29, జులై 2010, గురువారం

అమెరికా అనుభవాలు – 7

అమెరికా అనుభవాలు – 7

రోప్ వేస్పోకేన్ లో వున్నప్పుడు అక్కడికి దగ్గరలో వున్న సిల్వర్ మౌంటైన్ రిసార్ట్ కి వెళ్ళాము. కింద బేస్ క్యాంపు నుంచి గండోలా (రోప్ వే) లో ఆరువేల అడుగుల ఎత్తున వున్న రిసార్ట్ కి చేరుకున్నాము. ఈ రోప్ వే నిడివి 3.1 మైళ్ళు. ప్రపంచంలో అతి ఎక్కువ దూరం ప్రయాణించే గండోలాల్లో ఇదొకటి. గంటకు పదహారువందలమంది టూరిష్టులను, స్కీయింగ్ క్రీడాకారులను పైకి తీసుకువెళ్ళగల 112 క్యాబిన్లు నిరంతరం పైకీ కిందకు తిరుగుతూవుంటాయి.


 ఒక్కొక్క క్యాబిన్ లో ఎనిమిదిమంది వసతిగా కూర్చోవడానికి వీలుంది. నిమిషానికి వెయ్యి అడుగుల వేగంతో మంచు కప్పుకు పోయిన లోయల మీదుగా పైపైకి తీగె బాటపై ప్రయాణించడం మరపురాని అనుభూతి . పైకి వెళ్ళిన తరవాత చూస్తే అంతా మంచు. తెల్లని మంచు. ఎవరో గంధర్వుడు యోజనాల నిడివి కలిగిన తన బాహువులతో లక్షలకొద్దీ టన్నుల తెల్ల దూది చల్లినట్టు ఎటు చూసినా కను చూపు మేర వరకు తెలతెల్లటి మంచు. అంత ఎత్తునుంచి కొండ సానువుల మీదుగా మంచు మీద స్కీయింగ్ చేస్తూ వేగంగా జారిపోతున్నవారిని చూస్తుంటే ‘భళిరా!’ అనిపించింది. ఉదయం పైకి వెళ్ళినవాళ్ళు సాయంత్రం దాకా ఈ స్కీయింగ్ క్రీడలో గడపవచ్చు. స్కీయింగ్ చేస్తూ మంచు లోయల్లో దారి తప్పిన వారిని కనిపెట్టి క్షేమంగా వెనక్కు చేర్చడానికి మంచుపై పరుగులు తీయగల చిన్న చిన్న మోటారు వాహనాలలో సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం గస్తీ తిరుగుతుంటారు.

అమెరికా లో బస్సు ప్రయాణం

స్పోకేన్ లో మూడు నిద్దర్లు చేసి తిరిగి బస్సులో సియాటిల్ కు బయలుదేరాము. అమెరికాలో బస్సులో ప్రయాణం చేయాలనే కోరిక స్పోకేన్ పుణ్యమా అని తీరింది.
అన్ని రంగాలలో మాదిరిగానే అమెరికాలో బస్సు సర్వీసులు ప్రైవేటు రంగంలోనే వున్నాయి. రహదారులు, వాహనాలు రెండూ బాగుండడం వల్ల బస్సు ప్రయాణం ఎలాటి కుదుపులు లేకుండా ఆహ్లాదంగా సాగింది. కండక్టర్ పద్దతి లేదు. డ్రైవర్ ఒక్కడే సమస్తం చూసుకుంటాడు. బస్సు కంట్రోల్స్ అన్నీ అతడి చేతిలోవుంటాయి. దారిలో విశేషాలన్నీ మైక్రోఫోన్ ద్వారా ప్రయాణీకులకు వివరిస్తుంటాడు. బస్సు ఎన్ని వందల అడుగుల ఎత్తున కొండ శిఖరాలు దాటుతున్నదీ తెలియచేస్తుంటాడు.


ఇంకో గంటలో సియాటిల్ చేరుకుంటామనగా వున్నట్టుండి మంచు కురవడం మొదలయింది. చూస్తూ ఉండగానే దాని ఉధృతి పెరిగిపోయింది. బస్సు స్నో కార్నీ అనేచోట ఆగినప్పుడు చూస్తే హోటళ్ళు, ఇళ్లు, వాటి పైకప్పులు మంచుతో కప్పుకు పోయివున్నాయి. ఒక క్షణం మాస్కోలో వున్నామా అనిపించింది.
బస్సు బయలుదేరింది కానీ వేగం మందగించింది. మా బస్సే కాదు మిగిలిన అన్ని వాహనాలు కూడా. ఎప్పుడూ గంటకు వంద కిలోమీటర్లకు తగ్గకుండా రోడ్లపై పరిగెత్తే వాహనాలన్నీ అతి జాగ్రత్తగా నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాయి. మంచు కారణంగా రోడ్లపై ట్రాఫిక్ గీతలు కనబడకుండా పోవడం కూడా ఇందుకు కారణం. ఎవరు ఏ లైనులో వెడుతున్నారో తెలియని పరిస్తితి.

అమెరికాలో పరిస్తితి  

 మార్గ మధ్యంలో అనేకచోట్ల లైట్లతో అమర్చిన హెచ్చరిక సూచనలు కానవస్తున్నాయి. వాటిని పాటిస్తూనే మా బస్సు డ్రైవర్ రేడియో ఆన్ చేసాడు. వాతావరణం గురించీ, రోడ్ల పరిస్తితి గురించీ, ఏ ప్రాంతంలో యెంత వేగంగా వెళ్ళాలో, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జాములు వున్నాయో వాటి వివరాలన్నీ రేడియోలో తెలియచేస్తున్నారు. ఇంత అభివృద్ధి చెందినా కూడా ఈ దేశంలో రేడియోకు లభిస్తున్న ప్రాధాన్యత తెలుసుకుని రేడియో మనిషిగా గర్వంగా ఫీలయ్యాను. మాస్కో గుర్తు వచ్చిందని అన్నాను కదా. అక్కడ ఇలాటివన్నీ సర్వ సాధారణం.

మాస్కోలో దృశ్యం

 మాస్కోలో ఏడాదికి పది నెలల పాటు మంచు కురుస్తూనే వుంటుంది. అయినా వాహనాల రాకపోకలకు కానీ, జన జీవనానికి కానీ ఎలాటి అంతరాయం కలగకుండా చూస్తారు. రోడ్లపై మంచుని ఎప్పటికప్పుడు తొలగిస్తుంటారు. ఇక రాత్రి వేళల్లో కొన్ని గంటలపాటు రోడ్లని శుభ్రం చేసే కార్యక్రమం నిర్విరామంగా సాగుతుంది. ప్రత్యెక వాహనాలతో ఉప్పు ఇసక కలిపి రోడ్లపై చల్లుతారు. ఉప్పు వల్ల మంచు కరిగి నీరుగా మారుతుంది. వెనుకవచ్చే మరో వాహనం చీపురుతో ఊడ్చినట్టు చేస్తుంది. మరో వాహనం నీళ్ళు చిమ్ముతూ రోడ్లని కడుగుతుంది. మాస్కోలో మేమున్న అయిదేళ్ళు కూడా మంచు కారణంగా రోడ్లపై వాహనాలు నిలిచిపోవదం కానీ, ట్రాఫిక్ కు అంతరాయం కలగడం కానీ చూడలేదు. అక్కడి,అప్పటి ప్రభుత్వ యంత్రాంగం శక్తియుక్తులన్నీ ప్రకృతిపై పోరాటానికే ఖర్చు చేసారా అనిపించింది. అక్కడితో పోలిస్తే ఇక్కడ అమెరికాలో పరిస్థితులు వేరుగా కానవచ్చాయి. రోడ్లపై గీతలు కనబడకపోతే ఇక్కడి వాళ్ళు కార్లు నడపలేరేమో!

NOTE: All images in this blog are copy righted to their respective owners