26, మార్చి 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (127) – భండారు శ్రీనివాసరావు

 సోవియట్ యూనియన్ లో ఏమీ జరగదు అన్న ధీమా కాస్తా ఏదో జరుగుతోంది అనే సందేహంగా మారి, కాదు, జరగకూడనిది ఏదో జరిగింది అనే నిశ్చయానికి రావడానికి మొదటి అడుగు పడింది 1990, మొదట్లోనో,  చివర్లోనో.

గొప్ప గొప్ప రష్యన్ పుస్తకాలను  వివిధ భాషల్లోకి అనువదించే రాదుగ ప్రచురణాలయాన్ని మూసివేయడంతో తెలుగు విభాగం బాధ్యులు అయిన ఆర్వీయార్  హైదరాబాదుకు, ప్రగతి ప్రచురణాలయం నిడమర్తి ఉమామహేశ్వర రావు గారు మైసూరుకు తరలిపోయారు. ఇలాంటి మూసివేత  పరిణామాలు అప్పటికి కలలో కూడా ఊహించలేనివి.

తరువాత వేటు రేడియో  మాస్కో విదేశీ విభాగాల మీద పడింది. రేడియో మాస్కో నివాస భవనంలో మా పక్కనే వుండే ఫిలిప్పీన్స్ సహోద్యోగి, ఒకరోజు ఉన్నట్టుండి  ఇల్లు ఖాళీ చేసి కుటుంబంతో సహా చెప్పాపెట్టకుండా స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఇలా ఎంతమందికి ఉద్వాసన  పలికారో ఎవరికీ తెలియదు.

 

రేడియో మాస్కోలో సుమారు ఎనభయ్ కి పైగా ప్రపంచ భాషల్లో ప్రసారాలు జరిగేవి. అందులో పద్నాలుగు భారతీయ భాషలు. ఒకరోజు ఒడియా భాషలో ప్రసారాలు నిలిపి వేయాలని హఠాత్తుగా  నిర్ణయం తీసుకుని ప్రకటించారు. ఆ భాషలో ప్రసారాలకు బాధ్యుడు అయిన అరుణ్ మొహంతి మాస్కోలోనే చదువుకుని, మాస్కో రేడియోలో ఒరిస్సా భాషలో వార్తలు చదువుతూ అలాగే, అక్కడే  సెటిల్ అయ్యాడు. అంతకు ముందు ఏడాదే అతడు తన రాష్ట్రానికి వెళ్లి పెళ్లి చేసుకుని తిరిగి వచ్చాడు. కొత్త పెళ్లి కూతురు నమిత మా ఆవిడకి మంచి స్నేహితురాలు అయింది. పెళ్లి కబురు తెలియగానే రేడియో మాస్కో వాళ్ళు సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ బదులు  అతడికి రెండు పడక గదుల అపార్ట్ మెంటు కేటాయించారు.  ఇంతలోనే ఈ పరిణామం.

అయితే అరుణ్ కి బెంగాలీ వచ్చు. రష్యన్ చదువుకున్నాడు కాబట్టి కొన్నాళ్ళు కొనసాగాడు. ఈ లోగా కన్నడ విభాగం మూసేసామని ప్రకటించారు. కన్నడ, రామకృష్ణ గారు, ఆయన భార్య, సరోజ, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారి  కుమార్తె నందిత వెంటనే మైసూరు వెళ్ళిపోయారు.

తరువాత దెబ్బ గుజరాతీ  భాష ఇన్ చార్జ్ వ్యాస్ పై పడింది. తరువాత అస్సామీ, పంజాబీ,  మళయాళం, తమిళ్,   ఇలా నెల రోజులు తిరిగే సరికి భారతీయ విభాగంలో సగానికి పైగా ఖాళీ. పిలవడం, విషయం చెప్పడం, ఇండియాలో ఎక్కడికి పోవాలో తెలుసుకోవడం, అక్కడికి ఏరో ఫ్లోట్ విమానం టిక్కెట్లు ఇవ్వడం చకచకా జరిగిపోతోంది. ఎవరి టైం రాగానే వాళ్ళు మూటా ముల్లె సదురుకుని స్వదేశం వెళ్ళిపోవడం. చిత్రం ఏమిటంటే దక్షిణ భారత దేశానికి సంబంధించి చిట్టచివర మూసివేసింది తెలుగు విభాగం.

అయిదేళ్ళపాటు మాస్కోలో మా ఆవిడ చేసిన అన్న వితరణ మా వీడ్కోలు సమయంలో కొట్టవచ్చినట్టు కనబడింది.

అదెలాగంటే :

అక్టోబర్ విప్లవం యాభయ్యవ వార్షికోత్సవానికి గుర్తుగా 1772 అడుగుల ఎత్తయిన  ఆస్తాంకినో టవర్ ను మాస్కో రేడియో, టెలివిజన్ లకోసం  మాస్కోలో నిర్మించారు. దీని నిర్మాణం 1963  లో మొదలయి 1967   లో పూర్తయింది. అప్పట్లో ఎత్తయిన నిర్మాణాల్లో మొదట చెప్పుకునే అమెరికన్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కన్నా ఎత్తులో ఇది 43 అడుగులు పెద్దది. తొమ్మిదేళ్ళ తరువాత కెనడాలో సీఎన్ టవర్ నిర్మించేంతవరకు ఈ రికార్డ్ ఆస్తాంకినో ఖాతాలోనే వుండిపోయింది. ఆ తరువాత ఎత్తయిన నిర్మాణాలు అనేక దేశాల్లో మొదలయి ఆస్తాంకినో రికార్డ్ మరుగున పడిపోయింది. ప్రచండమయిన పెనుగాలు వీచే పరిస్థితుల్లో ఈ టవర్ పై భాగం కొన్ని మీటర్లు అటూ ఇటూ వొరిగిపోతూ మళ్ళీ సర్దుకునే విధంగా దీని నిర్మాణాన్ని డిజైన్ చేశారు.  పొడవాటి తాటిచెట్లు విపరీతమయిన గాలి తాకిడికి అటూ ఇటూ వూగిపోతూ వుండడం చూసిన వారికి దీనిలోని ప్రత్యేకత సులభంగా అర్ధమవుతుంది. పై నుంచి చూస్తే, కింద పరచుకున్న మబ్బుల చాటున వున్న  ఎత్తైన భవనాలు కనబడేవి కాదు.  ఈ టవర్ ను కొన్ని విభాగాలుగా చేసి మధ్య మధ్యలో  రివాల్వింగ్ రెస్టారెంట్లు మొదలయినవి ఏర్పాటు చేశారు. మా కుటుంబం భారత దేశానికి తిరిగి వస్తున్న సందర్భంలో హిందుస్తానీ సమాజ్ వారు అంత ఎత్తున వీడ్కోలు విందు ఏర్పాటు చేయడం మరపురాని మరో అనుభూతి. 

ఈ రెస్టారెంట్లలో టేబుల్ ముందుగా బుక్ చేసుకోకపోతే ప్రవేశం దుర్లభం. అక్కడి ధరలు సాధారణమయినవే కాని అంత ఎత్తులో విందు చేయడం అన్నది ఒక మహత్తర అనుభూతి కాబట్టి  వాటికి పర్యాటకుల  తాకిడి ఎక్కువగానే వుంటుంది. కాకపోతే మాస్కో రేడియోలో పనిచేసే  విదేశీయులు తమ ఆఫీసు ద్వారా బుకింగ్ చేసుకునే సౌలభ్యం వుంది.

‘ఎవరూ ఎక్కువ తక్కువ కాదు. అందరూ సమానమే కాకపోతే  వారిలో కొంతమంది ఎక్కువ సమానం’ అని  ఆనిమల్ ఫాం రచయిత జార్జ్ ఆర్వెల్,   సోవియట్ల సమానత్వం గురించి చేసిన వ్యాఖ్యలో కొంత నిజం లేకపోలేదు. డాలర్లు చెల్లించే విదేశీయులకోసం  కోసం మాస్కోలో ప్రత్యేక హోటళ్ళు వున్నాయి. పాశ్చాత్య దేశాల్లోని హోటళ్లకు తగ్గట్టుగా అవి చాలా డాబుసరిగా వుంటాయి. అందులో పనిచేసేవారు ఇంగ్లీష్ తెలిసిన రష్యన్లు. సాధారణ రష్యన్ పౌరులు వాటిల్లో అడుగు పెట్టే వీలు లేదు. విదేశీ అతిధులను  తీసుకువచ్చే టాక్సీ డ్రైవర్లు కూడా హోటల్ గుమ్మం దగ్గరే ఆగిపోవాలి. అల్లాగే సోవియట్ యూనియన్ సందర్శనకు వచ్చే ఇతర దేశాల కమ్యూనిస్ట్ నాయకులు షాపింగ్ చేయడం కోసం ప్రత్యేక దుకాణాలు వున్నాయి.  ప్రపంచంలో దొరికే అన్నిరకాల వస్తువులు అక్కడ అమ్ముతారని చెప్పుకునే వారు. పైగా వాటిని విదేశీ కరెన్సీ లో కాకుండా స్తానిక కరెన్సీలో కొనుగోలు చేసుకునే సౌలభ్యం వుంది. అయితే,  వాటిల్లో  ప్రవేశం అంత సులభం కాదు. ప్రత్యేకించి రష్యన్లకి.   కొందరికే కొన్ని కాకుండా అందరికీ అన్నీ అనే సిద్ధాంతంతో మొదలయిన సామ్యవాదం చివరికి కాలక్రమంలో భ్రష్టు పట్టడానికి ఇలాటి అవకరాలన్నీ దోహదం చేసాయని అక్కడ చాలాకాలంగా వుంటున్న వారు చెప్పుకోగా విన్నాను.

బెజవాడ నుంచి వచ్చిన ఒక ప్రముఖ కమ్యూనిస్ట్  (సీపీఎం)  నాయకుడు ఒకసారి మా  ఇంటికి భోజనానికి వచ్చారు. మాటల సందర్భంలో ఈ విషయం చెప్పారు. కానీ ఆయన పాత తరం కమ్యూనిస్ట్ నాయకుడు. అలాంటి  షాపుల్లో  పాశ్చాత్య  దేశాల్లో మాత్రమే  దొరికే చాలా ఖరీదైన వస్తువులు నామమాత్రపు ధరకు కొనుక్కోగలిగే సదుపాయాన్ని ఆయన ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. ‘మేము  ఈ దేశానికి సోవియట్ పార్టీ ఆహ్వానం మేరకు వచ్చింది  షాపింగ్ చేయడం కోసం కాదు’ అన్నారాయన. అంత గొప్ప వ్యక్తి పేరు గుర్తు రానందుకు చింతిస్తున్నాను. బహుశా వారి పేరు   లావు బాల గంగాధర రావు  గారని లీలగా గుర్తు.

 

ఆస్తాంకినో టవర్ విందుకు వెళ్ళేటప్పుడు లెనిన్ స్కీ ప్రాస్పెక్టస్ మీదుగా వెళ్ళాము. మాస్కో రేడియోకి   టాక్సీలో వెళ్ళాలి అంటే ఈ రోడ్డు మీదుగానే వెళ్ళాలి.

మాస్కోలో లెనిన్ స్కీ ప్రాస్పెక్ట్ అనేది ప్రధాన వీధి. ఎనిమిది లేన్ల మార్గం. వీటికి అదనంగా ట్రాములువిద్యుత్ తో నడిచే బస్సులు  ఇదే రోడ్డుపై తిరుగుతుంటాయి. వీటన్నిటితో యెంతో విశాలంగా వుండే ఆ వీధికి సోవియట్ వ్యవస్తకు ఆది పురుషుడయిన లెనిన్ పేరు పెట్టారు. ఆ వీధి మధ్యలో రాకపోకలకు వీలయిన మరో మార్గం వుంటుంది. కానీ దాన్ని వాడుతున్న దాఖలాలు ఎన్నడూ కానరాలేదు. బహుశా గోర్భచేవ్ వంటి నాయకులకోసం దాన్ని ప్రత్యేకించారేమోనని అనుకుండేవాళ్ళం. చివరికి తెలిసిందేమిటంటే,  అది స్కూలు బస్సులు వెళ్ళే మార్గమని.

ఒకసారి ఆ మార్గంపై వెడుతున్న ఒక కాన్వాయ్ ని చూసాము. ముందు మిలీషియా వాహనం ( రష్యన్ లో పోలీసులను 'మిలీషియాఅంటారు.) దానివెంట ఒక బస్సుదాని వెనక అంబులెన్స్వెనుకనే మరో పోలీసు వాహనం,   ఏదో స్కూలు పిల్లలు పిక్నిక్ కి వెళుతున్నప్పటి సంబడం అది అని చెప్పారు. పిల్లల్ని ఎక్కడికి తీసుకు వెళ్ళాలన్నా స్కూలు వాళ్ళు ముందు పోలీసులకు తెలియచేయ్యాల్సి వుంటుంది. అల్లా వుంటుంది అక్కడ పిల్లల పట్ల తీసుకుండే శ్రద్ధ.

మా కుటుంబం శాశ్వతంగా వదిలివెడుతున్నది ఇలాంటి వ్యవస్థ వున్న దేశాన్ని.

కింది ఫోటో:

మాస్కోలో సోవియట్ రేడియో, టెలివిజన్ టవర్ ఆస్తాంకినో



 

 

(ఇంకావుంది)    

25, మార్చి 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (126) – భండారు శ్రీనివాసరావు

 1991లో ఒక రోజు

మాస్కోలో ఆ సాయంత్రం తెలిసిన తెలుగు కుటుంబాలనన్నింటినీ భోజనానికి ఆహ్వానించాను. పిలిచిన వాళ్లందరూ కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. డిన్నరుకు సర్వం సంసిద్ధం. అంతా ముచ్చట్లు చెప్పుకుంటూ కులాసాగా కాలక్షేపం చేస్తున్న సమయంలో ఫోను మోగింది. అవతల పీ.టీ.ఐ. మాస్కో విలేకరి.

ఆయన చెప్పింది చెవులో పడగానే రిసీవర్ చేతిలోనుంచి జారి పోయింది. ‘రాజీవ్ గాంధి ఈజ్ నో మోర్’

ఎక్కడో తమిళనాడులో చెన్నైకి దగ్గర్లో, సరిగ్గా  నోరు తిరగని పేరు కలిగిన ఒక వూళ్ళో బాంబు బ్లాస్ట్ జరిగింది. రాజీవ్ గాంధి అక్కడికక్కడే చనిపోయాడు.

వార్త తెలిసి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ నిశ్చేష్టులయ్యారు. అన్నం ముడితే వొట్టు.

నేను హైదరాబాదు ఫోను చేసాను. రాజభవన్ లో పనిచేస్తున్న నా స్నేహితుడు జ్వాలాకి. విషయం చెప్పకుండా అడిగాను ఏదయినా జరగరానిది జరిగిందా అని. ఏం లేదు అంతా బాగానే వుంది అన్నాడు. అప్పుడు అసలు విషయం చెప్పాను. కాసేపటి తరువాత విన్న విషయం నిజమే అని నిర్ధారణ అయింది.

ఆ దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకు నేను కుటుంబంతో కలిసి  కాఫీ తాగడానికి ఓ హోటల్ కు వెళ్లాను. అక్కడ మాకు సర్వ్ చేయాల్సిన వెయిట్రెస్ వృద్ధురాలు. అక్కడ వయసుతో పనిలేకుండా ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు వుండేది. మమ్మల్ని చూడగానే భారతీయులమని గుర్తు పట్టింది. అనుమాన నివృత్తికోసం ‘ఇందీస్కీ పజాలుస్తా’ (మీరు ఇండియన్లా) అని అడిగింది. ఔనని చెప్పగానే మా ఆవిడను, పిల్లలను దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. రష్యన్ లో ఏమిటో అంటోంది. ఆ భాష కొద్దిగా తెలిసిన మా పిల్లలు చెప్పింది ఏమిటంటే, రాజీవ్ గాంధి చనిపోయాడని తెలిసి ఆమె తన దుఃఖాన్ని మాతో పంచుకుంటోంది. పరాయి దేశంలో వనిత, మన దేశంలో జరిగిన ఘోరానికి బాధ పడుతోంది. ఆవిడను చూసి మాకే సిగ్గనిపించింది.

మాస్కోలోనే కాదు, రష్యాలో చాలామందికి  తెలిసిన పేరు రాజ్ కపూర్. తర్వాత నటుడు జితేంద్ర.  వీరు నటించిన సినిమాలకు చాలా ఆదరణ వుండేది. మేము  మాస్కోలో వున్నప్పుడే భారతీయ ఉత్సవాలు జరిగాయి. వీటిల్లో మా భూమి నర్సింగరావు గారు తీసిన  రంగుల కల చిత్రం కాబోలు  ప్రదర్శించారు. అలాగే ప్రముఖ నాట్యకారిణి శోభానాయుడు గారి బృందం నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. వారందరినీ మా ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తే కాదనకుండా వచ్చారు. నరసింగరావు గారి సోదరుడు కూడా వచ్చారు. సరే చాలామంది ఇండియన్ ఎంబసీ తెలుగు కుటుంబాల వాళ్ళు, కొంతమంది తెలుగు విద్యార్ధులు వచ్చారు. ముగ్గురు రాష్ట్రపతుల దగ్గర ప్రెస్ సెక్రెటరీ గా  సుదీర్ఘ కాలం పనిచేసిన కూచి సూర్యనారాయణ గారి అల్లుడు ఏదో పనిమీద మాస్కో వచ్చి ఆ రోజున మా ఇంటికి వచ్చారు. ఇలా పరిచయం అయిన వారెవ్వరూ తర్వాత కాలంలో  మమ్మల్ని మరచిపోలేదు.

ఇక సోవియట్ యూనియన్ మొత్తంలో మిహాయిల్ గోర్భచేవ్ తర్వాత, అంతంత సేపు రష్యన్ నేషనల్ టీవీ ఛానల్ పైన వారం వారం కనిపించే భారతీయుడు ఒకరున్నారు. ఆయన పేరు లక్ష్మణ్ కుమార్. అచ్చ తెలుగు పేరులా ధ్వనించే పేరున్న ఈ పెద్దమనిషి నిజానికి కన్నడిగుడు. మాస్కోలోని  భారత రాయబార కార్యాలయంలో పనిచేసే సిబ్బంది పిల్లల చదువు సంధ్యల కోసం ఎంబసీ వారు నెలకొల్పిన ఇండియన్ సెంట్రల్ స్కూల్లో యోగా టీచర్. తొంభయ్యవ దశకం నాటికే భారతీయ యోగాకి రష్యాలో విశేషమైన ఆదరణ, గౌరవం ఉండేవి అంటే ఈ తరం వాళ్ళు నమ్మడం కష్టం. అలనాటి అంటే దాదాపు ముప్పయ్ నలభయ్ ఏళ్ళ క్రితమే సోవియట్ పౌరులకు యోగాలో శిక్షణ ఇచ్చేందుకు వారానికి ఒకరోజు సోవియట్ ప్రైం టైం  టీవీ ఛానల్ లో నిర్విరామంగా ఒక గంటకు పైగా యోగా పాఠాలు చెబుతూ కానవచ్చే వారు ఈ లక్ష్మణ రావు గారు.  బహుశా ఒక విదేశీ ప్రైం ఛానల్లో ప్రముఖంగా కనిపించే అవకాశం సకృత్తుగా కొందరికే లభిస్తుందేమో. అలాంటిది సోవియట్ యూనియన్ వంటి ఇనుపతెరల దేశంలో ఇది మరీ అసాధ్యం. అలాంటి అరుదైన మహత్తర అవకాశం లక్ష్మణ కుమార్ గారికి అయాచితంగా దొరికింది.

మా ఇద్దరు పిల్లలు మాస్కోలో అదే కేంద్రీయ పాఠశాలలో చదువుతున్నప్పుడు లక్ష్మణకుమార్ గారి పిల్లలు గిరిజ, గీతేశ్ మా పిల్లలు సందీప్, సంతోష్ క్లాస్ మేట్స్.

సరే! మా జీవితంలో ఒక అద్భుత ఘట్టానికి, సోవియట్ యూనియన్ అంగ వంగ కళింగ దేశాల మాదిరిగా విడిపోవడానికి ఒకేసారి తెర పడింది. దాంతో ఎక్కడివాళ్ళం అక్కడ తట్టా బుట్టా సర్దుకుని స్వదేశానికి తరలి వచ్చాం. ఆయన కుటుంబం బెంగుళూరుకి, మేము హైదరాబాదుకి.  

మాస్కోలో కలిసి మెలిసి ఉన్న మా రెండు కుటుంబాలు మళ్ళీ కలవడం అన్నది పాతికేళ్ళ తర్వాత ఒకసారి జరిగింది. ఏదో పనిమీద హైదరాబాదు వచ్చిన  లక్ష్మణ కుమార్ దంపతులు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు మా ఆవిడ వుంది. మళ్ళీ ఈ మధ్య కలిశాము మళ్ళీ హైదరాబాదులోనే. కాకపోతే మా ఆవిడ లేకుండా. చాలా బాధ పడ్డారు విషయం తెలిసి. ఏమీ చేయగలిగింది లేదు వాళ్ళు, నేనూ కూడా.

ఆయనకు 88, మనిషిలో తేడా లేదు, కొంచెం వినికిడి శక్తి తగ్గింది.  నాకు అప్పటికి  78. చిన్నప్పటి నుంచి ఎవరి మాటా  వినే అలవాటు లేదు. అంచేత నాకూ చెవుడే. కులాసాగా పాత కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాము.

తోకటపా

హైదరాబాదు డెక్కన్ సేరాయ్ స్టార్ హోటల్ వాళ్ళు అతి ఖరీదైన డిష్ వడ్డించారు. అదే టమాటా పప్పు. 

కింది ఫోటోల్లో :

లక్ష్మణకుమార్ దంపతులను శాలువాలతో సత్కరిస్తూ నేను, గ్రూపు ఫోటోలో అందరం. ఈ ఫోటోలో ఓ రష్యన్ గృహిణి వున్నారు. అపోలో ఆసుపత్రిలో పనిచేసే గుండె వైద్యుడు డాక్టర్ సతీష్ గారి  నాన్నగారు భారత సైన్యంలో అధికారి. రష్యన్ యువతి జోయా (ZOYA) అప్పుడు వారి నాన్నగారి ఉద్యోగ రీత్యా (ఆయన గారు కూడా రష్యన్ మిలిటరీ అధికారే, సోవియట్ ఎంబసీలో దౌత్యాధికారి) ఢిల్లీలో వుండగా పరిచయం. గుండె డాక్టర్ కదా,  సతీష్ గారు, ఆవిడా గుండెలు మార్చుకుని  ప్రేమించుకుని మరీ  పెళ్లి చేసుకున్నారు. 1992 నుంచి ఇక్కడే వుంటూ తెలుగు బాగా నేర్చుకుని తెలుగు జోయా గారు అయిపోయారు. అదన్న మాట.








(ఇంకా వుంది)

24, మార్చి 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (125) – భండారు శ్రీనివాసరావు

 ఎత్తైన భవనం నుంచి ఒక రాయిని కిందికి  పడేసినప్పుడు, అది భూమిని చేరే కొద్దీ మరింత  వేగాన్ని పుంజుకుంటుందని అంటారు.

అలాగే సోవియట్ యూనియన్ లో దశాబ్దాల తరబడి స్తబ్దుగావున్న పరిస్థితుల్లో మార్పు మెల్లగా మొదలై, రోజులు గడుస్తున్న కొద్దీ విస్తారమై, సాధారణ జనజీవితంలో పెను మార్పుగా పరిణమించింది. మేము వెళ్ళిన కొత్తల్లో  మొదటి రెండేళ్లు క్యూలు వున్నా కూడా  దుకాణాల్లో సరుకులు కానవచ్చేవి. ఉదాహరణకు మా ఇంటికి దగ్గరలో, రోడ్డు దాటగానే ఎదురుగా  వున్న ప్రోదుక్తి (పాల ఉత్పత్తుల దుకాణం) లో  పాలు, పెరుగు (కీఫీర్), వెన్న, ఐస్ క్రీమ్స్, జున్ను మొదలైనవి ఎప్పుడు వెళ్ళినా  పుష్కలంగా దొరికేవి. పోయిన కొత్తల్లో ఎప్పుడు అవసరమైనవి అప్పుడే కొనుక్కుండేవాళ్ళం. కాలు బయట పెట్టిన ప్రతిసారీ ఎలుగుబంటి దుస్తులు ధరించలేక వెళ్ళినప్పుడే అవసరానికి మించిన  పాలూ, వెన్నా కొనేవాళ్ళం. ధర తక్కువ కావడం ఇందుకు ఒక కారణం.   కొంతకాలం తర్వాత క్యూలు మొదలయ్యాయి.   దుకాణంలో వున్న సరుకంతా ఎవరు ముందు వస్తే వారికి, ఎంత అడిగితే అంతా అమ్మేవాళ్లు. దాంతో క్యూలో వెనుక వున్నవాళ్ళు, ఒక్కోసారి  ఖాళీ చేతులతో వెనక్కి మళ్ళాల్సివచ్చేది. అలాకాకుండా,  దుకాణంలో వున్న సరుకుని, కొనడానికి వచ్చిన వాళ్ళను బేరీజు వేసుకుని మనిషికి ఇన్ని అని  అమ్మితే అందరికీ సరిపోయేవి. ధర తక్కువ కావడంతో అవసరం వున్నా లేకపోయినా ఎక్కువ కొనేవారు. అవన్నీ చివరికి వృధాగా డస్ట్ బిన్ పాలయ్యేవి.  ఇలాగే ప్రతి నిత్యావసర వస్తువుకు కృత్రిమ కొరత ఎదురయ్యేది.

దీనికి తోడు గోర్భచేవ్,  పెరిస్త్రోయికా  (పునర్నిర్మాణం), గ్లాస్ నోస్త్ ( ఓపెన్ నెస్, బహిరంగత్వం, దాపరికం లేకపోవడం) అనే సిద్ధాంతాలు క్రమంగా జనంలోకి చొచ్చుకుపోయాయి. ఏదైనా గట్టిగా అడగొచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయ వచ్చు అనే ధీమా సామాన్య ప్రజల్లో కూడా పెరిగింది. ఎంతవరకు అంటే మాస్కో  రేడియో సహోద్యోగి విక్టర్ చెప్పినట్టు,  ‘ప్రధాని గారూ, మీరు మొన్న ఒక కార్యక్రమంలో బూట్లు సాక్స్ తో కనబడ్డారు, వాటిని ఎక్కడ కొన్నారో చెబుతారా?’ అంటూ పత్రికలకు లెటర్స్ టు ది ఎడిటర్  కాలమ్ కు  బహిరంగ ఉత్తరాలు రాసేటంతగా అంటే ఇక అర్ధం చేసుకోవచ్చు, అధికారానికి వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే గోర్భచేవ్, నోరు విప్పి  మాట్లాడడానికి భయపడే రష్యన్  ప్రజానీకానికి తన చేతల ద్వారా, మాటలద్వారా  ఏ స్థాయిలో స్వాతంత్రం ఇచ్చాడో. కనీవినీ ఎరుగని మార్పుల్లో ఇది ప్రధానమైనది. ఈ రెండు పదాలు నిజానికి ఎప్పటి నుంచో వాడుకలో వున్న పదాలే. కాకపోతే, గోర్భచేవ్ తన ప్రసంగాలతో వీటికి ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం కల్పించిన మాట వాస్తవం.

నేను వెళ్ళిన మొదటి రెండేళ్లలో మెట్రోలో మౌనంగా కూర్చుని, పుస్తకాలు, పేపర్లు  చదువుతూ ప్రయాణించే రష్యన్లు, క్రమక్రమంగా నోళ్ళు విప్పి పక్క వారితో గుసగుసలు మొదలుపెట్టడం ఆరంభం అయింది. దశాబ్దాలుగా గూడుకట్టుకుని వున్న భయాలు వారిలో తొలగిపోతున్నాయి అనడానికి ఇది సంకేతం. చోటు చేసుకుంటున్న పరిణామాలు జీర్ణం చేసుకోలేని విక్టర్ వంటి వాళ్ళు బహిరంగంగానే తమలోని అసంతృప్తిని వెళ్ళగక్కేవారు. గోర్భచేవ్ సంస్కరణలతో విబేధించి మాట్లాడే తెలుగువారిలో ఆర్వీయార్  ప్రధములు. అంతవరకూ ఇనుపతెరల  వెనుక దేశంగా (రావూరి భరద్వాజ గారు రష్యా సందర్శించిన అనంతరం రాసిన తన అనుభవాల గ్రంధానికి ఈ పేరు పెట్టారు) వున్న సోవియట్ యూనియన్,  గోర్భచేవ్ హయాములో తలుపులు, కిటికీలు బార్లా తెరిచిన సౌధంగా మారిపోయింది. రష్యన్లకు బయటి ప్రపంచాన్ని కళ్ళారా చూసే అవకాశం లభించింది. తమ దేశంలో తమ రోజువారీ జీవనం హాయిగా గడవడానికి అన్ని వసతులు వున్నప్పటికీ, బయటి ప్రపంచంలో తమకు లేనిది ఏమిటో కనిపించి దానికి ఆకర్షితులు అయ్యారు. మానవ ప్రవృత్తి అలాంటిది. లేనిదాని కోసం తాపత్రయ పడడం మనిషి స్వభావంలోనే వుంది.

డబ్బుకు ఎవరికీ ఇబ్బంది లేదు. వున్నదల్లా,  దానితో కొనుక్కోగల వస్తువుల కొరత. నిజానికి ఆ కొరతలకు కారణం తామే అన్న గ్రహింపు లేకపోవడమే విషాదం.     

 పలానా చోట పలానా వస్తువు దొరుకుతోందని అక్కడ కొన్న వాళ్ళు తమకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. ముఖ్యంగా భారతీయ కుటుంబాల్లో ఈ పద్దతి గమనించాను. ఫోను మాట్లాడుతూ మాట్లాడుతూ, మా ఆవిడ వున్నట్టుండి ఫోను పెట్టేసి బయటకు వెళ్ళే కోట్లు, బూట్లు  తగిలించుకుని సంచీ చేతబట్టుకుని బయలుదేరేది. అక్కడెక్కడో షాపులో ఇండియన్  బియ్యం దొరుకుతున్నాయని త్రిలోచనగారో మరొకరో తెలిసిన వాళ్ళు చెప్పేవారు. అంతే! కన్నడ సరోజ గారిని వెంటతీసుకుని, మెట్రోలోనో, టాక్సీలోనో అక్కడకు నేరుగా వెళ్ళిపోయేది. అదృష్టం వుంటే బియ్యం దొరికేవి. లేకపోతే దారిలో దొరికిన క్యూబా అరటి పండ్లో, మరొకటో కొనుక్కుని ఇంటికి చేరేది.

క్యూబా రష్యాకు మిత్రదేశం. అంచేత, క్యూబాకు ఓడలలో పెట్రోలు సరఫరాచేసి బదులుగా అరటి పండ్లు దిగుమతి చేసుకునేవారు. దేశం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోవడానికి,  అలవికి మించి మిత్ర దేశాలకు చేసే ఇలాంటి సాయాలు కూడా ఒక కారణం అనే అభిప్రాయం వుండేది.

ఇండియన్ బియ్యం గురించి ఒక జోకు చెప్పుకునేవారు.

ఇండియన్ ఎంబసీకి కొత్తగా వచ్చిన ఓ అధికారి, ఉదయం పది గంటలకు తన సిబ్బందితో మీటింగు పెట్టుకున్నారు. ఆయన దగ్గర పనిచేసే ఒక చిన్న అధికారి మీటింగుకు ఆలస్యంగా వచ్చారు. పెద్ద అధికారికి కోపం వచ్చింది. ఆలస్యానికి కారణం ఏమిటి అని పెద్దఅధికారి చిన్నఅధికారిని పెద్దగానే గద్దించి అడిగారు. చిన్న అధికారి నోరు పెగుల్చుకుని చిన్నగా  చెప్పాడు. ఆఫీసుకు వస్తుంటే దారిలో... అని నసిగాడు.

‘దారిలో ఏమైంది?’ పెద్ద అధికారి గాండ్రింపు లాంటి  ఝాడింపు.

‘దారిలో  వస్తుంటే....ఒక  షాపులో  బియ్యం అమ్మడం కనిపించింది. వెంటనే వెళ్లి కొనుక్కున్నాను

చిన్న అధికారి వాక్యం పూర్తికాకముందే, మీటింగుకు సకాలంలో వచ్చిన వాళ్లందరూ పొలోమని ఆ షాపుకు జంపు.

ఇది జోక్ కావచ్చు కానీ, ముందు ముందు ముంచుకు రాబోతున్న మార్పులకు అద్దం పట్టేదిగా నాకు అనిపించింది.

ఉన్నట్టుండి ఒక రోజు మెట్రో టిక్కెట్టు ధరను అయిదు కోపెక్కుల నుంచి పది కోపెక్కులకు అధికారికంగా పెంచారు. దశాబ్దాలుగా ఎదుగూ బొదుగూ లేకుండా వుంటున్న ధరవరలు ముందు ముందు పెరగబోతున్నాయి అనడానికి ఇది ఒక సూచిక.

కింది ఫోటో:

మాస్కోలో మహాత్మా గాంధి విగ్రహం వద్ద ఇండియన్ స్కూల్ విద్యార్ధులు, నల్లకోటులో వున్నది మా పెద్దవాడు సందీప్, వారిపక్కన ఇండియన్  ఎంబసీలో పనిచేసే దౌత్యాధికారి కేవీ రమణ గారి భార్య శ్రీమతి త్రిలోచన 


  

(ఇంకావుంది)         

23, మార్చి 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (124) – భండారు శ్రీనివాసరావు

 వేగంగా సంభవించే మార్పులు కొన్నయితే, చాపకింది నీరులా నెమ్మదిగా చోటుచేసుకునే మార్పులు మరికొన్ని. అలాంటి ఒక గొప్ప మార్పుని అయిదేళ్ళ కాలంలో నేను సోవియట్ యూనియన్ లో చూడగలిగాను. నేను ఇంతకు  ముందే చెప్పినట్టు రష్యన్ల జీవితాలు దశాబ్దాల తరబడి  ఎలాంటి మార్పులు లేకుండా నల్లేరు మీద బండిలా సాగిపోయేవి. రీనక్ వంటి నయా మార్కెట్లు రంగప్రవేశం చేసినా కూడా  వారి జీవనంలో చెప్పుకోదగ్గ  గొప్ప కుదుపులేవీ సంభవించలేదు. ఇంట్లో ఆఫీసులో కూడా ఎలాంటి మార్పు లేదు. గోర్భచేవ్ ఉపన్యాసాలు కూడా అదే తీరు. ఆఫ్ఘని స్తాన్  నుంచి రష్యన్ సైనిక దళాల ఉపసంహరణ, గ్లాస్ నోస్త్, పెరిస్త్రోయికా  సిద్దాంతాల ప్రాధాన్యత వంటి అంశాలపై ఆయన  ప్రసంగాలు గంటలు గంటల పాటు సాగిపోయేవి. రాజకీయ నాయకులకు లంగ్ పవర్ ఎంత ముఖ్యమన్నది తెలిసివచ్చింది. వార్తలు అరగంట అయితే ఒక్కోసారి పూర్తి సమయం అంతా గోర్భచేవ్ ప్రసంగాలను అనువదించి చదవడంతోనే సరిపోయేది. వేరే వార్త అంటూ వుండేది కాదు. ఇది కాక రష్యన్ టీవీ మెయిన్ ఛానల్ లో, ఆలిండియా రేడియో రాత్రి తొమ్మిది గంటల వార్తల మాదిరిగా నొవొస్తి అనే  నేషనల్ బులెటిన్ ప్రసారం అయ్యేది. ఇక దాంట్లో అయితే ప్రెసిడెంట్ గోర్భచేవ్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం మరో ముచ్చటి లేకుండా అర్ధరాత్రి వరకు కొనసాగేది.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి.

ఖేదమైనా, మోదమైనా సాపేక్షమే!

ఎనభయ్యవ దశకం పూర్వార్థంలో,  ఆకాశవాణి, దూరదర్శన్ లు మాత్రమే  రాజ్యమేలుతున్న రోజుల్లో,  వాటిని ఇందిరా వాణి అనీ, రాజీవ్ దర్శన్ అనీ గిట్టని వాళ్ళు ముద్దుగా పిలిచేవారు. వాటి మీద, అవి ప్రసారం చేసే కార్యక్రమాలమీద ఏలినవారి పెత్తనం, సర్కారువారి ముద్ర అంతగా వుండేవని చెప్పడం అందులోని శ్లేష. ఆ తరవాత రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళినప్పుడు,  అక్కడి దేశాధినేత అనండీ , పార్టీ నేత అనండీ,  మిహాయిల్ గోర్భచేవ్,  రష్యన్ టీవీ తెరపై గంటలు గంటలు కనబడే తీరు చూసిన తరవాత కానీ ఈ విమర్శలు అర్ధం పర్దం లేనివన్న సంగతి అర్ధం కాలేదు. మేము అలా అనుకుంటూ సంతోషంగా ఆ కార్యక్రమాలు చూస్తూ రోజులు గడుపుతున్న రోజుల్లో ఒక ఆరబ్ దేశం నుంచి నాకు తెలిసిన ఒక తెలుగు  మిత్రుడు ఏదో పని మీద మాస్కో వచ్చి,  మా ఇంట్లో రష్యన్ టీవీ ప్రోగ్రాములు చూసి ఎంతగానో మురిసి ముక్కచెక్కలవ్వడం చూసి, మాకు మతి పోయింది. కదిలిస్తే అతగాడు చెప్పిన కధ,  అర్జున విషాద యోగాన్ని తలపించింది. ఆ దేశంలో టీవీ తెరపై,  ఉదయం నుంచీ రాత్రి పడుకునే వరకూ బోధలు ప్రవచిస్తూ , సూక్తులు వల్లిస్తూ ఒకే ఒక్క పెద్దమనిషి అస్తమానం దర్శనం ఇస్తాడట. ఆ ప్రోగ్రాములు చూసీ  చూసీ  వచ్చిన ఆ పెద్దమనిషికి,  రష్యన్ టీవీ కార్యక్రమాలు చల్లని వేళలో ప్రియురాలి వెచ్చని కౌగిలిలా ఎంతో ఉల్లాసాన్ని కలిగించాయి. అందుకే అన్నారు మనుషుల బాధలు, ఇబ్బందులు అన్నీ సాపేక్షం (రిలెటివ్). ఇతరులతో పోల్చి చూసుకుంటే సగం బాధ తగ్గిపోతుందంటారు .

మానవ మనస్తత్వం తీరే అంత. మన ఇంట్లో కరెంటు పోతే, కరెంటు కంప్లైంట్ చేయడానికి ముందు,  పక్క వాటాలో కరెంటు వుందో లేదో చూడాలనిపిస్తుంది. పొరుగు వారింట్లో కూడా కరెంటు పోతే ‘అదో తుత్తి’.

మనిషి కష్టాలు, ఇబ్బందులు చూసే ‘సాపేక్ష సిద్ధాంతం’ కనుక్కున్నారేమో.

సోవియట్ యూనియన్ లో మొదటి మార్పు నాకు మొట్టమొదట కనబడింది మెక్ డొనాల్డ్ రూపంలో.

1990 వ సంవత్సరం ప్రారంభంలో కాబోలు,  మాస్కోలో మొట్టమొదటి మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ మొదలయింది. అప్పుడు చూడాలి తమాషా. మాస్కో నగరంలో వున్న పిల్లలు,  యువతీ యువకులు అందరికీ అదొక అడ్డాగా మారిపోయింది.  అంటే హైదరాబాదులో ఒకప్పుడు ఇరానీ కఫేలు చాలామందికి రోజూ పరస్పరం కలుసుకునే ప్రదేశాలుగా వుండేవి. అక్కడ కూర్చుని సమోసాలు, టై బిస్కెట్లు  తింటూ వేడి వేడి చాయ్ తాగుతూదక్కన్ క్రానికల్ పేపర్లో స్పోర్ట్స్ న్యూస్ చదువుతూ కుర్రకారు భలేగా  కాలక్షేపం చేసేవారు.  అయితే మాస్కో మెక్ డొనాల్డ్ విషయంలో కాసింత తేడా వుంది. అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునే సావకాశం వుండేది కాదు. ఎప్పుడు చూసినా కిలోమీటర్ల పొడుగునా క్యూలు దర్శనమిచ్చేవి. మా పిల్లలు అక్కడికి వెళ్లి పిజ్జా తిని కోక్ తాగిరావాలంటే ఒక పూటకు పైనే  పట్టేది.

 ఆ రెస్టారెంట్ కు కొద్ది దూరంలోనే  లెనిన్ సమాధి వున్న రాతి పలకలు పరచిన  మైదానం వుండేది. ఈ మెక్ డొనాల్డ్ వచ్చిన తరువాత అక్కడ క్యూలు పలచపడ్డాయని హాస్యోక్తిగా చెప్పుకునే వారు.

ఇనుప తెర’ దేశంగా పేరు పొందిన సోవియట్ రష్యాలో గోర్భచెవ్ సంస్కరణల పుణ్యమా అని తలుపులు బార్లా తెరవడంతో, మెక్ డొనాల్డ్ వంటి పాశ్చాత్య రెస్టారెంట్లకు అక్కడ కాలుమోపే అవకాశం దొరికింది.

మాస్కో మెట్రో సింబల్,  ఇంగ్లీష్ అక్షరం ‘M’ ని పోలివుంటుంది. సరిగ్గా దానిలాగే వుండే మెక్ డొనాల్డ్ సింబల్ కూడా మాస్కో యువతరాన్ని అమితంగా ఆకర్షించింది.

మెక్ డొనాల్డ్ రెస్టారెంట్లలో బాగా అమ్ముడుపోయే బిగ్ మాక్’ ని, మాస్కో రెస్టారెంట్ లో బల్షోయీ మాక్’ అనేవారు. రష్యన్లో బల్షోయీ’ అంటే పెద్ద’ అని అర్ధం. అప్పట్లో బిగ్ మాక్ ధర  రెండు రష్యన్ రూబుళ్లు. అంటే అమెరికా కరెన్సీలో చెప్పాలంటే మూడు  డాలర్ల ముప్పయ్ ఎనిమిది సెంట్లు. సగటు రష్యన్ పౌరుడి నెల జీతంలో వందోవంతు. కాకపొతే, డాలరుకు బ్లాక్ మార్కెట్లో పాతిక ముప్పయి రూబుళ్ళు దొరికేవి. అంటే ఒక డాలరుకు పదిహేను బల్షోయి మాక్ లు వచ్చేవి అన్నమాట.

ఈ కరెన్సీ బ్లాక్ మార్కెట్ అనేది కూడా ఆర్ధిక సంస్కరణల పుణ్యమే.

నెమ్మదిగా మొదలయిన ఈ  మార్పులు మంచివా, చెడ్డవా అనే సోయి ఎవరిలో కనబడేది కాదు.

మార్పు అంటే తెలియని జనాలకు ఏదో ఒక మార్పు కావాలి అంతే!

కింది ఫోటోలు:

నాటి సోవియట్ అధినేత మిహాయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్

మాస్కోలో లెనిన్ మసోలియంకు కూతవేటు దూరంలో వెలిసిన మొదటి మెక్ డొనాల్డ్ రెస్టారెంట్. బయట మంచులో క్యూ లైన్లలో  వేచివున్న జనం.






 

(ఇంకావుంది)