4, అక్టోబర్ 2021, సోమవారం

పిచ్చ అసూయగా వుంది. నా మీద నాకే! – భండారు శ్రీనివాసరావు

 మొన్న ఆగస్టుకి డెబ్బయ్ ఆరులో పడ్డాను. దాదాపు ఓ అర్ధ శతాబ్దం నన్ను కంటికి రెప్పలా చూసుకున్న అర్ధాంగి కరోనా అంటే ఏమిటో తెలియకుండానే, ఆ పదం వినకుండానే, ఆ మహమ్మారి ఆగమనానికి ముందుగానే నేను పుట్టిన ఆగస్టులోనే, 2019లో కన్ను మూసింది. వచ్చే పెన్షన్ తప్ప వేరే ఆధారం లేదు. కూడబెట్టుకున్నవీ లేవు. ఇవేవీ నా మనసుకు తాకలేదు. కారణం నా ఇద్దరు పిల్లలు, నా కోడళ్ళు. తోడులేని మనిషికి తోడుగా నిలబడ్డారు. నా చుట్టపక్కాల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎనభయ్యో పుట్టినరోజు ఇటీవలే జరుపుకున్న మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు రోజూ నా యోగక్షేమాలు కనుక్కోకుండా నిద్రపోడు.

సాధారణ మనుషులకి నిజంగా ఇవన్నీ అసాధారణ విషయాలే. అందుకే నా మీద నాకు అసూయ. కానీ ఇంతటి ఆదరణకి నేను అర్హుడిని కాదు అన్న సంగతి నాకు తెలుసు.
ఏడుగురు అక్కయ్యలు. అది ఒక కారణం కావచ్చు నాకు ఆడవాళ్లంటే గౌరవం. మా కోడళ్ళను చూసిన తరువాత అది రెట్టింపు అయింది.
పెద్ద కోడలు అమెరికానుంచి ఫోన్ చేసి నా వెల్ఫేర్ కనుక్కుంటుంది. వాళ్ళు అక్కడ సిటిజన్లు. ఆమెకు విద్యార్హతలు చాలా వున్నా, పిల్లల కోసం ఇన్నేళ్ళు ఉద్యోగం చేయకుండా ఇల్లు చూసుకుంది. నా మనుమరాళ్లు ఇద్దరూ యూనివర్సిటీ చదువులకోసం ఈ ఏడాది బయటి రాష్ట్రాలకు వెళ్ళారు. దాంతో ఖాళీగా వుండడం ఇష్టం లేక వున్న ఊళ్లోనే క్వాలిఫికేషన్ కు తగిన ఉద్యోగానికి అప్లయి చేస్తే ఇన్నేళ్ళు ఏ ఉద్యోగం చేశావు అని మాట మాత్రం అడగకుండా అర్హతను చూసి మంచి ఉద్యోగం ఆఫరు చేశారు. ఈరోజే చేరుతోంది.
నా రెండో కోడలు మొన్నీమధ్య పుట్టింటికి వెళ్ళింది. అన్ని రోజులూ ఉదయం కాఫీ నుంచి రాత్రి భోజనం వరకు మా అబ్బాయే కనుక్కున్నాడు. రాత్రి కోడలు ఫ్లయిట్ దిగి ఇంటికి వచ్చేసరికి పొద్దుపోయింది. అర్ధరాత్రి అలికిడి వినిపించి వెళ్లి చూస్తే, బయట డ్రాయింగు రూములో ఇన్నిరోజులుగా దుమ్ముకొట్టుకుపోయిన కుర్చీలు, బల్లలూ మెరుస్తూ కనిపించాయి. తను లోపల వంటిల్లు శుభ్రం చేస్తోంది. కొద్ది రోజులుగా ఇంట్లో ఆడదక్షత లేదుగా. ఇల్లు ఎలా ఉండాలో అలా వుంది. ఆమెకు ఏదో పెద్ద కార్పొరేట్ సంస్థలో పెద్ద ఉద్యోగం. అయినా ఇంటినీ, నన్నూ, నా అవసరాలను కనిపెట్టి చూస్తుంటుంది. ఎందుకమ్మా ఈ టైములో ఇలా అవస్థ పడతావు అంటే నవ్వి ఊరుకుంది.
ఈరోజు పొద్దున్న నాకు బ్రేక్ ఫాస్ట్ పెడుతూ చెప్పింది తనకు ప్రమోషన్ వచ్చిందని ఇప్పుడే తెలిసిందని. మా ఇంటికి వచ్చిన రెండేళ్ళలో ఇది రెండోది. మంచి మనుషులపట్ల భగవంతుడు కూడా దయ చూపిస్తాడు.
నాకు మరో అదృష్టం వుంది. నా రాతలు మా పిల్లలు ఎవ్వరూ చదవరు. ఎందుకంటే వాళ్లకి ఈ మాధ్యమాలు ఆట్టే నచ్చవు. అంచేత ఎలా రాసినా ఇలా ఎందుకు రాశావు అనేవాళ్ళు లేరు. వాళ్ళ ఫోటోలు పెట్టవద్దు అంటారు, అంతే!
నామీద నేను అసూయ పడడానికి ఇదో కారణం కూడా.
మా ఆవిడ వుండివుంటే నన్ను పట్టడానికి పగ్గాలు వుండేవి కావు.
దేవదాసు సినిమాలో పార్వతి పాత్ర వేసిన సావిత్రితో, ముసలి భర్త సీ.ఎస్.ఆర్. అంటాడు, చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఈ మచ్చ ఏమిటని.
చంద్రుడికే తప్పలేదు. మనమెంత?

04-10-2021)


(అమెరికాలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గర)



 

ప్రేమా! దోమా! - భండారు శ్రీనివాసరావు


ఒక తరం ప్రేమమీద నమ్మకాలు లేక ప్రేమా! దోమా! అని ఎద్దేవా చేసింది.
మరో తరం ప్రేమారాధనలోనే మునిగి తేలింది. పెళ్ళీ పెటాకులు లేని దేవదాసు జీవితాలతో బతుకులు తెల్లార్చుకుంది.
మళ్ళీ తరం మారింది. ప్రేమలేని పెళ్ళేమిటి? ప్రేమించే పెళ్లి చేసుకుంటాం అంటూ పెళ్ళాడి, ఆ పెళ్లి పెటాకులు చేసుకుని విడాకుల బాట పట్టింది.
మరో తరం వచ్చింది. ఈ తరానికి పెళ్ళిళ్ళ మీదా నమ్మకం లేదు, ప్రేమల మీదా నమ్మకం లేదు. కలిసి వున్నన్నాళ్ళు కలిసి ఉందాం, కుదరనప్పుడు ఎవరి దారి వారిదే అంటూ కొత్తదారులు వెతుక్కుంటోంది.
అలా అని, అన్ని తరాల్లోని వీళ్ళందరూ, తమ తరంలోని ఈ బాపతు వాళ్ళే అయివుంటారని రూలేమీ లేదు.
కాలచక్రం తిరుగుతూ తరాలను తిప్పితే మళ్ళీ పాతతరం భావాలు కొత్త తరంలో చిగురించవచ్చు.
అప్పటిదాకా ఒకటి గుర్తుంచుకుంటే మంచిది.
పెళ్లికయినా, ప్రేమకయినా పరస్పర విశ్వాసమే పునాది.
ప్రేమకయినా, పెళ్లికయినా ఆ బంధం బలపడడానికి సర్దుబాటు మనస్తత్వం ఒక్కటే ప్రధానం.
తరాలు మారినా ఇది చెరగని సత్యం.


(NOTE: COURTESY IMAGE OWNER)


04-10-2021

3, అక్టోబర్ 2021, ఆదివారం

సీఎస్ ఆర్ నశ్యదాస్యం – భండారు శ్రీనివాసరావు

 

అలనాటి కేరక్టర్ యాక్టర్ సీ.ఎస్.ఆర్. (చిలకలపూడి సీతారామాంజనేయులు) సీఎస్ ఆర్ పూర్వస్మృతులు
అనే పేరుతో ఆత్మకధ రాసుకున్నారు. (విజ్ఞాన దీపిక ప్రచురణలు, జామై ఉస్మానియా, హైదరాబాదు, ముఖ చిత్రం బాపు)
అందులో సి.ఎస్.ఆర్ తన సొంత శైలిలో ఇలా రాసుకున్నారు:
“నశ్యం నా విషయంలో ఒక జాడ్యంగా తయారుకావడానికి మా నాన్న కూడా కారణం. ఆయనకు నాటకాల పిచ్చి. తను వెడుతూ చిన్న పిల్లవాడిని నన్ను కూడా వెంట తీసుకు వెళ్ళేవాడు. నేను నిద్ర ఆపుకోలేక పొతే, ఆయన పక్కవాళ్ళ దగ్గర రెండు చిటికెలు నశ్యం అడిగి తీసుకుని నా ముక్కుకు అంటించే వాడు. దాంతో తల తిరిగి నాటకం పూర్తయ్యేవరకు కళ్ళప్పగించి నాటకం చూస్తుండేవాడిని. ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు ఈ నశ్యజాడ్యం పెరిగి పెద్దదయింది. దాదాపు నలభయ్ ఏళ్ళు నేను నశ్యదాస్యాన్ని అనుభవించాను. ఈ దాస్య శృ౦ఖలాలను తెంచుకునేందుకు ఒక పెద్ద స్వతంత్ర సమరమే చేయాల్సి వచ్చింది. చివరికి 1959 జనవరి ఒకటో తేదీన చరిత్రను సృష్టించా. ఆ రోజునుంచి నశ్యం మానేశా. నలభయ్ ఏళ్ళు నసాళానికంటేట్టు పీల్చి పీల్చి వదిలేశా”



అందరం అత్తలమే! – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha Daily today, SUNDAY)

అదేవిటో దురదృష్టం. కోడళ్ళకు సరే. సినిమావాళ్ళకు కూడా అత్త అంటే పడదు. అత్త అంటే సూర్యాకాంతం లాంటి గడుసు మనిషని అనుకునేలా సినిమాలు తీసారు. తీస్తున్నారు. అత్తలందరికీ అసలు పేరు ఒకటి వుంటుంది కాని, గయ్యాళితనానికి మారుపేరనే పాడుపేరొకటి వారి సొంతం. సొంతానికి సాధించింది ఏవీ లేకపోయినా పొద్దస్తమానం కోడళ్లను సాధిస్తారనే ట్యాగ్ లైన్ మరోటి. కోడలు యెంత గుణవంతురాలయినా, నడుం దించకుండా అడవా చాకిరీ యెంత చేస్తున్నా, 'అదేం రోగమో మా కోడలు పిల్లకు నడుం ఒంగి చావదు, చచ్చినట్టు ప్రతిపనీ నేనొక్కత్తినే చేసుకు చావాలి' అనే టీవీ సీరియళ్ల అత్తళ్ళకు కొదవ వుండదు. ఇంతకీ ఈ అత్తల పురాణం ఎందుకంటే? -
సాధించే గుణం, వంకలు పెట్టే గుణం, 'అన్ని పనులు నేనే చేస్తున్నాను, వేరేవారికి పనులు చేతకాదు' అనే అత్తల సహజ స్వభావం సమాజంలో అందరిలోను ఎంతో కొంతవున్నదని చెప్పడానికే.
ఏదయినా ఆఫీసరును కదిపి చూడండి. అక్షరం పొల్లుపోకుండా ఇదే సోది చెబుతాడు.
'తను తప్ప పనిచేసేవారు ఎవ్వరూ లేరనీ, అందరి పనులు తానే నెత్తికెత్తుకుని చేస్తుండబట్టే ఆఫీసు ఈ మాత్రం నడుస్తోంద'నీ అంటాడు. ఆయన కింద పనిచేసేవాడిని అడిగితే, తన కింద వాళ్లని గురించి ఆయన కూడా ఇదేవిధమైన అమూల్యాభిప్రాయం వ్యక్తం చేస్తాడు. అంటే ఏమిటన్న మాట, అత్తలకీ వీళ్ళకీ ఏమీ తేడా లేదన్న మాట.
'ఎవ్వరూ పనిచేయడం లేదు అందుకే దేశం ఇలా తగలడిపోతోంద'ని అనుక్షణం మధన పడిపోయేవాళ్లు అడుగడుక్కీ కనిపిస్తుంటారు. నేనూ ఇందుకు మినహాయింపు కాదు. వంకలు పెట్టే వంకర గుణం నాకూ వుంది.
కొన్నేళ్ళ క్రితం రైల్లో పోతుంటే బోధివృక్షం కింద బుద్ధుడికి జ్ఞానబోధ అయినట్టు నాకూ జీవిత సత్యం బోధపడింది. వెచ్చటి వేసవికాలంలో చల్లటి ఏసీ కోచ్ లో అంతా ముసుగుతన్ని పడుకున్న సమయంలో, సమస్త లోకం నిద్రలో జోగుతున్న ఆ సమయంలో పట్టాలపై రైలు అలుపులేకుండా పరుగులుతీస్తోంది. ఏదయినా స్టేషన్ వచ్చినప్పుడల్లా, రైలు దడదడా పట్టాలు మారుతున్న ధ్వని వినబడుతూ వుంది. ఆ అర్ధరాత్రి వేళ పట్టాలు మార్చే మనిషి కాస్త ఏమరు పాటుగా వున్నా, కాసింత రెప్పవాల్చినా రెప్పపాటు కాలంలో ఆ రైల్లోని ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తధ్యం.
అంటే ఏమిటి, రైల్లో ఇంతమంది జనం హాయిగా ఆదమరచి కంటినిండా నిద్రపోగలుతున్నారు అంటే ఇంతమందికోసం ఎవరో ఒకరు ఆ నిశిరాత్రివేళ నిద్రలేకుండా పనిచేస్తున్నారనే అర్ధం. 'అది అతని డ్యూటీ. చేయక ఏం చేస్తాడు' అంటే అతడి పని అతడు పనిచేస్తున్నాడు అనేకదా! కాబట్టి 'మనం ఒక్కళ్ళమే పనిచేస్తున్నాం, మిగిలిన వాళ్లు అందరూ పని దొంగలు' అని రొమ్ము విరుచుకోవడంలో అర్ధం లేదు.
అలాగే మరో ఉదాహరణ. చలికాలం. నిద్రలేచి కూడా, మంచం మీద నుంచి లేవడానికి బద్దకించి ముసుగు తన్నిపడుకున్నవేళ, మన ఇంటి ముందు ఎవరో పాల ప్యాకెట్లు వుంచి వెడతారు. 'అవి అంత పొద్దున్నే యెలా వచ్చాయి' అని ఒక్క క్షణం కూడా ఆలోచించం. 'ఇంటింటికీ ఇలా పొద్దున్నే వేస్తున్నాడు అంటే అతడు యెంత పొద్దున్న లేచి వుంటాడు అనే ప్రశ్న నేనయితే ఎప్పుడూ వేసుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే నాలోనూ కనిపించని 'అత్త' వుంది. అదే నాచేత 'అది అతడి డ్యూటీ' అనే మాట చెప్పిస్తుంది.
ఇది నాలాంటి వాళ్ళ థియరీ. మరి అతడు తన డ్యూటీ చేస్తున్నప్పుడు 'ఎవ్వరూ పనిచేయడం లేదు' అని నేనిచ్చే స్టేట్ మెంట్లకి అర్ధం ఏమిటి?
పొద్దున్నే వేడివేడి కాఫీ తాగుతూ, పత్రికల్లో వచ్చే తాజా వార్తలు చదివే భోగం మనకు పట్టింది అంటే ఎవరో పిల్లాడు తెల్లవారుఝామున్నే నిద్రలేచి, ఏజెంట్లు ఇచ్చిన పత్రికలు సైకిల్ మీద పెట్టుకుని ఇంటింటికీ తిరిగి వేయబట్టే కదా! అలాగే తెల్లారకముందే అన్నన్ని వార్తలు మోసుకుని పత్రికలు మన ఇళ్లకు వస్తున్నాయి అంటే పత్రికాఫీసుల్లో ఎంతమందో మనకోసం నిద్రకాచి పనిచేయబట్టే కదా! ఇలాగే, మన చుట్టూ వున్న పని మనుషులు, చెత్త తీసుకుపోయేవాళ్ళు, వీధులు వూడ్చేవాళ్ళు, ఒకళ్లా ఇద్దరా అనేకమంది ఒళ్ళు దాచుకోకుండా, పనికి బద్ధకించకుండా ఎవరి పనులు వాళ్లు చేస్తూ వుండడం వల్లే, హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చుని, 'ఎవ్వరూ పనిచేసేవాళ్ళే లేరు, నేనొక్కడ్ని తప్ప. అందుకే దేశం ఇలా తగలడిపోతోంద'ని సన్నాయి నొక్కులు నొక్కగలుగుతున్నాము.
ఒక్కటి నిజం. ఎవ్వరూ పనిచేయకుండా మనకు రోజు గడవడం లేదు. ఒక్కళ్ళూ పనిచేయడం లేదని వంకలు పెట్టకుండా కూడా రోజు గడవడం లేదు. అందుకే అన్నది, అందరిలోనూ ఎంతో కొంత 'అత్తల గుణం' వుందని.
తోకటపా:
యాభయ్ ఏళ్ళక్రితం ప్రతి సర్కారు కొలువుకు ఎంప్లాయ్ మెంట్ ఆఫీసు నుంచి నెంబరు తెమ్మనే వాళ్ళు. (ఇప్పుడూ ఆ పద్దతి ఉందేమో తెలవదు). హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఆ ఆఫీసు వుంది. అక్కడ పనిచేసే సిబ్బంది ఉద్యోగాలకోసం వచ్చేవారిని చులకనగా చూస్తారని ప్రతీతి.
అక్కడికి వెళ్ళిన మా బంధువు ఒకరిపట్ల కూడా ఇలాగే చిన్నచూపు చూసారని చెప్పడంతో నేను పై అధికారులకు చెప్పాను. కారణం తెలియదు కానీ ఆ అధికారి, మా వాడికి ఆ ఆఫీసులోనే తాత్కాలిక పద్దతిలో చిన్న ఉద్యోగం ఇప్పించారు.
కొన్ని నెలలు గడిచాయో లేదో, మా చుట్టం వైఖరిలో మార్పు మొదలయింది. అవసరార్థం ఆఫీసుకు వచ్చిన నిరుద్యోగులను చిన్నబుచ్చి కసురుకోవడం చూసి ఆశ్చర్యపోయాను.
గతంలో అతడూ ఇలాగే ఇతరుల తూష్ణీంభావాలకు గురైన వాడే. అదేమిటో చిత్రం, కుర్చీలో కూర్చోగానే మారిపోయాడు, అత్తపాత్రలో ఒదిగిపోయిన కోడలు పిల్లలా.



NOTE: Cartoon Courtesy Andhra Prabha Cartoonist Shri MAHAV

2, అక్టోబర్ 2021, శనివారం

ఎయిర్ ఇండియా మహారాజా

ఈ మహారాజా నేనూ ఒక ఈడు వాళ్ళమే. మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఓ ఏడాది ముందే అంటే 1946లో మేమిద్దరం పుట్టామన్న మాట.
పుట్టుక దగ్గర నుంచీ ఈ మహారాజా గారెకి దేశ విదేశాల్లో అసంఖ్యాక అభిమానులు ఏర్పడ్డారు. ఈ లోగో పుణ్యమా అని ఎయిర్ ఇండియాకు అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.
ఆకారానికి మించిన పెద్ద పెద్ద మీసాలు, రంగు రంగుల కుచ్చు తలపాగా, పంచమీద కోటూ, రాజులు ధరించే పాదరక్షలు ఇవన్నీ జనాలను బాగా ఆకర్షించాయి.
ఏ దేశానికి ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభించినా ఈ మహారాజా కూడా అందుకు తగ్గట్టే తన వేషాన్ని సవరించుకుని, దశావతారాలు ఎత్తుతాడు. నవ తరాన్ని ఆకర్షించడానికి అవసరమైతే పంచె కట్టు పక్కనబెట్టి, జీన్స్ ప్యాంటు వేసుకుంటాడు. ఎయిర్ ఇండియా మహారాజా మస్కాట్ తమ డ్రాయింగు రూములో వుండాలని ఎగబడి వీటిని కొనుక్కున్న వారి సంఖ్య లక్షల్లో వుంటుంది.
ఇంత ప్రాచుర్యం తెచ్చుకున్న ఈ మహారాజాకు కూడా విమర్శల దాడి తప్పలేదు.
సోషలిజం అని ఓ పక్క కబుర్లు చెబుతూ ప్రభుత్వ విమాన సంస్థకు ఈ మహారాజా లోగో ఏమిటనే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చివరికి ఎయిర్ ఇండియా 1989లో తన లోగో మార్చుకోవాల్సివచ్చింది. ఎగురుతున్న హంస, కోణార్క్ చక్రతో కూడిన కొత్త లోగోను ప్రవేశపెట్టింది. దానితో యాభయ్ ఆరేళ్లు ఓ వెలుగు వెలిగి దేశ విదేశాల్లో తన ప్రభావం చాటిన ఎయిర్ ఇండియా మహారాజా ఇప్పుడు ఓజ్ఞాపకంగా మిగిలాడు.
కానీ అదేమిటో విచిత్రం.
ఎయిర్ ఇండియాలో పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకుని, ఆ బిడ్డును టాటా సంస్థ సొంతం చేసుకుందని వస్తున్న వార్తల నేపధ్యంలో ఈ మహారాజానే మళ్ళీ వార్తల్లో ప్రముఖంగా కనబడ్డాడు. అంటే ఎయిర్ ఇండియా అంటే మహారాజా. ఆ మీసాల మహారాజా అంటే ఎయిర్ ఇండియా అని జనం డిసైడ్ అయిపోయారన్న మాట.


NOTE: Courtesy Image Owner


(02-10-2021)

1, అక్టోబర్ 2021, శుక్రవారం

టాటా! బై బై ! అంటున్న మహారాజా !

 

(టాటాల  చేతికి ఎయిర్ ఇండియా!)



Note: Courtesy Image Owner

ఎవరీ గాంధి? – భండారు శ్రీనివాసరావు

 

(అక్టోబర్ రెండు మహాత్ముని జయంతి)
1969
మహాత్మాగాంధీ శతజయంతి సంవత్సరం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జర్మని నుంచి ఒక ప్రొఫెసర్ భారత దేశానికి వచ్చారు. ఆయన ఆ దేశంలోని అతి పురాతనమైన విశ్వవిద్యాలయం హైడల్ బర్గ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. పేరు డాక్టర్ మర్ల శర్మ. వారిది కాకినాడ. పై చదువుల కోసం జర్మనీ వెళ్లి అక్కడే స్థిర పడ్డారు. గాంధి గారు పుట్టి వందేళ్ళు గడుస్తున్న సందర్భంలో భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల వాళ్ళు గాంధీని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుని ఒక పరిశోధనా పత్రం తయారు చేసే పని పెట్టుకుని వచ్చారు. ఆరోజుల్లో నేను విజయవాడ ఎస్సారార్ కాలేజీలో డిగ్రీ చేస్తున్నాను. ఆయన చేస్తున్న పరిశోధనలో చేదోడువాదోడుగా వుండే అవకాశం నాకు లభించింది. అందులో భాగంగా నేను శర్మ గారితో కలిసి (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక గ్రామాలు తిరిగాను.
‘మహాత్మాగాంధి ఎవరు?’ అనేది శర్మ గారు తయారు చేసుకొచ్చిన ప్రశ్నావళిలో మొట్టమొదటిది. వూరి పేరు గుర్తు లేదు కానీ పట్టుమని పాతిక గడప కూడా లేని ఓ మారుమూల గ్రామంలో ఒక నడికారు మనిషిని ఇదే ప్రశ్న అడిగితే, ఆమె జవాబుగా తన కుమారుడిని చూపించింది. అతడి పేరు గాంధి. మహాత్మాగాంధీ హత్యకు గురైన తర్వాత పుట్టిన తొలిచూలు బిడ్డడు అతడు. మహాత్ముడి మీది గౌరవంతో కొడుక్కి గాంధి అని పేరు పెట్టుకుంది. స్వాతంత్ర ప్రదాత అనే కృతజ్ఞతతో ఆ రోజుల్లో వేలాదిమంది తమ సంతానానికి గాంధీ పేరు పెట్టుకున్నారు. వారిలో ఎంతమంది తమ నడవడికతో ఆ పేరుకు న్యాయం చేకూర్చారో తెలుసుకోవాలంటే మరో విదేశీ యూనివర్సిటీ పూనుకోవాలి.
అది అప్పటి మాట.
దశాబ్దాలు గడిచిన తర్వాత మా పక్కింటి పిల్లవాడు తల్లిని అడుగుతుంటే విన్నాను, ‘మమ్మీ! గాంధి అంటే ఎవరు? ఈరోజు నేను స్కూల్లో మాట్లాడాలి. నా ఫ్రెండ్ గోపి ఏమో, రాహుల్ గాంధి గ్రాండ్ పా అంటున్నాడు, కరక్టేనా!’
ఈ పిల్లవాడి ప్రశ్న కంటే ఆ తల్లి ఇచ్చిన జవాబు నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ‘నన్ను విసిగించకురా! వెళ్లి గూగుల్ లో వెతుక్కో’
ఈ నేపధ్యంలో మహాత్మా గాంధి ఆయన బోధనలు, ప్రబోధాలు నేటి తరానికి ఏ మేరకు శిరోధార్యాలు అనే పెద్ద ప్రశ్న నా ముందు నిలిచింది.
మహాత్మాగాంధీ తన జీవిత కాలంలో ఎన్నో చెప్పారు. ఎన్నో రాశారు. ఈ విషయంలో ఆయనది ఒక రికార్డు అనే చెప్పాలి. తన దృష్టికి వచ్చిన ప్రతి ఉత్తరానికీ, సామాన్యులు, అసామాన్యులు అనే బేధం లేకుండా స్వదస్తూరీతో ఓ కార్డు ముక్కపై జవాబు రాయడం ఆయనకు ఓ అలవాటు. ఆయన సూక్తులూ, బోధనలు వర్తమానానికికూడా వర్తిస్తాయంటూ గాంధి జయంతి, వర్ధంతి రోజుల్లో నాయకులు చేసే షరామామూలు ప్రసంగాలతో జాతి జనుల చెవులు చిల్లులు పడివుంటాయి. ఆచరణకు వచ్చేసరికి హళ్లికి హళ్లి. సున్నకు సున్నా.
భారతీయ సమాజంలో వైరుధ్యాలు, అసమానతలు నానాటికి పెరిగిపోతున్నాయి. పెరగడమే కాదు, మరింత తీవ్రస్వరూపం ధరిస్తున్నాయి. సంపదలు పెరుగుతున్నా దేశంలో కోట్లాది సామాన్య ప్రజలకు వాటి పంపిణీ సక్రమంగా జరగడం లేదు. పేదలు నిరుపేదలు అవుతున్నారు. సంపన్నులు కోట్లకు పడగెత్తుతున్నారు. సామాన్యుల జీవన ప్రమాణాలు పాతాళంలోకి దిగజారుతుంటే, కలవారి జీవన ప్రమాణాలు అంతరిక్షాన్ని తాకుతున్నాయి. దేశంలో సంపదలు పెరిగాయి. సంపదలతో పాటు వైరుధ్యాలు, అసమానతలు పెరిగాయి. పెరిగిన సంపదలలో 73 శాతం భారత జనాభాలో కేవలం ఒక శాతం వున్న శ్రీమంతుల గుప్పిట్లోకి వెళ్లాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు గాంధి పుట్టిన దేశమా ఇది? అనే అనుమానం కలక్కమానదు. బహుశా ఆయన మళ్ళీ పుట్టి ఈ దేశాన్ని చూస్తుంటే ఆయనకు కూడా తప్పకుండా ఇలాంటి సందేహమే పొటమరించి వుండేదేమో! ఎందుకంటే ఆయన స్వతంత్ర భారతం గ్రామీణ భారత పునాదులపై నిర్మించబడాలి అని బలంగా కోరుకున్నారు. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని నమ్మిన నాయకుడాయన.
అలా అని దేశం పరిస్తితి మరీ ఘోరంగా వుందని అర్ధం కాదు. ఎన్నో అవలక్షణాల నడుమ కూడా పురోగతి చుక్కల్ని తాకుతున్నమాట సైతం అవాస్తవం కాదు. కాకపోతే ఆనాడు మహాత్మా గాంధి కన్న కలల ప్రకారం సాగుతోందా అంటే అనుమానమే.
మహాత్ముడి బోధనలలో సర్వకాలాలకు వర్తించేవి వున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకోవాల్సినవీ వున్నాయి. మహాత్ముడు రాట్నం వడికి తీసిన నూలు దుస్తులు ధరించమని ప్రజలకు చెప్పారు. ఆనాడు ఆయన ఉద్దేశ్యం ఖద్దరును ప్రోత్సహిస్తే విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం వుండదు అన్నది కావచ్చు. మరి నేటి తరం ‘రాటం మాకిప్పుడు కాదు వాటం’ అంటోంది. విదేశీ వస్తు బహిష్కరణకు గాంధి నాడు పిలుపు ఇస్తే దేశవ్యాప్తంగా ప్రజలు ఉవ్వెత్తున స్పందించి తమ దుస్తులు మూటలు కట్టి తీసుకొచ్చి నడి వీధుల్లో రాశులుగా పోసి తగలబెట్టారు. మహాత్ముడి మాటకు జనాలు ఎలాంటి విలువ ఇచ్చారో తెలుసుకోవడానికి ఇలాంటి దృష్టాంతాలు కోకొల్లలు.
‘గమ్యం (లక్ష్యం) ఎంత గొప్పదిగా పరిశుద్ధంగా వుండాలని కోరుకుంటామో, ఆ లక్ష్య సాధనకు మనం అనుసరించే మార్గాలు కూడా అంతే పవిత్రంగా వుండాలి’ అని మహాత్ముడు చెప్పిన సూక్తిని ఆయనకు ఏకలవ్య శిష్యుడిగా ప్రపంచం పరిగణించిన నల్ల జాతి నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ తరచూ పేర్కొంటూ వుండేవారు. మహాత్ముడు ప్రబోధించిన అహింసావాదాన్ని ఆయన మనసా వాచా కర్మణా నమ్మి ఆయన తన ఉద్యమాన్ని నడిపారు. ఏ దేశంలో అయితే వర్ణ వివక్షకు వ్యతిరేక పోరాటాన్ని మహాత్ముడు ప్రారంభించారో ఆ దేశమే తదనంతర కాలంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి నివాళులు అర్పించిందంటే ఆయన బోధనల లోని ప్రభావం అంత గొప్పదని అవగతమవుతుంది.
నిజానికి మహాత్ముడి బోధనల అవసరం ఆనాటి రోజులకంటే ఈనాడే ఎక్కువగా వుంది. కానీ వాటిని విదేశాల్లో వారు పాటిస్తూ, గౌరవిస్తుంటే, మనం మాత్రం జయంతులు, వర్ధంతుల సందర్భాల్లో ఇచ్చే సందేశాలకు పరిమితం చేసి సంతోషపడుతున్నాం. మోహన్ దాస్ కరం చంద్ గాంధి అనే మహానీయుడు నడయాడిన నేలమీదనే మనమూ నడుస్తున్నాం అనే స్పృహను కోల్పోతున్నాం. పైగా ఆయనకు మహాత్ముడు అనే బిరుదు ఎవరిచ్చారు అనే అర్ధ రహితమైన చర్చలతో కాలక్షేపం చేస్తున్నాం.
‘ఇది తగునా!’ అనే ప్రస్తావన మనకు రాదు. ఎందుకంటే మహాత్మా గాంధి అంటే ఎవరు అనే ప్రశ్నకు జవాబు చెప్పాలంటే గూగుల్ వెతుక్కోవాల్సిన దుస్తితిలో వున్నాం. ఇక ముందు కూడా వుంటాం. కారణం గాంధీతో కానీ, ఆయన సూక్తులతో కానీ నేటి యువతరానికి అవసరం లేదు. పాత తరం పట్టించుకునే పరిస్తితిలో లేదు.
అక్టోబర్ రెండున మరో మహానుభావుడు కూడా జన్మించారు. కానీ ఆయన Unsung Hero.
ఆయనే....
లాల్ బహదూర్ శాస్త్రి గారు.
కింది ఫోటో:



(1980 లో మాస్కోలోని గాంధి విగ్రహం దగ్గర మా పెద్దపిల్లవాడు సందీప్, అతడి స్నేహితులు)