనులు ' అనే శీర్షికతో రాసేవాడిని. సినిమా సమీక్షలు, పుస్తక సమీక్షలు, ఆదివారాల్లో పిల్లలకోసం ప్రత్యెక కధలు , బంగ్లాదేశ్ అవతరణకు దోహదం చేసిన పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి ఇండో-పాక్ యుద్ధంలో భారత సైన్యాల కదలికలను సూచించే మ్యాపులు - ఇలా అన్నింట్లో నేనున్నానంటూ వేలు పెట్టేవాడిని. శ్రీయుతులు ఉపేంద్ర, ఐ వెంకటరావు,కే.రామకృష్ణ, వీరభద్రరావు, ఎల్వీ రమణ ( ఈ మధ్యనే కాలం చేశారు), సత్యనారాయణ, ఆంజనేయులు, చంద్రశేఖర ఆజాద్ వంటి సహోద్యోగుల నడుమ నా ఆంధ్ర జ్యోతి ఉద్యోగ పర్వం నాలుగున్నర సంవత్సరాలపాటు ఇట్టే గడిచిపోయింది.
అన్నట్టు చెప్పడం మరిచాను. మొదట్లోనే నార్లగారు నాకో బ్రహ్మొపదేశం చేశారు. జర్నలిస్టు అనే వాడు ఎప్పుడూ, జేబులో రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకోవాలనే వారు. చాలా కాలంపాటు దాని పాటించాను కూడా. తర్వాతి రోజుల్లో రేడియోలో ఏదో విషయంలో పేచీ వచ్చి,రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చేశాను. అంతే! నెలరోజులపాటు మళ్ళీ ఆఫీసు మొహం చూడలేదు. చివరికి ఎవరో పూనుకుని రాజీ చేయడం, ఉద్యోగంలో తిరిగి చేరడం జరిగిపోయాయి. అదో అధ్యాయం.
హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో విలేకరిగా చేరడం యాదృచ్చికమే అని చెప్పాలి. అంతకుముందు ఈ ఉద్యోగాన్ని ఎంతో సమర్ధంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న తురగా కృష్ణమోహన రావు గారు - గోల్కొండ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి- దురదృష్టవశాత్తు -నకిరేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ విధంగా ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడానికి ఆకాశవాణి ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా నేను ధరకాస్తు  చేసుకోవడం, ఇంటర్వ్యూ కు హాజరు కావడం - సెలెక్ట్ కావడం జరిగిపోయాయి. ఆంద్ర జ్యోతి అనుభవం ఈ ఉద్యోగం పొందడానికి అదనపు అర్హతగానే కాకుండా- అసలైన అర్హతగా తోడ్పడిందని నా నమ్మకం. రాసిన రాతలు అచ్చులో చూసుకునే అవకాశం ఆంద్ర జ్యోతి ద్వారా లభిస్తే- సొంత గొంతును తెలుగునాట నలుగురికీ వినిపించే వీలు రేడియోలో దొరికింది. వార్తా సేకరణ, కూర్పు, తెలుగులోకి అనువాదం ఇలాంటి ప్రక్రియలతో పాటు, రెగ్యులర్ న్యూస్ రీడర్లు రాని రోజున ఏకంగా స్టూడియోలోకి వెళ్లి వార్తలు చదివేయడం- వారానికి రెండు మార్లు వార్తా వాహిని - ఒకసారి జీవన స్రవంతి (రోజువారి జరిగే ఘటనలకు కొంత హాస్యాన్ని జోడించి తయారు చేసిన ప్రత్యేక వార్తలు ) ఇలా అన్నిరకాలుగా నా రేడియో జీవితాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాను.
ఆ రోజుల్లో ఇన్ని పత్రికలూ లేవు. ఇంత మంది విలేకరులు లేరు. ముఖ్య మంత్రి నిర్వహించే విలేకరుల సమావేశానికే పది, పన్నెండు మంది హాజరైతే గొప్పగా వుండేది. నేను రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో కావడం - వార్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం రేడియో పై ఎక్కువగా ఆధారపడాల్సిరావడం- రేడియో విలేకరిగా నా ప్రాధాన్యతను  కొంత పెంచింది. ఇక  అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు - రేడియో మీది అభిమానాన్ని, నా మీది వ్యక్తిగత అభిమానాన్ని కలబోసి ప్రదర్శించేవారు. విలేకరుల సమావేశాలను -'శ్రీనివాస్ వచ్చాడా!' అని కనుక్కుని మొదలు పెట్టడం అప్పుడప్పుడు నలుగురిలో ఇబ్బందిగా వుండేది. తన ఎయిర్ బస్ మంత్రివర్గంపై చెలరేగిన విమర్శల దరిమిలా- మంత్రుల మూకుమ్మడి రాజీనామాలను ప్రకటించడానికి ఓసారి విలేకరులకు కబురు పెట్టారు. మధ్యాన్నం వార్తల టైం దగ్గర పడుతుండడంతో-రాజీనామాల సంగతి ముందుగా నాకు చెప్పడం- విలేకరుల సమావేశం మొదలు కాకముందే ఆ సమాచారం ప్రాంతీయ వార్తల్లో ప్రసారం కావడం జరిగిపోయింది. ఇది నా వృత్తి జీవితంలో మరచిపోలేని సంఘటన.
ఆ రోజుల్లో ప్రతి రోజు సచివాలయానికి వెళ్లి మధ్యాహ్నం దాకా ప్రెస్ రూం లోనో లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ల్లోనో గడిపి- అంతవరకు సేకరించిన సమాచారం తెసుకుని న్యూస్ బుల్లెటిన్ కు అందించడానికి కాలినడకన రేడియో స్టేషన్ కు వెడుతుండే వాడిని. ఒకరోజు అలా పోతున్నప్పుడు ముఖ్యమంత్రి  పైలట్ వాహనం సైరన్ మోగిస్తూ వెళ్ళింది.అంజయ్య గారు- తన అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కారులో డ్రైవర్ పక్కన ముందు సీట్ లో కూర్చునే వారు. ఆయనకు కార్యకర్తల తాకిడి ఎక్కువ. వెనుక సీట్ లో ఎవరికీ వారు దూరి పోయేవారు. ఈ ఇబ్బంది తట్టుకోవడం కోసమో ఏమో ఆయన ముందు సీట్ కి మారిపోయారు. సరే! ఆ రోజు నా పక్కనుంచి వెళ్ళిన ముఖ్యమంత్రి వాహనం కొద్దిగజాలు ముందుకు పోయి ఆగింది. ఆయన అంగరక్షకుడు బాలాజీ- - రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో పనిచేస్తున్నారు- కిందికి దిగి ‘సీఎం గారు పిలుస్తున్నారు రండి’ అనడం- నన్ను కారు ఎక్కించుకుని రేడియో స్టేషన్ లో దింపడం క్షణాల్లో జరిగిపోయాయి. అనుకోకుండా ముఖ్యమంత్రి రేడియో స్టేషన్ కి రావడంతో మా వాళ్ళంతా అవాక్కయ్యారు. అంజయ్య గారు ఇలా నాపట్ల చూపిన అవ్యాజానురాగాలకి ఇంకా ఎన్నో ఉదాహరణలు వున్నాయి. అవి ఆయన గొప్పతనానికి, మంచి తనానికి తార్కాణాలుగా భావిస్తానే కాని , నా ప్రత్యేకత ఏమీ లేదు.
పోతే , ఎందరో మంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు, డీజీపీలు ,చీఫ్ సెక్రటరీలు, సీనియర్ ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఎస్. అధికారులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, శాసన సభ్యులు - ఇందరితో సాన్నిహిత్యాలు, విందులు, వినోదాలు, విమాన యానాలు, విదేశీ ప్రయాణాలు, హెలికాఫ్టర్ చక్కర్లు - మాస్కో రేడియో ఉద్యోగ విజయాలు - ఓ విధమైన 'మత్తులో' వృత్తి జీవితం గడిచిపోయింది.
అటు చూస్తే, వ్యక్తిగత జీవితం ఓ గుండు సున్నా. జీతానికీ, జీవితానికీ పొంతన లేకపోవడంతో అందినంతవరకు అప్పులు చేయడం (చేబదుళ్లు పుట్టవు కానీ జర్నలిష్టులకు మాత్రం బ్యాంకు రుణాలు కోకొల్లలు ) వాటిని తీర్చడం కోసం మళ్ళీ కొత్తవి చేయడం - అదో రుణ చక్ర భ్రమణం. ఇలా ఊబిలో కూరుకుపోయిన జీవితానికి ఆసరాగా మా ఆవిడ నిర్మల- అమ్మ వొడిని ప్రారంభించింది. కన్న సంతానం ఇద్దరు పిల్లలతో పాటు - మరో పాతికమంది పసి పిల్లల ఆలనా పాలనా నెత్తిన వేసుకుంది. ఓ గృహిణిగా సంసార బాధ్యతలో పాలు పంచుకుంటున్నదని అనుకున్నానే కాని, అలవికాని భారం మోస్తున్నదని అనుకోలేదు. ఫలితం - పదేళ్ళ తరవాత ఆమెకు జరిగిన ఓపెన్ హార్ట్ సర్జరీ. మరో పదేళ్ళ అనంతరం మొన్నీమధ్య రెండో సర్జరీ.
ఇక వృత్తి జీవితం చివరి రెండేళ్ళు – కే.ఎస్. శర్మ గారి పుణ్యమా అని హైదరాబాద్ దూర  దర్శన్ వార్తా విభాగంలో ఆర్వీవీ గారి సారధ్యంలో దొర్లిపోయాయి. రెండువేల అయిదు డిసెంబరు ఆఖర్లో ఉద్యోగ విరమణ. మోహన్ కందా గారన్నట్టు- మనిషికి మరణం, ఉద్యోగికి రిటైర్మెంట్ రెండూ తప్పవు.
వెనక్కు తిరిగి చూసుకుంటే- ఎన్నో అనుభూతులు-అనుభవాలు. ప్లస్ లూ, మైనస్ లూ.
అన్నింటి సమగ్ర సమాహారమే జీవితం.
నిజానికి జీవితంలో ఫెయిల్యూర్ స్టొరీ లు వుండవచ్చు కానీ, ఏ జీవితం ఫెయిల్యూర్ కాదు.

(డిసెంబర్. ఆరు - రెండువేల ఆరులో ఉద్యోగవిరమణ సందర్భంలో  రాసినదానికి కొద్దిపాటి సవరణలతో )

18, జనవరి 2014, శనివారం

దడిగాడువానసిరా


సంస్కారం లేని వాళ్ళే ఇతరుల ఉత్తరాలు, డైరీలు చదువుతారంటారు.
కానీ ఇది ‘రాంగున్నర రాంగు’ అభిప్రాయమన్నది మా సుబ్బారావు నిశ్చితాభిప్రాయం!
అసలు జనం డైరీలు రాసేదే ఎవరైనా చదవకపోతారా! అన్న ఆశతోనే అనేది కూడా  మా వాడి థియరీనే! ఆ మాటకి వస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ డైరీలు రాసేసి - దరిమిలా వాటిని ఆత్మకథలుగా అచ్చేసి - తెలిసిన వారి చేత కొనిపించి - తెలియని వారికి ఉచితంగా ఇచ్చి చదివించిన వైనాన్ని వైనవైనాలుగా చెప్పుకురావడం మా వాడికి వెన్నతో పెట్టిన విద్య! ఇందు నిమిత్తం అవసరమైన సమయాల్లో `కోట్‌' చేయడానికి వీలుగా సుబ్బారావు అనేక దాఖలాలతో కూడిన అనేకానేక పుస్తకాలను సేకరించి సిద్ధంగా ఉంచుకున్నాడు కూడా. ` ఎవ్వరూ చదవని దాన్ని అసలు రాయడమే శుద్ధ దండుగ' అన్న అతడి అభిప్రాయంతో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు. 

కాకపోతే, ఈ రకమైన సిద్ధాంతాలు వల్లించే సుబ్బారావుని చూస్తున్నప్పుడు,  చిన్నప్పుడు మా వూళ్ళో పార్ట్  టైమ్‌ పోస్టుమాస్టరుగా పనిచేసిన గోపయ్యగారు గుర్తొస్తుంటారు.  వూళ్ళో ఎవరికి ఉత్తరాలు వచ్చినా వాటిని చించి, చదివి, వాటిలోని  విషయాలను ఆమూలాగ్రం అర్ధం చేసుకుని , ఆపైన,  వాటిని జాగ్రత్తగా అతికించి, తాపీగా ఎవరివి వాళ్ళకు బట్వాడా చేయడం అన్నది  వూరి పోస్ట్ మాస్టరుగా తనకున్న కాపీరైట్‌ అని  భావిస్తూ - ఆ కర్తవ్య నిర్వహణని ఎంతో నిష్టగా సాగిస్తూ వుండేవాడు.  అంతటితో ఆగితే ఏ చిక్కూ లేకపోను. సదరు ఉత్తరాల చిరునామాదారులు ఎదురైనప్పుడు ఏమయ్యా ! రామం! మీ ఆవిడకి మీ అమ్మతో బొత్తిగా పడడం లేదా ఏమిటి?'  అంటూ ఆరాలు తీసేవాడు.  ఇలా చాన్నాళ్లు  అతగాడి సెన్సార్‌షిప్‌ని మౌనంగా భరిస్తూ వచ్చిన ఆ వూరి కొత్తకోడలు ఒకావిడ - ఓసారి పుట్టింటికి పోయినప్పుడు మొగుడికి రాసిన ఉత్తరంలో విషయాలన్నీ రాస్తూ చివరాఖర్న `దడిగాడువానవిదిచ' అని రాసి వూరుకుంది. అంటే చదివినవాడు గాడిదఅన్నది తిరగేసిరాసిన ఆ వాక్యానికి అర్ధం.  కానీ భార్యాభర్తల నడుమ సాగే ఉత్తరాయణంలో ప్రతి అక్షరాన్ని పొల్లుపోకుండా చదివే వెధవ అలవాటున్న ఆ పెద్ద వెధవ  - మర్నాడు ఆ మొగుడు శాల్తీ తారసపడ్డప్పుడు ` ఏమో అనుకున్నాను. ఎంతయినా మీ ఆవిడకు కోపం పాలు కాస్త ఎక్కువే ' అన్నాడట ఏ మాత్రం సిగ్గుపడకుండా.
తాజాతోక
చివర్లో `తాజాకలం' బదులు `తాజాతోక' అనే పదం వాడడం వల్లా ఈ రెండూ ఎక్కడో విన్నట్టుగా వుందే అనే ఫీలింగ్‌ పాఠకులకు కలిగితే దానికి రచయిత పూచీ ఎంతమాత్రం లేదనన్నీ,  ఆ పదాలపై అన్ని స్వామ్యములు, ఈప్రజాస్వామ్యదేశంలో,   ఏ కొందరివో కాక అందరివనన్నీ సమస్త ప్రజానీకానికీ ఇందుమూలంగా తెలియచేయడమైనది. – రాయని రచయిత 

ఏరీ! వారేరీ! కనరారే!


(2010 ఫిబ్రవరి తొమ్మిదో తేదీన రాసింది)

ఆ దృశ్యం చాలా అపురూపం. చూడ ముచ్చటగా వుంది. సెల్ ఫోన్లో ఫోటో తీసి శాశ్వితంగా భద్రపరచుకోవాలనిమనసులో గట్టిగా అనిపించి కూడా  కూడా సభ్యత కాదని తమాయించుకున్నవారు ఎంతోమంది.


(ఈరోజు మహానటుడు ఎన్టీయార్ వర్ధంతి)


అందులోకనబడుతున్నవారందరూ పెద్ద వాళ్లే! ఆరేడుపదుల వయస్సు పైబడ్డ వాళ్లే!

చేతికర్ర ఊతంతో కొందరు-

భార్య భుజం ఆసరాతో మరి కొందరు-

మొగుడిచేయి పట్టుకుని ఇంకొందరు-

'రంగుల' మాయా బజార్ ఆడుతున్న అదునాతన థియేటర్ కాంప్లెక్స్ లో

నెమ్మదిగా పైపైకి పాకుతున్న ఎస్కలేటర్ పై నిలుచుని వెడుతున్నదృశ్యం 'జగన్మోహనంగా' గోచరించింది.

జీవన పధంలో మూడు వంతులకు పైగా నడిచివచ్చిన ఆ ముదివగ్గులందరూ - గతంలోని మధురిమను మరోసారి మనసారా నెమరు వేసుకోవాలని వచ్చిన వారిలా కానవచ్చారు.

వీళ్ళల్లో కొందరయినా- .

బళ్ళు కట్టుకుని పోరుగునవున్న బస్తీకి పోయి - మూడు నాలుగు ఇంటర్వెల్స్ తో టూరింగ్ టాకీస్ లో ఆ సినిమా చూసివుంటారు.

లేదా సినిమా చూడమని అమ్మా నాన్నా ఇచ్చిన అర్ధ రూపాయిలో ఒక బేడానో, పావులానో పెట్టి ముంతకింద పప్పుకొనుక్కొని, గోలీ సోడా తాగి నేల టిక్కెట్టుతో సరిపెట్టుకున్న వాళ్ళుంటారు.

బెజవాడ దుర్గా కళా మందిరంలో మేడ మీద గోడను ఆనుకుని నిర్మించిన పరిమిత సీట్ల చిన్న బాల్కానీలో దర్జాగా కూర్చుని చూసినవాళ్ళు వుండివుంటారు.

మొదటిసారి వచ్చినప్పుడు, రావడం ఆలస్యమై చిన్న శశిరేఖమ్మ పాట చూడలేకపోయినవాళ్ళు - మరునాడు ముందుగా వచ్చేసి ఆట మొదటినుంచీ చూసినవాళ్ళు వుండేవుంటారు.

సినిమాలు ఇలా కూడా తీస్తారా అని బోలెడు బోలెడు ఆశ్చర్య పోతూ మళ్ళీ మళ్ళీ చూసినవాళ్ళు తప్పకుండా వుంటారు.

అందుకే ఈ రోజున ఆ సినిమా మళ్ళీ చూస్తూ ఆ నాటి సంగతులను గుర్తుకు తెచ్చుకునే వుంటారు.

పెద్ద తెరపై, స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టం తో, సినిమాస్కోప్ లో 'విజయా వారి' హనుమ కేతనం హోరున ఎగురుతుంటే కళ్ళార్పకుండా ఒక పక్క చూస్తూనే మరో పక్క తమ మనోఫలకాలపై పాత జ్ఞాపకాలను 'రీవైండ్' చేసుకునే వుంటారు.
 అందుకే అంత నిశ్శబ్దంగా వున్న హాలులో అన్ని గుసగుసలు. అన్ని ధ్వనులు చెలరేగుతున్న థియేటర్ లో ముందుకు ముందే వినబడుతున్న డైలాగులు. నటులు నోరు తెరవకముందే వాళ్ళు ఏమంటారో ముందే ప్రేక్షకులు అనేస్తుంటారు.  చిన్న చిన్న సంభాషణలలో యెంత పెద్ద అర్ధం దాగునివుందో పక్కవారికి చెప్పేస్తుంటారు. పాటలు వస్తూనే గొంతు కలిపి పాడుతుంటారు. జరగబోయేది చెప్పేస్తుంటారు. వినే వాళ్లకి కూడా అంతా తెలిసే వింటుంటారు. ఆహా ఓహో అని ముక్తాయింపు ఇస్తుంటారు. హోల్ మొత్తం హాలంతా ఇదే తంతు. ఎవరూ విసుక్కునే వాళ్ళుండరు. ఎందుకంటె అందరిదీ ఇదే వరస.

వున్నట్టుండి, కనీకనబడకుండా, లైట్లు వెలుగుతాయి.  అప్పుడే ఇంటర్వెల్లా! అని చూస్తే- ఆ వేళ కాని వేళలో , సంధ్యాసమయంలో 'వర్కింగ్ డే' రోజునవేసిన ఆ ఆటకు హాలు మూడువంతులు నిండి పోయి వుంటుంది.   కానీ ఆ సంతోషం వెంటనే ఆవిరి అయిపోతుంది. అవును!  ఈ సినిమా తప్పకుండా చూడాల్సిన చిన్నారులేరీ! ఏరీ! వారేరీ! కనబడరేమీ!

బహుశా పరీక్షల రోజులేమో! సినిమాకు తీసుకురావాల్సిన తలిదండ్రులకు తీరుబడి దొరకలేదేమో. మరో రోజు చూపిస్తారేమో. అని మనసు మూలల్లో ఎక్కడో ఒక చిన్న ఆశ.

'వుయ్ డోంట్ లైక్ టెల్గూ మూవీస్ ఎటాల్!' అంటున్న ఈనాటి తెలుగు యువతరానికి- 'మనమూ గొప్ప చిత్రాలు తీయగలం - కాదు, కాదు ఎప్పుడో చిన్నప్పుడే తీసేసాం' అని చాటి చెప్పుకోవడానికైనా - ఈ సినిమా చూపిస్తే యెంత బాగుంటుందో కదా!.

(09-02-2010)


ఇద్దరు అధికారులు – ఒకే పాఠం


(నా వ్యాపకాల జ్ఞాపకాలనుంచి)
ఎంత అల్పులమో తెలుసుకోవడానికి అనుదినం ఎదురయ్యే సంఘటనలను కొంత నిశితంగా పరిశీలిస్తే చాలని నా  అనుభవమే నాకు మరోసారి తెలియపరిచింది.
దూరదర్శన్ సప్తగిరి ఆధ్వర్యంలో హైదరాబాదు రవీంద్రభారతిలో ‘స్వర సమరం’ అనే సంగీత పోటీ జరిగింది. గవర్నర్ శ్రీ నరసింహన్ ముఖ్య అతిధి. సతీసమేతంగా హాజరయి శాస్త్రీయ సంగీతం పట్ల తమ మక్కువను చూపారు. ఆద్యంతం తెలుగులో ప్రసంగిస్తూ ఇలాటి అద్భుత కార్యక్రమాలను నిర్వహించే శక్తి కేవలం దూరదర్శన్ కు మాత్రమే వుందని ఉద్ఘాటిస్తూ, ఆ సంస్థ ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించడం ద్వారా శాస్త్రీయ  సంగీతాన్ని ప్రోత్సహించాలని ఉద్బోధించారు. సరే అసలు విషయం ఇది కాదు.
మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ ఆర్.ప్రభాకర రావు, వారి శ్రీమతి వేదవతి  సంగీతం మీద వున్న ఆసక్తితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.   శ్రీ ప్రభాకర రావు పోలీసు శాఖలో అనేక ఉన్నత పదవులను నిర్వహించి సమర్ధుడైన అధికారిగా నిరూపించుకున్నారు. ఆయన్ని గుర్తుపట్టిన దూరదర్శన్ సిబ్బందిలో కొందరు వారిని మొదటి వరుసలో కూర్చోవాల్సిందిగా అభ్యర్ధించారు. అయినా సున్నితంగా తిరస్కరించి సాధారణ ప్రేక్షకుల మాదిరిగానే వారిద్దరూ వెనుక వరుసలోనే కూర్చుని కార్యక్రమాన్ని ఆసాంతం తిలకించారు.
గవర్నర్ పాల్గొంటున్న దృష్ట్యా రవీంద్రభారతి ఆవరణలో కట్టుదిట్టమయిన పోలీసు బందోబస్తు చేశారు. కార్యక్రమం ముగిసిన తరువాత  రంగస్థలం మీద కళాకారులను అభినందిస్తూ  నరసింహన్ దంపతులు  కొద్దిసేపు అక్కడే వుండిపోయారు. ప్రభాకరరావు దంపతులు ఈలోగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నించగా ద్వారం వద్దవున్న పోలీసు అధికారులు అడ్డగించారు. కొత్తగా ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తున్న ఆ సిబ్బందికి తాము అభ్యంతరం చెబుతున్న వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం తమ శాఖకు అత్యున్నత అధికారిగా పనిచేశారన్న విషయం తెలిసివుండక పోవచ్చు. మధ్యలో ఎవరో కల్పించుకుని ఆయన ఎవరో చెప్పబోతుంటే శ్రీ ప్రభాకర రావు వద్దని సైగచేసారు. వారి డ్యూటీ వారిని చేయనీయండిఅంటూ మళ్ళీ వెనక్కు వచ్చి హాలులో కూర్చుండిపోయారు.
రోజు తిరగకుండా మరో సారి మళ్ళీ ఇదేమాదిరి సంఘటన అనుభవంలోకి వచ్చింది. మర్నాడు  ఆదివారం గవర్నర్ శ్రీ నరసింహన్ పుట్టినరోజు. రాజభవన్ లో అనేకమంది వారిని కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేసారు. శ్రీ నరసింహన్ పూర్వాశ్రమంలో పోలీసు అధికారిగా పనిచేసినందువల్లనేమో లోగడ పోలీసు శాఖలో ఉన్నత పదవుల్లో పనిచేసిన అనేకమంది గవర్నర్ ను అభినందించడానికి రాజ్ భవన్ కు వచ్చారు. గతంలో రేడియోలో పనిచేసి నప్పుడు సన్నిహితంగా మెలిగిన అనేకమంది  అధికారులను చాలా సంవత్సరాల తరువాత అక్కడ కలుసుకోవడం జరిగింది. వారిలో శ్రీ రామస్వామి ఒకరు. ఆయన హైదరాబాదు పోలీసు కమీషనర్ గా  పనిచేశారు. నిబంధనల ప్రకారం తన సెల్ ఫోనును కారులో బయటే వుంచేసి లోపలకు రావడం చూసి ఆ విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే పోలీసుశాఖలో ఇన్నేళ్ళు పనిచేసి మేమే రూల్స్ పాటించకపోతే యెట్లాఅన్నట్టు చిరునవ్వే సమాధానం.
ఎదిగినకొద్దీ వొదగమని ఓ సినీ కవి  చక్కని పాట రాశారు. విన్నప్పుడల్లా యెంత చక్కని పాట అని ఎన్నోసార్లు అనుకుంటాం. కాని సందర్భం వచ్చినప్పుడు మాత్రం గుర్తురాదు. ఉద్యోగం ద్వారా సమకూడిన హోదా ఒక్కటే గుర్తుంటుంది.
ఒక రోజు తేడాతో చూసిన ఈ రెండు సంఘటనలు మనసుపై మంచి ముద్రవేశాయి. అలా వుండగలిగితే  యెంత బాగుండు ఒక్క క్షణం అనిపిస్తుంది. కాని మనసు కోతి లాటిది. దానికి తోడు,  పాడు అహం ఆ ఆలోచనను అనుక్షణం చంపేస్తూనే వుంటుంది. ఏం చేస్తాం! (05-11-2012)