భండారు శ్రీనివాసరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భండారు శ్రీనివాసరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, జులై 2010, శనివారం

అమెరికా అనుభవాలు - 22

అమెరికా అనుభవాలు - 22




చిరంజీవి క్రేజ్




ఏ దేశమేగినా నేనే నెంబర్  వన్

 
సియాటిల్ లో వుండగా రెండు సినిమాలు చూసాము. చిరంజీవి నటించిన ‘టాగూర్’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ వున్నారని తెలుసుకుని చూద్దామని వెళ్ళాము. ఒక్కొక్క టిక్కెట్టు పది డాలర్లు. మామూలుగా అమెరికన్ సినిమాలయితే ఇంత ఖరీదు వుండదు. నెట్లో టికెట్లు బుక్ చేసుకున్నాము. హౌస్ ఫుల్ అయింది. సియాటిల్ లో అంత మంది తెలుగు వాళ్ళు వున్న సంగతి ఆ సినిమాకు వెళ్ళినతరవాత తెలిసింది. హైదరాబాద్ క్రాస్ రోడ్ లో సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఒకటే చప్పట్లు- డాన్సులు. తెరమీద చిరంజీవి కనిపించినప్పుడల్లా ఈలలు-కేకలు. సినిమా ప్రొజెక్షన్ చేస్తున్న అమెరికన్ ఆపరేటర్ కి బుర్ర తిరిగిపోయి వుంటుంది. నాలాటి వాళ్ళు – అంటే అయిదు పదులు దాటిన వాళ్ళు – నాలుగయిదు జంటలు తప్ప మిగిలిన ప్రేక్షకులందరూ ముప్పయి సంవత్సరాల లోపు వాళ్ళే.






మరో రోజు ఏ ఎం సీ అంటే అమెరికన్ మూవీ కార్పోరేషన్ నిర్వహించే సినిమా హాలులో ఒక ఇంగ్లీష్ సినిమా చూసాము. ఈ కార్పోరేషన్ కు దేశమంతటా థియేటర్ లు వున్నాయి. ఒక్కో కాంప్లెక్స్ లో అనేక థియేటర్ లు వుంటాయి. కౌంటర్ దగ్గర టికెట్ తీసుకునే వద్దనుంచి ఇంటర్వెల్ లో కాంటీన్ సర్వీసు వరకు ప్రేక్షకులందరూ ఎంతో క్రమ శిక్షణతో మెలుగుతారు. ఎల్లో లైన్ దాటి వెళ్లరు. చాల సినిమా హాళ్ళలో కష్టమర్ సర్వీసు సెంటర్లు వుంటాయి. అనువయిన సీటు దొరకలేదని వాళ్లకు పిర్యాదు చేస్తే కోరిన సీటు కేటాయించి తరువాత ఆటకు పంపుతారు. కౌంటర్ దగ్గర టికెట్ కొనుక్కునే పద్ధతికి అదనంగా ఇప్పుడు అన్ని సినిమా హాళ్ళలో టికెట్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి ఎవరికివారే కావాల్సిన టికెట్లు కొనుక్కోవచ్చు.



మైక్రోసాఫ్ట్ టెంపుల్


పశ్చిమంలో పరమేశ్వరుడు


సియాటిల్ లో హిందూ రెలిజియన్ సెంటర్ వుంది. దీని నిర్మాణానికి మైక్రోసాఫ్ట్ సంస్త లక్షల డాలర్ల భూరి విరాళం ఇచ్చింది. గుడి ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా వుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి – శివపార్వతులు – లక్ష్మీనారాయణలు – గణపతి – కుమారస్వామి – ఇలా ఎందరో దేవతా మూర్తుల పాలరాతి విగ్రహాలు ప్రతిష్టించారు. ఇక్కడి పూజారి తెలుగువారే. భార్యా కుమార్తె తో కలసి ఆలయ ఆవరణ లోనే నిర్మించిన ఇంట్లో వుంటారు. డిల్లీ లో సంస్కృతంలో పీజీ చేసారు. హైదరాబాదులో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్త లో పని చేస్తున్న శ్రీ విజయరాఘవాచారి తనకు గురు సమానులని చెప్పారు. ఈ గుడిలో నిర్వహించిన దసరా, దీపావళి ఉత్సవాలకు మేము కూడా హాజరయ్యాము.

వెల్లువెత్తిన తెలుగుతనం

మరో రోజు సియాటిల్ ఆంధ్రా అసోసియేషన్ వారు నిర్వహించిన కార్యక్రమానికి వెళ్ళాము. ఒక స్కూల్లోని ఆడిటోరియం లో దాన్ని నిర్వహించారు.



 అది చూసిన తరవాత ఆ స్కూలు విద్యార్ధులు యెంత అదృష్టవంతులో అనిపించింది. క్రీడా మైదానం, బాస్కెట్ బాల్ కోర్టు, ఫుట్ బాల్ మైదానం, స్విమ్మింగ్ పూల్, కంప్యూటర్ లేబొరేటరీ, కారు పార్కింగ్ స్తలం చూస్తుంటే ఈ దేశంలో విద్యారంగానికి యెంత పెద్ద పీట వేస్తున్నారో అర్ధమయింది.

మారని కట్టూ బొట్టూ


ఆంధ్రా అసోసియేషన్ వారి సాంస్కృతిక కార్యక్రమం కూడా చాలా బాగుంది.చక్కని హాస్య నాటికతో పాటు – సంగీత విభావరిని నిర్వహించారు. ప్రేక్షకులందరూ 30-35 సంవత్సరాల మధ్య వయస్సు వారే. యిప్పటి సినిమా పాటలతో పాటు యాభయి సంవత్సరాల కిందటి తెలుగు సినిమా పాటలను స్వర బద్ధంగా పాడడం అద్భుతంగా తోచింది.
 అలాగే నాటిక కూడా. వేషాలు వేసినవారందరూ బిజీగా ఉదయం నుంచి రాత్రి వరకూ ఉద్యోగాలతో తీరిక లేనివాళ్ళే. ఎప్పుడు రిహార్సల్స్ అవీ చేసారో కానీ ఎక్కడా తడబడకుండా ప్రదర్శనని రక్తి కట్టించారు.

NOTE: All Images in this blog are copy righted to their respective owners

28, జూన్ 2010, సోమవారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు) - భండారు శ్రీనివాస రావు




                                                                                    


                                                      
  


                                      

                                                                                                             


జర్నలిష్టులందరూ తమ వృత్తి అనుభవాలను గ్రంధస్తం చేస్తుండాలని మిత్రుడు దేవులపల్లి అమర్ చెబుతుంటారు.గ్రంధ  ప్రచురణ అనేది సామాన్య జర్నలిష్టులకు అలవి కాని భారం. అయినప్పటికీ, అనుభవంలోకి వచ్చిన విషయాలను కనీసం కాగితం మీద పెట్టడం వరకు జరగాలన్నది నా అభిప్రాయం కూడా. అయినా సరే - ఇంచుమించు రెండు దశాబ్దాల క్రితం - మాస్కోలో గడిపివచ్చిన సుమారు ఐదేళ్ళ అనుభవాలను అక్షర బద్ధం చేసే ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఏకధ్రువ ప్రపంచ వ్యవస్తను ప్రశ్నిస్తూ- నూతన సామ్యవాద సిద్దాంతాలను ప్రవచిస్తూ - ఏడు దశాబ్దాలకు పైగా సాగిన మొట్టమొదటి 'సోవియట్ కమ్యూనిష్ట్ ప్రభుత్వ చరమాంకాన్ని కళ్ళారా చూడగలిగిన అరుదయిన అవకాశాన్ని ఆలంబనగా  చేసుకుని - 'మార్పు చూసిన కళ్ళు' అనే పేరుతో ఆనాటి అనుభవాలను గుదిగుచ్చి గ్రంధస్తం చేయాలనే ప్రబలమయిన కాంక్షను ఎన్నో ఏళ్ళుగా అదిమిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి కారణాలు అనేకం. ఆనాడు నేను చూసింది మరో ప్రపంచం. అప్పటికీ ఇప్పటికీ యెంతో తేడా.  

ఆ రోజుల్లో 'అలా వుండేదియిలా వుండేది' అని రాస్తే నమ్మడానికి వీల్లేకుండా ఈనాటి రష్యన్ల జీవన విధానాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. రతనాలను రాశులుగా పోసి- వీధి అంగళ్ళలో విక్రయించిన  'స్వర్ణ యుగాలుచరిత్ర పుటల్లో ఆనవాలుగా మిగిలిపోయినట్టే - ఆ నాటి నా అనుభవాలు కూడా.  నేను  కమ్యూనిష్టుని కాను.  వృత్తి రీత్యా వివిధ రాజకీయ పార్టీలవారితో అంటకాగి తిరిగివుండ వచ్చు కానీ  ఏ రకమయిన రాజకీయ వాసనలను నేను వొంటబట్టించుకోలేదు.  ఒక సామాన్యుడిగా  అప్పటి కమ్యూనిస్ట్ రష్యాలో కాలుమోపాను . అక్కడ నేను గడిపిన 'జీవనం'  నా జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం.  నేనూ, నా భార్యా పిల్లలూ - అత్యంత సుఖప్రదమయినగౌరవ ప్రదమయినతృప్తికరమయిన  రోజులు గడిపింది ఆ రోజుల్లోనే.  వాటిని గురించి ఏ కొంచెం చెప్పినా  గోరంతను 'కొండంతచేసి చెబుతున్నానేమో అని  అనిపించకత ప్పదు.   అందుకే  'మార్పు చూసిన కళ్ళు' అక్షరబద్ధం చేయడానికి ఇంతగా తటపటాయించాల్సి వచ్చింది.  



అంతేకాదు.  కాలం గడుస్తున్నకొద్దీ - గుర్తుంచుకోవాల్సిన విషయాలు కూడా గుర్తుకురానంతగా మరపున పడడం సహజమయిన విషయం.  తేదీలు, పేర్లూ స్పురణకు తెచ్చుకోవడం క్లిష్టంగా మారుతుంది.  విషయానికి న్యాయం చేయలేక పోతున్నామేమో  అన్న సంశయం  మరింత వెనక్కి లాగుతుంది. ఏతా వాతా  జరిగింది ఏళ్ళతరబడి కాలయాపన.
(దస్వి దానియా అంటే రష్యన్ లో మళ్ళీ కలుద్దాం)
(ఇంగువ తెచ్చిన తంటా- గురించి మరోసారి).

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


27, జూన్ 2010, ఆదివారం

మహిళలపై టీవీ ప్రభావం - భండారు శ్రీనివాసరావు


మహిళలపై టీవీ ప్రభావం 


ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం కాదు హింసాయుగం.
'ఎందెందు వెదికిచూసిన అందందే శ్రీహరి కనిపిస్తాడని' ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడితో అంటాడు. కానీ హింస కోసం అలా వెతకాల్సిన పని కూడా లేదు.
హింస ఎక్కడ లేదు? నగరాల్లో- గ్రామాల్లో- ఇళ్ళల్లో- వీధుల్లో- మాటల్లో- చర్చల్లో ఎక్కడ చూసినా హింస విలయతాండవం చేస్తోంది. అంతెందుకు - సినిమాల్లో చూపిస్తున్న హింస నేరుగా టీవీల ద్వారా  డ్రాయింగ్ రూముల్లోకి  జొరబడుతోంది. అవునా? కాదా?
అయిదేళ్ళక్రితం  అమెరికా వెళ్లాను. మన దగ్గరినుంచి వెళ్లి అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్న అనేకమంది తెలుగు పిల్లలు కనిపించారు. 'మీ ఈ  అభివృద్దికి కారణం  ఏవిటన్న నా ప్రశ్నకు వాళ్ళు చెప్పిన సమాధానాలలో ఒకటి ఈనాటి ఈ చర్చకు సంబంధించినది  వుంది. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు క్రమం తప్పకుండా  దూరదర్శన్ లో  క్విజ్ ప్రోగ్రాములు చూసే వాళ్ళమనీ,  ఆ నాలడ్జే తరువాత జీవితంలో అక్కరకు వచ్చిందనీ  వాళ్ళు చెప్పారు. 
టీవీల వల్ల పాజిటివ్  ఎఫెక్ట్  ఉంటుందనడానికి దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. 
లాహోర్ లో  ఇన్ష్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఎడ్మినిస్ట్రేషన్  లో చదువుకునే విద్యార్ధులు నిరుడు ఒక పరిశోధనా పత్రం ఒకటి రూపొందించారు. ఎలక్ట్రానిక్ మీడియా ఎఫెక్ట్ ఆన్ చిల్ద్రెన్  అన్నది సబ్జెక్టు. వాళ్ళ లెక్క ప్రకారం-
అక్కడి పిల్లల్లో -
పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు రోజుకి రెండుగంటలు టీవీ చూస్తారట. ఓ అరగంటపాటు హోం వర్క్ చేసుకుని -ఓ గంట టీవీ గేమ్స్  చూస్తారట. 

ఓ యిరవయి నిమిషాలు  రేడియో వింటారు. మరో యిరవయి నిమిషాలు పుస్తకాలు చదవడానికీ, ఓ గంట ఆటలకీ, రెండున్నర గంటలు స్నేహితులతో ముచ్చట్లకీ  ఖర్చు చేస్తారని తేలింది. 
మరో ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే - చాలామంది పిల్లలు టీవీ తమకు సెకండ్ పేరెంట్ లాంటిదని చెప్పారు. టీవీ వల్ల  ఇమాజినేటివ్ పవర్ పెరుగుతుందన్నారు. కొత్త భాషలు, కొత్త పదాలు నేర్చుకోవచ్చన్నారు. అదేసమయంలో వాళ్ళు మరో మాట కూడా చెప్పారు. పేద పిల్లలు టీవీ వల్ల నష్టపోతున్నారన్నారు. అలాగే పెద్దల నుంచి వేధింపులకు గురయ్యే పిల్లలు - టీవీలు చూసి హింసా మార్గం పడుతున్నారని, దౌర్జన్యకారులుగా తయారవుతున్నారని, చదువులో వెనకబడుతున్నారని వెల్లడించారు. ఈ పరిశోధన చేసిన విద్యార్ధులు కొన్ని విలువయిన సూచనలు కూడా చేశారు. బెడ్ రూముల్లో టీవీలు ఉండకూడదన్నారు. వాణిజ్యపరంగా నిర్వహించే టీవీ చానళ్ళను రెగ్యులేట్ చేయాలన్నారు. పిల్లలు చూసే ప్రోగ్రాములపై  పెద్దలు ఓ కన్నేసి వుంచాలన్నారు. 
రాజ్యాంగంలోని ఆర్టికిల్ యిరవై ఒకటి  మనందరికీ జీవించే హక్కు ఇచ్చింది. రయిట్ టు లివ్ విత్ డిగ్నిటి అంటే హుందాగా, గౌరవంగా జీవించే హక్కు కూడా ఈ అధికరణం పౌరులకు ఇస్తోందని - హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టం చేసాయి. టీవీల్లో మహిళలని అసభ్యంగా చూపించడం ఈ  ఆర్టికిల్ కి విరుద్ధం. కానీ ఏ టీవీ చానల్ కూడా దీన్ని పట్టించుకున్న దాఖలా  లేదు.
వంటలు-ఆరోగ్యం- ఎడ్యుకేషన్ - వీటి మీద చాలా ఛానళ్ళు అనేక చక్కటి ప్రోగ్రాములు అందిస్తున్నాయి. వీక్షకుల స్పందన కూడా వీటికి బాగా వుంది. మంచి సంగతులు సరే. చెడు ప్రభావం తలచుకుంటేనే భయపడాల్సి వస్తోంది. ఆడవాళ్ళల్లో- ముఖ్యంగా గృహిణుల్లో చాలామందికి టీవీ చూడడంతోనే సరిపోతోంది. సరయిన వ్యాయామం లేక ఊబకాయం సమస్యలు తలెత్తుతున్నాయి.  పిల్లలు ఆకర్షణీయమయిన టీవీ యాడ్స్ చూసి  పిల్లలు జంక్ ఫుడ్స్ కి అలవాటుపడుతున్నారు. పత్రికల్లో ఇలాంటి ప్రకటనలు మామూలే కదా అనవచ్చు. కానీ నిరక్ష్యరాస్యులపై వాటి ప్రభావం అంతగా వుండదు. టీవీల యుగం వచ్చాక చదువుతో నిమిత్తం లేదు. చూసి  కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు. కన్స్యూమరిజం బాగా ప్రబలడానికి  ఈ డ్రాయింగ్ రూం  టీవీలే  కారణం. ఇన్ని రకాల టీవీలు లేని రోజుల్లో పల్లెటూళ్ల లోని  ఆడవాళ్ళకు అనేక రకాల కాలక్షేపాలు ఉండేవి. కుట్లు. అల్లికలు, సంగీతం  అలా ఏదో ఒక   ప్రయోజనకరమయిన వాటితో పొద్దు పుచ్చుకునేవాళ్ళు. ఇప్పుడో-  సీరియళ్లు చూస్తూ  వాటిపై   చర్చోపచర్చలు చేసుకోవడంతోనే  సరిపోతోంది. పిల్లలని  చూడడానికి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడి సీరియల్ ఏమయిపోతోందో అని బెంగ పడుతున్నారని వింటుంటే  వాటికి ఎంతగా ఎడిక్ట్  అయ్యారో అర్ధం చేసుకోవచ్చు. 
ఒక సూర్యుండు సమస్త జీవులకు  తానొక్కొక్కడయి తోచు  చందాన -  ఈ నాడు  ప్రయివేటు  ఛానళ్ళు కుటుంబంలో అందరికీ కావాల్సిన ప్రోగ్రాములను నేత్రానందంగా తయారుచేసి అందిస్తున్నాయి. కొన్నిసందర్భాలలో ఇవి కుటుంబ సభ్యుల నడుమ పొరపొచ్చాలకు  కూడా కారణమవుతున్నాయి. దానితో ఎవరికి వాళ్ళు తమ విభవం కొద్దీ ఎవరి గదుల్లో వాళ్ళు విడిగా టీవీ సెట్లు ఏర్పాటుచేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అసలే అంతంత మాత్రంగా వున్న 'మాటా మంతీ'  దీనితో నామమాత్రంగా మారిపోయింది. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే  'గెస్టులు' గా తయారవుతున్నారు. ఇరుగు పొరుగు- చుట్టపక్కాలతో సంబంధబాంధవ్యాలే కనుమరుగవుతున్నాయి. టీవీ చూస్తున్న సమయంలో ఫోన్ వస్తే సమాధానం  చెప్పేవారే కరువవుతున్నారు. 
ఇక అశ్లీల కార్యక్రమాలను గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 
అశ్లీలాన్ని అరికట్టే  సదాశయంతో  రూపొందించే  ప్రోగ్రాములే అశ్లీల దృశ్యాలతో నిండిపోతున్నాయి. 
ఒక్క మాటలో చెప్పాలంటే- తీరిక పుష్కలంగా ఉన్నవాళ్ళకోసం ఛానళ్ళు  తీరిక లేకుండా  పనిచేస్తున్నాయి. 
-భండారు శ్రీనివాసరావు -  

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


                
  

27, మే 2010, గురువారం

మౌంట్ అబూ గురించిన జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

మౌంట్ అబూ గురించిన జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు


2003 లో ఒక రోజు.
అబూ రోడ్ చేరేసరికి ఉదయం ఏడున్నర.
బ్రహ్మ కుమారీలు ఏర్పాటు చేసిన సుమోలో మా ఆరుగురిని సామానుతో సహా మౌంట్ అబూ కి చేర్చారు. సుమారు యిరవై కిలోమీటర్లకు పైగా ఘాట్ రోడ్.  ఆరావళీ పర్వత పంక్తుల్లో మౌంట్ అబూ ఎత్తయిన శిఖరం అంటారు. శిఖరం అన్న మాటే గాని పైన అన్ని వసతులతో కూడిన ఒక చిన్నపాటి పట్టణమే వుంది. మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ చాలా బాగుంది. స్నానాలు ముగించుకుని బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కేంటీన్ కి బయలుదేరాము. నిటారుగా నిర్మించిన సిమెంట్ రోడ్ పై నుంచి కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. డైనింగ్ హాల్ ఎంతో నీటుగా వుంది. పుంగనూర్ కి చెందిన శ్రీనివాస్ అనే కార్యకర్త స్వచ్చందంగా అంత దూరం నుంచి వచ్చి అక్కడ బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేసే విధులను నిర్వహిస్తున్నాడు. బ్రహ్మ కుమారీల ప్రధాన కార్య స్థానంలో పనిచేసేవారందరూ అలాటి వారే. ఎవరూ జీతాలు తీసుకోరు. బ్రేక్ ఫాస్ట్ లో దక్షిణాది వంటకాలు కూడా వుండడంతో మాకు ఎలాటి ఇబ్బంది ఎదురు కాలేదు. తరువాత మెల్లగా నడుచుకుంటూ ఆ కొండల మీద కలయ తిరిగాము. మబ్బులు తాకుతూ వెడుతున్న అనుభూతి. పురాణ సినిమాలలో నారదుడు గుర్తుకువచ్చాడు.
కాసేపు గదిలో సేదతీరామో లేదో మళ్ళీ భోజనాలకు పిలుపు. ఈసారి నార్త్ ఇండియా వంటకాలు. కాకపొతే పులిహార వడ్డించారు. తెలుగు వాళ్లమని పెరుగు స్పెషల్.
భోజనం ముగించుకుని మెట్లెక్కి శిఖరం అంచున ఫోటోలు దిగాము.
మధ్యాహ్నం నుంచి బ్రహ్మ కుమారీల సెషన్స్ మొదలయ్యాయి. బ్రదర్ శాంత కృష్ణ మెడిటేషన్ గురించీ, బ్రహ్మకుమారీల గురించీ వివరంగా చెప్పారు. మాలో కొంతమంది జర్నలిష్టులకు సహజసిద్దమయిన రీతిలో రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు వేసినా, ఆయన నిగ్రహం కోల్పోకుండా జవాబులు చెప్పారు.
మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వాన.
హైదరాబాదుకు చెందిన బ్రహ్మకుమారీల ప్రతినిధి సరళ, ఐఏఎస్ అధికారి శ్రీ మంగపతిరావు, రెవెన్యూశాఖలో పనిచేసిన శ్రీమతి నైనాదేవి, మా ఆవిడ నిర్మల   హైదరాబాదు నుంచి వచ్చిన బృందం లో వున్నారు. మా పని తరలి వచ్చిన మగ పెళ్లివాళ్ళ మాదిరిగావుంది.
శుక్రవారం


అంబర చుంబిత అన్న అల్లసానివారి పద్యం గుర్తుకు వచ్చింది.
మేము వుంటున్న జ్ఞాన సరోవర్ నుంచి సుమారు యిరవై కిలోమీటర్లు ఘాట్ రోడ్ లో పైకి వెడితే వచ్చే గురు  శిఖిరం మీద నిలబడ్డపుడు ఎవరికయినా ఈ పద్యపాదం స్ఫురించకమానదు.
ఆకాశం అంచుల్లో నిలబడ్డ అనుభూతి కలిగించే ఆ సుందర దృశ్యం అనిర్వచనీయం. ఎటుచూసినా తెల్లని పొగ మంచు. అడుగు దూరం అవతల వున్నది కూడా కనిపించని స్తితి. ఎదురుగా వున్న మనుషులను కూడా పోల్చుకోలేని పరిస్తితి.
అక్కడికి వెడుతున్నప్పుడు మా డ్రయివర్ బాబు ఆ పొగమంచులో ముందుకు వెళ్లడం కుదరదని వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపేశాడు. ఉసూరుమనిపించింది. కానీ ఇంతలో హెడ్ లైట్లు వేసుకుని ఒక కారు ఎదుటినుంచి రావడంతో ఏమనుకున్నాడో కానీ ముందుకే నడిపించాడు. ముందు సీట్లో కూర్చున్న నాకు అడుగు ముందు ఏమివుందో కనిపించడం లేదు. అయినా డ్రయివరు బాబు మాత్రం ఎంతో చాకచక్యంగా నడుపుతూ మమ్మల్ని  పైకి చేర్చాడు. అప్పటికే అక్కడ చాలామంది వున్నారు. ఏదో మాట్లాడుకుంటూ పోకపోతే ఎదురుగా వచ్చేవారు డీకొట్టే ప్రమాదం వుంది. అందుకే అవసరం వున్నా లేకపోయినా గలగలా మాట్లాడుకుంటూ, నూట యాభయి రూపాయలుపెట్టి కొనుక్కున్న కాల్చిన మొక్కజొన్న కంకులు తింటూ   దాదాపు మూడువందల మెట్లెక్కి, గురు శిఖరం చేరుకున్నాము. అంత పొగమంచులో కూడా చిరుచెమట పట్టింది. ఆ శిఖరం మీద దత్తాత్రేయ ఆలయం వుంది. చాలా చిన్న గుడి. గుడి కంటే అక్కడ వేళ్ళాడదీసిన గంట పెద్దదిగా అనిపించింది.  ఆ గంట మోగిస్తే దాని ధ్వని లోయలో ప్రతిధ్వనించడం ఒక అనుభూతి. అక్కడ కొన్ని ఫోటోలు దిగాము కానీ ఆ దట్టమయిన పొగమంచులో ఆ ఫోటోలు ఎలావస్తాయో తెలియదు. అన్ని మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం డోలీలు వున్నాయి. నూటయిరవై రూపాయలు ఇస్తే పైకి తీసుకువెళ్ళి కిందకు తీసుకువస్తారు. దోవలో డ్రైవర్ బాబుని అడిగాము, చంద్రబాబునాయుడు ఎవరో తెలుసా అని. ఆంధ్రా సీఎం అని చటుక్కున జవాబిచ్చాడు. అదే గుజరాత్ సీఎం ఎవరంటే ఉప రాష్ట్రపతి పేరు చెప్పాడు.
మేము వెళ్ళిన దోవలో రెండు లోయల నడుమ కట్టిన ఒక డాం కనిపించింది. మౌంట్ అబూ లో కొన్ని ప్రాంతాలు మాత్రమే బ్రహ్మకుమారీల అధీనంలో వున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఆకాశవాణి, దూరదర్శన్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, రాజస్తాన్ టూరిజం కార్యాలయం వున్నాయి. గురు శిఖరానికి వెళ్ళే దారిలో పడి పన్నెండు చిన్న చిన్న ఊళ్లు, ఆవుల మందలూ వాటి కాపరులూ కానవచ్చారు. విచిత్రమేమిటంటే  వాళ్ళు మేమూ కూడా చలిదుస్తులు వేసుకోలేదు. పొగమంచులో చలిగా అనిపించదు. వెంట తీసుకువెళ్ళిన షాల్స్ కారులోనే వొదిలేసి తిరిగాము. కాకపొతే, గొడుగు తప్పనిసరి. ఎప్పుడు వాన పడుతుందో తెలవదు. వాన వచ్చిందో పొగమంచు పరార్.
కిందికి వచ్చి కేంటీన్ లో భోజనాలు చేశాము. పులిహార, రోటీలు, రసం, పెరుగు, మామిడి పండ్లు. శుక్రవారం కదా. మా ఆవిడకు పులుపు నిషిద్దం. అన్నంలో పాలూ పంచదార కలుపుకుని భోజనం ముగించింది.అక్కడ మాకు హైదరాబాదు
నుంచి వచ్చిన సత్యనారాయణ రెడ్డి, రాజేశ్వరరెడ్డి, శర్మ, సుబ్బారావు, ఆయన భార్య పరిచయం అయ్యారు.
మధ్యాహ్నం నాలుగ్గంటల సమయంలో కాస్తంత ఎండ పొడ. కానీ అది వేడిగా వుందో చల్లగా వుందో అనుమానమే.
గమ్మత్తుగా సాయంత్రానికి వాతావరణం హైదరాబాదులో మాదిరిగా మారిపోయింది.            
ఆరు గంటలకు అసలు సెషన్ మొదలు. మా అందరికీ బాడ్జీలు, ఇతర సమాచారం వున్న ఫోల్డర్లు ఇచ్చారు. విశాలంగా వున్న ఒక పచ్చిక బయలులో సమావేశం మొదలయింది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లందరూ అక్కడ జమయ్యారు. ఆ ప్రదేశం ఎంతో అందంగా వుంది. తివాచీ పరచినట్టుగా పచ్చని పచ్చిక. ఎత్తయిన చెట్లు. ఎటుచూసినా రంగురంగుల పూలమొక్కలు. అకాడమీ ఆఫ్ బెటర్ వరల్డ్ కు చెందిన బ్రదర్ మోహన్ సింగ్హన్ ఒక విషయం చెప్పారు. కొన్నేళ్ళకు పూర్వం ఆ ప్రదేశం రాళ్ళు రప్పలతో, రక్కసి పొదలతో నిండి వుండేదట. నీటి సౌకర్యం ఏమాత్రం లేని ఆ రోజుల్లో నంజుడప్ప అనే ఆయన స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. చిన్న చిన్న మట్టి పాత్రలకు చిల్లులు పెట్టి, వాటికి దూది పెట్టి, నీళ్ళను నింపి ఒక్కొక్క మొక్కని తడుపుతూ, వాటినన్నిటినీ పసిపాపలమాదిరిగా సాకుతూ పోషించి పెంచాడట. అలా నాలుగయిదేళ్ళలోనే ఆయన ఆ ప్రాంతం రూపురేఖలను  మార్చివేశాడట. ఇది విన్న తరవాత పని పట్ల నంజుడప్ప అంకిత భావానికి జోహారు అర్పించకుండా వుండలేకపోయాము.
బ్రహ్మ కుమారీ సంస్త అధినేత్రులందరూ , రాజయోగి డాదీ మనోహర్ ఇంద్రాజీ తో సహా  ఆ సమావేశానికి వచ్చారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసారు. తరువాత మెడిటేషన్ హాలులో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. మంగపతిరావు గారూ నేనూ కూడా జ్యోతులను వెలిగించాము. మీడియా ఇంచార్జి కరుణ ఆధ్వర్యంలో ఇది జరిగింది.
మధ్యాహ్నం వరకు కన్ను పొడుచుకున్నా కానరాని పొగమంచు. సాయంత్రం  ఏడవుతున్నా సూర్యాస్తమయం కాని స్తితి.మౌంట్ అబూలోని ఈ ప్రకృతి వైరుధ్యాన్ని మనస్సులో పదిల పరచుకుంటూ, మెడిటేషన్ హాలులో దాదీ రతన్ మొహినీజీ  హిందీలో చేసిన అనుగ్రహ భాషణాన్ని ఆలకించాము.
కర్మ బంధాలలో చిక్కుపోయిన ఆత్మ తన తండ్రి అయిన పరమాత్మను  గుర్తించలేదన్నారు. దానికి ధ్యానం ఒక్కటే మార్గం అన్నారు. ఆధ్యాత్మిక మార్గం హేతువుని తిరస్కరిస్తుంది, అయితే అది హేతువుని అధిగమించి వెళ్ళగలదన్నారు దాదీజీ.
శనివారం ఉదయం
తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి- ధ్యాన మందిరానికి వెళ్ళాము. స్నానాలు చేసి శుచిగా రావాలని కానీ, పాద రక్షలు ధరించకూడదని కానీ నిబంధనలేమీ లేవు. మందిరంలో ఒక బ్రహ్మ కుమారి తెల్లని దుస్తుల్లో సోఫా మీద ధ్యాన ముద్రలో వుంది. ప్రశాంతమయిన వాతావరణంలో ఎక్కడ అమర్చారో తెలియని స్పీకర్ల నుంచి మెల్లగా ఒక పాట వినబడుతోంది. పాట పూర్తీ కాగానే బ్రహ్మ కుమారి సమ్మోహన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టారు. మధుర ఘడి యలుగా వారు పేర్కొనే ఆ సుప్రభాత వేళలో మెడిటేషన్ చేయడం కొత్త అనుభూతి. కానీ మనస్సు కోతి కదా. దాని వాసనలు దానివి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే నేను మాత్రం ఆ వాతావరణాన్నీ అక్కడి మనుషులనూ పరిశీలించడంలో మునిగిపోయాను. అరగంటలో ఆ కార్యక్రమం ముగిసింది. అంతా నిశ్శబ్దంగా బయటకు వచ్చారు. అందరిలో ఒక రకమయిన ప్రశాంతత. నిజంగా ధ్యానం లో ఏదయినా వుందా?
మరునాడు మౌంట్ అబూ నుంచి కిందికి దిగాము. అక్కడ బ్రహ్మ కుమారీలకు ఒక బ్రహ్మాండమయిన సమావేస మందిరం వుంది. దాదాపు లక్షమంది సౌకర్యంగా కూర్చుని ప్రసంగాలు వినడానికి, కార్యక్రమాలు తిలకించడానికీ వీలుగా దానికి రూపకల్పన చేసిన తీరు అద్భుతంగా వుంది. అంత పెద్ద హాలులో ఎక్కడా స్తంభాలు లేకుండా మందిరం పైకప్పు నిర్మించారు. వేదికకు సుదూరంగా కూర్చున్నవారికి కూడా స్పుటంగా వినగలిగేలా అత్యాదునికమయిన లౌడ్ స్పీకర్లను అమర్చారు. నిర్మాణ కౌశలానికి ఒక మచ్చు తునకగా పరిగణించాల్సిన ఈ సుందర మందిరం దేశానికి బ్రహ్మ కుమారీల భిక్షే.
(రెండువేల మూడులో సతీ సమేతంగా చేసిన మౌంట్ అబూ యాత్ర గురించి మనసు పొరల్లో మరగునపడిన జ్ఞాపకాల ఆధారంగా భండారు శ్రీనివాసరావు 27-05-2010-) 
Be firm when authority is required,but be gentle and sweet when administering authority- Brahmakumaries 

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


                                                           
              

25, మే 2010, మంగళవారం

మీలో పాపం చేయనివాడు ఎవరో చెప్పండి? – భండారు శ్రీనివాస రావు

మీలో పాపం చేయనివాడు ఎవరో చెప్పండి? – భండారు శ్రీనివాస రావు











గత కొద్ది రోజులుగా తెలుగు చానళ్ళలో – వైఎస్సార్ సంక్షేమ పధకాల భవిష్యత్తు గురించి చర్చోపచర్చలు సాగుతున్నాయి.

నిధుల లేమి సాకుతో ఈ పధకాలకు గండి కొట్టే ప్రయత్నం జరుగుతోందని పాలక పక్షం లోనే కొందరు బాహాటంగా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. రాజశేఖరరెడ్డి ప్రజలకిచ్చిన వాగ్దానాలను తోసిరాజంటే- వచ్చే ఎన్నికల్లో తిరిగి ఆ జనమే పార్టీకి ‘మొండి చేయి’ చూపిస్తారని హెచ్చరిస్తున్నారు.


అయితే, ఈ సంక్షేమ పదకాలకే కాదు – అసలు ప్రభుత్వం పూనిక వహించిన ఏ పదకానికయినా పూచీకత్తు వహించాల్సిన ముఖ్యమంత్రి రోశయ్య గారు మాత్రం – ఎటువంటి పరిస్తితుల్లోను సంక్షేమ పధకాలను నిలుపుచేసే ప్రసక్తే లేదని పదే పదే ఘంటాపధంగా చెబుతూ వస్తున్నారు. అయినా కూడా అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో – ఈ చర్చ రచ్చరచ్చగా తయారవుతోంది. ‘తప్పు చేస్తే సోనియానయినా నిలదీస్తాం’ అనేవరకు ఇది సాగి చివరకు ఈ సెగ డిల్లీ వరకూ పాకింది. ముఖ్యమంత్రి,- పీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఇద్దరు ఒకేరోజు హస్తిన ప్రయాణం పెట్టుకోవడంతో – అధిష్టానం ఆగ్రహంతోవుందన్న పుకార్లకు కూడా పట్టుచిక్కింది.
మూడు ముఠాలు , ఆరు వర్గాల సంస్కృతి కలిగిన కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీకి ఈ ‘కలహాల కాపురాలు’ కొత్తేమీ కాదు. వీటన్నిటినీ పిల్లకాయల ఆటలుగా కొట్టేయడం డిల్లీలో పెత్తనం చేసే పెద్దల అలవాటు. అవసరం అనుకునేవరకూ – పట్టించుకోనట్టుగా వ్యవరించగల దీమంతం ఆ పార్టీ సొంతం. పైగా మీడియాలో సాగే ఈ రకమయిన చర్చలూ రచ్చలూ ఒక రకంగా ఆ పార్టీకి బలమూ, బలహీనతా రెండూ కూడా. కాకపొతే ముఠాభక్తి మరింత ముదిరి, ఏకంగా అధినాయకత్వానికే కాక తగిలే రీతిలో మాటల తూటాలు ప్రయోగించినప్పుడే వస్తుంది ఇలాంటి తంటా. గల్లీ గోలలన్నీ డిల్లీ చేర నంతవరకే అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అధిష్టానంవారు అనుమతిస్తారన్నది జగమెరిగిన సత్యం.

రాజశేఖరరెడ్డి మరణం వరకూ నివురుగప్పిన నిప్పులా వున్న ముఠా తగాదాలు ఆ తరవాత ఒక్కసారిగా పెచ్చరిల్లి బజారున పడుతున్నాయి. సహజంగానే ఈ పరిణామాలన్నీ మీడియాకు వండి వార్చిన సిద్దాన్నం కావడంలో అసహజమేమీ లేదు.
‘మాట్లాడుకోవడానికి పార్టీ వేదికలున్నాయి. ఇలా త్వరపడి మీడియాకెక్కడం మంచిదికాదంటూ’ ఓ పక్క సన్నాయి నొక్కులు నొక్కుతూనే – మరో పక్క అదే నోటితో అనాల్సిన నాలుగు మాటలూ అనేసి చేతులు దులుపుకోవడం నిత్యకృత్యంగా మారుతోంది. ఇలా ఖండన ముండనలూ, విమర్సలు ప్రతి విమర్సలూ, ఆరోపణలు ప్రత్యారోపణలతో కూడిన టీవీ ప్రోగ్రాములతో తెలుగులోగిళ్ళు అన్నీ దద్దరిల్లిపోతున్నాయి. వీటి హోరులో – సదసద్వివేక చర్చలకూ, పూర్వాపరాల పరిశీలనకూ ఎంతమాత్రం అవకాశం లేకుండాపోతోంది. బహుశా ఈ కారణం వల్లనే కావచ్చు – కాంగ్రెస్ పార్టీలోని ముఠా తగాదాలు ఇంతింతై వటుడింతయ్ అన్నట్టు బుల్లి తెరలపై ‘ ఐమాక్స్’ అనుభూతిని అందిస్తున్నాయి. వొడ్డున వుండి తమాషా చూస్తున్న కొన్ని ప్రతిపక్షాలు ‘ఇవన్నీ కాంగ్రేస్ వాళ్ళ అంతర్గత వ్యవహారం’ అని కొట్టేస్తూనే – అగ్నికి ఆజ్యం చందంగా తమ వ్యాఖ్యానాలను జోడించి కధను రక్తి కట్టిస్తున్నాయి. బాలకృష్ణ సింహ గర్జనలనుంచి కాస్త ఊపిరి పీల్చుకోవడానికి తెలుగుదేశానికి సంక్షేమ పధకాల రచ్చ అక్కరకు వచ్చింది.

 వైఎస్సార్ సంక్షేమ పధకాలను తూర్పారపడుతూ వచ్చిన ఆ పార్టీకి ఇప్పడు అవే ఆదుకునే అస్త్రాలుగా కానవస్తున్నాయి. పేదలకు పనికివచ్చే ఈ సంక్షేమ పధకాలను అమలుచేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి వుండాలే కానీ మనసుంటే మార్గముండదా అంటూ – కాంగ్రెస్ కోర్టు లోకి ఒక కొత్త బంతిని విసిరింది.

‘గత ఆరేళ్ళలో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు కూడబెట్టిన అక్రమాస్తులూ, దోచుకున్న సొమ్మూ స్వాధీనం చేసుకుంటే ఎన్ని పధకాలనయినా నిక్షేపంగా అమలు చేయవచ్చని’ ఆ పార్టీ ఇచ్చిన సలహాతో తేనెతుట్టిని కదిపినట్టయింది.

రాష్ట్రంలో రాజకీయ అవినీతికి అసలు మూలాలు టీడీపీలోనే వున్నాయని, ఆ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీ నాయకులు పోగేసుకున్న నల్ల ధనంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చని ఎదురుదాడి ప్రారంభం కావడంతో ఈ రగడ కొత్త మలుపు తిరిగింది.

అవినీతి భాగోతంలో అన్ని పార్టీలకు అంతో ఇంతో భాగం వుంది కనుక అంతా కలసి ఈ పని చేస్తే - మరో పాతికేళ్ళ వరకూ ప్రజలపై పైసా కూడా పన్ను వేయాల్సిన పని వుండదని మరి కొందరు మేధావులు విశ్లేషణల్లో వాకృచ్చారు.

ఇదంతా వినడానికి ఎంతో సొంపుగా వుంది. వూహించుకున్నంత మాత్రానే ఆహా అనాలనిపించేదిగా వుంది.

కానీ ఇది జరిగే పనేనా?

కోట్లు ఖర్చుపెట్టి వేలల్లో ఎన్నికల పద్దులు చూపే ప్రజ్ఞాశీలురు- అడ్డదోవలో అక్రమగా ఆర్జించిన సొమ్మును సినిమాల్లో చూపించినంత సులభంగా వొదులుకోగలరా?

పోనీ – అలాగే జరిగిందనుకున్నా – మళ్ళీ ఆ డబ్బుని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సింది తిరిగి వీళ్ళే కదా! ఈ అధికార యంత్రాంగమే కదా!

ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు – అతి సాధారణ అధికారి ఇంటిపై ఏసీబీ దాడిజరిగినా – బ్యాంకు స్ట్రాంగ్ రూముల్లోమాదిరిగా కరెన్సీ నోట్ల కట్టలు బయటపడుతున్న ఈ రోజుల్లో – ప్రజాధనం పక్క దారులు పట్టకుండా ఖర్చుకాగలదని ఆశించడం అత్యాశ కాదా!
ఇలాటి పరిస్థితుల్లో పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు?

ఎవరు వీరిలో పవిత్రులు?

అందుకే ఒక సినీ కవి చెప్పినట్టు –

ఒకరిపై రాయి విసిరేముందు -
‘మీలో పాపం చెయ్యనివాడు ఎవరో చెప్పండి?’

(24-05-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

16, జనవరి 2010, శనివారం

మార్పు చూసిన కళ్ళు (మాస్కో అనుభవాలు -ఏడో భాగం ) - భండారు శ్రీనివాసరావు






స్త్రీ బాలవృద్దులదే హవా!

అక్కడ అన్ని విషయాల్లో పెద్దపీట స్త్రీబాలవృద్ధులదే.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తుపాకి పట్టగలిగిన ప్రతి ఒక్క మగవాడినీ- వయస్సుతో నిమిత్తం లేకుండా యుద్ధరంగానికి పంపిన కారణంగా - దేశాన్ని నడిపేందుకు మహిళల తోడ్పాటు అవసరమయిందని చెప్పుకుంటారు. ఆ రోజుల్లో రైళ్ళూ బస్సులూ ట్రాములూ నడపడంతోపాటు కర్మాగారాల్లో కూడా స్త్రీలే పనిచేసారు. అందుకు కృతజ్ఞతగా ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం- ఆడవారికి కొన్ని ప్రత్యెక హక్కులు కల్పించింది. అనేక రాయితీలు, సదుపాయాలూ వారికి సమకూర్చింది. చలి దేశం కాబట్టి చిన్నదో, పెద్దదో ప్రతివారికీ ఒక గూడు అవసరం. కొంపాగోడూ లేనివాళ్ళు మనవద్ద మాదిరిగా ప్లాటు ఫారాలపైనా, ఫుట్ పాతులపైనా రోజులు వెళ్లమార్చడానికి అక్కడ వీలుండదు. ఇళ్ళ కేటాయింపు కుటుంబంలో ఆడవారి పేరు మీద జరిపే  పధ్ధతి ప్రవేశపెట్టడంతో కాలక్రమేణా ఇంటి వ్యవహారాలలో పడతుల పట్టు పెరుగుతూ వచ్చింది. అంతే కాకుండా చదువులు ఉద్యోగాలలో మగవారితో పోటీ పడి సంపాదించుకున్న ఆర్ధిక స్వావలంబన వారి స్వేచ్చా జీవితానికి ఆలంబనగా మారింది. ఇంటిమీద హక్కులు, ఆర్దికపరమయిన వెసులుబాటు లభించడంతో ఇళ్ళల్లో వారిదే పైచేయి అయింది. నిండా యిరవయి ఏళ్ళు నిండకుండానే ఇద్దరు ముగ్గురు మొగుళ్ళకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధం కాగల సత్తా వారి సొంతం అయింది. మాస్కో రేడియోలో పనిచేసే నటాషా చెప్పినట్టు 'పండగనాడుకూడా పాత మొగుడేనా ' అనే వారి సంఖ్య పెరిగింది.


 సోవియట్ రష్యాలో ఏటా పెరిగిపోతున్న విడాకుల పట్ల అక్కడో జోకు ప్రచారంలోకి వచ్చింది. విడాకులు ఎవరు ఇచ్చినా, కొత్త ఇల్లు కేటాయించేవరకు పాత పెళ్ళాంతోనూ, పాత పెళ్ళాం  కొత్త మొగుడితోనూ  కలసి పాత పెళ్ళాం పాత ఫ్లాటులో కొన్నాళ్ళపాటు  నివసించాల్సిన పరిస్తితి మగవాళ్ళది. ఈ దుస్తితి పగవాళ్ళకి కూడా రాకూడదురా బాబూ! అని సరదాగా చెప్పుకునేవారు. అయితే అక్కడ ' ఏకపతీవ్రతం ' చేస్తున్న ఆడవాళ్ళు కూడా లేకపోలేదు. పిలిపెంకో అనే ఎనభై ఏళ్ళ 'యువకుడితో' మా కుటుంబానికి పరిచయం ఏర్పడింది. ఆయన గారి ఏకైక భార్య గత కొన్నిదశాబ్దాలుగా  ఆయనగారితోనే కాపురం చేస్తోంది. ఒకే మొగుడితో కాపురం అన్న సూత్రమే ఆవిడనూ, మా ఆవిడనూ జత కల్పిందని పిలిపెంకో మహాశయులవారి అభిప్రాయం. చివరికి ఈ అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందంటే మేము ఇండియా తిరిగి వచ్చినతరవాత కూడా ఆ పిలిపెంకో దంపతులు హైదరాబాద్ వచ్చి మా ఇంట్లో వారం రోజులు వుండి వెళ్ళారు. గమ్మత్తేమిటంటే నాకూ, మా ఆవిడకు రష్యన్ తెలియదు. వారిద్దరికీ వాళ్ళ భాష తప్ప మరోటి తెలియదు.అయినా అనుబంధానికి ఇది అడ్డంకే కాలేదు. కాకపొతే -
మా పిల్లలే మాకు దుబాసీలు. మాస్కోలో కూడా.
ఇక-  చిన్న పిల్లల విషయానికి వస్తే -


 ఆ దేశం వారి పాలిట స్వర్గం. వారు ఆడింది ఆట, పాడింది పాట. చదువయిన సంధ్యయినా వారి అభిరుచి ప్రకారమే. మా అబ్బాయిని  డాక్టర్ ని చేద్డామనుకుంటున్నాము, మా అమ్మాయిని ఇంజినీరు చదివిద్దామనుకుంటున్నాము అంటే   అక్కడ కుదరదు. చిన్న తరగతుల స్తాయిలోనే వారి వారి అభిరుచులను కనుగొనే పరీక్ష - (ఇంగ్లీష్ లో యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు)- పెట్టి ఆ విద్యార్ధి డాక్టర్ అవాలనుకుంటున్నాడో, ట్రాక్టర్ డ్రైవర్ కావాలనుకుంటున్నాడో - తెలుసుకుని ఆ కోర్సులో చేర్పిస్తారు. ఇందులో తలిదండ్రుల ప్రమేయం ఏమాత్రం వుండదు. చదివించే భాద్యత కూడా సర్కారుదే కావడంవల్ల, డాక్టరుకూ, ట్రాక్టర్ డ్రైవర్ కూ జీతభత్యాలలో పెద్ద తేడాలు లేకపోవడంవల్ల , వారికీ అభ్యంతరాలు వుండవు. మరో విచిత్రమయిన సంగతేమిటంటే జననాలను ప్రోత్సహించడం. యెంత ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని  కంటే ప్రోత్సాహకాలు అంత ఎక్కువగావుంటాయి. పదిమందికి పైగా పిల్లల్ని కన్న సంతాన లక్ష్ములను జాతీయ అవార్డులతో సత్కరి స్తుంటారు. గర్భవతులయిన ఉద్యోగినులకు , గర్భం ధరించిన సమాచారం తెలిసినప్పటినుంచి ,సుఖ ప్రసవం జరిగి, పుట్టిన బిడ్డ బుడి బుడి నడకలు నడిచే వయస్సు వచ్చేవరకు ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకునేందుకు వీలుగా తల్లులకు జీతంతో కూడిన సెలవు మంజూరు చేస్తారు. ఆ పుట్టిన పిల్లలు పెరిగి పెద్దయ్యేవరకు ప్రభుత్వం వారికి కల్పించే రాయితీలూ, సదుపాయాలూ కనీ వినీ ఎరుగనివి.

దేవుడి మీద నమ్మకం లేని దేశంలో పిల్లలే దేవుళ్ళు - నమ్మలేని ఈ నిజం గురించి మరో సారి.

4, జనవరి 2010, సోమవారం

రాయని రచయిత - డి వెంకట్రామయ్య

రాయని రచయిత - డి వెంకట్రామయ్య



శ్రీ డి.వెంకట్రామయ్య



'డి వెంకట్రామయ్య' కధలపై నేను మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే ఆయన రాయడం బాగా తగ్గించారు. తగ్గించారు అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో!

వస్తున్న కధల్లో రాశి పెరిగి, వాసి తగ్గి - ఆ బాపతు వాటిని 'చదవడం మానేస్తే పోలా' అని అనేకమంది చదువరులు అనుకుంటునట్టే , 'కాగితంపై కలం పెట్టగలిగినవాళ్ళందరూ కధలు రాయడం మొదలుపెట్టేసరికి- 'రాయడం మానేస్తే పోలా' అనిపించి రచనా వ్యాసంగానికి ఆయన దూరమయ్యారేమోనని నా అనుమానం.

రచయితగా నాకు తెలిసిన వెంకట్రామయ్య గారు- నాకు వృత్తిపరంగా తెలిసివచ్చేనాటికే 'కలం సన్యాసం' స్వీకరించినట్టున్నారు. అడిగినవారి కోసం అడపా దడపా రాయడం తప్పిస్తే- అప్పటినుంచీ కధా రచయితగా ఆయన రాసిందీ, రాస్తున్నదీ ఏమీ లేదనే చెప్పాలి.

1975 నవంబర్లో అనుకుంటాను- తొలిసారి వెంకట్రామయ్యగారిని హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంలో సహోద్యోగిగా కలుసుకున్నాను. ప్రాచుర్యం పొందిన రచయితతో ఏ అభిమానికయినా సాన్నిహిత్యం ఉండవచ్చుకానీ పాతికేళ్ళకు పైగా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం అరుదు. వృత్తిరీత్యా కలసి పనిచేస్తున్నప్పటికీ- ప్రవృత్తిరీత్యా ఆయనకూ, నాకూ నడుమ శతసహస్ర వైరుధ్యాలు.

ఆయనకు నిశ్శబ్దం యిష్టం. వార్తలు ఎంపిక చేసేటప్పుడూ, వాటిని అనువాదం చేసేటప్పుడూ పనిచేసే వాతావరణం ప్రశాంతంగా వుండాలని కోరుకునేవారు. ఇందుకు నేను పూర్తిగా విరుద్ధం. నలుగురితో బాతాఖానీ వేస్తూ, గలగలా నవ్వుతూ, నవ్విస్తూ పని చేస్తూ పోవడం నా పధ్ధతి.

టేబుల్ పై కాగితాలన్నీ ఒక పధ్ధతి ప్రకారం సర్దిపెట్టుకోవడం ఆయనకలవాటు. చెత్తబుట్టకూ, రాతబల్లకూ తేడా తెలియనంతగా - నానా చెత్త మధ్య కూర్చుని చెత్త రాతలు రాస్తూ వుండడం నా ప్రత్యేకత.



ఆ రోజుల్లో ఎవరయినా వార్త పట్టుకు వస్తే- అది ఆయన చేతులో పడితే ఇంతే సంగతులు. రేడియో మార్గదర్శిక సూత్రాలనూ, ఆనాటి బులెటిన్ ప్రాదాన్యతలనూ అప్పటికప్పుడు బేరీజు వేసుకుని 'ఈ వార్త యివ్వడం కుదరద'ని మొహమ్మీదే చెప్పేసేవారు. అంత నిష్టూరంగా అలా చెప్పకపోతే ఏం అనిపించేది కానీ ఆయన మాత్రం లేనిపోని భేషజాలు తనకు సరిపడవన్న తరహానే ప్రదర్శించేవారు. స్నేహితులనో- పరిచయస్తులనో -మొహమాటపడి వ్యవహరించడం ఆయనకు చేతకాని పని. ఇలాంటి విషయాల్లో ఆయనకూ నాకూ మధ్య కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు బయటపడేవి. బయట తిరిగే విలేకరులకు కొన్ని కొన్ని ఆబ్లి గేషన్స్ ఉండడానికి అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన ఏకీభవించేవారు కాదు. దానితో, వార్త ఎందుకు యివ్వలేకపోయామో అన్నది సంజాయిషీ ఇచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి మాది.

పని పట్ల ఆయన చూపే నిజాయితీ, నిబద్దతా అందర్నీ కట్టిపడేసేవి. బులెటిన్ ఆయన తయారుచేసారంటే దానిపై ఆయన ముద్ర స్పష్టంగా వుండేది. అందులో యితరుల జోక్యాన్ని ఆయన అనుమతించేవారు కాదు. ప్రజాసంబందాలకు పెద్దపీట వేసే మా బోంట్లకు ఆయన ఈ మొండి వైఖరి కొండొకొచొ కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేది. అయినా ఆయన ధోరణి ఆయనదే. సిద్దాంతాలూ, సూత్రాలూ వల్లించే వాళ్ళల్లో - వాటికి కట్టుబడి వ్యవహరించేవాళ్ళని చాలా తక్కువమందిని చూస్తాం! వెంకట్రామయ్యగారు దీనికి పెద్ద మినహాయింపు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగంలో చేరిన చాలా కాలం తర్వాత నాకు ఆయన కధలు రాయడం పూర్తిగా తగ్గించిన సంగతి తెలిసింది. పత్రికల్లో- మీడియాలో పనిచేసే 'రచయితల'కు సొంత రచనలు చేసే తీరిక తక్కువన్న అభిప్రాయం ఒకటి ఉంది.నిజమేనేమో!
'పని రాక్షసుడి'గా పేరు పడ్డ వెంకట్రామయ్యగారు-
విధి నిర్వహణకు మాత్రమే ప్రాధాన్యం యిచ్చే వెంకట్రామయ్యగారు-
ఉద్యోగిగా తన కర్తవ్యాన్ని వొదిలిపెట్టి-
'వెంకట్రామయ్య'గా కధలు రాసుకోగలరని అనుకోవడం భ్రమ. అందుకే ఆయన 'రాయని రచయితగా మిగిలిపోయారు.
ఆయన మిత్రుల్లో చాలామంది మాదిరిగానే నాకూ ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆయనతో పెంచుకున్న చనువునీ, సాన్నిహిత్యాన్నీ, స్నేహాన్నీ ఉపయోగించుకుని- వీలుదొరికినప్పుడల్లా కధలు రాయమని పోరేవాడిని. అలా వెంట పడగా పడగా బద్ధకం వొదిల్చుకుని చివరికి ఒక కధ రాసారు.దాన్ని గురించి స్నేహితులతో చెబుతూ- 'యిది శ్రీనివాసరావు పుణ్యమే' అని - పాపపుణ్యాల పయినా, దేవుళ్ళూ దెయ్యాల పయినా ఏమాత్రం నమ్మకం లేని వెంకట్రామయ్యగారన్నట్టు గుర్తు.
అతికొద్ది 'మంచి' కధలు రాసిన రచయితగా 'డి వెంకట్రామయ్య' అసంఖ్యాక చదువరులకు పరిచయం. కానీ ఆయన పేరుపెట్టు కోకుండానో, 'గళం'పేరుతోనో - రేడియోకి అసంఖ్యాకంగా రచనలు చేసిన సంగతి అందులో పనిచేస్తున్నవారికే తెలియదు. పేరు మీద వ్యామోహం పెంచుకోకపోవడంవల్లనే ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాలేదని అనుకునేవారు కూడా వున్నారు. రాసినవి 'కొద్దే' అయినప్పటికీ, పుస్తక ప్రియులను 'పెద్దగా' ఆకట్టుకున్నవే ఆయన ఖాతాలో చేరాయి. అందుకే 'ఎన్ని' రాసారన్నది కాకుండా, 'ఏమి' రాసారన్నదానికి విలువ కట్టి పురస్కారాలు ఇస్తారనే మంచి పేరున్న 'రాచకొండ రచనా పురస్కారం' ఎంపిక కమిటీ ఈ ఏడాది పురస్కారాన్ని డి వెంకట్రామయ్యగారికి ప్రకటించడం ముదావహం. పురస్కారానికి వున్న విలువ పురస్కార గ్రహీతను బట్టి మరింత పెరుగుతుంది అనడానికి ఇదో మంచి ఉదాహరణ. అలాగే, రావిశాస్త్రి గారికి వీరాభిమానిగా చెప్పుకోవడానికీ, ఒప్పుకోవడానికీ సంకోచించని వెంకట్రామయ్యగారికి ఇదో కలికితురాయి. మరెన్నో మంచి రచనలు చేయడానికి ఈ పురస్కారం ఆయనకి తగిన ప్రోత్సాహకారకం కాగలదని ఆశించడం అత్యాశ కాబోదేమో.

- భండారు శ్రీనివాసరావు