3, మార్చి 2013, ఆదివారం

మనశ్శాంతికి మార్గం

బుద్ధుడు అంతేవాసులతో కలసి అడవి మార్గాన వెడుతున్నాడు.
దోవలో ఆగి ఒక శిష్యుడిని పిలిచి ‘దాహంగా వుంది మంచి నీళ్ళు పట్టుకురమ్మ’ని కోరాడు.
అతడు చుట్టుపక్కల పరికిచి చూస్తే దగ్గరలో ఓ వాగు కనిపించింది. ఆకుల దొన్నెలో నీళ్ళు పట్టుకురాబోయేలోగా ఒక  ఎడ్లబండి అటుగా వచ్చింది. ఎడ్లు వాగుదాటే క్రమంలో  అందులోని  నీళ్లన్నీ మురుకులుగా మారాయి. ఆ నీటిని తీసుకువెళ్లడం ఆ శిష్యుడికి మనస్కరించలేదు.
తిరిగి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి వున్న విషయం మనవి చేసుకున్నాడు. ‘స్వామీ! వాగులో నీరు మురికి మురికిగా వుంది’  
బుద్ధుడు తలపంకించి వూరుకున్నాడు.         

అప్పటికి అక్కడే విశ్రాంతికోసం  విడిది చేసిన బుద్ధుడు కొంతసేపు గడిచిన తరువాత అదే శిష్యుడిని పిలిచి మంచి నీరు పట్టుకు రావాల్సిందని మళ్ళీ కోరాడు.
శిష్యుడు మళ్ళీ వాగువద్దకు వెళ్లాడు.  
అప్పటికీ వాగులో నీళ్ళు  తేరుకోలేదు.  బురద బురదగానే వున్నాయి.
శిష్యుడు తిరిగి వచ్చి అదే విషయం బుద్ధుడితో చెప్పాడు. బుద్ధుడు ఏమీ మాట్లాడలేదు.
మరి కొద్ది సేపటిలోనే ఆ శిష్యుడికి మళ్ళీ పిలుపు. నీళ్ళు తెమ్మని గురువుగారి అర్ధింపు.
ఈసారి వెళ్లేసరికి వాగులో నీరు తేరుకుని వున్నాయి. నిర్మలంగా వున్న నీటిని ఆకు దొన్నెలో తెచ్చి గురువు గారికి అందించాడు.
బుద్ధుడు ఆ నీటిని సేవించి శిష్యుడితో ఇలా అన్నాడు.
‘దీన్నిబట్టి నీకేం అర్ధం అయింది. ముందు వెళ్ళినప్పుడు వాగులో నీళ్ళు మురికిగా వున్నాయి.   
‘కొంత వ్యవధానం తరువాత అవే తేరుకున్నాయి. అవి అలా తేరుకోవడానికి మనం చేసినదేమీ లేదు. కొంత వ్యవధి ఇచ్చాం అంతే.
 ‘మన మనసు కూడా ఆ వాగులో నీటి మాదిరే.
‘అది కలత చెందినప్పుడు దాన్ని దాని మానాన వొదిలిపెట్టాలి. కాసేపటి తరువాత అదే కుదుట పడుతుంది.
‘ఈ మర్మం తెలుసుకోగలిగితే మనశ్శాంతి కష్టమేమీ కాదు.
‘మానసిక ప్రశాంతత కోసం వేరే  ప్రయత్నాలేవీ  అవసరం లేదు. నిజానికి ఎలాటి ప్రయత్నమూ లేకుండానే దాన్ని పొందవచ్చు.’
NOTE: Courtesy Image Owner 

4 వ్యాఖ్యలు:

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

మనశ్శాంతికి మార్గం = టివి న్యూస్ చూడకుండా ఉండటం ముఖ్యంగా టి వి చర్చలు అస్సలు చూడకుండా ఉండటం. ఇదేదో నేను అనుకునేది మాత్రమే కాదు, ఈ మధ్య ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ పుస్తకం తిరగేస్తుంటే అందులో కనపడిన విషయం కూడా.

భండారు శ్రీనివాస రావు చెప్పారు...

@శివరామప్రసాదు కప్పగంతు- మీరు చెప్పింది వాస్తవం. దీనికి పుస్తకాలు కూడా తిరగెయ్యనక్కరలేదనుకుంటా.ఇది నా స్వానుభవం కూడా.మొన్న సంక్రాంతికి ఓ వారంపాటు మా వూరెళ్ళి టీవీలకూ, టీవీ చర్చలకూ దూరంగా వుండి తిరిగొచ్చిన తరువాత చూసుకుంటే నా బీపీ చాలా అదుపులో వుంది. కాకపొతే ప్రస్తుత సందర్భం బుద్ధుడి బోధనలు యెంత చక్కగా వుంటాయో తెలియచెప్పడం.ధన్యవాదాలు ప్రసాదు గారు - భండారు శ్రీనివాసరావు

SAHEBPEER SHAIK చెప్పారు...

Simple but effective way to get peace. Thanks to BSR

S.Saheb Peer,
KADAPA

భండారు శ్రీనివాస రావు చెప్పారు...

@SAHEBPEER SHAIK _ KADAPA - Thank you very much Shaik saab - Bhandaru Srinivas Rao