24, జూన్ 2021, గురువారం

అభినవ ఉద్దాలకులు – భండారు శ్రీనివాసరావు

 

“ఇదిగో! పీతాంబరం వచ్చాడు. హడావిడి పడి కాఫీ తేవద్దు” వంటింట్లోకి కేకేసి చెప్పాడు ఏకాంబరం.
తర్వాత గొంతు తగ్గించి పీతాంబరంతో అన్నాడిలా.
“మా ఆవిడ మరీ ఉద్దాలకుడి భార్య లాగా ప్రవర్తిస్తోంది”
“ఉద్దాలకుడా! అతడెవ్వడు” అడిగాడు పీతాంబరం.
“ఉన్నాడులే పురాణ కధల్లో ఒకడు. శుద్ధ బుద్ధావతారం. అతడేమి అన్నా భార్య ఒప్పుకోదు. పైగా తద్విరుద్ధంగా చేస్తుంది. అన్నం పెట్టు అని అడిగితే అన్నం గిన్నె నేలకేసి కొడుతుంది.”
“అది సరే. అది కధ. మీ ఆవిడ సంగతేమిటి ! అది చెప్పు ముందర” అన్నాడు పీతాంబరం, ఏకాంబరం భార్య తెచ్చి ఇచ్చిన కాఫీ చప్పరిస్తూ.
ఆమె లోపలకు వెళ్ళగానే అన్నాడు ఏకాంబరం.
“ఏం చెప్పను! మా ఆవిడదీ అచ్చంగా అదే వరస. నేను ఏది చెప్పినా దానికి విరుద్ధంగా చేస్తుంది. అందుకని ఓ ఉపాయం కనిపెట్టాను”
“ఏమిటది?”
“స్నానానికి నీళ్ళు పెట్టు అని చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు స్నానానికి నీళ్ళు వద్దు అని చెబుతాను. అంతే! ఆవిడ చక్కగా గంగాళం వేన్నీళ్ళు సిద్ధం చేస్తుంది. ఈ కిటుకు తెలిసిన తర్వాత నా పని సులువైంది. నాకు ఏది కావాలో అది వద్దు అని చెబుతాను. దానితో నాకు ఏది కావాలో అది చేసి పెడుతోంది”
“బాగుందే ఈ టెక్నిక్. అధికారంలో వుండే వాళ్ళు కూడా ఇదే పని చేస్తే సరి పోతుంది. వాళ్ళు ఒక పని తలపెట్టి నప్పుడు దానికి విరుద్ధంగా చేయబోతున్నామని చెప్పాలి. ప్రతిపక్షాల వాళ్ళు కాదూ కూడదు అంటారు. పైగా అధికార పక్షం మనసులో పెట్టుకుని బయటకు చెప్పని ఆ పని చేయమని కూడా నానా యాగీ చేస్తారు. అప్పుడు ఆ పని చేసారనుకో, ప్రతిపక్షం చెప్పింది ఒప్పుకున్నట్టు అవుతుంది. తాము చేయాల్సింది చేసినట్టూ అవుతుంది” చెప్పాడు పీతాంబరం తాపీగా కాఫీ తాగి కప్పు కింద పెడుతూ.
(24-06-2021)

రాజకీయ దత్తతలు - భండారు శ్రీనివాసరావు

 “ఒక కుర్రాడు నేరేడు చెట్టుకింద నిలబడి వున్నప్పుడు నిగనిగలాడే నల్లటి నేరేడు పండు కింద పడుతుంది. వంగి దాన్ని తీసుకుని రుచి  చూస్తాడు. బ్రహ్మాండం అనుకుంటూ ఉండగానే మరోటి రాలి పడుతుంది. వంగి చేతిలోకి తీసుకుంటాడు. అలా ఒకటి కాదు పాతిక నేరేడు పండ్లు  నాలుక ముదురు నీలం రంగుకు మారే వరకు, ఆవురావురుమని నోరారా  తింటాడు. ఇంతలో  మళ్ళీ ఒకటి రాలుతుంది. ఈసారి బద్దకంగా వంగి తీసుకుంటాడు. మునుపటి రుచి లేదేమిటి అనుకుంటాడు. ఇంకోటి , మరొకటి తిన్న తరువాత నేరేడు పండు మీద యావ తగ్గిపోతుంది.

“దీన్ని ఇంగ్లీష్ వాడు డిమినిషింగ్ రిటర్న్స్ (Diminishing Returns) అంటాడు”

ఇలా సాగేది చతుర్వేదుల రామనసింహం గారి పాఠం.

ఇలా కధలు కధలుగా పాఠాలు చెబుతుంటే విద్యార్ధులు వినకేం చేస్తారు? మా బీ కాం తరగతి వాళ్ళే కాదు, మిగిలిన తరగతుల వాళ్ళు కూడా వచ్చి కూర్చుని వినేవారు. ఆయన క్లాసులో అటెండెన్స్ రిజిస్టర్ కూడా వుండదు. అయినా ఒక్కళ్ళు కూడా డుమ్మా కొట్టరు. రామనరసింహం గారు పాఠం చెప్పే తీరు అలాంటిది.

ఎస్సారార్ కాలేజీలో రామనరసింహం గారు మాకు లెక్చరర్. క్లాసు నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వారి మాటలు బాగా గుర్తుండిపోయేవి. యాభయ్ ఏళ్ళు దాటిన తదుపరి కూడా అవి అలా మనసులో వుండిపోయాయి.

రాజకీయ దత్తతలు అని మొదలు పెట్టి ఈ నేరేడు పండ్ల కధ ఏమిటి అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నాను.

ఇప్పుడు మరో పాఠం చెప్పుకుందాం.

“గ్రామస్తుల మధ్య ప్రేమ భావం వుండాలి. పోలీసు కేసులు ఉండొద్దు. కేసులు వున్నా వాటిని వెనక్కి తీసుకోండి. ఒకళ్ళ నొకళ్ళు దూషించుకోవడం ముందు మానేయండి. అందరం ఒకటే అనుకోండి.

“అంకాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోండి. అక్కడివాళ్లు బంగ్లాలు కట్టుకుని హాయిగా వుంటున్నారు. ఆ వూరి గ్రామ కమిటీ చెబితే సుప్రీం కోర్టు చెప్పినట్టే. నలభయ్ ఐదేళ్ల నుంచి ఆ ఊరిలో ఒక్క పోలీసు కేసు లేదు. మీ ఊళ్ళో

రెక్కల కష్టం మీద బతికే వారిని గురించి తోటి గ్రామస్తులు ఆలోచించాలి. మీ ఊళ్ళో పనిచేయగలిగిన  వాళ్ళందరూ వాళ్ళ రెండు చేతులతో వారానికి రెండు గంటలు ఉచితంగా శ్రమిస్తే మీ ఊరిలో మీరే అద్భుతాలు సృష్టించగలరు” 

ఈ సుద్దులు చెప్పింది తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్. ఎవరితో? తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామస్తులతో.

ఇంకా చాలా చెప్పారు.

ఆ వూరిలో పదో తరగతి  అమ్మాయి సుప్రజకు   డాక్టర్ చదువు పట్ల వున్న మమకారం వున్నా ఆర్ధిక పరిస్థితులు సహకరించడం లేదని  తెలుసుకుని ఆ బాధ్యత తనదేని ఆ అమ్మాయి తండ్రికి హామీ ఇచ్చారు.

2600 మంది జనాభా కలిగిన వాసాలమర్రి  గ్రామాభివృద్ధికి నూట యాభయ్ కోట్లు ఖర్చు చేస్తామన్నారు. గ్రామ రూపురేఖలు సమూలంగా మార్చి వేయడానికి ఆ జిల్లా కలెక్టర్ నే ఆ వూరికి స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తున్నట్టు ప్రకటించారు.

గ్రామంలోని అందరి భూములకు డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేశారు.

జిల్లాలోని ప్రతి పంచాయితీకి పాతిక లక్షలు, భువనగిరి మునిసిపాలిటీకి కోటి, ఇతర మునిసిపాలిటీలకు యాభయ్ లక్షల చొప్పున అందచేస్తామని అన్నారు. 

ఇలా తను దత్తత తీసుకున్న వాసాల మర్రి గ్రామం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తూ పోయారు.

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఎందుకిలా అనే ప్రశ్న తప్పకుండా ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతం ఆ జిల్లాలో ఎన్నికలు లేవు. వాసాల మర్రి అంటే దత్తత తీసుకున్న గ్రామం కనుక అంతగా తప్పు పట్టడానికి ఏమీ ఉండక పోవచ్చు.

గ్రామాలను, లేదా కొన్ని ప్రాంతాలను దత్తత తీసుకున్న ఉదాహరణలు ఉమ్మడి రాష్ట్రంలోను  కనిపిస్తాయి.

మహబూబ్ నగర్ జిల్లాను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నారు. పైకి దత్తత గురించి ప్రకటించక పోయినా ఖమ్మం జిల్లాలో జరిగి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్క ఇటుక మీద తన పేరే ఉంటుందని అలనాడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చెప్పేవారు. అలాగే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాములో పులివెందులలో జరిగిన అభివృద్ధి ఎవరూ కాదనలేనిది. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన నియోజకవర్గం వారణాసిని దత్తు తీసుకున్న మాదిరిగానే అభివృద్ధి చేస్తున్నారు.

అయితే, రాజకీయ నాయకులు ప్రాంతాలను దత్తు తీసుకోవడం అనే అంశం చర్చకు వచ్చినప్పుడు మన పార్ల మెంటు సభ్యుల నిర్వాకం గురించి కూడా చెప్పుకోవాలి.

నరేంద్ర మోడీ మొదటి సారి ప్రధాన మంత్రి అయినప్పుడు దేశంలోని ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఒక వెనుకబడిన గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసే ఒక పధకం ప్రకటించారు. అప్పుడు ఒకే ఒక ఎంపీ ప్రధాని ప్రశంసకు నోచుకున్నారు. ఆయన ఎవ్వరో కాదు, మాజీ కేంద్ర మంత్రి  అశోక్ గజపతి రాజు. పార్లమెంటులోని మిగిలిన సభ్యులలో చాలామంది  ఈ పధకాన్ని పట్టించుకున్న దాఖలా లేదు.

(24-06-2021)

ఆంధ్ర అభ్యసన పరివర్తన

 ఇంగ్లీష్ భాషలో వున్నవి ఇరవై ఆరు అక్షరాలే. అంచేత కాబోలు ఇతర భాషలలోని ముఖ్యంగా లాటిన్ వంటి భాషలోని  పదాలను చేర్చుకుని ఆ భాష పరిపుష్టం అయిందంటారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న కొద్దీ కొత్త కొత్త పదాలు అనుభవంలోకి వస్తుంటాయి. ఇది తప్పనిసరి పరిణామం.

ఓ యాభయ్ ఏళ్ళ క్రితం నేను ఒక తెలుగు దినపత్రికలో పనిచేస్తున్నప్పుడు ఘెరావ్, ధర్నా అనే పదాలు మొదటిసారి వాడుకలోకి వచ్చాయి. మొదట్లో వీటిని రకరకాలుగా రాసేవారు. ఘెరావో, ధరణ ఇలా. అవి తెలుగు పదాలు కావు కాబట్టి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పలికేవాళ్ళు, రాసేవాళ్ళు. తొలి రోజుల్లో వీటిని  తెలుగులోకి అనువదించే ప్రయత్నం జరిగింది. కానీ అది సఫలం కాలేదు. దరిమిలా, కాలం గడిచిన కొద్దీ అవి వ్యావహారిక పదాలుగా మారిపోయాయి. ఇలాటి ఉదాహరణలు చాలా వున్నాయి. రైలు స్టేషన్, సిగ్నల్, బస్ స్టాండ్, సిటీ బస్సు, ఆటో ఇలా చాలా చెప్పుకోవచ్చు. పైన తెనిగించినట్టు “ఆంధ్ర అభ్యసన పరివర్తన” మాదిరిగా అదే పత్రికలో ఈ పదాలను తర్జూమా చేసి రాస్తున్నారా! లేదే! లేనప్పుడు ఈ కొత్త పదసృష్టి దేనికోసం? ఎవరి కోసం?

నేను మొదటి నుంచి చెబుతున్నది ఒక్కటే. మీరు తెలుగులో అనువాదం చేయండి. కానీ చదువరికి అర్ధం అవుతుందా లేదా అని ఒక్క క్షణం ఆలోచించండి. ఇలా అనువాదాలు చేసేవాళ్ళు ఏసీ గదులు వదిలి, బొత్తిగా ఇంగ్లీష్ తెలియని పల్లె ప్రాంతాలలో వాటిని ఎలా పలుకుతున్నారో అధ్యయనం చేయండి. ఉదాహరణకు మా చిన్నప్పుడు పల్లెటూళ్ళలో కిరోసిన్ ను మట్టినుంచి తీసే నూనె కాబట్టి  మట్టి నూనె (చమురు) అనేవారు. అలాగే పొగబండి. ఇప్పుడా ఇంజిన్లతో నడిచే బండ్లు లేవు కాబట్టి రైలు అనక తప్పదు. విశాఖ పట్నంలో డ్రెడ్జింగ్  యంత్రాలతో పనిచేయిస్తున్నప్పుడు అక్కడి పని వారు దాన్ని తవ్వోడ అని పిలిచేవారని కలం కూలీ జి. కృష్ణ గారు చెప్పేవారు. పాశం యాదగిరిని అడిగితె లక్ష ఉదాహరణలు చెబుతాడు. ఒక తెలుగు వాక్యంలో ఒక్కటంటే ఒక్క తెలుగు పదం లేని వాక్యాలు తెలుగునాట అందరూ పలుకుతుంటారని సోదాహరణంగా పేర్కొంటాడు.

ఈ విధంగా పల్లెల్లో పుట్టే పలుకుబడులను ఈ అనువాద మేధావులు పట్టించుకోరు. పైగా అనువాదం కోసం అనువాదం అనే పద్దతిలో తెలుగును నానా హింస పెడుతున్నారు.

“ఆంధ్ర అభ్యసన పరివర్తన” వంటి ప్రయోగాలతో తెలుగును క్లిష్టతరం చేయడం, ఇదేమైనా భావ్యమా! అని మనం ప్రశ్నిస్తే తప్పేమిటి?



(24-06-2021)  

ఎమర్జెన్సీ ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు

 నలభయ్ ఆరేళ్ల కిందటి మాట.

ఎమర్జెన్సీతో పాటే పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు.
ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చే వార్తలు, ఫోటోలను ముందుగా సెన్సార్ అధికారికి చూపించి, ఆయన అనుమతి లభించిన తరువాతనే వాటిని ప్రచురించాల్సిన పరిస్తితులు ఉండేవి.
ఢిల్లీ స్టేట్స్ మన్ పత్రికలో ఒక అద్భుతమైన ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. అయన పేరు రఘురాయ్ . ఎమర్జెన్సీ విధించిన తరువాత నగరంలో పరిస్తితులను కళ్ళకు కట్టినట్టు చూపే ఒక ఫోటో తీసాడు.
ఒకతను సైకిల్ పై ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకుని దాన్ని తోసుకుంటూ వెడుతుంటాడు. వెనకనే అతడి భార్య నడిచి వస్తుంటుంది.
ఆ ఫోటోకి కింద పెట్టిన క్యాప్షన్ ఇలా వుంటుంది.
“చాందినీచౌక్ ప్రాంతంలో జనజీవనం చాలా సాధారణంగా వుంది”
సెన్సార్ అధికారికి అందులో అభ్యంతర పెట్టాల్సింది ఏమీ కనిపించలేదు. దాన్ని ఓకే చేసాడు. ఫోటోగ్రాఫర్ తెలివి అతడ్ని పప్పులో కాలేసేలా చేసింది. ఆ ఫోటో చూస్తే జనజీవనం సాధారణంగా సాగిపోతున్న భావన కలిగే మాట నిజం. కానీ అదే వీధిలో గుంపులు గుంపులుగా గస్తీ తిరుగుతున్న పోలీసులు కూడా ఆ ఫోటోలో లీలగా కనిపిస్తారు. ఆ అధికారి ఆ విషయం గమనించలేదు. అంచేత మరునాడు పత్రికలో ఆ ఫోటో అచ్చయింది.
సెన్సార్ అధికారులు తరువాత నాలుక కరుచుకున్నారు. ఆ ఫోటో ప్రచురణకు అనుమతి ఇచ్చిన అధికారిని బదిలీ చేసారు.

23, జూన్ 2021, బుధవారం

రేవంత్ రెడ్డికే టీపీసీసీ - Political Analyst Bandaru Srinivas on Revanth...

ముఖ్యమంత్రి కితాబు

 (జిల్లా కలెక్టర్ ను ఒక గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తున్నట్టు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన నేపధ్యంలో గుర్తుకొచ్చిన పాతికేళ్ళ నాటి జ్ఞాపకం) 

విరిగిన కాలుతో ఇంట్లో ‘కాలుక్షేపం’ చేస్తున్న రోజుల్లో నా కాలక్షేపం కోసం జ్వాలా పూనికతో ఎంసీఆర్ హెచ్ ఆర్డీ డైరెక్టర్ జనరల్ పీవీఆర్కే ప్రసాద్ గారు తెలుగు మాతృభాష కాని ఐఏఎస్ ట్రైనీలకి తెలుగు బోధించే పని ఒప్పచెప్పారు. మా ఇంటికి దగ్గర్లోనే గ్రీన్ లాండ్స్ గెస్టు హౌస్ లో ఉంటున్న ఆ ఉత్తరాది యువ అధికారులు ఉదయం, సాయంత్రం మా ఇంటికే వచ్చి నా వద్ద తెలుగు నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. నేను నేర్పిన తెలుగేమో కానీ, మా ఆవిడ చేసిపెట్టే తెలుగు చిరుతిండ్లకు మాత్రం వాళ్ళు బాగా అలవాటు పడ్డారు.

వారిలో ఒకరు తదనంతర కాలంలో విజయవాడ సబ్ కలెక్టర్ అయ్యారు. అప్పట్లో కూడా ఇసుకకు బాగా గిరాకీ వుండేది. ఆ మాఫియాకు ఈ అధికారి గొంతులో వెలక్కాయ కావడంతో బదిలీ తప్పలేదు. మంచి అధికారి, నా దగ్గర తెలుగు నేర్చుకున్నాడు అనే భావనతో నా అంతట నేనే వెళ్లి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెప్పాను. ఆయన రవీంద్ర భారతిలో జరిగే ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారుల సమావేశానికి వెళ్ళే హడావిడిలో వున్నారు. ఆ సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చెప్పారు.

ఇంతవరకు మునిసిపల్ కమీషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించలేదు. మునిసిపాలిటీలలో పరిస్తితులను మెరుగుపరచడానికి ఇప్పుడాపని చేద్దామనుకుంటున్నాను. ముందు ఏలూరుతో మొదలెడతాను. సంజయ్ అని సమర్దుడయిన అధికారిని ఏలూరు మునిసిపల్ కమీషనర్ గా వేస్తున్నాను”

సబ్ కలెక్టర్ గా పనిచేసిన అధికారికి మునిసిపల్ కమీషనర్ పదవి ఇష్టమో కాదో నాకు తెలవదు. కానీ, మంచి పనులు చేయడానికి ఆ ఉద్యోగం కూడా పనికి వస్తుంది అని తెలుసు. పైగా సిఎం అంతటి వాడే ‘సమర్ధుడు’ అని ఇచ్చిన కితాబు ఇంకా గొప్పది కదా!

(23-06-2021)

 

22, జూన్ 2021, మంగళవారం

విని తీరాల్సిన కేసీఆర్ ప్రసంగం – భండారు శ్రీనివాసరావు

 ఉద్యమ కాలంలో సరే, గత ఏడేళ్ల కాలంలో తెలంగాణా ముఖ్యమంత్రిగా కేసీఆర్ శాసనసభలోను, బహిరంగ సభలలోను అనేకానేక అద్భుత ప్రసంగాలు చేశారు. అవన్నీ ఒక ఎత్తు, ఈరోజు వాసాలమర్రి గ్రామ సభలో చేసిన ప్రసంగం ఒక ఎత్తు.

ఆయన ఈ సభలో కేవలం ప్రసంగం మాత్రమే చేశారని నాకు అనిపించలేదు.

దత్తత తీసుకున్న తీసుకున్న తండ్రి పిల్లవాడికి సుద్దులు చెప్పినట్టు ప్రజలకు  అనేక హిత బోధలు చేశారు.  ఒకరకంగా చెప్పాలంటే అనుగ్రహ భాషణం చేశారు. ఇందులో సూక్తులు వున్నాయి. సలహాలు వున్నాయి. హితోక్తులు వున్నాయి. హెచ్చరికలు వున్నాయి. హామీలు వున్నాయి. వరాల జల్లులు  వున్నాయి. సుతిమెత్తని చీవాట్లు వున్నాయి. కానీ ఎక్కడా దాష్టీకం లేదు. పైపెచ్చు అధికారులని, అనధికారులని పేర్లతో సంబోధిస్తూ, వారి సేవలని ప్రశంసిస్తూ అందరినీ కలుపుకుపోయే ఒక సమర్ధ నాయకుడిగా ప్రేక్షకులకు దర్శనం ఇచ్చారు.

ఈ కార్యక్రమం ఆసాంతం చూడని వారికి ఈ వాక్యాల్లో కొంత అతిశయోక్తి కనిపించవచ్చు. చూడకపోతే నేనూ అలాగే అనుకునేవాడిని.

బహుశా ఆయన ప్రసంగం రేపు పత్రికల్లో వివరంగా రావచ్చు. ఆయన చెప్పినవన్నీ ఇక్కడ రాయడం సాధ్యం కాని పని.

అయినా ఒక విషయంతో ముగిస్తాను.

ఆ గ్రామం సర్వతోముఖాభివృద్ధికి ఆ జిల్లా కలెక్టర్ నే ఆ వూరికి స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తున్నట్టు కేసీఆర్ ఈ సభలో ప్రకటించారు.

ఇలాంటివి ఒక్క కేసీఆర్ కే సాధ్యం. సందేహం లేదు.

తోకటపా: సుదీర్ఘ ప్రసంగ సమయంలో, ఉక్కపోతకు చేతిలో వున్న కాగితాలతో విసురుకున్నారే కానీ, అక్కడ ఎవరిమీదా విసుక్కోలేదు.

(22-06-2021)