21, జనవరి 2025, మంగళవారం

ప్రజాస్వామ్యం అంటే ...- భండారు శ్రీనివాసరావు

 ప్రతి నాలుగు లేదా అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే కాదు. ప్రజాస్వామ్య స్పూర్తి ఉన్నప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి జరిగిన ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ స్పూర్తి కొట్టవచ్చినట్టు కనబడింది.

ఈరోజు పొద్దున్నే మూడు నాలుగు పత్రికలు చూశాను. టీవీలో కనపడ్డ ఆ దృశ్యాలు, నేను తిరగేసిన ప్రధాన పత్రికల్లో కానరాలేదు. ట్రంప్ అమెరకా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు  అంతకు నిమిషం ముందు వరకు అధ్యక్షుడిగా వున్న బైడన్, ఉపాధ్యక్షురాలిగా వున్న కమల హారిస్ పక్కనే ఆసీనులయి కనిపించారు. ట్రంక్ తనదైన శైలిలో పూర్వపు ప్రభుత్వాన్ని, దాని విధి విధానాలను తూర్పారపడుతూ ప్రసంగిస్తున్నా, వారిద్దరూ చాలా నిగ్రహంతో, హుందాగా ఆ ప్రసంగాన్ని మౌనంగా ఆలకించారు. అంతే కాదు, ఒక సందర్భంలో సభికులు అందరూ నిలబడి హర్షధ్వానాలు చేస్తున్నప్పుడు,వారిద్దరూ కూడా లేచి నిలబడి చేతులు చరిచారు. ప్రజాస్వామ్య స్పూర్తికి కొలమానం అయిన ఈ దృశ్యాల ఫోటోలు నాకు ఈరోజు పత్రికల్లో ఎక్కడా కనిపించలేదు.



(21-01-2025)   

20, జనవరి 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (78) – భండారు శ్రీనివాసరావు

 

 

దేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఆంధ్రరాష్ట్ర రాజధాని కర్నూలు నుంచి హైదరాబాదుకు మారగానే ఆయన మొదట్లో ప్రస్తుతం రాజభవన్ పక్కన వున్న దిల్ కుశ్ గెస్ట్ హౌస్ లో వుండేవారు. ‘కర్నూలు రాజధానిలో డేరాలు వేసుకుని వుండి వచ్చారు కదా! ఇప్పుడు హైదరాబాదులో జీవితం ఎలావుంద’ని ఒక విలేకరి ముఖ్యమంత్రిని అడిగారు. ‘ఏం చెప్పనబ్బా! ఈ ఇల్లు ఎంత పెద్దగా వుందో చూస్తున్నారు కదా! మా ఆవిడ ఏ గదిలో వుందో కనుక్కోవడానికి అరగంట పడుతోంది’ అని నవ్వుతూ బదులిచ్చారు. తరువాతి కాలంలో సంజీవరెడ్డి బేగంపేట లోని గ్రీన్ లాండ్స్ ప్రభుత్వ అతిధి గృహాన్ని తన అధికార నివాసంగా ఎంచుకున్నారు. ఆయన తర్వాత దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. సంజీవరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా వున్నప్పుడు సంజీవయ్య ఖుర్షిద్ జా అనే ఒక ప్రైవేటు భవంతిలో నివాసం వుండేవారు.

సంజీవయ్య గారి ప్రసక్తి వచ్చింది కనుక, కర్నూలు జిల్లా కల్లూరు మండలం లోని స్వగ్రామం  పెద్దపాడులో ఆయన సొంత ఇంటి పరిస్థితి గురించి చెప్పుకోవడం సముచితంగా వుంటుంది. 

అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రి.

ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆ పదవికి రాజీనామా చేసిన దరిమిలా  ఆయన స్థానంలో దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రూ నిర్ణయించారు. అగ్రకులాల ఆధిపత్యం అధికంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ లోని కొందరు నాయకులు, ఒక దళితుడు ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేక పోయారు. సంజీవయ్య అవినీతిపరుడని, అక్రమంగా లక్షలాది రూపాయలు కూడబెట్టారని అధిష్టానానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. సంజీవయ్య నీతి, నిజాయితీ తెలిసిన నెహ్రూ ఆ ఫిర్యాదులను కొట్టి పారేశారు. అయినా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మొండిపట్టు పట్టారు. 

నెహ్రూ ఓ నాయకుడిని ఆంధ్రాకు వెళ్లి సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరారు. ఆయన హైదరాబాద్ వచ్చి అప్పటి కాంగ్రెస్ యువ నేత చక్రపాణిని కలిసి వచ్చిన పని చెప్పారు. సంజీవయ్య గారి గురించి బాగా తెలిసిన చక్రపాణి నిర్ఘాంతపోయి ఆ నాయకుడిని చివాట్లు పెట్టారు. కానీ ప్రధాని ఆదేశం. చేసేది లేక ఢిల్లీ నాయకుడిని వెంటబెట్టుకుని కారులో సంజీవయ్య గారి గ్రామానికి వెళ్లారు. గ్రామ పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి. ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యిపై, మట్టి కుండతో అన్నం వండుతున్నది. పొగగొట్టంతో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది. "ఏమిటి ఇక్కడ ఆపారు?" ప్రశ్నించాడు ఢిల్లీ నేత. 

"సంజీవయ్య గారి ఇల్లు ఇదే. ఆ వృద్ధురాలు ఆయన అమ్మగారు. కారు దిగండి" అన్నారు చక్రపాణి. నాయకుడు నివ్వెరపోయాడు. చక్రపాణి ఆమెకు నమస్కరించి "అమ్మా! ప్రస్తుతం మంత్రిగా ఉన్న మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు" అన్నారు.

ఆమె చెమటలు తుడుచుకుంటూ, "అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా నాయనా! ఈ కట్టెల పొయ్యి మీద వంట చెయ్యడం కష్టంగా ఉంది. ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు" అన్నది. 

ఢిల్లీ నాయకుడి నోట్లోంచి మాట రాలేదు. "సార్!  గ్రామంలోకి వెళ్లి విచారణ చేద్దామా?" అడిగారు చక్రపాణి. "అవసరం లేదు. కారును హైద్రాబాద్  పోనీయండి" అన్నాడు నాయకుడు. 

ఆ తరువాత వారం రోజుల్లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయ్యారు. 

 కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాల కారణంగా రెండేళ్ళ తర్వాత సంజీవరెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరిగింది. తదుపరి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చాలా రోజులు ప్రస్తుతం విద్యుత్ సౌధకు సమీపంలోని ఏరువాక ప్రభుత్వ భవనంలో వుండి, తరువాత బేగంపేటలో గ్రీన్ లాండ్స్ ఎదురుగా, రోడ్డుకు ఆవల వైపు ఉన్న మరో ప్రభుత్వ భవనాన్ని(ఇప్పుడు మంజీరా గెస్ట్ హౌస్) తన అధికార నివాసంగా ఎంచుకున్నారు. ముఖ్యమంత్రికి శాశ్వత అధికార నివాసభవనం ఉండాలనే బ్రహ్మానందరెడ్డి ఆలోచన ఫలితంగా ఆనందనిలయం రూపుదాల్చింది. వాస్తు చూసి ఏర్పాటు చేసుకున్నా, ఎక్కువరోజులు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగలేదు. రాష్ట్ర విభజన ఉద్యమాల ఫలితంగా ఆయన పదవి నుంచి దిగిపోవడంతో పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు. ఆంధ్ర ఉద్యమం కారణంగా రాజీనామా చేసి తప్పుకునేంత వరకు ఆయన కూడా ఆనంద నిలయంలోనే కొనసాగడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం రాష్ట్రం, రాష్ట్రపతి పాలనలో వుంది.

తదనంతరం జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో హోంమంత్రిగా వున్న సమయంలో పంజాగుట్ట ప్రాంతంలోని ద్వారకాపురి కాలనీలో ముచ్చటపడి కట్టుకున్న చిన్న భవంతిలోనే కొనసాగారు. ముఖ్యమంత్రి హోదాకు తగిన వసతులు అరకొరగా ఉన్నప్పటికీ చివరి వరకు ఆయన ఆ ఇంట్లోనే కాలక్షేపం చేసారు.

ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి వ్యవహార శైలి విభిన్నం. ఆయన తార్నాక లోని సొంత ఇంట్లోనే వుండి, దానికి అన్నిరకాల హంగులు సమకూర్చుకున్నారు. బహుశా సొంత నివాసాలకు ప్రభుత్వ ఖర్చుతో వసతులు ఏర్పాటు చేసుకునే సాంప్రదాయానికి అప్పుడే బీజం పడిందని అనుకోవాలి. ఆ రోజుల్లో మొత్తం హైదరాబాదులో లిఫ్ట్ సౌకర్యం ఉన్న ప్రైవేటు గృహాలు రెండే ఉండేవని, వాటిల్లో ఒకటి చెన్నారెడ్డి గారి తార్నాక నివాసం అని జనం చెప్పుకునేవారు. 

తదుపరి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య పరిస్తితి దీనికి పూర్తిగా విరుద్ధం. ఆయనకు  బరకత్ పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టూ ఆర్ టీ ఇల్లు వుండేది. మంత్రిగా, కేంద్ర మంత్రిగా వున్నప్పుడు ఆయన అక్కడే వుండేవారు. ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా వుంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా వుండవు. ముఖ్యమంత్రిగా జనాల తాకిడి ఎక్కువ. దాంతో ఆయన గతంలో సంజీవరెడ్డి నివాసం ఉన్న గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ ని అధికార నివాసంగా చేసుకుని, దానికి జయప్రజా భవన్ అనే పేరు పెట్టారు.

ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన భవనం వెంకట్రాం మాత్రం తాను అంతకుముందు మంత్రిగా వున్నప్పుడు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్ లోనే వుండిపోయారు. భవనం వెంకట్రాం తర్వాత ముఖ్యమంత్రి అయిన కోట్ల విజయ భాస్కరరెడ్డి లోగడ పీవీ ముఖ్యమంత్రిగా నివసించిన ఆనంద నిలయానికి మారారు. 

ఇక, తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ఎన్టీ రామారావు ఆబిడ్స్ లోని తన సొంత ఇంట్లోనే వున్నారు. ఒక ముఖ్యమంత్రి అధికార నివాసాలు ఒకటికి మించి గుర్తించి, అందుకు తగిన సదుపాయాలు కల్పించే పద్దతి ఆయన హయాములోనే మొదలయింది. గండిపేటలోని తన ఆశ్రమాన్ని కూడా రెండో అధికార నివాసంగా మార్చుకున్నారు. కొన్నాళ్ళు ప్రతిపక్షంలో వుండి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాస్తు బాగుందని భావించారేమో తెలియదు, బంజారా హోటల్ సమీపంలోని తన కుమార్తె పేరిట ఉన్న ఒక చిన్న భవనంలో నివాసం వున్నారు. ప్రభుత్వం పక్కనే ఉన్న మరో భవనాన్ని అద్దెకు తీసుకుని ముఖ్యమంత్రి అవసరాలకు తగిన విధంగా వసతులు సమకూర్చడం జరిగింది. ఒక నెల రోజులపాటు ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కర రావు జూబిలీ హిల్స్ లోని తన సొంత ఇంట్లోనే వున్నారు.

1995లో ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబునాయుడు జూబిలీ హిల్స్ లోని తన సొంత ఇంట్లోనే నివాసం వున్నారు. హోదాకు, అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వమే కొన్ని వసతులు సమకూర్చింది.

వై. ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని మాసాలపాటు నాగార్జున సొసైటీలోని తన కుమార్తె ఇంట్లో నివాసం వున్నారు. ముఖ్యమంత్రికి శాశ్వత నివాస భవనం ఉండాలనే కాసు బ్రహ్మానంద రెడ్డి ఆలోచనను ఆయన మళ్ళీ ఆచరణలోకి తీసుకువచ్చారు. బేగంపేట మంత్రుల క్వార్టర్స్ లోని కొన్ని భవనాలను తొలగించి, అన్ని వసతులతో కూడిన విశాలమైన ఒక మంచి భవనాన్ని ప్రభుత్వ ఖర్చుతో కొద్ది నెలల కాలంలోనే నిర్మించారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే వరకు అందులోనే నివాసం వున్నారు.

తరువాత ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయిన కే. రోశయ్య ఆ భవనంలో చేరడానికి ఇష్టపడలేదు. అమీర్ పేటలోని ప్రకృతి చికిత్సాలయం దాపునే తాను నిర్మించున్న భవంతిలోనే వుండిపోయారు. ముఖ్యమంత్రిగా రోశయ్య నుంచి బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా చాలా కాలం జూబిలీ హిల్స్ లోని సొంత ఇంట్లోనే వున్నారు. ఆ తరువాత తన నివాసాన్ని బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార నివాసానికి మార్చుకున్నారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్నాళ్ళు సొంత ఇంట్లో నివసించిన తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొన్నాళ్ళు  వై.ఎస్. హయాములో నిర్మించిన నివాసంలోనే వున్నారు. అక్కడ వున్న సోఫాలను కానీ, ఫర్నిచర్ ను కానీ మార్చకుండా అందులో నివసించారని కేసీఆర్ వ్యక్తిగత అధికారులు చెబుతుంటారు. అక్కడే వుంటూ, పక్కనే కొత్తగా విశాలమైన ఆధునిక వసతులు కలిగిన సీఎం క్యాంపు కార్యాలయ సముదాయాన్ని ఏర్పాటు చేశారు.

పోతే, అటు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు తాత్కాలికంగా కృష్ణానదీ తీరాన ఒక ప్రైవేటు గెస్టు హౌస్ ను తన అధికార నివాసంగా మార్చుకున్నారు. అధికారంలో ఉన్నంతకాలం చంద్రబాబు దాన్నే తన నివాసంగా ఉపయోగించుకున్నారు. 2019లో  ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగింది. ప్రతిపక్షనేత జగమ్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నకాలంలో అమరావతి ప్రాంతంలో నిర్మించుకున్న ఇంటినే ఆయన అధికార నివాసంగా మార్చుకున్నారు. 2024 లో మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గతంలో నివసించిన భవనాన్నే అధికార నివాసం చేసుకున్నారు.

తెలంగాణా రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ హయాములో నిర్మించిన అధికారిక నివాస భవనం వాడుకోకుండా సొంత ఇంటిలోనే నివాసం వుంటున్నారు.

కింది ఫోటో:

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొదటి, చివరి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య పేరిట భారత ప్రభుత్వం విడుదల చేసిన పోస్టల్ స్టాంప్ 



(ఇంకా వుంది)

అయాం ఎ బిగ్ జీరో (77) – భండారు శ్రీనివాసరావు

 సొంత సొద కోసం కాసేపు రాజకీయాలకు విరామం.

హైదరాబాదులో మా కాపురం కొన్నేళ్ళు ఆరు ఆటంబాంబులతో సాగింది.

 1975 లో హైదరాబాదుకు వచ్చినప్పుడు కొత్త కాపురం ఇబ్బందులు  ఎలా ఉంటాయో ఏమిటో తెలియకుండా, అశోక్ నగర్ చమన్ దగ్గర  మా రెండో  అన్నయ్య రామచంద్రరావు గారింట్లో కొన్నాళ్ళు కాలక్షేపం చేశాము. తర్వాత వాళ్ళ పక్కనే ఉన్న  ఇంట్లో చిన్న వాటా దొరికితే అక్కడకు మారాము. ఇల్లుగలవాళ్ళు ఆ ఇంటిని ఎవరికో అమ్మివేయడంతో వాళ్ళకీమాకూ ఆ ఇంటితో రుణం తీరిపోయింది. మళ్ళీ ఇల్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి. సరే! ఎక్కువ వెతుకులాట, ప్రయాస లేకుండానే చిక్కడపల్లి త్యాగరాయ గానసభ సమీపంలో ఒక పోర్షన్ దొరికింది. మాస్కో వెళ్ళే దాకా అక్కడే మా ఆల్ మకాం.  ఇల్లు చిన్నదే అయినా,  ఆ ఇంటి వాస్తు మహిమ ఏమోకానీ ఎప్పుడూ నలుగురు వచ్చేపోయేవాళ్ళతో కళకళలాడుతూ వుండేది. పగలల్లా మా ఆవిడ నడిపే అమ్మవొడి, సాయంత్రం అయ్యేసరికి రచయితలుకవులుఉన్నతాధికారులతో కూడిన  ఆస్థానంగా మారిపోయేది. ఆఫీసునుంచి నా రాకతో నిమిత్తం లేకుండా జనం జమ అయ్యేవారు. వాళ్లకుకాఫీలుఉప్మాలుకొండొకచో అర్ధరాత్రి భోజనాలతో మా ఆవిడ నిర్మల అన్నీ అమర్చిపెట్టేది. ఇవన్నీ చూసి రేడియోలో నా సహచరులున్యూస్ రీడర్,  ప్రముఖ రచయిత డి. వెంకట్రామయ్య గారు“వండ నలయదు వేవురు వచ్చిరేని నన్నపూర్ణకు నుద్దియౌ నతనిగృహిణిఅనేవారు, మనుచరిత్రలో అల్లసాని పెద్దన గారి పద్యాన్ని ఉటంకిస్తూ. అనడమే కాదు తన జీవిత చరిత్ర గ్రంథంలో  పేర్కొన్నారు కూడా.  

ఇదలా ఉంచుదాం.

‘పొయ్యి పైనాపొయ్యి లోపలా’ వున్నవాడే కలవాడు అనేది మా బామ్మగారు. అంటే నలుగురికి సమృద్ధిగా  వండి పెట్టే సరుకులుపొయ్యి వెలిగించడానికి ఎండు కట్టెలు ఎల్లప్పుడూ ఇంట్లో వుండాలి అనేది ఆవిడగారి మన్ కి బాత్.

మా బామ్మ గారి రోజుల్లో లాగా కట్టెల బాధ ఇప్పుడు లేదు. వచ్చిన బాధల్లా  గ్యాస్  సిలిండర్ ఖాళీ అయితేనే. సింగిల్ సిలిండర్ సిస్టం కావడం వల్ల గ్యాస్ అయిపోతే ప్రత్యామ్నాయం వుండేది కాదు. బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేసేరోజుల్లో  కాల్ గ్యాస్ కంపెనీలో ప్రసాద్  గారని స్నేహితుడిగా మారిన ఒక ఉద్యోగి వుండేవారు. గ్యాస్ అయిపోవడం ఆలస్యం, ఎంత కొరతగా వున్నాసరే, అరగంటలో సిలిండరు ఇంటికి వచ్చేది. ఇరవై మూడు రూపాయలు అనుకుంటా. ఆ పెద్ద మొత్తం సర్దడానికి ఆఫీసులో ఉపేంద్రగారు వున్నారనే ధీమా.

ఆ కాలంలో సామాన్య గృహస్తుకు డబ్బుతో పాటు బాగా కటకటగా ఉండేవి  మరో మూడు. కరెంటునల్లా నీళ్ళుగ్యాస్ సిలిండరు.    

ఇంట్లో నిత్యం జరిగే సంతర్పణలుసమారాధనలుసంభారాల భారంతో  నిమిత్తం పెట్టుకోకుండా అవన్నీ అంతా మా ఆవిడ భుజాల మీదకు వదిలేసి, కొరతలుగా ఉన్న ఈ మూడింటి సంగతి చూడడానికి, అధికార దుర్వినియోగం ఆనండిఏదైనా అనండి ఎంతదూరం అయినా వెళ్ళేవాడిని. నీళ్ళు రాని రోజున ఏకంగా మంచినీళ్ళ మంత్రి, ఆయన్ని అలానే పిలిచేవాడిని,  మునిసిపల్ శాఖ మంత్రి, కళా వెంకటరావు గారికి పొద్దున్నే ఫోన్ కొట్టేవాడిని. ఆయన విసుక్కోకుండా ‘ట్యాంకర్ కావాలి కదా పంపిస్తాను అనేవారు. అన్నట్టే అరగంటలో మంచి నీళ్ళ ట్యాంకర్ వచ్చి సంపులో  నీళ్ళు నింపి పోయేది మా  ఇరుగు పొరుగుకు కూడా సరిపోయేలా.   

అలాగే కరెంటు. పోవడం ఆలస్యంవిద్యుత్ బోర్డుచైర్మన్ నార్ల తాతారావు గారికి ఫోన్. ఆయన నా బాధ పడలేక మా ఇంటి దగ్గరలోనే ఓ ట్రాన్స్ ఫార్మర్ వేయించారు.

పొతే మూడోది మరీ ముఖ్యమైనది గ్యాస్ సిలిండర్. ఖాళీ అయిందని మా ఆవిడ ఫోన్ చేసి చెప్పడం ఆలస్యం అన్ని పనులు వదిలిపెట్టి ఆ పనిమీదనే  కూర్చొనే వాడిని.        

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో తెలిసిన జనరల్ మేనేజర్లకు ఫోన్ చేసేవాడిని. అరగంటలో సిలిండర్ డెలివరీ అయిన సంగతి తెలిసిన  తర్వాతనే ఆఫీసు పనయినా  ఏదైనా. నా బాధ ప్రపంచం బాధ అన్నట్టు సాగేది నా వ్యవహారం. అదేమిటో ఆ రోజుల్లో ఒక సిలిండర్ ఇరవై రోజులు కూడా వచ్చేది  కాదు. ఇప్పుడు రెండు నెలలు పైన  వస్తోంది. ఈ ఖర్చులు అయితే తగ్గాయి. కానీ మరో రూపంలో, ధరలు పెరిగి పెరిగాయి. పక్షి పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరి పోయిన తర్వాత గూడు విశాలమైనట్టు, ఇప్పుడు  ఇళ్లు కూడా ఖాళీగా, విశాలంగా  కనిపిస్తున్నాయి.

ఆ తర్వాత అయిదేళ్లు ఇలాంటి ఏ కొరతలు లేని సోవియట్ యూనియన్ లో కాలుమీద కాలేసుకుని దర్జాగా బతికాము. దేనికీ కొరతలేదుచివరాఖరుకి డబ్బుకు కూడా. ఇరవై నాలుగు గంటల పైపు గ్యాసునీళ్ళు, కరెంటుఫోనుమూడు పడక గదుల ఇల్లు ఉచితం. దాంతో వారానికి రెండు మార్లు, వారాంతపు రోజుల్లో  మాస్కోలోని తెలుగు విద్యార్ధులతో, తెలుగు కుటుంబాలతో  మా ఇల్లు నిత్య కల్యాణం పచ్చ తోరణం. నిర్మల గారి సత్రం అనేవారు.

ఇక అయిదేళ్ళ ప్రవాస జీవితం తర్వాత తిరిగి వస్తే, హైదరాబాదు ఎయిర్ పోర్టులోనే నాటి కమ్యూనికేషన్ల మంత్రి రంగయ్య నాయుడు గారు కలిసి,  ఫోన్ లేకపోతె ఎల్లా అంటూ ఆయనే చొరవ తీసుకుని  ఫోన్  కనెక్షన్  మంజూరు చేశారు. డిపార్ట్ మెంటు వాళ్ళు మర్నాడు  ఫోనులాంగ్ కార్డు పట్టుకుని రేడియో స్టేషన్ కు వచ్చారు, ఇల్లెక్కడ అడ్రసు చెప్పండని అంటూ. అప్పటికి రెంటుకు ఇల్లే దొరకలేదు. మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారింట్లో ఉంటున్నాము.

ఆకస్మికంగా వచ్చి పడ్డ ఫోన్ కోసం ఇంటి వేట ముమ్మరం చేశాము. చివరికి పంజాగుట్టలోని మా అన్నయ్య ఇంటికి దగ్గరలోనే దుర్గానగర్ కాలనీలో ఓ ఇల్లు దొరికింది. ఓడలో మాస్కో సామాను వచ్చేలోగా  దగ్గరలో ఉన్న మరో పెద్ద ఇంటికి మారాము. అద్దె రెండు వేలు. లంకంత కొంప. ఇంటివాళ్ళు ముస్లిమ్స్. ఎక్కడో ఏదో దేశంలో వుంటారు. ఆ ఇల్లు కట్టిన తాపీ మేస్త్రీకి  చిన్న చిన్న గదులు కట్టడం తెలియదల్లే వుంది. అన్నీపెద్ద పెద్ద  హాల్సే. ఇల్లంతా కట్టిన తర్వాత చూసుకుంటే వంటిల్లు కనబడనట్టుంది. ఏదో చిన్న జాగా చూసి వంట గది అనిపించాడు. ఆ ఇంట్లో మా మాస్కో సామాను భేషుగ్గా సరిపోయింది కానీ సిలిండర్లకు ఆ చిన్న కిచెన్ లో  జాగా దొరకలేదు. దాంతో వున్న ఆరు సిలిండర్లలో  ఒకటి స్టవ్ కు బిగించి, మిగిలిన అయిదింటినీ బయట హాల్లో దసరా బొమ్మల కొలువులా వరసగా పెట్టేవాళ్ళం.

నేను మాస్కోనుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే అప్పటి పెట్రోలియం మంత్రి చింతా మోహన్ గారు ఓ రెండు,  ఎంపీలు డాక్టర్ మల్లు రవిరాయపాటి సాంబశివరావు గార్లు చెరి రెండు సిలిండర్లు నోరు తెరిచి అడగకుండానే తమ కోటాలో ఇప్పించారు. దాంతో ఆరు సిలిండర్లు గృహ ప్రవేశం చేసాయి. నట్టింట్లో బాంబులు పెట్టుకుని శ్రీనివాసరావు మళ్ళీ కొత్త కాపురం మొదలు పెట్టాడని ఫ్రెండ్స్ సరదాగా అనేవారు. అయితే మా ఆవిడ పబ్లిక్ రిలేషన్స్ కు అవి బాగా ఉపయోగపడ్డాయి. ఎవరికి ఎప్పుడు సిలిండర్ అవసరమైనా వాళ్ళు గ్యాస్ కంపెనీకి కాకుండా మా ఆవిడకు  ఫోన్ చేసేవాళ్ళు. అలా కొన్నాల్టికి  ఎవరికి ఇచ్చామో తెలియని పరిస్థితుల్లో చివరికి మా ఇంట్లో అయిదే మిగిలాయి.

ఈలోగా రూల్స్ మారి ఒక పేరు మీద ఒకే కనెక్షన్, రెండే సిలిండర్లు  అన్నారు. శాపవిమోచనం అయిన గంధర్వుల మాదిరిగా ఓ మూడు సిలిండర్లు  రెక్కలు కట్టుకుని తమ దేవ లోకానికి తరలి పోయాయి. ఆచూకీ దొరక్కుండా పోయిన సిలిండర్ డబ్బు మా చేత కట్టించుకున్నారు. అలా ఆరు సిలిండర్ల కధ కంచికి చేరింది.

ఇక ఇప్పుడు దేనికీ కొరత లేదు, ఒక్క మా ఆవిడ లేదనే చింత తప్ప. అనుభవించే దశలో దాటిపోయింది.

కింది ఫోటో:

మాస్కో ఇంట్లో మా ఆవిడ నిర్మల  







(మాస్కోలో ఆంధ్రప్రభ వారపత్రిక ఎక్కడిదనా సందేహం. ఇదొక పాత పత్రిక. ఒకరకంగా గుర్తింపు కార్డు. మాస్కోకు వచ్చే తెలుగు అతిధులకు నేనెవరో, నా మొహం ఎలా వుంటుందో తెలవదు. అలాగే వైస్ వెర్సా. పలానా రోజు వస్తున్నామని ఓ కార్డు ముక్క రాసి  పడేసే వారు. ఎయిర్ పోర్టులో ఆంధ్రప్రభ పట్టుకుని వున్న నన్ను చూడగానే నేను  నేనే అని వాళ్లకు తెలిసిపోయేది)

 

(ఇంకా వుంది)

19, జనవరి 2025, ఆదివారం

నా ఆఖరి ఇంటర్వ్యూ – భండారు శ్రీనివాసరావు


‘ఇక నుంచి ఏ టీవీ డిబేట్ కు వెళ్ళకూడదు, ఏ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వకూడదు’ అని ఏడాది క్రితం కాబోలు గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి ముందు నేను ఇచ్చిన ఆఖరు ఇంటర్వ్యూ ఇది. షరా మామూలుగానే DISCLAIMER:

‘ఈ  వీడియో టైటిల్ కు, నేను ఇచ్చిన ఇంటర్వ్యూ కు ఎలాంటి సంబంధం లేదు’

కాకపోతే నేను రాస్తున్న అయాం ఎ బిగ్ జీరో సీరియల్ కు దీనికి కొంత సంబంధం వుంది కాబట్టి ఈ పాత వీడియో ఈరోజు పోస్టు చేస్తున్నాను.

ఆదాన్ టీవీ వారికి కృతజ్ఞతలు 



అయాం ఎ బిగ్ జీరో (76) – భండారు శ్రీనివాసరావు

 

యన్టీయార్ అని అభిమానులు ముచ్చటగా పిలుచుకునే నందమూరి తారక రామారావు గారు (ఎన్టీఆర్) ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో కొందరు తెలుగు దేశం నాయకులు ఆయన్ని కలిసి, 'పలానా జిల్లా ఎస్పీ ని బదిలీ చేయాల'ని  కోరారు. వారిని ఎన్టీఆర్ రెండే రెండు ప్రశ్నలు అడిగారు.

"ఆ పోలీసు అధికారి అవినీతిపరుడా? చేతకాని వాడా?"

కాదన్నారు వాళ్లు.

"మరేమిటి?" సీ.ఎం. ఆరా.

"మన పార్టీకి పనికి రాడు" పార్టీ నేతల జవాబు.

"పార్టీకి పనికి రాకపోతే మీకేమిటి నష్టం? పార్టీ పని మీరు చేయండి. ప్రభుత్వం చేయాల్సింది అధికారులు చేస్తారు" సంభాషణ ముగించారు ఎన్టీఆర్.

ఆ ఎస్.పీ. ఎవరో కాదు ఉద్యోగపర్వంలో అత్యంత సమర్ధుడనీ, నిజాయితీపరుడనీ పేరు తెచ్చుకుని తదనంతర కాలంలో పోలీసు డైరెక్టర్ జనరల్ గా పదవీ విరమణ చేసిన ఐ.పీ.ఎస్. అధికారి శ్రీ  ఏ.కే. మహంతి. ఒక టీవీ ఛానల్ చర్చలో ఆయనే స్వయంగా ఈ ఉదంతం వెల్లడించారు.

రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ ది ఒక ఉత్కృష్ట అధ్యాయం. రాజకీయాల దశను దిశను ఆయన ఒక మలుపు తిప్పారు. నిజం చెప్పాలంటే రాజకీయాల రంగూ, రుచీ మార్చారు. సమాజంలో కొన్నివర్గాలకే పరిమితమైవున్న రాజకీయ అవకాశాలను  బడుగు బలహీన వర్గాలకు సైతం అందుబాటులోకి తెచ్చారు. ఒక ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు, ఒక సామాన్య గృహిణి, ఒక లాయరు, ఒక చిన్న వ్యాపారి ఇలా అనేకమంది ఆయన హయాములో  ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు కాగలిగారు. (ఉమ్మడి) రాష్ట్రం మొత్తం రాజకీయ రంగం రూపురేఖలు మారిపోయింది కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పేరుతొ ఒక ప్రాంతీయ పార్టీని పెట్టిన తరువాతనే.    

 తెలుగుదేశం పార్టీ తొలిసారి ఎన్నికల కురుక్షేత్రంలో అడుగుపెట్టి, తొలి అడుగులోనే విజయభేరి మోగించి 1983 లో అధికారంలోకి వచ్చింది. ఈ అపూర్వ విజయానికి ఎన్టీ రామారావు వ్యక్తిగత ఆకర్షణ, గత కాంగ్రెస్ పాలనపై ప్రజలకు కలిగిన ఏష్టత ప్రధానంగా దోహదం చేసాయి. రాష్ట్రావతరణం నుంచి ఏకఛత్రాధిపత్యంగా సాగుతూ వచ్చిన కాంగ్రెస్ పాలనకు గండి పడింది. అంతవరకూ ప్రాంతీయ పార్టీల పొడ ఎరుగని తెలుగు ఓటర్లు, 'తెలుగుజాతి ఆత్మ గౌరవం' నినాదంతో ముందుకు వచ్చిన  తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం కట్టబెట్టారు. రాజకీయాల్లో తొమ్మిది మాసాల పసికూన అయిన తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో 203  స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. పాలకపక్షం అయిన కాంగ్రెస్ 60  సీట్లకే పరిమితమయింది. ఈ అసాధారణ విజయంతో ఎన్టీఆర్ ప్రతిభ దేశం నలుమూలలకు పాకింది.

అంతవరకూ తెలుగు సినీ పరిశ్రమను ఏలిన శ్రీ రామారావుకు, రాజకీయరంగంలో సయితం లభించిన ఈ అపూర్వ విజయం ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.  ఈ విజయం పెంపొందించిన ఆత్మ బలంతో ఆయన మరింత దూకుడు ప్రదర్శించి జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ వ్యతిరేకులను కూడగట్టి ఆ పార్టీకి రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుచేయాలనే ఉద్దేశ్యంతో పావులు కదిపారు. సహజంగానే ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బతీసింది. 'కేంద్రం ఒక మిధ్య' అని అభివర్ణిస్తూ, 'కేంద్ర పెత్తనాన్ని ఇక సహించేది లేదు' అనే రీతిలో తెలుగుదేశం అధినేత  ప్రదర్శించిన ధిక్కార ధోరణి ఎన్టీఆర్  కు జనబాహుళ్యంలో మరింత ఆదరణను, రాజకీయాల్లో మరిన్ని నిరసనలను సంపాదించి పెట్టింది. పైకి అహంభావంగా కానవచ్చే ఎన్టీయార్ మనస్తత్వం, స్వపక్షంలోనే విపక్షం పురుడు పోసుకోవడానికి ఉపకరించింది. ఏడాది తిరక్కుండానే ఆయన మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి శ్రీ నాదెండ్ల  భాస్కరరావు నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు ఆగస్టు సంక్షోభం రూపంలో శ్రీ రామారావు పదవికే ముప్పు తెచ్చింది. దరిమిలా జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నిద్రాణంగా వున్న తెలుగుప్రజల రాజకీయ చైతన్యాన్ని మళ్ళీ కొత్త చిగుళ్ళు తొడిగించింది. రాష్ట్ర రాజకీయాన్ని ఓ మలుపు తిప్పి సరికొత్త రాజకీయాలకు తెర తీసింది. ఎన్నికలలో ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న శాసన  సభ్యులకు ఎరవేసి  తమ వైపు తిప్పుకుని, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను అడ్డదోవలో కూలదోసే దుష్ట సంస్కృతి అప్పటినుంచే తెలుగు రాజకీయాల్లో వేళ్ళూనుకుంది. ఈనాడు యధేచ్చగా సాగిపోతున్న పార్టీ మార్పిళ్ళ రాజకీయాలకు ఆనాడే బీజం పడింది. తెలుగుదేశం పార్టీ అవిర్భావం వల్ల రాజకీయాలు ఎంతగా చైతన్యవంతం అయ్యాయో, ఎంతగా బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం పెరిగిపోయిందో, అంతే స్థాయిలో రాజకీయాలు కాలుష్య కాసారాలు  కావడం, నైతిక విలువలు దారుణంగా  క్షీణించడం ఇటువంటి అవలక్షణాలు అన్నీ అలాగే పెరిగిపోయాయి అనడం  సత్యదూరం కానేరదు. ఈ మంచి చెడులకు  రామారావు గారిని బాధ్యుడిని చేయడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే అయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల పట్ల ఆయనకు ఒక నిర్దుష్టమైన అవగాహన వుండేది. ఆయన్ని బాగా ఎరిగినవారికీ, సన్నిహితంగా మెలిగిన  అధికారులకు, కొందరు విలేకరులకు  ఈ విషయం ఎరుకే. దానికి మహంతి వంటి సీనియర్ పోలీసు అధికారులే ప్రత్యక్ష సాక్షులు.    ఉదంతంతో ఈ వ్యాసాన్ని మొదలు పెట్టిన కారణం కూడా అదే.

ఏ కాంగ్రెస్ పార్టీని ఎన్టీఆర్ సకల పాపాలకు కూపంగా అభివర్ణిస్తూ వచ్చారో, చివరికి ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీలో  సయితం అవే అవలక్షణాలు చోటు చేసుకోవడాన్ని ఆయన కళ్ళారా గమనించారు. కానీ, ప్రస్తుత రాజకీయాల్లో చేయగలిగింది ఏమీ లేదని అందరూ నాయకుల్లాగానే అయన కూడా సమాధానపడ్డారేమో తెలియదు. కానీ తను నమ్మిన విషయాల్లో ఎన్టీఆర్ కు వున్న చిత్తశుద్ధిని ఆయన వ్యతిరేకులు కూడా సందేహించలేరనేది మాత్రం వాస్తవం.

గతం తవ్వడం వల్ల ప్రయోజనం వుండదు. అయితే సినిమాల్లో, రాజకీయాల్లో తనదయిన శైలితో ప్రకాశించిన శ్రీ రామారావు గారి జీవితం 'ముగింపు' మాత్రం చాలా బాధాకరం. ఆయన అభిమానులు, వ్యతిరేకులు సైతం ఖేధపడే రీతిలో ఆయన మరణించడం  విధి వైపరీత్యం. చనిపోయిన తరువాత నేల ఈనినట్టు రాష్ట్రం నలుమూలలనుంచి తరలివచ్చిన అశేష జనవాహినిని చూసిన ప్రతి ఒక్కరూ,   జనం గుండెల్లో ఆయన ఎంతగా గూడుకట్టుకుని వున్నారో అర్ధం చేసుకుని వుంటారు.

ఆయన చనిపోయి ఈ నాటికి (2025) ఇరవై తొమ్మిదేళ్లు.  అప్పటికీ ఇప్పటికి  ఒక తరం మారిపోయింది. కొత్త తరానికి పాత విషయాలు తెలియవు. తెలుసుకోవాలనే ఆసక్తీ లేదు. చరిత్ర అంటే వారికి వర్తమానమే. తాము చూసిందే చరిత్ర. రాహుల్ గాంధీ ఎవరంటే మహాత్మా గాంధీ మనుమడు అని జవాబు చెప్పే రోజులు. అలాగే ఎన్టీఆర్ అంటే ఈ తరానికి గుర్తువచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్. ఏ సంగతి తెలుసుకోవాలన్నా ముందు గుర్తుకువచ్చే గూగులమ్మని అడిగినా ఇదే పరిస్థితి. ఎన్టీఆర్ అని కొట్టి చూస్తే కనపడేవి ఒకటి రెండు పెద్దాయన ఫోటోలు. మిగిలినవి అన్నీ చిన్న ఎన్టీఆర్ వే కనిపిస్తాయి.

కింది ఫోటో:

సీనియర్ ఎన్టీఆర్ అంతిమ యాత్ర  



(ఇంకావుంది)

18, జనవరి 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (75) – భండారు శ్రీనివాసరావు

 

ఇక తెలుగు దేశం ప్రచారం చాలా పకడ్బందీగా, ప్రణాళిక ప్రకారం సాగింది.

ఎన్టీఆర్ చైతన్య రధం ఒక గ్రామం చేరే లోగా మరో జీపు ముందుగానే అక్కడికి చేరుకునేది. వేములపల్లి శ్రీ కృష్ణ రాసిన ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ అనే పాటశంకరంబాడి సుందరాచారి రచించిన ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ అనే పాటలను మైకుల్లో వినిపించేవాళ్ళు. వస్తున్నది రామారావు వంటి సుప్రసిద్ధ నటుడు. వేస్తున్నది ఉర్రూతలూగించే ఈ పాటలు. జనాలు విరగబడేవాళ్ళు. వాళ్ళను చూడగానే ఎన్టీఆర్ ప్రసంగం మరింత వేడెక్కేది. ఇక ఈలలూచప్పట్లతో ఆ ప్రాంతం మారుమోగిపోయేది.

ప్రచారం ఉధృతం అవుతున్న కొద్దీ కాంగ్రెస్ నాయకులకు తత్వం బోధపడింది. అపజయం తప్పదేమో అనే సందేహం పట్టుకుంది. దీనికి తొలి సూచన నంద్యాలలో జరిగిన ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారంలో కనబడింది. ఆ సభలో మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి బొజ్జా వెంకట రెడ్డి ‘ బడుగు బలహీన వర్గాలను కాపుకాసే కాంగ్రెస్ కు ఓటు వేస్తారాసినిమా వేషాలతో జిమ్మిక్కులు చేసే తెలుగు దేశం పార్టీకి ఓటేస్తారా’ అని అడిగితే సభకు వచ్చిన వాళ్ళలో చాలామంది మా ఓటు ఎన్టీఆర్ కే అని చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణులు నీరసపడిపోయాయి. తిరుపతి ఎన్నికల సభల నాటికి విషయం ధృవపడింది. ఆ రోజు ఒకే రోజున తిరుపతిలో రెండు సభలు. ఒకటి ప్రధాని ఇందిరాగాంధీ సభ. రెండోది ఎన్టీఆర్ సభ. ఇందిర సభకి హాజరైన వారిలో చాలామంది ఎన్టీఆర్ ప్రచార రధం బయలుదేరింది అనే విషయం తెలుసుకుని అక్కడికి పరిగెత్తి వెళ్ళడం చూసి కాంగ్రెస్ అధినేత్రికి ఫలితం ఎలా వుండబోతోందో ముందే తెలిసిపోయింది.

ఎన్నికలుముగిశాయి. ఫలితాలు వెలువడుతున్నాయి.

1983 అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రత్యేకత వుంది.  అదేమిటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను మొదటిసారి ప్రయోగాత్మకంగా షాద్ నగర్ నియోజకవర్గంలో ఉపయోగించారు.

షాద్  నగర్ లో ఈవీఎం కౌంటింగ్ కావడం వల్ల గంటల్లోనే ఫలితం వెలువడింది. కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ పి. శంకరరావు సమీప ప్రత్యర్ధి, టీడీపీ అభ్యర్ధి పుట్టపాగ రాధాకృష్ణపై విజయం సాధించారు. రిటర్నింగ్ ఆఫీసరు అధికారికంగా ప్రకటించిన ఆ సమాచారాన్ని మొదట  హైదరాబాదులోని ప్రాంతీయ వార్తా విభాగానికి, తరువాత ఢిల్లీ ఆలిండియా రేడియో కేంద్రానికీ అందించాను. మధ్యాన్నం ప్రాంతీయ వార్తలతో పాటు గంటగంటకూ వెలువడే ఎన్నికల ప్రత్యేక బులెటిన్లలో కూడా ఆ వార్తను ప్రసారం చేసారు. అలాగే సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే ఇంగ్లీష్, తెలుగు వార్తల్లో కూడా శంకరరావు గెలిచిన వార్త ప్రసారం అయింది. మిగిలిన చోట్ల సాధారణ పద్దతిలో బ్యాలెట్ పత్రాలను లెక్కించడం వల్ల తెలుగు దేశం అభ్యర్ధుల ఆధిక్యతలకు సంబంధించిన సమాచారం మినహా ఫలితాలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనలు రాలేదు. ఆ రోజుల్లో రేడియోలో ఆధిక్యతలు ప్రకటించే సాంప్రదాయం లేదు. అనధికారికంగా టీడీపీ విజయపధంలో దూసుకుపోతున్నట్టు సమాచారం వస్తున్నా ఆ వివరాలను ప్రసారం చేయలేని పరిస్తితి. ఇప్పటిలా వేరే వార్తా మాధ్యమాలు లేకపోవడం వల్ల అందరూ రేడియో వార్తల మీదనే ఆధారపడాల్సిన రోజులవి. షాద్  నగర్ లో ఈవీఎం లు వాడి కాంగ్రెస్ ఏదో గందరగోళం చేసిందని వదంతులు బయలుదేరాయి. దరిమిలా కొన్ని గంటల తర్వాత మాన్యుయెల్ గా కౌంటింగ్ జరిగిన ప్రాంతాల నుంచి ఫలితాలు రావడం మొదలయింది.

 కావాలనే రేడియోలో వార్తలు తొక్కిపడుతున్నారని ఆ పార్టీ అభిమానుల్లో సందేహాలు కలిగాయి. నేను షాద్ నగర్ నుంచి తిరిగివచ్చేసరికి  కొందరు టీడీపీ కార్యకర్తలు  రేడియో స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు. విషయం వివరించి చెప్పడంతో శాంతించారు.

అదే రాత్రి ఫలితాలు చాలావరకు తెలిసిపోయాయి. ప్రభుత్వం స్థాపించడానికి ఏర్పాటు చేసే మెజారిటీ టీడీపీకి అప్పటికే లభించింది. ఎన్టీఆర్ ని కలిసి ఆయన స్పందన రికార్డు చేయడానికి స్కూటరు మీద ఆబిడ్స్ నివాసానికి వెళ్లాను. వాకబు చేస్తే ఆయన అప్పటికే నిద్రకు ఉపక్రమించారని తెలిసింది.

దటీజ్ ఎన్టీఆర్.

రాష్ట్రమంతా సంబరాలు జరుగుతుంటే ఆయన మాత్రం ఆయన అలవాటు ప్రకారం వేళకు నిద్రపోయారు.

మరునాడు అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్పందన విచిత్రం అనిపించింది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ తుడిచిపెట్టుకునిపోదు. చూస్తుండండిమళ్ళీ అధికారంలోకి వస్తుంది”

అప్పుడు భేషజం అనిపించిన ఆయన మాటలు ఆరేళ్ళ తరువాత నిజమయ్యాయి. 1989 లో కాంగ్రెస్ పార్టీటీడీపీని ఓడించి మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టింది.

కింది ఫోటో:

ఎన్నికల ప్రచారంలో చైతన్య రధంపై ఎన్టీ రామారావు 



(ఇంకా వుంది)