28, జులై 2010, బుధవారం

అమెరికా అనుభవాలు – 4

అమెరికా అనుభవాలు – 4

గీతల నడుమ జీవితం



నేను ముందు అనుకున్నట్టు సియాటిల్ చిన్న నగరమేమీ కాదు. బహుశా హైదరాబాదుకి రెండు మూడు రెట్లు వుంటుందేమో. అనేక కొండల మీద నిర్మితమయిన నగరమిది. పచ్చదనం పరచుకున్నట్టు ఎటు చూసినా పచ్చని చెట్లు. సియాటిల్ వున్న వాషింగ్టన్ స్టేట్ ని గ్రీన్ స్టేట్ అని ఎందుకు అంటారో ఈ నగరాన్ని చూస్తె అర్ధమవుతుంది. పచ్చదనానికి తోడు విశాలమయిన రహదారులు. ఈ రోడ్లని గమనిస్తే అమెరికన్లని గురించి ఒకరు చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. సుఖప్రదమయిన జీవితం గడపడం వారి లక్ష్యం. అది సజావుగా నడవడానికి అవసరమయిన కొన్ని నియమనిబంధనలు ఏర్పరచుకుని వాటిని ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఈ నిబంధనల అమలు మీద సర్కారు ఆజమాయిషీ కంటే స్వచ్చందంగా పౌరులు వాటికి కట్టుబడి వ్యవహరించడం వల్లే అవి విజయవంతంగా అమలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. అమెరికాలో మీకు నచ్చిన విషయం ఏమిటంటే ‘రహదారులు’ అని నిస్సంశయంగా నేను జవాబిస్తాను. మనలో చాలామందిమి టీవీలో వీడియో గేమ్స్ చూసి వుంటాము. రోడ్లపై గీతల నడుమ ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించుకుంటూ కారు నడపాల్సివుంటుంది. గీతలకు ఆవలగా ఏమాత్రం పక్కకు జరిగినా ప్రమాదం జరుగుతుంది. అలాగే అమెరికాలో రోడ్లు కూడా. నిర్దిష్టమైన వేగంతో గీతల నడుమ కారు నడుపుకుంటూ వెడితే చాలు, ఎలాటి ఇబ్బంది వుండదు. వాహనాలు వెళ్ళడానికి, రావడానికి వేర్వేరు రహదారులు వుంటాయి. ఒక్కో మార్గంలో మూడు,నాలుగు వరసల్లో వాహనాలు వెడుతుంటాయి. హారన్ మోగించే ప్రసక్తే లేదు. ఓవర్ టేక్ చేయాలంటే ఖాళీగా వున్న మరో వరుసలోకి వెళ్లి వేగంగా దాటి మళ్ళీ మన వరుసలోకి రావాలి. ఇక ఫ్రీవేల ( FREE WAYS) విషయం తీసుకుంటే వాటి నిర్మాణ శైలి పరమాద్భుతంగా వుంటుంది.


 దేశంలోని వివిధ నగరాలను కలుపుతూ నిర్మించిన ఈ ఫ్రీ వేస్ – అనేకనగరాల మధ్యనుంచి వెడుతుంటాయి. వీటిల్లో కార్లు,తదితర పెద్ద వాహనాలు మినహా మిగిలినవి నిషిద్దం. అలాగే కాలి నడకన వెళ్ళేవారు కూడా వీటిపైకి రాకూడదు. ఈ ఫ్రీ వే ఎడమ వయిపు వరసని ‘కార్ పూల్’ అంటారు. ఒకరికి మించి ప్రయాణీకులు వున్న వాహనాలు మాత్రమె ఇందులో వెళ్ళడానికి వీలుంటుంది. ఈ లైన్ లో వెళ్ళే వాహనాలు తక్కువగా వుంటాయి. కనుక వేగంగా వెళ్ళడానికి వీలుంటుంది. రోడ్లమీద వాహనాల రద్దీ తగించడానికి ఈ ‘కార్ పూల్’ పధ్ధతి ప్రవేశ పెట్టారని చెప్పుకుంటారు.


 ఇక్కడ ప్రతి వారికీ కారు వుంటుంది. కనుక ఇద్దరు కలసి వెడితే రెండో కారు బయటకు తీయనక్కరలేదు, కాబట్టి రద్దీ తగ్గుతుందని అంటారు. కార్ పూల్ వరుసలో కాకుండా వేరే వరుసల్లో వాహనాల రద్దీ ఎక్కువగా వుండి చాలా సార్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ వుంటుంది. నిజానికి ఆ వరుసల్లో వెళ్ళే కార్లలో ఒకే వ్యక్తి ప్రయాణిస్తుంటాడు. అయినా సరే కార్ పూల్ వరుసలోకి రావడానికి ప్రయత్నించడు. చేసాడా జరిమానాలు భారీగా వుంటాయి. జరిమానా భయం కన్నా – నిబంధన పాటించాలన్న నిబద్ధతే వారినలా చేయిస్తోందనడం సబబుగా వుంటుంది. అలాగే నాలుగు రోడ్ల కూడళ్ళలో ఏర్పాటు చేసిన ‘స్పెన్సర్’ వ్యవస్థ కూడా ఎంతో బాగుంది. ఇక్కడ ట్రాఫిక్ దీపాలు యిరవై నాలుగ్గంటలు పనిచేస్తాయి. వాహనాల రద్దీ తక్కువగా వుండే అర్ధరాత్రి సమయాలలో ఈ స్పెన్సర్ లు ఉపయోగపడతాయి. ఎదుటివయిపునుంచి వాహనాలు రాకపోయినా ఎర్రదీపం కారణంగా కారు నిలపాల్సిన అవసరం లేకుండా రోడ్ల కింద అమర్చిన ఈ స్పెన్సర్ లు – కారు ముందు టైర్లు తాకగానే – గ్రీన్ సిగ్నల్ పడేలా చూస్తాయి.

నడిచే వాడిదే రోడ్డు

ఇక్కడి వారికి ఏమున్నా లేకపోయినా కారు మాత్రం వుండి తీరాలి. కారు లేక పోతే కాలూ చేయీ ఆడదు. రోడ్లమీద నడిచేవారు అంతంత మాత్రంగానే కానవస్తారు. కానీ వాళ్ళదే ఇక్కడ హవా. ఎంతో వేగంగా వెళ్ళే వాహనమయినా సరే నడిచి వెళ్ళే వారు కనబడగానే ఆగిపోతుంది. వాళ్ళు రోడ్డు దాటి వెళ్లేవరకూ అన్ని వాహనాలు తటాలున నిలబడి పోతాయి.


 నడిచివెళ్లేవారిని డీ కొడితే అదో పెద్ద నేరం. ఆ కేసునుంచి బయటపడాలంటే చాలా పెద్ద మొత్తంలో నష్ట పరిహారం చెల్లించుకోవాల్సి వుంటుంది. రద్దీగా వుండే రోడ్లని క్రాస్ చేయడానికి కూడళ్ళ వద్ద నాలుగు వయిపులా ‘సిగ్నల్ పుష్ బటన్లు’ వుంటాయి.


 వాటిని ప్రెస్ చేస్తే రోడ్డు దాటడానికి వీలుగా రెడ్ లైట్ మారిపోయి తెల్లదీపం వెలుగుతుంది. ఇలాటి ఏర్పాటు అన్ని నగరాల్లోనూ వుంది.

క్లిష్ట సమస్యకు సింపుల్ పరిష్కారం  

ఎప్పుడు జనసందోహంతో వుండే మార్కెట్ ప్రదేశాలలో నడిచి వెళ్ళే వాళ్ళు -  రోడ్లు దాటడానికి విద్యుత్ దీపాలతో అవసరంలేని ఒక పద్దతి ఇక్కడ  అనుసరిస్తున్నారు. అది మనదగ్గర కూడా ప్రవేశపెడితే బాగుంటుందేమో.





 అదేమిటంటే రోడ్డుకు ఇరువైపులా ఒక బాస్కెట్ లో కొన్ని జండాలు ఉంచుతారు. రోడ్డుదాటాలనుకునేవారు ఒక జండా చేతిలోకి తీసుకుని వెళ్ళాలి. ఆ జండా చేతిలో వుంటే చాలు - రోడ్డుపై పై వెళ్ళే వాహనాలన్నీ టక్కున ఆగిపోతాయి.


 రోడ్డుదాటగానే రెండో వైపువున్న బాస్కెట్ లో జండా ఉంచేసి వెళ్లిపోవచ్చు.చిన్న పిల్లలు, వృద్ధులు, పిల్లల తల్లులకు యిది చాలా ఉపయుక్తంగా వుంది.  యెంతో క్లిష్టంగా అనిపించే సమస్యకు వాళ్ళు కనుగొన్న 'సులువయిన' పరిష్కారం ఇది. ట్రాఫిక్ సమస్యలపై అధ్యయనం పేరుతో విదేశీ పర్యటనలు చేసే  పోలీసు అధికారుల కళ్ళలో యిది పడకపోవడం విచిత్రమే మరి.
           
ట్రాఫిక్ కు సంబంధించి కొట్టవచ్చిన్నట్టు కనబడే మరో విషయం ఏమిటంటే ఎక్కడా రోడ్లమీద ట్రాఫిక్ పోలీసులు జాడ కనబడదు. వాళ్ళు హమేషా వాహనాల్లో తిరుగుతూ అతి వేగంగా వెళ్లే వాహనాలను అదుపు చేస్తుంటారు. జాతీయ రహదారులపై ఈ పోలీసులు హెలికాప్టర్లలో గస్తీ తిరుగుతుంటారు. వాహనదారులు భయపడేది వీరికే. అతి వేగంగా వెళ్లే వాహనాలను పట్టుకోవడానికి అప్పుడప్పుడు వీరు రోడ్ల పక్క చెట్ల మాటున మాటు వేస్తారు. వీరి వాహనంలో వైర్లెస్ టెలిఫోను, కంప్యూటర్, ఇంటర్నెట్ తో పాటు ‘గన్’అని పిలిచే ఒక పరికరం వుంటుంది. ఈ పరికరాన్ని రోడ్లపై వేగంగా వెడుతున్న వాహనాల వయిపు గురిపెట్టి వుంచుతారు. నియమిత వేగాన్ని మించి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఈ పరికరం గుర్తించి కారు నంబరుతో సహా నమోదు చేస్తుంది.


 మన వైపు చలాన్ చెయ్యడం చూసివుంటారుకదా. ఇక్కడ టికెట్ ఇవ్వడం అంటారు. కారు నంబర్ ను బట్టి కంప్యూటర్ ద్వారా వాహనదారుడికి చెందిన వివరాలన్నీ వారికి ఇట్టే తెలిసిపోతాయి. టికెట్ నేరుగా ఇంటికే వస్తుంది. కోర్టులో జరిమానా చెల్లించుకోవాలి. ఇలాటి టికెట్ల సంఖ్య పెరిగిందంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆటోమాటిక్ గా రద్దయిపోతుంది. లైసెన్స్ పోయి కారు నడపలేకపోతే జీవచ్చవం కింద లెక్క. అంతే కాదు- ఎక్కువసార్లు పోలీసులకు దొరికిపోయిన రికార్డ్ వుంటే కారు ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగిపోతుంది. మరోసారి కారు కొనుక్కోవడానికి అప్పు పుట్టదు కాక పుట్టదు.అలాగే బ్యాంకుల్లో అప్పులు కూడా.

కారు భీమా వుంటే ఆ ధీమాయే వేరు కదా! 

 పౌరులందరికీ సోషల్ సెక్యూరిటీ నంబర్ ఇచ్చి వారి సమస్త వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడం ద్వారా అన్ని రకాల అక్రమాలకూ కళ్ళెం వేయగలిగారు. చెల్లని చెక్కులు ఇవ్వడం, అద్దెలు ఎగ్గొట్టి ఇల్లు మారిపోవడం, బ్యాంకులనుంచి తీసుకున్న రుణాలు అనుకున్న వ్యవధిలో చెల్లించకపోవడం, ప్రమాదకరంగా కార్లను నడపడం ఇలా ఏది చేసినా కంప్యూటర్ల ద్వారా తెలిసిపోయి చట్టం చేతికి సులువుగా చిక్కిపోతారు. ఈ విధంగా క్రమబద్ధమయిన, చట్టబద్ధమయిన జీవనానికి ప్రజలు అలవాటు పడేలా చేయడానికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న తీరు హర్షణీయం.

NOTE: All images in this blog are copy righted to their respective owners

కామెంట్‌లు లేవు: