31, జులై 2010, శనివారం

అమెరికా అనుభవాలు - 22

అమెరికా అనుభవాలు - 22




చిరంజీవి క్రేజ్




ఏ దేశమేగినా నేనే నెంబర్  వన్

 
సియాటిల్ లో వుండగా రెండు సినిమాలు చూసాము. చిరంజీవి నటించిన ‘టాగూర్’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ వున్నారని తెలుసుకుని చూద్దామని వెళ్ళాము. ఒక్కొక్క టిక్కెట్టు పది డాలర్లు. మామూలుగా అమెరికన్ సినిమాలయితే ఇంత ఖరీదు వుండదు. నెట్లో టికెట్లు బుక్ చేసుకున్నాము. హౌస్ ఫుల్ అయింది. సియాటిల్ లో అంత మంది తెలుగు వాళ్ళు వున్న సంగతి ఆ సినిమాకు వెళ్ళినతరవాత తెలిసింది. హైదరాబాద్ క్రాస్ రోడ్ లో సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఒకటే చప్పట్లు- డాన్సులు. తెరమీద చిరంజీవి కనిపించినప్పుడల్లా ఈలలు-కేకలు. సినిమా ప్రొజెక్షన్ చేస్తున్న అమెరికన్ ఆపరేటర్ కి బుర్ర తిరిగిపోయి వుంటుంది. నాలాటి వాళ్ళు – అంటే అయిదు పదులు దాటిన వాళ్ళు – నాలుగయిదు జంటలు తప్ప మిగిలిన ప్రేక్షకులందరూ ముప్పయి సంవత్సరాల లోపు వాళ్ళే.






మరో రోజు ఏ ఎం సీ అంటే అమెరికన్ మూవీ కార్పోరేషన్ నిర్వహించే సినిమా హాలులో ఒక ఇంగ్లీష్ సినిమా చూసాము. ఈ కార్పోరేషన్ కు దేశమంతటా థియేటర్ లు వున్నాయి. ఒక్కో కాంప్లెక్స్ లో అనేక థియేటర్ లు వుంటాయి. కౌంటర్ దగ్గర టికెట్ తీసుకునే వద్దనుంచి ఇంటర్వెల్ లో కాంటీన్ సర్వీసు వరకు ప్రేక్షకులందరూ ఎంతో క్రమ శిక్షణతో మెలుగుతారు. ఎల్లో లైన్ దాటి వెళ్లరు. చాల సినిమా హాళ్ళలో కష్టమర్ సర్వీసు సెంటర్లు వుంటాయి. అనువయిన సీటు దొరకలేదని వాళ్లకు పిర్యాదు చేస్తే కోరిన సీటు కేటాయించి తరువాత ఆటకు పంపుతారు. కౌంటర్ దగ్గర టికెట్ కొనుక్కునే పద్ధతికి అదనంగా ఇప్పుడు అన్ని సినిమా హాళ్ళలో టికెట్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి ఎవరికివారే కావాల్సిన టికెట్లు కొనుక్కోవచ్చు.



మైక్రోసాఫ్ట్ టెంపుల్


పశ్చిమంలో పరమేశ్వరుడు


సియాటిల్ లో హిందూ రెలిజియన్ సెంటర్ వుంది. దీని నిర్మాణానికి మైక్రోసాఫ్ట్ సంస్త లక్షల డాలర్ల భూరి విరాళం ఇచ్చింది. గుడి ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా వుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి – శివపార్వతులు – లక్ష్మీనారాయణలు – గణపతి – కుమారస్వామి – ఇలా ఎందరో దేవతా మూర్తుల పాలరాతి విగ్రహాలు ప్రతిష్టించారు. ఇక్కడి పూజారి తెలుగువారే. భార్యా కుమార్తె తో కలసి ఆలయ ఆవరణ లోనే నిర్మించిన ఇంట్లో వుంటారు. డిల్లీ లో సంస్కృతంలో పీజీ చేసారు. హైదరాబాదులో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్త లో పని చేస్తున్న శ్రీ విజయరాఘవాచారి తనకు గురు సమానులని చెప్పారు. ఈ గుడిలో నిర్వహించిన దసరా, దీపావళి ఉత్సవాలకు మేము కూడా హాజరయ్యాము.

వెల్లువెత్తిన తెలుగుతనం

మరో రోజు సియాటిల్ ఆంధ్రా అసోసియేషన్ వారు నిర్వహించిన కార్యక్రమానికి వెళ్ళాము. ఒక స్కూల్లోని ఆడిటోరియం లో దాన్ని నిర్వహించారు.



 అది చూసిన తరవాత ఆ స్కూలు విద్యార్ధులు యెంత అదృష్టవంతులో అనిపించింది. క్రీడా మైదానం, బాస్కెట్ బాల్ కోర్టు, ఫుట్ బాల్ మైదానం, స్విమ్మింగ్ పూల్, కంప్యూటర్ లేబొరేటరీ, కారు పార్కింగ్ స్తలం చూస్తుంటే ఈ దేశంలో విద్యారంగానికి యెంత పెద్ద పీట వేస్తున్నారో అర్ధమయింది.

మారని కట్టూ బొట్టూ


ఆంధ్రా అసోసియేషన్ వారి సాంస్కృతిక కార్యక్రమం కూడా చాలా బాగుంది.చక్కని హాస్య నాటికతో పాటు – సంగీత విభావరిని నిర్వహించారు. ప్రేక్షకులందరూ 30-35 సంవత్సరాల మధ్య వయస్సు వారే. యిప్పటి సినిమా పాటలతో పాటు యాభయి సంవత్సరాల కిందటి తెలుగు సినిమా పాటలను స్వర బద్ధంగా పాడడం అద్భుతంగా తోచింది.
 అలాగే నాటిక కూడా. వేషాలు వేసినవారందరూ బిజీగా ఉదయం నుంచి రాత్రి వరకూ ఉద్యోగాలతో తీరిక లేనివాళ్ళే. ఎప్పుడు రిహార్సల్స్ అవీ చేసారో కానీ ఎక్కడా తడబడకుండా ప్రదర్శనని రక్తి కట్టించారు.

NOTE: All Images in this blog are copy righted to their respective owners

కామెంట్‌లు లేవు: