1, మార్చి 2013, శుక్రవారం

తేలిగ్గా తీసుకుంటే అన్నీ తేలికే



గురువుగారు ప్రవేశిస్తూ వుండగానే పరమానందయ్య గారి శిష్యులందరూ గౌరవపురస్సరంగా లేచి నిలబడి కూర్చున్నారు.
పాఠం మొదలు పెడతారని అనుకునే లోగా పరమానందయ్య  గారు చేతిసంచీలోనుంచి ఒక భరిణ బయటకు తీసి పట్టుకున్నారు.
‘దీని  తూకం  పది కాసులు. మరి దీని బరువు ఎంతో చెప్పండి’
గురువుగారి ప్రశ్న.
శిష్యులు అయోమయంలో పడ్డారు.  తూకం పది కాసులంటారు. మళ్ళీ బరువెంతో చెప్పమంటారు. దీంట్లో తిరకాసు ఏమిటి అన్న మీమాంసలో పడిపోయారు.
‘ఈ భరిణె బరువు పది కాసులే. అయితే నేను ఈ భరిణెను చేతిలో ఎంతసేపు పట్టుకున్నాను అన్న దానిపైనే దీని బరువు మారిపోతూ వుంటుంది.’ గురువు చెప్పడం ప్రారంభించారు.
‘ఉదాహరణకు నేను దీన్ని ఒక నిమేష మాత్రం పట్టుకున్నానని అనుకోండి. అప్పుడు దీని బరువు యెంత అన్నది నాకు సమస్యే కాదు. అదే ఓ ఘడియసేపు పట్టుకుంటే చేయి లాగుతుంది. ఝాముకాలం చేత్తో పట్టుకునే వుంటే భుజాలవరకు నరాలు లాగుతాయి. అదే ఓ రోజల్లా ఈ భరిణెను పట్టుకునే వుంటే చేయి నొప్పి కూడా అదే పరిమాణంలో పెరిగిపోతుంది.’
శిష్యులు వింటున్నారు కాని గురువు గారు ఏవైపుగా వెడుతున్నారో వెంటనే బోధపడలేదు.
‘అంటే  ఏమిటన్న మాట. తేలిగ్గావున్న వున్న వస్తువు కూడా పట్టుకుని వేళ్ళాడుతుంటే కొంతసేపటి తరువాత మోయలేని భారంగా తయారవుతుంది. మానసిక వొత్తిళ్ళు, చీకాకులు  కూడా అంతే. వెంటనే వొదిల్చుకుంటే వొదిలిపోతాయి. వాటినే తలచుకుంటూ కూర్చుంటే అవి కూడా మన నెత్తిపై తిష్ట వేసుకు కూర్చుంటాయి.
‘ప్రాపంచిక విషయాలు అన్నీ అలాగే. తేలికగా  తీసుకోగలిగితే తేలికగానే వుంటాయి’
గురువుగారు పాఠం ముగించారు. (01-03-2013)
NOTE:Courtesy Image Owner 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

chalaa baagunnadi.