21, మార్చి 2013, గురువారం

జపాన్ దేశం చూడరబాబూ!



రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడికి గురై సర్వనాశనమయిన జపాన్ ఈనాడు సర్వ సంపదలతో తులతూగగలుగుతున్నదంటే దానికి కారణం అక్కడి ప్రభుత్వాలే అయినప్పటికీ మూలకారణం మాత్రం ఆ దేశపు ప్రజలే. వారి దీక్షాదక్షతలే జపాన్ దేశానికి  ప్రపంచదేశాల్లో ప్రముఖస్థానాన్ని కట్టబెట్టాయి. హిరోషిమా మీద అణుబాంబు పడి ఆ ప్రాంతం భస్మీపటలం  అయిన తరువాత అది కేవలం పదేళ్ళ కాలంలో పూర్తిగా తన పూర్వ ఆర్ధిక వైభవాన్ని అందుకోగలిగిందంటే దానికి కారణం ఆ దేశపు ప్రజల్లోని ఆత్మ స్తైర్యం.  
మామూలుగా భూకంపం సంభవిస్తే ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. అలాటిది  ఏటా కొన్ని వందల భూకంపాలు ఆ దేశాన్ని కుదిపేస్తుంటాయి. అయినా వాటిని తట్టుకుంటూ మొత్తం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా జపాన్ ఆవిర్భవించగలిగింది. పైగా సహజవనరులు కూడా అంతంతమాత్రమే.
పారిశుధ్యానికి పెద్దపీట వేయడం ద్వారా ఆ దేశం అత్యంత పరిశుద్ధ దేశంగా విరాజిల్లుతోంది. అక్కడి పారిశుధ్య కార్మికులను గౌరవంగా హెల్త్ ఇంజినీర్ అని పిలుస్తారు. వేతనాలు కూడా ఆ గౌరవానికి తగ్గట్టుగానే వుంటాయి. నెలకు అయిదు వేల నుంచి ఎనిమిది వేల అమెరికన్ డాలర్లు వారికి జీతాలుగా ముట్టచెబుతున్నారంటే మాటలు కాదు.




జపాన్ పిల్లలు తమ పాఠశాలల్లో మరుగు దొడ్లతో సహా మొత్తం స్కూలు పారిశుధ్యాన్ని తామే స్వయంగా చూసుకుంటారు. ఇందుకోసం ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయిస్తారు. పైగా ఈ కార్యక్రమంలో స్కూలు టీచర్లు కూడా పాల్గొంటారు. చిన్నప్పటినుంచి వ్యక్తిగత పరిశుభ్రతకు ఇస్తున్న ఈ ప్రాధాన్యత ముందు ముందు వారి జీవితాల్లో బాగా ఉపయోగపడుతోంది. జపాన్ లో కుక్కలను పెంచేవారు వాటిని వీధుల్లో తిప్పేటప్పుడు విధిగా ఒక చేతి సంచీని దగ్గర వుంచుకుంటారు. దారిలో శునకరాజం కాలకృత్యాలు తీర్చుకుంటే దాన్ని వెంటనే శుభ్రం చేయడానికి ఈ ఏర్పాటు.
ప్రాధమిక తరగతి నుంచే పిల్లలకు పెద్దవారితో, తోటివారితో మంచి యెలా మెలగాలో నేర్పుతారు.
స్కూళ్ళలో మొదటి మూడు తరగతుల వరకు ఎలాటి పరీక్షలు వుండవు. పాఠాలు బట్టే వేయించడం, పరీక్షలు పెట్టి మార్కులు వేయడం ద్వారా విద్యార్ధుల శక్తియుక్తులను నిర్ణయించడం అక్కడి పధ్ధతి కాదు. చిన్నప్పటినుంచే పిల్లలను శీలవంతులుగా తీర్చిదిద్దడం మీదనే వారి విద్యావిధానం ఆధారపడివుంటుంది.
స్కూళ్ళల్లో భోజనం చేసిన తరువాత కూడా విద్యార్ధులు విధిగా దంతధావనం చేయాల్సి వుంటుంది. వ్యక్తిగత పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అలాగే తిన్న ఆహారం సరిగా జీర్ణం కావడానికి వీలుగా అక్కడి పిల్లలు భోజనానికి కనీసం అర్ధ గంట వ్యవధి కేటాయిస్తారు. ఇలా యెందుకు అని ఎవరయినా ప్రశ్నిస్తే పిల్లలే జపాన్ భవిష్యత్తు అని జవాబు వస్తుంది.
అత్యంత ధనిక దేశం అయినప్పటికీ అక్కడ సంపన్నులు సైతం ఇళ్ళల్లో పనివాళ్ళను పెట్టుకోరు. ఇళ్ళల్లో పనిభారం అంతా ఇంటి పెద్దలు, పిల్లలే పంచుకుంటారు.
ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్న మొబైల్ ఫోన్లు చాలావరకు తయారుచేసే దేశం జపానే. కాని ఆ దేశంలో ఏఒక్కరూ రైళ్ళలో, రెస్టారెంట్లలో మొబైల్ ఫోన్లు ఉపయోగించరు.
హోటళ్ళలో రెస్టారెంట్లలో ఆహారాన్ని వృధాచేయడం కానరాదు. అక్కడివారు తమకు యెంత కావాలో ఆ మేరకే వడ్డించుకుంటారు.
జపాన్ లో రైళ్ళు వేళ ప్రకారం నడుస్తాయి. అక్కడి రైళ్ళు ఏడాదికి సగటున ఏడు సెకన్లు ఆలశ్యంగా నడుస్తాయంటే సమయపాలన ఏవిధంగా పాటిస్తాయో అర్ధం చేసుకోవచ్చు.
(Courtesy from a net article) 

కామెంట్‌లు లేవు: