18, అక్టోబర్ 2021, సోమవారం

రావూరి భరద్వాజ అసలు పేరు - భండారు శ్రీనివాసరావు

(జ్ఞానపీఠ అవార్డు పొందిన రావూరి భరద్వాజ వర్ధంతి ఈరోజు)





జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయిన రావూరి భరద్వాజ (పూర్వాశ్రమంలో రావూరు శరభాచారి) గురించి
ఓ చిన్న జ్ఞాపకం:
ప్రసిద్ధ జర్నలిష్టు కే ఏ అబ్బాస్ రాసిన ఆంగ్ల గ్రంధాన్ని రావూరి భరద్వాజ గారు ‘మొగ్గ తొడిగిన ఎర్ర గులాబి’ అనే పేరుతొ తెలుగులోకి అనువదించారు.
ఈ పుస్తకం వెనుక చిన్న కధ చెప్పుకోవడం నాకు తెలుసు. రాజకీయ నాయకుల్లో నెహ్రూ ఒక్కరినే అమితంగా అభిమానించే సుప్రసిద్ధ జర్నలిస్టు కేయే అబ్బాస్, నెహ్రూ అనంతరం ఆయన బిడ్డ ఇందిర ప్రధాని కాగానే 'Return of the RED ROSE' అనే పేరుతొ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని 'మొగ్గ తొడిగిన ఎర్రగులాబి' పేరుతొ శ్రీ రావూరి భరద్వాజ తెలుగులోకి అనువదించారు. శ్రీమతి గాంధి హైదరాబాదు వచ్చినప్పుడు, అప్పుడు రేడియోలో పనిచేస్తున్న భరద్వాజ గారే స్వయంగా తాను అనువదించిన ఈ పుస్తకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీకి బహుకరించారు. ఆవిడ అంతకుముందు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వున్నప్పుడు రేడియోలో (అప్పటికి దూరదర్శన్ లేదు) పనిచేస్తున్న స్టాఫ్ ఆర్టిస్టుల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలతో సమానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న భరద్వాజ గారు ఆమె చేసిన ఈ మేలుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పుస్తకాన్ని ఆమెకు అందచేసారు.ఇదొక సంగతి. మరోటి కూడా చెప్పుకోవాలి.
రావూరి భరద్వాజ గారు ఇంత పొడవు గడ్డం పెంచనప్పుడే కాదు అసలు గడ్డం ఏదీ లేనప్పుడు కూడా నాకు తెలుసు. నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు, విలక్షణ వ్యక్తిత్వం కలిగిన ఈ మహా రచయితతో పరస్పరం జోకులు వేసుకునేంత సన్నిహిత పరిచయం వుండేది. నా చిన్నతనంలోనే ఆయన రాసిన 'పాకుడురాళ్ళు' నవల, అప్పుడు బెంగుళూరు నుంచి వెలువడే తెలుగు వారపత్రిక ‘ప్రజామత’లో సీరియల్ గా వస్తున్న రోజుల్లోనే నన్నెంతో ఆకర్షించింది. తరువాతి కాలంలో భరద్వాజ గారితో ఆకాశవాణిలో కలసిపనిచేసే మరో అదృష్టం లభించింది. జ్ఞానపీఠం అవార్డ్ ఆయన స్థాయికి చిన్నదని చెప్పను కాని ఆలస్యంగా వచ్చిందని మాత్రం చెప్పగలను.

17, అక్టోబర్ 2021, ఆదివారం

శుభకార్యాల్లో చావుల సంగతి ప్రస్తావించవచ్చా - భండారు శ్రీనివాసరావు

 రాజమండ్రి వద్ద గోదావరిపై నిర్మించిన మొట్టమొదటి రైలు రోడ్డు వంతెన ప్రారంభోత్సవానికి రేడియోలో ప్రత్యక్ష వ్యాఖ్యానం బాధ్యత ఉషశ్రీ గారికి అప్పగించారు. ఆ రోజుల్లో మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు బెజవాడలో సమాచార శాఖ అధికారిగా పనిచేస్తూ వుండేవారు. ఆయనా ఉషశ్రీ గారు మంచి స్నేహితులు. ఆ వంతెన ప్రారంభోత్సవానికి వస్తున్నది సాక్షాత్తూ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ కావడంతో అధికారులు ఏర్పాట్లపై మరింత శ్రద్ధ పెట్టారు. వీవీఐపీ ప్రోగ్రాం కాబట్టి ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారం నిమిత్తం పనిచేసేవాళ్ళు, ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. వాటిలో భాగంగానే ఉషశ్రీ గారు, మా అన్నయ్యను కలిసి వంతెన తాలూకు వివరాలు సేకరించారు. అప్పుడు మా అన్నయ్య చెప్పిన సలహా నాకు బాగా జ్ఞాపకం వుంది.

రేడియోలో ప్రత్యక్ష వ్యాఖ్యానం కాబట్టి మధ్యలో విరామాలు ఇవ్వడానికి వీలుండదు. మీరు ఏదో ఒక సంగతి శ్రోతలకు నిరంతరం  చెబుతూనే వుండాలి. ఎక్కడా బ్రేక్ రాకూడదు. వంతెన వివరాలు ఎలాగూ మీకు ఇస్తాము. కానీ మధ్యమధ్యలో ఎక్కడయినా వీలుచూసుకుని ఈ వంతెన నిర్మాణంలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని స్మరించుకుంటే బాగుంటుంది’

ఈ సలహా ఆయనకు నచ్చింది. కానీ, ఎందరెందరివో ధర్మసందేహాలు తీర్చగలిగిన ప్రతిభాశాలి ఆయనకే ఒక అనుమానం పొడసూపింది. శుభమా అంటూ కార్యక్రమం జరుగుతుంటే చనిపోయిన సంఘటనలు గుర్తు చేయడం బాగుంటుందా అని.

దీనికి సమాధానం ఆరోజు ప్రధాని ప్రసంగంలోనే లభించింది.

ఆసియాలోనే అతి పొడవైన రైలు రోడ్డు వంతెనను ప్రారంభోత్సవం చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అత్యంత క్లిష్టమైన ఈ ఇంజినీరింగ్ ప్రక్రియను జయప్రదంగా పూర్తిచేయడంలో అవిరళ కృషి చేసిన ఇంజనీర్లను, కార్మికులను అభినందిస్తున్నాను. అయితే ఇదే సమయంలో ఈ బృహత్తర కార్యక్రమ నిర్వహణలో అసువులు బాసిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను’

63 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ వంతెన నిర్మాణం 1972 లో పూర్తయింది. రాజమండ్రి, కొవ్వూరులను కలుపుతూ నిర్మించిన ఈ వంతెన అప్పట్లో ఆసియా ఖండంలోనే అతి పొడవైనదిగా చెప్పుకునే వారు. ఈ వంతెనకు అధికారికంగా ఏం పేరు పెట్టారో తెలవదు కానీ స్థానికులు మాత్రం కొవ్వూరు బ్రిడ్జ్ అనే పిలుచుకునే వారట.

NOTE: రాజమండ్రి దగ్గర ఎన్ని కొత్త వంతెనలు వచ్చాయో నాకు తెలియదు. నా పోస్టు ఉద్దేశ్యం జాతికి పనికి వచ్చే ఇలాంటి ప్రాజెక్టులు ఎవరి హయాంలో కట్టారు అని కాదు వాటికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు అనేది వివరించడానికి మాత్రమే.

16, అక్టోబర్ 2021, శనివారం

ఎక్కువైనా తక్కువైనా కొట్లాటే

 

ఓ ఇరవై ఏళ్ళ క్రితం నాకు తెలిసిన కుటుంబం నగరంలో ఒక కాలనీలో రెండంతస్తులతో ఇల్లు కట్టుకున్నారు. మేము గృహ ప్రవేశానికి కూడా వెళ్ళాము. ఇంటి ఎదురుగా పెద్ద చెరువు. కాకపోతే నీళ్ళు ఆట్టే లేవు. వీళ్ళ ఇల్లు నిజానికి ఆ చెరువుకు నీళ్ళు పారే ప్రదేశంలో వుంది. చెరువుకు నిండా నీళ్ళు వస్తే ఇబ్బంది పడతారేమో అని చెప్పాలనిపించింది. కానీ సందర్భం కాదేమో అని ఊరుకున్నాను.

అంత చక్కటి ప్రదేశంలో మంచి ఇల్లు కట్టుకున్నందుకు వచ్చిన వాళ్ళు అందరూ గృహస్తును అభినందించారు. అప్పటికే ఆ కాలనీలో చాలా సుందర భవంతులు వెలిశాయి. చూడగానే సంపన్నుల కాలనీ అనిపించేదిగా వుంది. ఆ రోజుల్లో ముఖ్యమంత్రికి నగర సుందరీకరణ మీద మక్కువ ఎక్కువ కావడంవల్ల ఆ చెరువు కట్టను అందమైన మినీ టాంక్ బండుగా తీర్చిదిద్దారు. దానితో ఆ కట్టకు దిగువన దీనిని తలదన్నే మరో కాలనీ వెలిసింది. సరే కొంత కాలం ఆ కాలనీ వాళ్ళు, ఈ కాలనీ వాళ్ళు సఖ్యంగానే వున్నారు.

ఆ సమయంలో ఇప్పటిలాగే కనీవినీ ఎరుగని వర్షాలు కురిసి చాలా కాలనీలు వరద ముంపుకు గురయ్యాయి. చెరువు నిండి ఆ ప్రవాహం వెనక్కి రావడంతో ఎగువ కాలనీలోని ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి. మునిగిపోతాయన్న భయంతో వాళ్ళు ఆ చెరువు కట్టకు గండి కొట్టే ప్రయత్నం చేయబోయారు. అంతే! దిగువన వున్న కాలనీవాళ్ళు గండి కొడితే తమ కాలనీ మునిగిపోతుందని భయపడి ఎగువ కాలనీ వాళ్లకు ఎదురు తిరిగారు. అప్పటిదాకా సఖ్యతగా ఉన్న రెండు కాలనీల వాళ్ళు ఒకరికొకరు పరమ శత్రువులు అయిపోయారు.

ఈ లోగా వరుణుడు శాంతించడం, వరద తగ్గు ముఖం పట్టడంతో పెద్ద సంఘర్షణకు అవకాశం లేకుండా పోయింది. ప్రకృతి ప్రజలకు ఉచితంగా ప్రసాదించే

నీరు తక్కువైనా కష్టాలే, ఎక్కువైనా కష్టాలే! అయితే ఈ కష్టాలకు తామే కారణం అని ప్రజలకూ తెలుసు. కానీ తెలియనట్టుగా ఉండిపోతారు.

 

15, అక్టోబర్ 2021, శుక్రవారం

ఆర్కే ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు

ఆర్కే పోయాడు అనగానే ‘అయ్యో పాపం! అలానా’ అన్నవాళ్లు, ‘ఎన్కౌంటర్ లోనా!’ అని నొసలు విరిచిన వాళ్ళు వున్నారు.

మంచిదో చెడ్డదో ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవితాన్ని మలచుకున్న వ్యక్తుల విషయంలో సమాజం ప్రదర్శించే స్పందన విభిన్నంగా వుండడం కొత్తేమీ కాదు. అలాగే ఆర్కే అలియాస్ రామకృష్ణ కూడా మినహాయింపు కాదు. ఆర్కే అసలు పేరు అక్కరాజు హరగోపాల్.
‘ఆర్కే కనిపిస్తే కాల్చేయాలి’ అని పోలీసులకు ఉత్తర్వులు, ఆర్కేను పట్టించిన వారికి కోటి రూపాయలు రివార్డు వున్న ఈ ఆర్కే అనే మావొయిష్టు అగ్ర నేతను, పదిహేడేళ్ల క్రితం, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అదే పోలీసులు అడవుల నుంచి సగౌరవంగా హైదరాబాదుకు తీసుకురావడం, అప్పుడు రేడియో విలేకరిగా పనిచేసిన నాకు కూడా విభిన్నమైన అనుభవం.
మావొయిష్టులు అనే విప్లవకారులతో ప్రభుత్వం చర్చలకు సిద్ద్ధపడడం, అందుకు వారిని ఆహ్వానించడం ఆ కాలంలో ఓ పెద్ద విశేషమైన, సంచలనాత్మకమైన వార్త. అయుధాలు వదిలిపెట్టి నగరానికి రావాలి అనే ప్రభుత్వ షరతు కారణంగా మొదట్లో ఈ చర్చలు జరుగుతాయా లేదా అనే విషయంలో కొంత సంగ్దిగ్ధత ఏర్పడ్డా, చివరికి ఆ నీలి నీడలు తొలగిపోయి చర్చలు జరిగాయి. అవి ఫలించాయా లేదా అనేది వేరే విషయం. ఒక ముందడుగు పడింది అని భావించినవారే ఎక్కువ.
దట్టమైన అడవుల్లో దశాబ్దాలుగా సంచరిస్తూ, ఒక స్థావరానికీ మరో స్థావరానికీ నడుమ, పోలీసుల డేగ కళ్ళు కప్పి వేరే స్థావరంలో తాత్కాలికంగా తల దాచుకుంటూ జీవితాలు గడుపుతున్న మావోయిష్టు నాయకులకు, నాటి ప్రభుత్వం వారిని ప్రభుత్వ అతిధులుగా పరిగణిస్తూ సమస్త మర్యాదలు చేసింది. సంవత్సరాల తరబడి అడవుల్లో దొరికింది తింటూ కాలం గడిపిన వారికి ప్రభుత్వ అతిథి గృహంలో చేసిన ఏర్పాట్లు విస్మయం కలిగించాయి. ఒక దిన పత్రిక అయితే ఒక అడుగు ముందుకు వేసి అతిథి గృహంలో మావోయిష్టు నాయకులకు జరుగుతున్న మర్యాదలను ఉటంకిస్తూ ఏకంగా వారికి భోజనాల్లో వడ్డిస్తున్న వివిధ రకాల వంటకాల జాబితాను సవివరంగా ప్రచురించింది.
ఈ విషయం దృష్టికి రాగానే మావోయిష్టు నాయకుడు ఆర్కే వెంటనే స్పందించి తమకు ప్రత్యేక మర్యాదలు, భోజన ఏర్పాట్లు అవసరం లేదని మృదువుగా తిరస్కరించి ఆ విషయం అధికారులకు తెలియచేసారు.
మావోయిష్టులు అక్కడ బస చేస్తున్నారని తెలిసి సామాన్య జనం తమ కష్టనష్టాలను ఏకరువు పెట్టుకోవడానికి, వారికి మహజర్లు ఇవ్వడానికి క్యూలు కట్టారు.
తాము ఇక్కడికి వచ్చింది ప్రభుత్వంతో చర్చలు జరపడానికి మాత్రమే అని ఆర్కే వారితో స్పష్టంగా చెప్పేవారు. సమాజంలోని ఈ అసమానతలు తొలగించడానికే తాము ఆయుధాలు చేతబట్టామని, తమ లక్ష్యం సాధించుకోవడానికి ప్రభుత్వంతో పోరాడుతాము కానీ సిఫారసులు చేయడం తమ పని కాదనీ ఆయన స్పష్టం చేశారు.
బీ టెక్ చదివి, కుటుంబాన్ని ఉద్ధరిస్తాడు అనుకున్న కొడుకు సమాజాన్ని ఉద్ధరించడానికి తుపాకీ చేతబట్టి అడవులకు వెళ్ళడం ఉత్తమ ఉపాధ్యాయుడిగా మన్ననలు అందుకున్న ఆర్కే తండ్రికి ఎలాంటి మనస్తాపం కలిగించిందో ఎవరికీ తెలియదు. సంఘాన్ని బాగుచేయాలనే సదుద్దేశ్యంతో అడవి బాట పట్టిన ఇలాంటి అడవి వీరులు ఎందరో ఇలా తమ బతుకులను తెల్లవార్చుకోవడం విషాదం అనిపిస్తుంది. గమ్యం మంచిదైనా నడిచే మార్గం మంచిది కాదని అనేవాళ్ళు వుంటారు. నిజం కూడా. కానీ లక్ష్యశుద్ధి వుంటే మార్గం గురించి ఆలోచించాల్సిన పని లేదని ఆ వీరుల నమ్మకం.
అయితే, పోరాడితే పోయేది లేదు అనే ఒకే ఒక జవాబు తప్ప, ఇన్నేళ్ళుగా సాధించింది ఏమిటి అనే ప్రశ్నకు వారి నుంచి సరయిన సమాధానం లేదు,.
ముందే చెప్పినట్టు మంచి చెడులను తేల్చి చెప్పేది ఒక్క కాలం మాత్రమే.
ఆర్కే కుటుంబానికి నా సానుభూతి.



(15-10-2021)

14, అక్టోబర్ 2021, గురువారం

కులాల ప్రసక్తి అవసరమా – భండారు శ్రీనివాసరావు

 

మా బావగార్లలో ఇద్దరు శ్రీ అయితరాజు రామారావు (వల్లభి), శ్రీ కొలిపాక రామచంద్ర రావు (రెబ్బారం) స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఖమ్మం జిల్లాలో బ్రిటిష్ వ్యతిరేక ఆందోళనలు నడిపి పద్నాలుగు మాసాలకు పైగా కఠిన జైలు శిక్ష అనుభవించారు. మహాత్ముని బోధనలకు ప్రభావితులై తమ గ్రామాల్లో అంటరానితనాన్ని నిర్మూలించే విషయంలో గ్రామీణులను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించేవారు. వున్నవాళ్ళు, లేనివాళ్ళు అనే తేడా లేకుండా వూరివాళ్ళతో రోజంతా తిరిగొచ్చి మళ్ళీ ఇంట్లో అనుష్టానాలు చేసేవాళ్ళు. అన్ని కులాలవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో స్వేచ్చగా మసిలేవాళ్ళు. భోజనాలు చేసేవాళ్ళు. అందరూ వాళ్ళది కాంగ్రెస్ మడి’ అనే వాళ్ళు. పెద్ద బావగారు అయితరాజు రామారావు గారు వాళ్ళ వూరు వల్లభిలో ఏకంగా ఒక హరిజనుడిని రామాలయ పూజారిగా నియమించారు. ఆ రోజుల్లో అదొక సంచలన వార్త. మా నాన్నగారు మా వూరు కంభంపాడు కరణం. ఆయన దగ్గర పనిచేసే వెట్టి వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఇంటి ముందు వాళ్ళకోసం ఒక చావిడి లాంటిది వుండేది. ఆయన మరణించిన తర్వాత కరణీకం బాధ్యతలు స్వీకరించిన మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వరరావు చేసిన మొట్టమొదటి పని ఆ చావిడిని నేలమట్టం చేసి వెట్టివారిని ఇంట్లో తిరిగేలా చేయడం. వూళ్ళో నిరసన వెల్లువెత్తినా మా అన్నయ్య లెక్కచేయలేదు. ఆయన చనిపోయిన రోజు ఊళ్ళోని దళితులందరూ ఆడామగా తేడా లేకుండా దహన సంస్కారాల్లో పాల్గొన్నారు.

మా బాబాయి కుమారుడు భండారు సత్యమూర్తి అన్నయ్య మా గ్రామానికి సుదీర్ఘ కాలం సర్పంచ్ గా పనిచేశారు. ఊళ్ళోని అన్ని కులాల వారు ఆయన్ని బాగా అభిమానించే వారు. ఆయన  గుండెపోటుకు గురై ఆకస్మికంగా మరణించినప్పుడు ఇది మరింత ప్రస్పుటంగా కనబడింది. మామూలుగా పాడె మీద కాకుండా బండి మీద పడుకోబెట్టి మనుషులు లాగుతూ ఊరేగింపుగా  దాన్ని శ్మశానానికి చేర్చారు. ఆయనకీ తల కొరివి పెట్టే హక్కు మాకూ వుందని బహిరంగంగా ప్రకటించి అలాగే చేశారు. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ డిమాండ్ కాదనలేని పరిస్థితి. ఆరోజు మొత్తం గ్రామంలో ఎవరింట్లో పొయ్యి వెలిగించలేదు.

అంటరానివాడు, అని మీరు అనుకుంటున్నవాడు, అంటుకున్నాడో, ఇక ఆరని మంటే” అని మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాల రావు గారు ఏకంగా ఒక కవితలో రాశారు.

ఈ నేపధ్యం వుంది కాబట్టి వివిధ రాజకీయ పార్టీల్లో SC నాయకులను ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాను, మహాత్మా గాంధి వారిని ఉద్దేశించి పెట్టిన పేరు ‘హరిజన్’ అనే పేరు ఎందుకు మార్చారని. అసలా పదం వాడకూడదు, వారిని SC లుగా మాత్రమే వార్తల్లో పేర్కొనాలని రేడియోలో పనిచేసేటప్పుడు తెలుసుకుని ఆశ్చర్య పోయాను. నిజంగా ‘హరిజన్’ అనేది నిషేధిత పదమా! అందులో ఏదైనా మతానికి సంబంధించిన అన్వయం నాటి పాలకులకి స్పురించి అలా చేశారా అనే అనుమానం ఇప్పటికీ తీరలేదు. వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం ఇంతవరకు లభించలేదు.

నా పోస్టులను ఫాలో అయ్యేవారు ఒక విషయాన్ని గమనించే వుంటారనే నమ్మకంతో ఇది రాస్తున్నాను. సాధ్యమైనంతవరకు, ఎంతో అవసరమైన సందర్భాలలో తప్ప నేను కులాలు, మతాల ప్రసక్తి తీసుకురాను. ఫేస్ బుక్ అనేది అయినా ‘మనుషుల నడుమ మతాల గళ్ళు, కులాల ముళ్ళు లేని ప్రపంచంగా’ వుంటే బాగుటుందని, ఇందులో విహరించే కాస్త సమయంలో అయినా వాటికి అతీతంగా వుంటే ఇంకా ఎంతో హాయిగా ఉంటుందని భావించే అనేకమందిలో నేనొకడిని.

ఇది చరిత్ర రికార్డుకు అవసరమయ్యే అంశం కాబట్టి, కేవలం తెలుసుకోవాలనే జిజ్ఞాసతో నా సందేహం తీర్చాలని కోరుకుంటున్నాను.

 

13, అక్టోబర్ 2021, బుధవారం

డ్రైవర్ పక్క ఫ్రంటు సీటు - భండారు శ్రీనివాసరావు


ఈ కాలంలో సీటుకోసం వెంపర్లాడని వెర్రివాళ్ళెవ్వరుంటారు?
రాజకీయాలు తీసుకుంటే సర్పంచ్ సీటుతో ప్రారంభించి సీఎం సీటు వరకు ఎగబాకాలనుకుంటారు.
సినిమాల్లో అయితే ఎగస్ట్రా పాత్రనుంచి మొదలుపెట్టి, సెట్లో వెనుక ‘హీరో’ అనో ‘హీరోయిన్’ అనో రాసున్న సీటు సొంతం చేసుకోవాలని కలలు కంటారు.
మహాసభల్లో స్టేజీ మీద మొదటి వరస సీటు దక్కించుకోవాలనుకునేవారు కోకొల్లలు.
ప్రేక్షకుల్లో కూర్చోవాల్సిన పరిస్తితే వస్తే అక్కడా మళ్ళీ ముందు వరస కోసం వెతుకులాటే!
చిన్న చిన్న సాంస్కృతిక సమావేశాలనుంచి పెద్ద పెద్ద సభలవరకూ ఈ సీట్ల గోల తప్పదు.
కెమెరా యాంగిల్ నుంచి వీ.వీ.ఐ.పీ. పక్క సీటు కోసం ఆత్రపడేవాళ్ళు తక్కువేమీ కాదు.
యాభై అరవై ఏళ్ళక్రితం పల్లెటూళ్ళకు వచ్చే బస్సుల్లో డ్రైవర్ పక్కన వుండే ఫ్రంటు సీటు కోసం వూళ్ళో మోతుబరులు పోటీపడేవారు.
ఎనభయ్యవ దశకం మొదట్లో ముఖ్యమంత్రి అయిన శ్రీ టంగుటూరి అంజయ్య అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కార్లో డ్రైవర్ పక్కన ముందు సీట్లో ఆసీనులయ్యేవారు. ‘అమ్మ’ (శ్రీమతి ఇందిరాగాంధి) కూడా ఫ్రంటు సీటే సుమా!’ అని అమాయకంగా అనేవారు. ఆవిడ కూడా ప్రధాని హోదాలో అంబాసిడర్ కార్లో ముందు సీట్లోనే కూర్చునేవారు. అంజయ్య గారు ముందు సీటు ఎంపిక చేసుకోవడంలో నాకు మరో కోణం కనిపించేది. ప్రజల మనిషి అయిన అంజయ్య గారికి జనం తాకిడి ఎక్కువ. ‘లైఫ్ బాయ్ ఎక్కడవుంటే ఆరోగ్యం అక్కడ వుంటుంది’ అనే వాణిజ్య ప్రకటన తరహాలో అంజయ్య గారు ఎక్కడ వుంటే అక్కడ జనమే జనం. బాత్రూం, బెడ్ రూముల్లో కూడా ఆయనకు ఈ తాకిడి తప్పేది కాదని చెప్పుకునేవారు. సెక్యూరిటీని కూడా తోసుకువచ్చి కారెక్కాలని చూసే అనుయాయుల వల్ల కలిగే తొడతొక్కిడిని తప్పించుకోవడానికి ఆయన హాయిగా ముందు సీటుకు మారిపోయారని అప్పట్లో ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా పనిచేసిన బాలాజీ చెబుతుండేవారు.
ఒకప్పుడు కారులో వెనుక సీటులో కూర్చునేవారే ఆ కారుకు యజమాని అని జనం భావించేవారు. ఇప్పుడా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. మంత్రులు, ముఖ్యమంత్రులు, శాసన సభ్యులు ఒకరేమిటి అంతా ఫ్రంటు సీటుకు అతుక్కుపోతున్నారు. టీవీ కెమెరా యాంగిళ్లకి కూడా ఈ సీటే అనువుగా వుండడం ఒక కారణం అయితే దారివెంట ప్రజలకు చేయి ఊపుతూ అభివాదం చెయ్యడానికీ, రెండు వేళ్ళు విజయసూచిక మాదిరిగా ప్రదర్శించడానికీ ఫ్రంటు సీటే బెటరన్న నమ్మకం కుదరడం మరో కారణం.

11, అక్టోబర్ 2021, సోమవారం

గుడ్డుగారికో రోజు - భండారు శ్రీనివాసరావు

 ఏ దేశమేగినా, ఎందుకాలిడినా పాలూ, నీళ్ళతో పాటు తప్పకుండా దొరికేది మరోటివుంది. అదే కోడి గుడ్డు.

అక్టోబర్ నెలలో రెండో శుక్రవారం అంతర్జాతీయ కోడిగుడ్డు దినం అంటున్నారు.
1975 వరకు ఎగ్గూ పెగ్గూ రెండూ మా ఇంటావంటా లేవు. వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా రెండోది ముందుగా వచ్చి చాలా కుటుంబాలలో తిష్ట వేసింది. మొదట్లో నిరసన ధ్వనులు వినపడ్డా మొత్తం మీద దానికి పసుపు నీళ్ళు చల్లి ఇళ్ళల్లోకి రానిచ్చారు. దాంతో పాటే మొదటిది కూడా తగుదునమ్మా అని గృహప్రవేశం చేసి ఓటరు కార్డు, ఆధార్ కార్డు లేకుండానే ఇంట్లో సభ్యురాలు అయిపోయింది. మంచి ఎండాకాలంలో కూడా చలి దుప్పటి కప్పుకుని ఫ్రిజ్ లో పడుకునేది ఆ కోడిగుడ్డే. మేము తిన్నా తినకపోయినా, ఇంటికి వచ్చిన నాన్ వెజ్ ఫ్రెండ్స్ ఎవరికయినా అవసరం పడుతుందో ఏమో అని మా ఆవిడ ముందు జాగ్రత్తగా వాటిని కొని ఫ్రిజ్ లో దాచి వుంచేది.
ఎప్పుడో మా చిన్నప్పుడు మా చుట్టాల అమ్మాయికి టైఫాయిడ్ వచ్చి నిమ్మలించిన తర్వాత త్వరగా కోలుకోవడానికి డాక్టర్ ఉడక పెట్టిన కోడి గుడ్డు రోజూ ఒకటి తినమన్నారు. అసలే నిప్పులు కడిగే ఆచారం. గుడ్డు తినమనగానే ఇంట్లో వాళ్లకి నిలువు గుడ్లు పడడం చూసిన డాక్టరు గారు, పేషెంటు ముక్కూ, కళ్ళూ మూసి, నోరు తెరిపించి పటేల్ మని గుడ్డు పగల గొట్టి తటాలున నోట్లో పోసి మింగించాడు. అటువంటి భీకర భీభత్స దృశ్యాలు చూసిన తరువాతే వ్యాధి కంటే చికిత్స ప్రమాదకరం అనే సామెత పుట్టి వుండాలి.
అసలు కోడి గుడ్డు అనగానే గుర్తుకు రావాల్సిన వ్యక్తి ఒకరు వున్నారు. ఆయనే బీ.వీ. రావు (బి.వాసుదేవరావు, ఇప్పుడు లేరనుకోండి). తెలంగాణాకు చెందిన ఈ పెద్దమనిషి వెంకటేశ్వరా హేచరీస్ అనే పరిశ్రమను స్థాపించి కోడిగుడ్డుకు ఎనలేని ప్రాముఖ్యాన్ని కట్టబెట్టారు. మేము మాస్కోలో ఉన్నరోజుల్లో నాటి ప్రభుత్వ అతిథి హోదాలో ఆయన రష్యా వచ్చారు. ఓరోజు మా ఇంటికి వచ్చి మా ఆవిడ చేతి భోజనం చేసి వెళ్ళారు. తర్వాత మేము ఇండియాకు తిరిగి వచ్చిన తరవాత కూడా గుర్తు పెట్టుకుని మా పిల్లలు ఇద్దర్నీ పూనాలో వున్న తమ స్టడ్ ఫాం కు తీసుకువెళ్ళారు. అదో సంగతి.
ఏది ఏమైనా పిడికెట్లో నాలుగోవంతు లేని కోడిగుడ్డుకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చి, దాని పేరిట ఒక దినం ఏర్పాటు కావడం, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని గుడ్డు ప్రాముఖ్యతను ప్రస్తుతిస్తూ రేడియో ప్రసంగాలు, టీవీ కార్యక్రమాలు జరగడం కోడిగుడ్డు చేసుకున్న పూర్వజన్మ సుకృతం.
గుడ్డుగా వున్నప్పుడూ, గుడ్డు నుంచి కోడిగా మారిన కొత్త అవతారంలో కూడా మానవులకు ఆహారంగా సేవలందిస్తూ త్యాగంలో బలి, శిబి చక్రవర్తులను మించిన ఆ త్యాగశీలికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం, ఆమ్లెట్ గా వేసుకుని నోరారా తినడం తప్ప అంటారు కొందరు ఎగ్గేరియన్లు.



NOTE: Courtesy Image Owner