శంకరం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటుంటే ఏడేళ్ళ
బుడుగు తండ్రిని అడిగాడు.
‘నేను ఇక్కడికి ఎక్కడినుంచి యెలా వచ్చాను?’
శంకరానికి ముందా ప్రశ్న అర్ధం కాలేదు. అర్ధం అయినతర్వాత దానికి
జవాబు ఏం చెప్పాలో ఓ పట్టాన అర్ధం కాలేదు.
తల్లి గర్భంలోనుంచి పిల్లలు యెలా వస్తారో చెప్పే ఈడు
కాదు పిల్లాడిది. అందుకే సమాధానం చెప్పకుండా దాటవేద్దామనుకున్నాడు. వాడి వయసా
చిన్నది. కొన్నేళ్ళు పోతే వాళ్ళకే తెలుస్తుంది అనుకునే సంస్కృతి ఇంటావంటా
వొంటబట్టించుకున్న కుటుంబమాయె.
కానీ కాసేపటి తరువాత శంకరం మనసు మార్చుకున్నాడు. ఇరవై ఒకటో
శతాబ్దంలో కూడా ఇంకా బూజు పట్టిన పాత సంస్కృతినే పట్టుకుని వేలాడితే యెలా అని కూడా
అనుకున్నాడు. అందుకే స్త్రీల గర్భధారణ
గురించీ, నవమాసాలు మోసి బిడ్డను కనే దాకా అతడు ఎక్కడినుంచి భూమిమీదకు యెలా వచ్చాడో
అంతా అరటిపండు వొలిచి చెప్పినట్టు పిల్లాడికి చెప్పేసి ‘అమ్మయ్య’ అనుకున్నాడు. తను
అందరిలాటి తండ్రిని కాదు కొంత స్పెషల్ అని కూడా అనుకున్నాడు.
మరి కాసేపటికి బుర్రలో బల్బ్ వెలిగింది.
వున్నట్టుండి బుడుగు ఎందుకా ప్రశ్న వేసాడు. అదే అడిగాడు.
బుడుగు జవాబుతో శంకరం
బుర్ర గిర్రున తిరిగింది.
“ఏం లేదు నాన్నా! నిన్న మన పక్క వాటాలో దిగిన సుందరం అంకుల్
పిల్లాడిని మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే అమలాపురం నుంచి అన్నాడు. దాంతో
మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలని నిన్నడిగాను. అంతే!”
(నెట్లో కానవచ్చిన ఇంగ్లీష్ ఆర్టికిల్ ఆధారంగా)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి