30, జులై 2010, శుక్రవారం

అమెరికా అనుభవాలు – 14

అమెరికా అనుభవాలు – 14

మిష్టరీ స్పాట్




మరో రోజు సాంటాక్రజ్ అమీపంలోని రెడ్ వుడ్ అడవుల్లోవున్న ‘మిష్టరీ స్పాట్’ చూడడానికి వెళ్ళాము. నిజానికి ఇది చాలా చిన్న టూరిస్ట్ స్పాట్. నూటయాభయి చదరపు అడుగులు వుంటుందేమో. కానీ, దీన్ని చూడడానికి వచ్చే పర్యాటకుల కార్లు పార్క్ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన పార్కింగ్ ఏరియా మాత్రం అతి విశాలంగా వుంది. దీనికి సంబంధించిన చరిత్ర కూడా వింతగా వుంది. సెలవుదినాలను వుడ్స్ లో (అడవుల్లో) గడిపేందుకు ఒక ఆసామీ అక్కడ కొంత స్తలాన్ని కొనుగోలు చేశారనీ, అక్కడ నెలకొనివున్న వింతయిన భౌతిక పరిస్తితుల కారణంగా ఇంటి నిర్మాణం చేయలేకపోయారనీ, దానితో ఆ ‘వింతయిన’ పరిస్తితులను ఆదారంగా చేసుకుని ‘మిష్టరీ స్పాట్’ గా ఆ ప్రదేశానికి పేరు పెట్టి పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేశారనీ చెబుతారు. అక్కడ విశేషమేమిటంటే, ఆ నూట యాభయి చదరపు అడుగుల విస్తీర్ణంలో భూమ్యాకర్షణ శక్తి పనిచేయదు.


 నిట్టనిలువుగా మనిషి నిలబడలేడు. కనిపించని ఏదో శక్తి బాలెన్స్ తప్పిపోయేలా చేస్తుంది. ఫోటోలు,వీడియోలకన్నా ఇందులోని విశేషం దీన్ని స్వయంగా చూసి అనుభవిస్తేనే బాగా అర్ధమవుతుంది.అక్కడ నిలబడ్డప్పుడు వెనక్కు విరుచుకు పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఏటవాలుగావున్న బల్ల చెక్కపై బంతులు వేస్తె అవి కింద నుంచి పైకి వస్తాయి. ద్వారబంధం వద్ద నిలబడితే ముప్పయి డిగ్రీలు వంపు తిరిగినట్టుగా వుంటుంది.


ఈ మిష్టరీని ఛేదించడానికి ఒక పక్క ప్రయత్నాలు, పరిశోధనలు సాగిపోతున్నా - మరో పక్క ఈ మిష్టరీ స్పాట్ ని సందర్శించడానికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా లక్షలు దాటిపోతూ, నిర్వాహకులకు కోట్లు కుమ్మరిస్తోంది.

ఇది చూసినప్పుడు నాకు విజయవాడ మాజీ మేయర్ జంధ్యాల శంకర్ గుర్తు వచ్చారు. చాలా సంవత్సరాల కిందట బెజవాడ లో ఆయన ఒక ఎగ్జిబిషన్ నిర్వహించారు. అందులో ఇలాగే భూమ్యాకర్షణ శక్తికి విరుద్ధంగా కొన్ని వింతయిన ప్రక్రియలను ప్రదర్శించారు. నీరు పల్లమెరుగు అనే సామెతను త్రోసిరాజని నీళ్ళు పైకి ప్రవహించేలా చేయడం, గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా మనిషి బాలెన్స్ తో నిలబడలేకుండా చేయడం – ఇలాటివి చేసినట్టు జ్ఞాపకం.

NOTE: All images in this blog are copy righted to their respective owners

2 కామెంట్‌లు:

పానీపూరి123 చెప్పారు...

మీ అమెరికా ప్రయాణపు వివరాలు బాగున్నాయి.
అన్నీ ఒక్కరోజే పోస్ట్ చేస్తే, చాలా మంది చదవక పోవచ్చు, టెంపో పోతుంది.
ఇంకా ఉంటే, రోజుకి ఒకటి/రెండు చొప్పున పోస్ట్ చెయ్యండి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

sorry andee. mee soochana cheresarike 25 bhaagalu post cheyyadam jarigipoyindi. - bhandaru srinivasrao