ఈ వ్యాసాలు రాసి
నాలుగయిదేళ్ళు గడిచిపోయాయి. ఆనాటి సంఘటనలు, సందర్భాలు వేరు. అందుకే వీటికి పాత చింతకాయ పచ్చడి కబుర్లు అని పేరు
పెట్టాల్సి వచ్చింది. ఇది గమనంలో వుంచుకోవాలని చదువరులకు ముందుగానే విజ్ఞప్తి
చేస్తున్నాను. తేదీలు వేసినా కొందరవి గమనించక పోయే అవకాసం వుంది కాబట్టి ఈ వినతి. - రచయిత
పీత కష్టాలు పీతవి
ముని శాపగ్రస్తుడయిన కుబేరుడు భూలోకంలో
మానవరూపంలో ముఖేష్ అంబానీ గా అవతరించి తండ్రి స్తాపించిన సువిశాల వ్యాపార
సామ్రాజ్యాన్ని మరింత విస్తరించి, అపర
కుబేరుడిగా పేరు గాంచి, పోగేసుకున్న అపార ధనరాశులతో ఏం చేయాలా అని
ఆలోచించి, ఏదో
ఒకటి చేయకపోతే బాగుండదనిపించి,
చివరకు కోట్లకు కోట్లు మంచి నీళ్ళ మాదిరిగా వెచ్చించి, ముంబై లో
ఏకంగా ఇరవై ఏడు అంతస్తుల రమ్యహర్మ్యాన్ని నిర్మించుకుని భార్యా పిల్లతో
సుఖంగా జీవిస్తున్న వైనాన్ని ఓ గిట్టని పత్రిక వైనవైనాలుగా వర్ణించి రాసింది. ఆ కధాకధనంబెట్టిదనిన -
ముఖేష్ అంబానీ తన నివాస భవనంలో పదిహేనో అంతస్తులో
వున్న పడకగదిలో నిద్రిస్తాడు. నిద్ర లేచిన తరువాత పదిహేడో అంతస్తుకువెళ్లి అక్కడ
వున్న జిమ్ లో వ్యాయామం చేసి అక్కడే
నిర్మించుకున్న అధునాతన నీటి కొలనులో కాసేపు ఈత కొడతాడు. తదుపరి,
పందొమ్మిదో అంతస్తులో బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని,
పద్నాలుగో అంతస్తులో దుస్తులు ధరించి ఆ పిదప ఇరవై ఒకటో అంతస్తుకు వెడతాడు.
అక్కడవున్న బ్రీఫ్ కేసు, అవసరమయిన
ఫైళ్ళు తీసుకుని పదహారో అంతస్తులో వెయిట్ చేస్తున్న భార్యకు టాటా చెప్పి పదమూడో
అంతస్తులో స్కూలుకు వెళ్ళడానికి తయారవుతున్న పిల్లలను పలకరిస్తాడు. ఆ పిమ్మట మూడో అంతస్తులో వున్న పార్కింగ్ ప్లేసులో
పార్కుచేసివున్న రెండున్నర కోట్ల రూపాయలు ఖరీదుచేసే మెర్సిడెస్ కారెక్కి సొంతంగా
డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసుకు వెడతాడు.
ఇంతవరకూ కధ బాగానే వుంది. కానీ విధి విచిత్రమైనది
కదా! ప్రతిరోజూ ఒకేరకంగా వుండదు. కదా!.
అందుకే ఓ రోజు అది అడ్డంగా అడ్డం
తిరిగింది. ఆ సంగతే ఆ పత్రిక రాసింది. ఆ కధనం ప్రకారం ఓ రోజు యధావిధిగా అన్ని అంతస్తుల్లో
తన దినసరి దినచర్యలను ముగించుకుని కారెక్కడానికి
మూడో అంతస్తుకు చేరుకున్న ముఖేష్ కు కారు తాళాలు మరిచివచ్చిన సంగతి
గుర్తుకు వచ్చింది.
ఎక్కడ మరచినట్టు ?
పదిహేనో అంతస్తులోనా ? లేక
పదిహేడా! పదా! పద్నాలుగా! ఇరవై ఒకటో అంతస్తులోనా లేక పదహారులోనా! లేదా పదమూడో
అంతస్తులో పిల్లలను పలకరించి
వస్తున్నప్పుడా? ఎక్కడ
మరచిపోయినట్టు. తల గోక్కుంటే తండ్రి వారసత్వంగా వచ్చిన బట్ట తల తగిలింది కాని తాళాలు గురించిన లైటు మాత్రం వెలగలేదు.
కానీ అంబానీనా
మజాకానా!
యజమాని తాళాలు మరచిన విషయం తెలియగానే అన్ని
అంతస్తుల్లోవున్న యావత్తు సిబ్బంది అలర్ట్ అయిపోయారు. నౌకర్లు, చాకర్లు, బట్లర్లు, సెక్రెటరీలు, జిమ్ ట్రైనర్లు, వంటవాళ్ళు, వడ్డించేవాళ్ళు, అటెండెంట్లు, అంట్లుతోమేవాళ్లు, లిఫ్ట్
బాయిలు, ఒకరా
ఇద్దరా లెక్కకు మిక్కిలిగావున్న పనివాళ్ళ ఫోన్లన్నీ ఒకేసారి రకరకాల రింగు టోన్లతో
గణగణా మోగాయి. కానీ ఏం లాభం! తాళం చేతుల జాడ లేదు. కాలమే ధనంగా భావించే అంబానీ
మహాశయులవారు ఇక చేసేదేమీ లేక ఆ రోజుకు అంతేనని
సరిపెట్టుకుని ఏదో ఒక కోటి రూపాయలు కిమ్మతు మరో ఒక చిన్న కారులో డ్రైవర్ ను తీసుకుని ఆఫీసుకు
వెళ్ళిపోయారు.
అంతటితో ముగిస్తే కధ ఏముంది? కధ ఎందుకవుతుంది?
అంబానీ వెళ్లి పోయిన తరువాత కూడా అంబానీ సిబ్బంది తాళాల అన్వేషణ కొనసాగించారు. ఆ క్రమంలో మరో ఆసక్తికరమయిన
విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో బట్టలు ఉతకడానికి కొత్తగా పనిలో కుదిరిన ఓ
పనిమనిషి కారు తాళాలున్న అంబానీ గారి
ప్యాంటును, ఆ ప్యాంటు జేబూలోని కారు తాళాల సమేతంగా సుతారంగా ఉతికి
ఝాడించి పదహారో అంతస్తులో
ఆరేసింది. అలా అన్నో అంతస్తుమీద ఆనందంగా ఆరుతున్న ఆ ప్యాంటు ఆరీ ఆరకముందే అక్కడ
హోరున వీస్తున్న గాలికి ఎంచక్కా
ఎగిరిపోయింది. ప్యాంటుతో పాటు రెండున్నర
కోట్ల రూపాయల కారు తాళాలు కూడా గాలిలో కలిసిపోయాయి.
కధ
అంతటితో ఆగిందా అంటే లేదు. ఆగితే, ముందే
చెప్పినట్టు కధ ఎందుకవుతుంది. అందులోను
అంబానీవారి కధాయె! అందుకని కధ మరో ఆసక్తికరమయిన మలుపు తిరిగి కూర్చుంది.
ఆ రోజు రాత్రి పదహారో అంతస్తులోని పడకగదిలో పడుకుని
అంబానీ అర్ధాంగి, తను
కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో మొదలై, ఇప్పటిదాకా జీడిపాకంలా సాగిపోతున్న టీవీ సీరియల్
నాలుగువేల నలభయ్యో ఎపిసోడ్ చూసి - పాలలో
విషం కలిపి అత్తగారిని చంపాలని ఆవిడ బెడ్ రూమ్ లోకి ఏడాది క్రితం బయలుదేరిన కోడలు
పిల్ల ఆ పాల గ్లాసు అత్తగారి చేతికి ఇవ్వకముందే ఆనాటి ఎపిసోడ్ పూర్తి కావడంతో, ఆ అమ్మడు అనుకున్న పని చేస్తుందో లేదో
అత్తగారు హరీ అంటుందో లేదో అన్న సస్పెన్స్ ఓపట్టాన తెగక నిద్రపట్టక
దొర్లుతూ పైన ఏదో శబ్దం వినిపించి లేచి
చూసింది. అంత పెద్ద ఇంట్లో ఏమూల ఏం జరుగుతున్నా ఇట్టే పట్టేసే పత్తేదారు టీవీ తెరలు మూల మూలల్లో వున్న కారణంగా, భవనం పై భాగంలో అంబానీ తనకోసం నిర్మించుకున్న
హెలిపాడుపై దిగుతున్న హెలికాప్టర్ ఆమె
కళ్ళబడింది. దాంతో ఆమె కలత నిద్ర
కాస్తా పటాపంచలై కొంగొత్త కలత మనసును పట్టుకుంది. ఇంత రాత్రప్పుడు మొగుడు హెలికాప్టర్ లో ఎక్కడ
చక్కర్లు కొట్టి వస్తున్నట్టు అన్న అనుమానం మనసు మూలల్లో సన్నగా చిన్నగా మొదలై పెద్దగా పెరిగి పెనుభూతమై
కూర్చుంది. ‘యెంత సంపాదించే మొగుడయినా
మగాడే కదా. మొన్నొక రోజు ఏదో ఫంక్షన్ లో ఓ సినీ హీరోయిన్ వంక వంకర చూపులు చూస్తున్నప్పుడే
తను జాగ్రత్త పడి వుండాల్సింది. అయినా
ఇన్నేళ్ళొచ్చి, ఇవేం బుద్దులు? ఇంట్లో ఎదిగిన పిల్లల్ని పెట్టుకుని ఇలా
చెడు తిరుగుళ్ళు తిరగడానికి బుద్ధి
వుండక్కరలేదా అవటా!’ అంటూ అపరాత్రి అని
కూడా చూడకుండా అత్తగారిని కావిలించుకుని భోరుమంది. అర్ధరాత్రి ఈ కాకి గోలేమిటని
విసుక్కున్న అత్త కోకిలా బెన్, వాడివన్నీ తండ్రి బుద్ధులే అని నసుక్కుంటూ,
విసుక్కుంటూ ఆ రాత్రే కొడుకుని పిలిచి
పంచాయితీ పెట్టింది. చవితినాడు నోముకోకుండా చైనాలో బిజినెస్ టూర్లో వున్న పాపానికి
తనపై పడ్డ నీలాపనింద ఇదా అనుకుని ఎంతో ఇదయిపోయిన ముఖేష్ అంబానీ మరోసారి బట్ట తలను
తడుముకుంటే అసలు విషయం గుర్తుకువచ్చింది. ఆ రోజు కారు తాళాలు పోయిన సంగతి మెర్సిడెస్ కంపెనీ వారికి తెలియచేస్తే
వారు తమ హోదాకు తగ్గట్టుగా ఆ రాత్రికి రాత్రే హెలికాప్టర్ ద్వారా కారు తాళాలను
బట్వాడా చేసారట. అంబానీ అర్ధాంగి ఆ రాత్రి
చూసి అపార్ధం చేసుకున్న హెలికాప్టర్ అదేనట!.
పీత కష్టాలు పీతవి అంటే ఇదే కాబోలు.
5 కామెంట్‌లు:
hahaha nice sir
పాత చింతకాయ పచ్చడి కబుర్లు - 4 మొదటసారిగా చదివా. ఆసక్తికరమైన కథనం.
@sarada and @ cb rao - అమ్మయ్య - ఇవి కొత్తగా రాసినవి కావు. ఎక్కడో చదివినట్టు వుందే అంటారేమోనని అనుకున్నా. నిజానికి ఇలాటివన్నీ నెట్లో ఇంగ్లీష్ లో షికారు చేస్తున్నవే. వాటికి కాస్త తెలుగు అద్ది ఇలా తయారు చేస్తున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి