27, జనవరి 2021, బుధవారం

థాంక్స్ చెప్పడం మినహా ఏం చేయగలను ?

థాంక్స్ చెప్పడం మినహా ఏం చేయగలను ?

నేను ఆకాశవాణి/ దూరదర్శన్ నుంచి రిటైర్ అయి అప్పుడే పదిహేను  ఏళ్ళు గడిచిపోయాయా!  నాకయితే గుర్తు లేదు. కానీ కంప్యూటర్ గుర్తు పెట్టుకుంది.

ఉద్యోగ విరమణ చేసే సమయంలో పింఛన్ మొత్తం నుంచి కొంత కమ్యుటేషన్ కింద తగ్గించి ఇస్తారు. ఓ పదిహేను ఏళ్ళ తరువాత మళ్ళీ పింఛన్ లో ఆ మొత్తం కలుపుతారు.

నేను రిటైర్ అయింది 2005 డిసెంబరు 31వ తేదీన. 2021 జనవరికి పదిహేను సంవత్సరాలు  పూర్తవుతాయి. అంటే ఆ ఏడాది జనవరి నెల పెన్షన్ లో ఈ మొత్తం కలపాలి.

పదిహేను ఏళ్ళు అంటే మాట కాదు. నిన్నా మొన్నా జరిగిన విషయాలే గుర్తుండి చావడం లేదు. మరి ఇంతకాలం అయిన తర్వాత ఈ విషయాన్ని గుర్తు చేయడానికి ఎన్ని మహజర్లు పెట్టుకొవాలో, ఎన్ని ఆఫీసుల చుట్టూ  తిరగాలో  అని అనుకున్న మాట కూడా నిజం.

ముందే చెప్పినట్టు ఈ విషయాలు ఏవీ నాకు గుర్తు లేవు, ఈరోజు ఉదయం పెన్షన్ మెసేజ్ వచ్చిన దాకా.

ఎప్పుడో అలారం పెట్టిన గడియారం ఆ సమయానికల్లా ఖచ్చితంగా అలారం కొట్టినట్టు, పదిహేను ఏళ్ళు గడవగానే పించను కార్యాలయంలోని కంప్యూటర్లు ఠంచనుగా ఈ  కమ్యుటేషన్ మొత్తాన్ని నా బ్యాంకు ఖాతాకు జత చేసాయి. ఆ  విషయాన్ని ఈరోజు ఉదయం ఆరుగంటలకల్లా ఒక ఎస్సెమ్మెస్  రూపంలో తెలియచేశాయి.

అద్భుతం అనిపించింది.

రిటైర్ అయి పని లేకుండా ఉన్న  మా బోంట్ల కోసం ఎవరో ఎక్కడో బాగానే పనిచేస్తున్నారు. వారందరికీ థాంక్స్. (27-01-2021)

 

 

  

26, జనవరి 2021, మంగళవారం

సంగీతమే ప్రాణంగా జీవిస్తున్న అన్నవరపు వారికి 'పద్మ శ్రీ'

 

"నేనూ  మారలేదు, నా ఇల్లూ  మారలేదు"

(Published in SAKSHI daily on 27-01-2021. Wednesday)

ఆలిండియా రేడియో వార్తావిభాగంలో నా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావుగారికి ఓ కన్ను వార్తలమీద, ఓ చెవి సంగీతం మీద. ఒక చెవి అని ఎందుకు అంటున్నానంటే సంగీతం అంటే చెవి కోసుకునే అభిమాని కాబట్టి.

ఓసారి బెజవాడ నుంచి మంచి నడి ఎండాకాలంలో వస్తున్న వారి అమ్మగారిని రిసీవ్ చేసుకోవడానికి సికిందరాబాదు స్టేషన్ కు వెళ్ళారు. గోల్కొండ రైలులో ఆవిడ దిగారు. అదే రైలులో ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి గారు కూడా వచ్చారు. ఆయన్ని చూడగానే కృష్ణారావు గారు వారి అమ్మగారిని ఓ సిమెంటు బెంచి మీద కూర్చోబెట్టి, ఇప్పుడే వస్తానని చెప్పి రామస్వామిగారివద్దకు వెళ్ళారు. ఆయన వయొలిన్ పెట్టె ఒక చేతిలో, మామిడి పళ్ళ బుట్ట మరో చేతిలో పట్టుకుని రైలు దిగారు. సూటు కేసు పట్టుకోవడానికి మరో చేయి లేక అటూఇటూ చూస్తుంటే కృష్ణారావు గారు ఆయన్ని పలకరించి వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లి హోటల్లో దిగబెట్టారు. ఇంతలో తల్లి గుర్తుకువచ్చి మళ్ళీ స్టేషన్ కు వెడితే ఆవిడ గాభరాగా ఈయన కోసం వెతుక్కుంటూ ఉన్నారట. అలా వుంటుంది కృష్ణారావు గారికి సంగీతం మీద అనురక్తి, సంగీతకారులు అంటే గౌరవ ప్రతిపత్తి.

రామస్వామి గారు బెజవాడ రేడియో స్టేషనులో హై గ్రేడ్ ఆర్టిస్టుగా చాలా సంవత్సరాలు పనిచేశారు. అక్కడే న్యూస్ ఎడిటర్ గా పనిచేసిన కృష్ణారావు గారికి అలా రామస్వామి గారితో పరిచయం.

1968లో హైదరాబాదు రవీంద్ర భారతిలో 150వ త్యాగరాయ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. జంట నగరాలలోని ప్రభుత్వ సంగీత కళాశాలల ప్రిన్సిపాల్స్ గా పనిచేస్తున్న శ్రీ నూకల సత్యనారాయణ, శ్రీ దంతాలే ఈ ఉత్సవాల నిర్వాహకులు. అనేక ప్రాంతాల నుంచి ఉద్దండులైన సంగీత విద్వాంసుల కచ్చేరీలు ఏర్పాటు చేశారు. వీరిలో అన్నవరపు రామస్వామి గారు కూడా వున్నారు. కచ్చేరీ సమయానికి ముందుగానే ఆయన ఓ అంబాసిడర్ కారులో రవీంద్రభారతికి చేరుకున్నారు. వయొలిన్ పెట్టె ఆయనకు ప్రాణం. దాన్ని ఎవరి చేతికీ ఇవ్వరు. స్వయంగా దాన్ని పట్టుకుని కారు దిగి డోరు వేస్తుంటే ఆయన చేతి వేలు నలిగిపోయింది. అయినా సరే బాధ ఓర్చుకుంటూ వేదిక మీదికి వెళ్లి కచ్చేరీ ప్రారంభించారు. వేలు బాగా వాచిపోయింది. కచ్చేరీ ఎలాగా అని నిర్వాహకులు కంగారు పడుతుంటే రామస్వామి గారు తన వయొలిన్ తో సభికులను ఉర్రూతలూగించారు. సంగీతం పట్ల ఆయన నిబద్ధత అలాంటిది.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి రామస్వామి గారు అనేక కచ్చేరీలలో వయొలిన్ సహకారం అందించారు. వారిద్దరినీ సంగీత అభిమానులు ‘రామకృష్ణులు’ అనేవారు.

అలాగే విజయవాడ రేడియో స్టేషనులో అన్నవరపు రామస్వామి గారు (వయోలిన్), దండమూడి రామమోహనరావు (మృదంగం) చాలా పేరుపొందిన కళాకారులు. వారికి బయట నుంచి కచ్చేరీలకు ఆహ్వానాలు వస్తుండేవి. ఆఫీసులో వీరి మీద ఆజమాయిషీ చేసే అధికారికి అది నచ్చేది కాదు. అందుకని కార్యక్రమాల జాబితా రూపొందించేటప్పుడు, బయట ప్రోగ్రాములకి వీలు కుదరకుండా వీరిద్దరికీ కలిపి రేడియోలో డ్యూటీ వేసేవారు.

మాండలిన్ శ్రీనివాస్ కి మొదట్లో ప్రోత్సాహం ఇచ్చింది రామస్వామి గారే. తన మనుమరాలిని శ్రీనివాస్ కు ఇచ్చి పెళ్లి కూడా చేశారు.

ఏలూరు సమీపంలోని సోమవరప్పాడు గ్రామంలో అతిపేద మంగళ వాయిద్య కళాకారుల కుటుంబంలో జన్మించిన అన్నవరపు రామస్వామి గారు వారాలు చేసుకుంటూ మొదట మాగంటి జగన్నాధం చౌదరి గారి వద్దా, ఆ తరువాత పారుపల్లి వారి వద్దా శిష్యరికం చేసి వయొలిన్ వాయిద్యంలో మెళకువలు అభ్యసించారు. వారి సోదరులు అన్నవరపు గోపాలం గారు కూడా ఘటం విద్వాంసులుగా ఆకాశవాణిలో పనిచేశారు. తండ్రి పెంటయ్య గారు సోమవరప్పాడు గ్రామంలో నాదస్వర కళాకారుడు.

కృష్ణారావు గారు ఒకసారి, బహుశా రెండు మూడేళ్ల క్రితం కాబోలు, విజయవాడ వెడుతూ రామస్వామి గారికి ఫోన్ చేసి ‘మీ ఇల్లు సూర్యారావు పేటలోనేనా, మారారా’ అని అడిగారుట. ‘నేనూ మారలేదు, ఇల్లూ మారలేదు’ అనేది అన్నవరపువారి జవాబు.

కృష్ణారావు గారు వెళ్ళే సరికి ఆ వీధివీధంతా బహుళ అంతస్తుల భవనాలతో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. వెతుక్కుంటూ వెడితే రామస్వామి గారు ఇల్లు కనపడింది. ఆ ఒక్క ఇల్లే ఆ వీధిలో ఎలాంటి మార్పు లేకుండా అలాగే వుంది. వీధి గుమ్మానికి ఒక పక్కన గుండ్రటి అక్షరాలతో ‘అన్నవరపు రామస్వామి’ అనీ, మరో వైపు ‘రామకృష్ణ నిలయం’ అని రాసి వున్న బోర్డులు కూడా ఎలాంటి మార్పు లేకుండా వున్నాయి. ఎప్పుడో యాభయ్ ఏళ్ళ క్రితం సాదా సీదాగా కట్టుకున్న ఆ ఇంటికి తన గురువుగారయిన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి పేరు పెట్టుకున్నారు.

పారుపల్లి వారు త్యాగరాయ గురు శిష్య పరంపరలోని వారు. ‘సంగీతాన్ని నమ్ముకోండి, అమ్ముకోకండి’ అనే త్యాగరాజు గారి బోధనలను వంటబట్టించుకున్నవారు.

అందుకే, రామస్వామి గారు కూడా వందలాదిమంది శిష్యులను తయారు చేసినప్పటికీ, తన గురువు గారి అడుగుజాడల్లోనే నడుస్తూ ఏనాడు ఎవరినుంచీ గురుదక్షిణ తీసుకోకుండా సంగీత సేవ చేస్తున్నారు.

రేడియో స్టేషన్లో ఉద్యోగం చేసేటప్పుడు ఆయన ప్రతిరోజూ సైకిల్ మీదనే వచ్చేవారు. గోచి పోసిన పంచె లాల్చీ ఆయన ఆహార్యం.

సంగీతం అంటే ప్రాణం పెడుతూ, సంగీతమే సర్వస్వంగా భావిస్తూ, సంగీత సేవ చేస్తూ వస్తున్న తొంభయ్ అయిదేళ్ళ అన్నవరపు రామస్వామి గారిని గుర్తించి భారత ప్రభుత్వం ఈ ఏడాది పద్మ శ్రీ పురస్కారం ప్రకటించడం ముదావహం. (26-01-2021


Clipping of Sakshi Telugu Daily - Telangana




22, జనవరి 2021, శుక్రవారం

నాడు అయోధ్యలో ఏం జరిగింది?

 

 


విప్లవ తపస్వి పీవీ సమీక్ష : పదో భాగం  

రచన: శ్రీ ఏ. కృష్ణారావు : సమీక్ష : భండారు శ్రీనివాసరావు

మాజీ  ప్రధాని పీవీ నరసింహారావు గురించి రాసేవారు ఎంత చేయి తిరిగిన రచయిత అయినప్పటికీ పీవీ జీవితంలో ప్రధాన అధ్యాయంగా మారిన ‘అయోధ్య కాండ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు, ఒకింత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడం ఖాయం. వున్నది ఉన్నట్టుగా రాసినా, లేనిది ఉన్నట్టుగా రాసినా చదివేవారి మనస్తత్వాన్ని బట్టి మార్కులు పడతాయి. అటు  పొగడ్తలకు, ఇటు తెగడ్తలకు  సిద్ధపడి వుండాలి. ఎందుకంటే  ఈ అంశం ఒక్క  రాజకీయంతో కలగలిసినది మాత్రమే  కాదు, మరో పక్క మతంతో ముడిపడిన విషయం కూడా  కావడమే ఇందుకు ప్రధాన కారణం.

రచయిత, అందులోను ఒక పత్రికారచయిత,  చదివేవారు ఏమనుకుంటారో అనే కోణం నుంచి ఆలోచించి  రాస్తారు అని నేను అనుకోను. కానీ ఆధునిక  భారతీయ చరిత్రలో జరిగిన ఒక చారిత్రక సంఘటన గురించి రాసేటప్పుడు  నిజమైన పత్రికారచయిత కొంత సంయమనం పాటించే తీరాలి. అది పత్రికా రచయిత నైతిక ధర్మం కూడా. అఖిల సమాజ శ్రేయస్సు దృష్ట్యా  కొన్ని సందర్భాలలో  ఇది అత్యంత ఆవశ్యకం.

అయోధ్య సంఘటన ఎప్పుడో క్రీస్తుకు పూర్వం జరిగింది కాదు, ఆ నాటి విషయాలు అన్నీ ఇప్పటి కాలంలో చాలామందికి తెలిసిన విషయాలే. అయినాసరే, మాట పడకుండా, అదే సమయంలో మొహమాట పడకుండా వాస్తవాలు  కాగితం మీద పెట్టడం అనేది కత్తి మీది సామే! ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ  రాజకీయ వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. ఆనాటి పరిస్థితులను గమనంలో పెట్టుకోకపోతే, ఈనాడు చదివే అంశాలు  అపార్థాలకు దారితీసే ప్రమాదం కూడా వుంది.  మరీ ముఖ్యంగా  నవతరం పాఠకులు  అంటే నాడు అయోధ్యలో ఏమి జరిగింది అనే విషయంపై  కర్ణాకర్ణిగా వినడం తప్పిస్తే లోతులకు వెళ్లి  పరిశీలించే అవకాశం లేని నేటి తరానికి కొన్ని వాస్తవాలు చేదుగా అనిపించవచ్చు. అసలు ఈ కారణంతోనే ఈ అంశాన్ని నేను  ఈ పుస్తక  సమీక్షలో చివరి అధ్యాయంగా ఎంచుకోవడం జరిగింది.

రచయిత కృష్ణారావు  కూడా బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన ‘ప్రత్యక్ష సాక్షి’ కధనం రాసేటప్పుడు తన మనసులోని మాటను ఇలా  పేర్కొన్నారు.

“ఒక అసాధారణ సంఘటనను ప్రత్యక్షంగా చూడడం, దాన్ని గురించి రాయడం అదే మొదటిసారి. నా ఆలోచనా ధోరణి, నా భావజాలం, నా అభిప్రాయాలు ఏవైనా, వృత్తికి సంబంధించి రాసే వార్తల్లో అవి చొరబడకూడదని భావించేవారిలో నేనొకడిని

దీన్నిబట్టి నాటి అయోధ్య సంగతులను ఒక జర్నలిస్టుగా రికార్డు చేయడానికి ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నారో అర్ధం అవుతుంది. ఎందుకంటే  ముందే చెప్పినట్టు ఇది రాజకీయాలతో, మతాలతో ముడిపడిన సున్నితమైన అంశం కనుక.

ఇది రాస్తూ వుండగా ఒక ఫోన్ వచ్చింది.

కొత్త నెంబరు. ఆయన పరిచయం చేసుకున్నారు. ఈ పుస్తకం పబ్లిషర్.

“ఏమండీ మీరిలా పుస్తకం మొత్తం రివ్యూ పేరుతో యధాతధంగా రాస్తూ పొతే ఎలాండీ. కాస్త మా విషయం కూడా ఆలోచించండి” అన్నారు చాలా సౌమ్యంగా, ఇంకా చాలా మర్యాదగా.

“ఏమైనా మీకు నా థాంక్స్. మేము పబ్లిష్ చేసిన మరికొన్ని పుస్తకాలు మీకు పంపుదామని అనుకుంటున్నాను. మీ అడ్రసు చెబుతారా!” అన్నారు అవతలనుంచి  శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్ రాఘవేంద్రరావు గారు.

నాకు అందులో అపహాస్యం ఏమీ కనిపించలేదు, అభిమానం తప్పిస్తే.

పుస్తకాలు ప్రచురించడంలో ఉన్న సాధక బాధకాలు తెలిసిన వాడిని కనుక, సున్నితంగా, పరోక్షంగా రాఘవేంద్రరావు గారు చేసిన అభ్యర్ధనని కాదనలేక ఈ సమీక్షని ఇంతటితో ముగిస్తున్నాను.

రచయితకి క్షమాపణలతో, ప్రచురణ కర్తలకి కృతజ్ఞతతో ...భండారు శ్రీనివాసరావు        

19, జనవరి 2021, మంగళవారం

పీవీ హయాంలోనే వైఎస్ కి తప్పిపోయిన సీఎం ఛాన్స్

 విప్లవ తపస్వి పీవీ : రచన : శ్రీ ఏ. కృష్ణారావు    

సమీక్ష తొమ్మిదో భాగం : భండారు శ్రీనివాసరావు

 

“ఏం సార్! కోట్ల బదులు వైఎస్ ని ముఖ్యమంత్రిని చేసుంటే బాగుండేది కదా! ఆంధ్రప్రదేశ్ లో కూడా మిమ్మల్ని గెలిపించేవారు కదా!”

పీవీ ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పుకున్న తరువాత రచయిత కృష్ణారావు మాజీ ప్రధాని పీవీని అడిగారు.

“వైఎస్ కు నాయకత్వ లక్షణాలు ఉన్నమాట నిజమే! కానీ కోట్ల నామీద పూర్తి ఒత్తిడి తెచ్చారు” అని పీవీ బదులిచ్చారు.

అంతే కాదు, మరో మాట అన్నారు, ‘మీడియా కూడా కోట్లకు ఉపయోగపడింది’ అని.

ఆ మాట వినేసరికి నేను దిగ్భ్రాంతి చెందాను అని కృష్ణారావు రాసుకున్నారు. ఎందుకంటే పీవీ ప్రస్తావించిన మీడియాలో ఆయన కూడా భాగం కనుక.

ఈవిషయమై రచయిత ఇంకా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

“నీవు తరచూ కోట్లని కలుస్తూ వుండు. ఆయన చెప్పిందిరాయి...” అని ఉదయం దినపత్రికలో మా చైర్మన్ మాగుంట సుబ్బిరామిరెడ్డి చెప్పేవారు. కోట్ల అప్పుడు కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా వుండేవారు.

“కోట్లని కలిసినప్పుడు తనపై బాగా ఒత్తిడి వస్తోందని, పార్టీ నేతలంతా తానే  ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని చెప్పేవారు. దీనితో నేను ‘కోట్లపై పెరుగుతున్న ఒత్తిడి అని వార్త రాస్తే దాన్ని ఉదయంలో పతాక శీర్షికలో ప్రచురించారు. ఆ వార్తను కోట్ల విజయభాస్కరరెడ్డి  ప్రధాని పీవీకి చూపించి ప్రభావితం చేశారని అంటారు.

“నిజానికి ఆ సమయంలో యువనేత అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి తనను ముఖ్యమంత్రి చేస్తారు అనే నమ్మకంతో వుండేవారు. ద్రోణంరాజు సత్యనారాయణ, కొణతాల రామకృష్ణ, కణితి విశ్వనాధం వైఎస్ కు మద్దతు.

“ఒక దశలో ప్రధాని పీవీ,  వైఎస్ కు అనుకూలం అన్నట్టు సంకేతాలు అందాయి. ఒకరోజు ఆయన పీవీని కలిసి సంతోషంగా తన నివాసానికి తిరిగివచ్చారు. నేను వైఎస్ కు ఎదురుపడి, ఏం జరిగిందని అడిగాను. ’పరిస్తితులు తనకు అనుకూలంగా వున్నాయని, తాను దాదాపు సీ ఎం అయినట్టే’ అని సంతోషంగా చెప్పారు.

“అయితే తర్వాత  పరిస్థితి మారిపోయింది. కోట్ల, నేదురుమల్లి వర్గాలు ఏకమయ్యాయి. ఎమ్మెల్యేలలో అత్యధికులు వైఎస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.

“ఒక రోజు వైఎస్ ఢిల్లీ వచ్చారని తెలిసి ఫోన్ చేశాను. ఆయన ‘చెప్పు కృష్ణారావ్’ అన్నారు. పీసీసీ మార్పు గురించి అడిగాను. ‘నన్నెందుకు అడుగుతావయ్యా! ఆ లంబూని (ఆరడుగులవాడు) అడుగు అని కోట్లని పరోక్షంగా విమర్శించారు.

‘ఆరడుగులవాడినే అడగండి అని హెడ్డింగ్ పెట్టి వైఎస్ అన్న మాటలు గురించి రాశాను. ఇది కోట్ల, వైఎస్ నడుమ మరింత ఘర్షణకు దారి తీసింది. ఆ వార్త రాసినందుకు వైఎస్ కు నా మీద ఆగ్రహం కలిగినట్టు తెలిసింది. ‘నువ్వు వైఎస్ కి కొన్ని రోజులు కనపడకపోవడమే మంచిది అని ద్రోణంరాజు నాకు సలహా ఇచ్చారు కూడా.

“ఒకరోజు నేను ద్రోణంరాజు సత్యనారాయణతో మాట్లాడుతున్న  సమయంలో వైఎస్  ధవళ వస్త్రధారి అయి పెళ పెళలాడుతూ వచ్చారు. ఆయన రాక గమనిస్తూనే ద్రోణం నా భుజం పై చేయి వేశారు. ద్రోణంతో  నాకు సాన్నిహిత్యం వుందని తెలిసి వైఎస్ మెత్తపడ్డారు. అయినా, ‘ఏం కృష్ణారావ్ ఏమిటా వార్త అలా రాయొచ్చా’ అని ఆగ్రహంగా అడిగారు. ‘నీవు హీరోవి రాజా! చూడు ! ఆ వార్త నీకెంత ప్రాధాన్యత పెంచిందో అని ద్రోణంరాజు నన్ను సమర్థించారు. ‘చరిత్రలో కొన్ని రికార్డు చేయడం అవసరం అని నేను అనేసరికి వైఎస్ గట్టిగా నవ్వేసారు.

(ఇంకావుంది)                   

 

18, జనవరి 2021, సోమవారం

పీవీ కోసం తీహార్ జైల్లో నెంబర్ వన్ గది సిద్ధం : సమీక్ష ఎనిమిదో భాగం

 పీవీ కోసం తీహార్ జైల్లో నెంబర్ వన్ గది సిద్ధం చేసిన అధికార్లు! 

విప్లవ తపస్వి పీవీ  సమీక్ష ఎనిమిదో భాగం 

పుస్తక రచన : శ్రీ ఏ. కృష్ణారావు : సమీక్ష : భండారు శ్రీనివాసరావు


ఎన్నికల్లో పరాజయం దరిమిలా  ప్రధాన మంత్రి పదవికి పీవీ రాజీనామా చేసిన రెండు వారాలకు రవీంద్ర కుమార్ చేసిన పిటిషన్ ఆధారంగా  1996 మే 24న ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయమని ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించడంతో పీవీని ఏ వన్ గా పేర్కొంటూ సీ బి ఐ నిందితులపై దశల వారీగా చార్జ్  షీట్లు దాఖలు చేస్తూ  పోయింది. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా నలుగురు జే ఎం ఎం ఎంపీలకి కోట్లాది రూపాయలు చెల్లించారని ఆరోపించింది.

2000 సెప్టెంబర్ 29 వ తేదీన పీవీ, బూటా సింగ్ లకు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజిత్ బరహోఖ్ చారిత్రాత్మక తీర్పు వెలువరించారు. నేరపూరిత కుట్ర, అధికార దుర్వినియోగాలకు పాల్పడ్డారని జడ్జి తీర్మానించారు.

79 సంవత్సరాల పీవీని జైలుకు తరలిస్తారని సంచలనాత్మక వార్తా కధనాలు ప్రచురించారు. తీహార్ జైలులో నెంబరు వన్ జైలులో ఏర్పాట్లను కూడా చేసినట్టు అధికారులు చెప్పారు. పీవీ కటకటాల వెనుక వున్నట్టు ఒక పత్రికలో  ఫోటో కూడా ప్రచురించారు. 

కింది కోర్టు తీర్పును పీవీ సవాలు చేస్తూ అప్పీల్ చేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఆర్.ఎస్.సోధి కింది కోర్టు తీర్పును కొట్టేసి పీవీ, బూటా సింగ్ లకు కేసు నుంచి విముక్తి కలిగించారు.

పీవీ కేసుల గురించిన ప్రస్తావనలో రచయిత కృష్ణా రావు సీ.బి.ఐ. గురించి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

“సీ.బి.ఐ. చాలా కుట్రలు, కుహకాలు, వ్యూహ, ప్రతివ్యూహాలతో కూడిన సంస్థ. ఉత్తరాదివారయితే ఇలాంటి కేసుల్లో తిమ్మిని బమ్మి చేయగలరు. ఢిల్లీ పోలీసులతోను, న్యాయమూర్తులతోను వారికి సంబంధాలు వుంటాయి. సీ.బి.ఐ. డైరెక్టర్ విజయరామారావుకు ఆ మాయాజాలాలు అంతగా తెలియవు. సుప్రీం ఆదేశాలతో ఆయనకు ఏమి చేయాలో పాలుపోలేదు. ‘ఒక పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ చేయగలిగిన పని కూడా సీ.బి.ఐ. చేయడం లేదు’ అని ఒకసారి వ్యాఖ్యానించింది.

జైన్ హవాలా కేసుల్లో వివిధ పార్టీల నేతల పేర్లు బయటకు రావడంతో పీవీ రాజకీయ పరమైన ఒత్తిడికి గురయ్యారు. బీజేపీ  నాయకుడు ఎల్.కె. అద్వాని తనను నిర్దోషిగా ప్రకటించేవరకు సభలో అడుగు పెట్టాను అని ప్రకటించి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శరద యాదవ్ కూడా సభ్యత్వం ఒదులు కొన్నారు. యశ్వంత్ సిన్హా బీహారు శాసన సభకు రాజీనామా చేశారు.

ఈ కేసు వల్ల జరిగే రాజకీయ నష్టం గమనించి పీవీ అనేకసార్లు విజయరామారావుతో మాట్లాడారు. కానీ కోర్టు వెంటపడుతోందని అంటూ విజయరామారావు తన నిస్సహాయత వ్యక్తం చేశారు. ఒకరోజు కాంగ్రెస్ నేత బలరాం జాఖడ్ తెలుగు మీడియాను చూసి ‘ ఆప్ కా రావ్ బర్ బాద్ కర్ దియా. హం సబ్ కో జైల్ బిజ్వానే కా కోషిష్ కియా’ ( మీ రావు మమ్మల్ని దుంప తెంచారు. మమ్మల్ని జైలుకు పంపించే ప్రయత్నం చేశారు) అని వ్యాఖ్యానించారు.  

జైన్ హవాలా కేసు దరిమిలా ప్రజాప్రయోజనాల వ్యాజ్యాల ద్వారా ఎవరినైనా బజారుకు ఈడ్వవచ్చు అన్న అన్న సంగతి తెలిసిందని రచయిత అభిప్రాయ పడ్డారు.      

కోర్టులు కేసులు నుంచి గట్టెక్కడానికి, ప్రధాని పదవిని కాపాడుకోవడానికి పూజలు చేయించాలని పీవీ మీడియా సలహాదారు పీవీఆర్ కె ప్రసాద్ సూచిస్తే పీవీ పెద్దగా నవ్వారు. ‘నాకు ప్రధాన మంత్రి పదవి ఏ పూజలు చేస్తే వచ్చిందయ్యా ? పోయే రోజు వస్తే పూజలు చేస్తే ఆగుతుందా?” అని పీవీ అన్నట్టు పీవీఆర్ కె ప్రసాద్ తన పుస్తకం ‘అసలేం జరిగిందంటే’ లో రాయడం గమనార్హం. పూజలు, యాగాలు, హోమాలు ఎన్నో చేయించి కూడా ఇందిరా గాంధి ఓడిపోయిన విషయాన్ని పీవీఆర్ కేకు గుర్తు చేశారు. 

పీవీ పూజలు చేసేవారు కాదని ఆయన సోదరుడు మనోహరరావు చెప్పారు. అయితే ఆధ్యాత్మికత మాత్రం ఆయనలో ఉండేదని ఆయన అన్నారు. కనీసం బయటకు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుని వెళ్ళిన సందర్భాలు కూడా లేవు. అయితే పూజలు, పునస్కారాలను ఆయన ఎప్పుడూ విమర్సించలేదని మనోహరరావు పేర్కొన్నారు. చంద్రస్వామితో సన్నిహిత పరిచయం ఉన్నప్పటికీ ఆయనతో ఎన్నడూ పీవీ పూజలు, యజ్ఞాలు చేయించిన దాఖలాలు లేవు. 

(ఇంకా వుంది)

విప్లవ తపస్వి పీవీ సమీక్ష ఏడో భాగం

 రాజకీయుల కోసం కోర్టుల్లో  రిట్లు వేసేవాళ్ళు రెడీగా వుంటారు   

విప్లవ తపస్వి పీవీ  సమీక్ష ఏడో భాగం 

పుస్తక రచన : శ్రీ ఏ. కృష్ణారావు : సమీక్ష : భండారు శ్రీనివాసరావు

“కాలం ఉనికిని ఏర్పాటు చేస్తుంది. కాలమే దాన్ని ధ్వంసం చేస్తుంది”

1996 జులై  9 వ తేదీన లఖూ బాయ్ పాథక్ కేసులో పీవీకి సమన్లు పంపుతూ న్యూ ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రేమ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇవి.

ఆ రోజున ఆయన  ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేసారో తెలియదు కానీ, పీవీపై కేసులు కాలమే సృష్టించింది. మళ్ళీ ఆ కాలమే ఆ కేసులను తుత్తునియలు చేసింది.

“లఖూ బాయ్ పాథక్ సాక్ష్యంలో ఎన్నో తప్పుడుతడకలు వున్నాయి. దాన్ని నమ్మలేము.” అని 2003లో కోర్టు కొట్టివేసి పీవీని నిర్దోషిగా ప్రకటించింది. కాంగ్రెస్ నేతలు కనీసం ఆయనకు అభినందనలు కూడా తెలపడానికి ముందుకు రాలేదని కృష్ణారావు తన పుస్తకంలో రాశారు.

అంతకు ముందే సెయింట్ కిట్స్ కేసులో కూడా పీవీ నిర్దోషిగా బయట పడ్డారు.

పీవీకి శిక్ష పడిన జే.ఎం.ఎం ముడుపుల కేసు పూర్తిగా రాజకీయమైనది. 1993 లో పీవీ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షలో గట్టెక్కేందుకు ముడుపులు చెల్లించారనే ఆరోపణలపై  1996 ఫిబ్రవరి  22 వ తేదీన రాష్ట్రీయ ముక్తి మోర్చా అనే సంస్థ  తరపున రవీంద్ర కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అవిశ్వాస పరీక్ష జరిగిన మూడేళ్ల తర్వాత, సరిగ్గా ఎన్నికలకు ముందు అతడు పిటిషన్ దాఖలు చేయడం వెనుక మతలబు లేకపోలేదు. 

ఢిల్లీలో రాజకీయ పార్టీలు వేసే ఎత్తులు పై ఎత్తులకు అనుగుణంగా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసే ఎన్జీవోలు, రవీంద్ర కుమార్ లాంటి వ్యక్తులు ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. ఎంపీల బంగాళాల గేరేజీల్లో, మారుమూల గల్లీల్లోని కార్యకర్తల ఇళ్ళల్లో వీరి అడ్రసులు వుంటాయి. పీవీకి కోటి రూపాయలు ఇచ్చాను అని హర్షద్ మెహతా చేసిన ఆరోపణలపై తక్షణం విచారణ జరపాలని  1993లో జన హిత్ అభియాన్ అనే ఎన్జీవో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. 

“న్యాయ వ్యవస్థ పనిచేసే తీరు ఎలా రాజకీయమయం అయిందో దేశం గమనిస్తోంది” అని వ్యాఖ్యానిస్తూ సుప్రీం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎం. వెంకటాచలయ్య ఈ పిటిషన్ ను వెంటనే వినేందుకు నిరాకరించారు.

(ఇంకా వుంది)

17, జనవరి 2021, ఆదివారం

డ్రెస్ మార్చుకుని రా! మంత్రిగా ప్రమాణం చేద్దువుగానీ!

  

విప్లవ తపస్వి పీవీ – రచన : శ్రీ ఏ.కృష్ణారావు 

సమీక్ష (ఆరో భాగం)- భండారు శ్రీనివాసరావు 

ఆర్ధిక సంస్కరణల అమల్లో పీవీకి నమ్మకంగా తోడ్పడిన మన్మోహన్ సింగ్ తదనంతర రాజకీయ పరిణామాల్లో, పీవీ శకం ముగిసిన చాలా కాలం తర్వాత భారత దేశానికి ప్రధాని అయ్యారు. పీవీకి మొదట్లో  స్టాప్ గ్యాప్ ప్రధాన మంత్రి అనే పేరు వచ్చినట్టే, మన్మోహన్ సింగ్ కి  కూడా తాను ప్రధానమంత్రిని అవడం అనేది చాలా యాదృచ్చికంగా జరిగిందనే అభిప్రాయం వుండేది.

మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని అయిన తర్వాత ‘Changing India’ అనే గ్రంధం రాశారు. ఆ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనే ఈ విషయం వెల్లడించారు.

‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా వున్నప్పుడు ప్రధానమంత్రి పీవీ నుంచి ఫోన్ వచ్చింది. ‘ఎక్కడున్నారని అడిగితే ఆఫీసులో’ అని జవాబిచ్చాను. ‘అలెగ్జా౦డర్ చెప్పలేదా?’ అని పీవీ ఆరా తీస్తే, ‘చెప్పారు. కానీ నేను అంత సీరియస్ గా తీసుకోలేదని బదులిచ్చాను. 

‘లేదు. నిజంగా సీరియస్సే. నువ్వు వెంటనే వెళ్లి డ్రెస్ మార్చుకుని ప్రమాణ స్వీకారానికి రా!’ అని పీవీ ఆదేశించారు. 

‘ఆ రకంగా నేను యాదృచ్చికంగా ఆర్ధిక మంత్రిని అయ్యాను’ అని మన్మోహన్ సింగ్ చెప్పేసరికి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లోని సభా ప్రాంగణం నవ్వులతో మార్మోగిపోయింది అని రాసారు ఈ పుస్తక  రచయిత కృష్ణారావు.

ఆర్ధిక సంస్కరణలను అమలు చేసే విషయంలో తనకు ప్రధాని పీవీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెబుతూ, ‘బడ్జెట్ ప్రవేశపెట్టాల్సివచ్చినప్పుడల్లా నేను నార్త్ బ్లాక్ కి (ప్రధానమంత్రి కార్యాలయం) వెళ్ళాల్సిన అవసరం వుండేది కాదని మన్మోహన్ సింగ్ ఒక సందర్భంలో చెప్పారు.

నిజానికి ఎగుమతి సబ్సిడీ రద్దు చేయడానికి వాణిజ్యమంత్రిగా వున్న చిదంబరం వెనుకాడారు. ఎగుమతులను ప్రోత్సహించాలంటే సబ్సిడీ తప్పదనే పాత కాలం ఆలోచనలతో ఉన్న చిదంబరం తటపటాయించడంతో మన్మోహన్ సింగ్ ఆయనకు గట్టిగా చెప్పారు. ‘త్వరగా నిర్ణయించండి, రేపటికల్లా ప్రకటించాలని ప్రధాని చెప్పారు’ అనడంతో చిదంబరం ఆశ్చర్యపోయి సాయంత్రానికల్లా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

1991 జులై  13న లోకసభలో విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగడానికి ముందు ప్రధాని పీవీ నరసింహారావు తన సంస్కరణలను బలంగా సమర్ధించుకున్నారు. ప్రసంగపాఠాన్ని పక్కనపెట్టి నలభయ్ అయిదు నిమిషాల పాటు అనర్ఘలంగా ప్రసంగించారు.

‘సర్వనాశే సముత్పన్నే అర్ధం త్యజిత పండితా’ (సర్వం నాశనం అవుతున్న తరుణంలో వివేకవంతులు కొంత త్యాగం చేసి మిగతాది నాశనం కాకుండా కాపాడుకుంటారు) అని లోకసభ సాక్షిగా దేశ ప్రజలకు స్పష్టం చేశారు.

వ్యవసాయం గురించి మాట్లాడినప్పుడల్లా పీవీలో రైతు నేపధ్యం స్పష్టంగా కనపడేది.

వ్యవసాయానికి సంబంధించి ప్రయోగాలు చేసి ప్రమాదాలను ఆహ్వానించ కూడదు అని ఆయన చెబుతుండేవారు.

‘దయచేసి పేద ప్రజలతో ప్రయోగాలు చేయకండి’ అని అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనపై 1994లో జరిగిన సంప్రదింపుల కమిటీ సమావేశంలో పీవీ కోరారు.

‘నా గ్రామంలో నా భూమిలో ప్రతి సర్వే నెంబరు గురించి నన్ను అడగండి. ఏ పరిస్థితుల్లో అది పండుతుందో, ఏ పరిస్థితుల్లో అది పండేందుకు నిరాకరిస్తుందో నేను చూశాను. అది కేవలం మట్టి నేలే కదా, దానితో మీరేమి చేసినా పండుతుంది అని అనుకోకండి. ఫ్యాక్టరీలో ఉత్పత్తి జరిగినట్టు జరుగుతుందని అనుకోకండి. దానికి ప్రాణం వున్నది. దాన్ని పసిపాపలా చూసుకోవాలి. అమ్మలా దాన్ని కాపాడుకోవాలి’ అని పీవీ చెప్పారు.

చరిత్రలో ఒక్కో వ్యక్తి అవసరం ఒక్కో రకంగా వుంటుంది. దేశంలోని ఆర్ధిక, సామాజిక పరిస్థితులను సమూలంగా మార్చేందుకు ప్రయత్నించిన పీవీ నరసింహారావు చారిత్రక పాత్రను కూడా ఇదే విధంగా అవగాహన చేసుకోవాలని ఈ పుస్తక రచయిత కృష్ణారావు అభిప్రాయపడ్డారు.

(ఇంకా వుంది)