9, ఆగస్టు 2017, బుధవారం

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (5) -


ఆడ వాళ్ళ ప్రయాణాలకి మా ఇంట్లో ఒక మేనా వుండేది.  నేను హైస్కూలు చదువు చదివే రోజుల్లో కూడా ఇంటి మధ్య హాల్లో ఆ మేనాను మోకులు కట్టి పైన రెండు దూలాల మధ్య వేలాడదీసి ఉంచేవాళ్ళు. దాన్ని మోయడానికి ఆరుగురు బోయీలు. పరిస్తితుల ప్రాబల్యం వల్ల మేనా వైభోగం అటక ఎక్కింది. ఆ  తరువాత చాలా కాలం వరకూ  పంటలు రాగానే వాళ్లకు ‘మేర’ (ధాన్యం వాటా) ఇవ్వడం కూడా నాకు గుర్తుంది. మేనా రోజులు అయిపోయిన తరువాత ఇంట్లో ఆడవాళ్ళు ఊళ్లకు పోవడానికి గుడిసె బండ్లు కట్టేవాళ్ళు. ఒక్క మగవాళ్ళ ప్రయాణాలకే అయితే గుడిసె కట్టకుండా కేవలం జల్ల బండ్లు మాత్రమే కట్టేవాళ్ళు. మా ఇంట్లో రాముడు భీముడు అని ఒక ఎడ్ల జత వుండేది. కాడి మెడ మీద పడగానే వాటికి ఎక్కడ లేని హుషారు. అవి లాగే బండి ఎక్కడానికి మేము పోటీలు పడేవాళ్ళం. బండి తొట్లో కూర్చుని, తోకలు మెలిపెడుతూ, చర్నాకోలతో ఎడ్లను అదిలిస్తుంటే అవి పరుగు మొదలు పెట్టేవి. వాటి మెడపట్టెలలో గంటలు మోగుతుంటే అదో తమాషాగా అనిపించేది. బండి నడిపే మనిషి వాటితో ఏవేవో మాట్లాడుతుండేవాడు. ఆ భాష వాటికి అర్ధం అవుతున్నట్టే అనిపించేది. ఒక ఈడు వచ్చిన తరువాత మేము రైలుకు పోవాలంటే మోటమర్రికి, బస్సు ఎక్కాలంటే పెనుగంచిప్రోలుకు మూడు, నాలుగు మైళ్ళు నడిచే వెళ్ళే వాళ్ళం. అలాగే పొరుగూరు వత్సవాయి టూరింగు టాకీసులో సినిమా చూడడానికి కూడా చాలామందిమి కలిసి కాళ్ళకు పనిచేప్పేవాళ్ళం. ఆ సినిమాల్లో రెండు మూడు ఇంటర్వెల్స్ ఉండేవి. పైన డేరా చిరుగులు పడి ఆకాశం కనిపిస్తూ వుండేది. హాలు బైట పెట్టిన మైకు మాత్రం గట్టిగా పనిచేసేది. సినిమాకు ముందు వేసే ‘నమో వెంకటేశా పాటలు చాలా దూరం వినిపించేవి. అవి వినపడడం లేదు అంటే సినిమా మొదలు పెట్టారని అర్ధం.
పొద్దున్నే చద్దన్నం మరో సుమధుర జ్ఞాపకం.
ఇంట్లో పదిమంది పిల్లలం కాక మరో పదిహేనుమంది దాకా పెద్దవాళ్ళు వుండేవాళ్ళు. అంత పెద్ద కుటుంబాన్ని నెట్టుకురావడం మా తాతగారికి అలవిమాలిన పని. ప్రతిపూటా కూరా నారా అంటే కుదరని పని. అందుకే, పిల్లలందరికీ పొద్దున్నే చద్దన్నం పెట్టేవాళ్ళు. అదే మా బ్రేక్ ఫాస్ట్. రాత్రిళ్ళు తినగా  మిగిలిన అన్నంలో ఆవకాయ కలిపి, పిల్లలందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని, ఒకరి తరవాత మరొకరికి వొంతులవారీగా ముద్దలు తినిపించేవాళ్ళు. పిల్లలకు విడిగా అన్నం పళ్ళాలు వుండేవి కాదు. పెరుగన్నంతో పిల్లల కడుపునిండి పోయేది.
పొద్దుటిపూట పెద్దవాళ్లకయితే జాంబెడు (పెద్ద గ్లాసు) కాఫీ లేదా చెంబెడు తేట మజ్జిగ.
ఇంటి వెనుకనే శివాలయం.
కార్తీక మాసం నెల రోజులూ  చీకటి పడుతుండగానే గుడి ఆవరణలోవున్న ధ్వజస్తంభానికి ఆకాశదీపం వేలాడదీసేవాళ్ళు.  ఆకాశదీపం అంటే  – చిన్న చిన్న కంతలు కలిగిన మూత వుండే ఒక రకం దీపం. లోపల ప్రమిదెలోనూనె పోసి  వొత్తి  వెలిగించి దానిని ఈ ఆకాశదీపంలో వుంచేవారు. చీకట్లో అంత ఎత్తున  ధ్వజస్తంభం నుంచి వేలాడుతూ - చిరు కాంతులు వెదజల్లుతూ మా పిల్లలందరికీ అది నిజంగా  ఆకాశంలో వెలిగే దీపంలాగానే అనిపించేది.

పొరుగున పెనుగంచి ప్రోలులో తిరుపతమ్మ తిరుణాల జరుగుతుంటే ఆ సంబరం ఛాయలు మా వూళ్ళో కనిపించేవి. రంగు కాగితాలతో రకరకాల ప్రభలు తయారు చేసి వాటిని బండ్లపై అమర్చేవారు. వాటికి కట్టే ఎడ్లను కూడా అందంగా అలంకరించేవారు. వాటిపై బుక్కా గులాములు చల్లేవాళ్ళు. మేళ తాళాలతో ఊరేగిస్తూ ప్రభలను పెనుగంచి ప్రోలు తీసుకువెళ్ళి ఏటి ఒడ్డున వున్న తిరుపతమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయించేవాళ్ళు. మొక్కుబళ్ళు తీర్చేవాళ్ళు. గుడి పక్కన ఎత్తైన  పెద్ద ఇనుప ప్రభ వుంది. కరెంటు రాకముందు ఆ ప్రభను ఊళ్ళో తిప్పేవారట. తీగెలు అడ్డం వస్తాయని ఆ ప్రభను కదలకుండా గుడి పక్కనే వుంచేసారు.  తిరుపతమ్మకు ఏటా రెండు తిరుణాళ్ళు జరిగేవి. ఒకటి పెద్ద తిరుణాల. రెండోది చిన్న తిరుణాల. అదేమి చిత్రమో పెద్ద తిరుణాల జరిగిన సంగతే ఎవరికీ తెలిసేది కాదు. అదే చిన్న తిరుణాల చాలా అట్టహాసంగా జరిగేది. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలియదు. చిన్న తిరుణాల జరిగినన్నాళ్ళు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో పండగ వాతావరణమే. పెనుగంచి ప్రోలు మీద జనం ఎగబడేవారు. ఊరుమీద ఊరు పడ్డట్టు వుండేది. ఆ వూళ్ళో మా బావగారి ఇల్లు తిరుణాలకు వచ్చిన చుట్టపక్కాలతో నిండి పోయేది. తిరుణాల లేని రోజుల్లో ఏడాది పొడుగునా ఆ దేవాలయ ప్రదేశం నిర్మానుష్యంగా వుండేది. అలాటిది గత కొన్నేళ్లుగా ఆ గుడి ప్రభలు జగజ్జేయమానంగా వెలిగిపోతున్నాయి. అక్కడ వాతావరణమే పూర్తిగా మారిపోయింది. మొన్నీ మధ్య మా మేనల్లుడు రామచంద్రం ఆ వూరు వెళ్లి వచ్చి చెప్పాడు, ‘వెనక ఏడాదికి రెండు తిరుణాళ్ళే. ఇప్పుడు ఏడాది పొడుగునా రోజూ తిరుణాళ్ళే’ అని. ఇతర జిల్లాలనుంచి కూడా ఆ వూరికి  ప్రతి రోజూ అనేక ట్రిప్పులు బస్సులు నడుస్తున్నాయి. మేము చదువు కునే రోజుల్లో బెజవాడ నుంచి పొద్దున్న ఒకటి (ఫస్ట్ బస్ అనే వాళ్ళు), సాయంత్రం ఒకటి (నైట్ హాల్ట్ బస్ అనేవాళ్ళు) బెజవాడ నుంచి వచ్చి పోయేవి. సాయంత్రం వచ్చిన బస్సు అక్కడే వుండిపోయేది. డ్రైవరు, కండక్టర్ కూడా అక్కడే నిద్ర చేసే వాళ్ళు. మళ్ళీ పొద్దున్నే ఫస్ట్ బస్  లో బెజవాడ వెళ్ళే వాళ్ళు. బస్సు బయలుదేరేటప్పుడు గట్టిగా హారన్  మోగించేవాళ్ళు. అది వింటూనే  ప్రయాణాలపై వెళ్ళేవాళ్ళు హడావిడిగా ఇళ్ళ నుంచి  సామాన్లు మోసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి బస్సు ఎక్కేవాళ్ళు. డ్రైవర్ పక్కన ఒక సీటు వుండేది. దాన్ని ఫ్రంట్ సీటు అనేవాళ్ళు. మునసబు, కరణాలకు, పోలీసులకు ఆ సీటు ప్రత్యేకం. బస్సులో ఖాళీ లేకపోయినా, నిల్చుని ప్రయాణం చేసేవాళ్ళు కాని వేరే వాళ్ళు అందులో కూర్చునే వాళ్ళు కాదు. బెజవాడకు టిక్కెట్టు రూపాయి వుండేది. పిల్లలకు అర  టిక్కెట్టు కొట్టించడానికి పెద్దవాళ్ళు నానా ప్రయాస పడేవాళ్ళు. వయసు తక్కువ చెప్పేవాళ్ళు. కండక్టర్ గట్టివాడయితే సీటు పక్కన నిలబెట్టించి పొడుగ్గా వుంటే పూర్తి టిక్కెట్టు కొట్టేవాడు. ఆ లడాయి నందిగామ చేరేదాకా సద్దుమణిగేది కాదు. (ఇంకా వుంది)     

8, ఆగస్టు 2017, మంగళవారం

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (4) - భండారు శ్రీనివాసరావు


కంభంపాడులో మా ఇల్లు పెద్ద భవంతి ఏమీ కాదు. ఈ ఇల్లు కట్టడానికి ముందు ఉన్న ఇల్లు మాత్రం చాలా పెద్దది, మండువా లోగిలి అని చెబుతారు. మా తాతగారి కాలంలో ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురయింది. ఆ సంఘటనలో కాలిపోగా మిగిలిన కలపతో కొత్త ఇల్లు కట్టారని చెబుతారు. ఇప్పటికీ వసారాలో వేసిన పైకప్పులో కాలిన నల్లటి మచ్చలు కానవస్తాయి. ముందు వసారా. పక్కన దక్షిణాన ఒక పడక గది, మధ్యలో పెద్ద హాలు, దానికి ఆనుకుని ఒక పెద్ద గది, వెనుకవైపు మళ్ళీ ఓ వసారా, పక్కన వంటిల్లు. వెనుక వసారాలో పాలు కాచుకునే దాలి గుంట, పక్కనే మజ్జిగ చిలికే కవ్వం. అక్కడక్కడా గోడల్లోనే చిన్న చిన్న గూళ్ళు, వంటింట్లో రెండు ఇటుకల పొయ్యిలు, గోడకు రెండు చెక్క బీరువాలు, ఒకటి మడి బీరువా, ఆవకాయ కారాల జాడీలు పెట్టుకోవడానికి, రెండో బీరువాలో పెరుగు కుండలు, కాఫీ పొడి  పంచదార మొదలయినవి దాచుకునే సీసాలు. వాటితో పాటే పిల్లలకోసం తయారు చేసిన చిరు తిళ్ళు. ఈ రెండు బీరువాలు తాకడానికి కూడా పిల్లలకు హక్కు వుండేది కాదు. మడి బీరువా మరీ అపురూపం. దానికి తాళం కూడా వుండేది కాదు, అందులోనే చిల్లర డబ్బులు దాచి పెట్టేవారు. పొరబాటున కూడా ఇంట్లో ఎవ్వరూ మైల బట్టలతో వాటిని తాకే సాహసం చేసే వాళ్ళు కాదు. వంటింటి వసారాలోనుంచి పెరట్లోకి గుమ్మం వుండేది. దానికింద వలయాకారంగా మెట్లు. కింద తులసి కోట. ఒక వైపు బాదం చెట్టు. అక్కడ అంతా  నల్ల చీమలు. ఎర్రగా పండిన బాదం పండ్లు కొరుక్కు తింటే భలే బాగుండేవి. ఇక బాదం పప్పు రుచే వేరు. దానికి పక్కనే  పున్నాగ చెట్టు. నేలరాలిన పూలు భలే మంచి వాసన వేసేవి. మా అక్కయ్యలు వాటిని సుతారంగా మడిచి మాలలు కట్టుకునే వాళ్ళు. మేము వాటితో బూరలు చేసి వూదేవాళ్ళం. దగ్గరలో ములగ చెట్టు. కొమ్మల నుంచి ములక్కాడలు వేలాడుతూ కనిపించేవి. అక్కడే రెండు బొప్పాయి చెట్లు కవల పిల్లల్లా ఉండేవి.
రెండో వైపు కొంచెం దూరంలో గిలక బావి. ఆ బావి చుట్టూ చప్టా. పక్కనే రెండు పెద్ద గాబులు (నీటి తొట్టెలు). ఒకటి స్నానాలకి, రెండోది బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి. స్నానాల గాబు పక్కనే వేడి నీళ్ళ కాగు. అక్కడే చెంబుతో వేడి నీళ్ళు, గాబు లోని చల్ల నీళ్ళు సరిపాట్లు చేసుకుంటూ పిల్లలు స్నానాలు చేసేవాళ్ళు. పెద్ద వాళ్ళు బావిదగ్గర నిలబడి, పనివాళ్ళు నీళ్ళు తోడి ఇస్తుంటే పిండితో వొళ్ళు రుద్దుకుంటూ స్నానాలు చేసేవాళ్ళు. నాకు బాగా బుద్ధి తెలిసే వరకు  ‘సబ్బు’ గృహ ప్రవేశం చేయలేదు.  బావి దగ్గర నుంచి వెనుక పెరట్లోకి చిన్న చిన్న కాలువలు ఉండేవి. ఇంట్లోకి అవసరం అయ్యే కాయగూరల్ని, ఆకు కూరల్ని అక్కడే పండించే వాళ్ళు. చుట్టూ కంచెగా వున్నా ముళ్ళ కంపకు కాకర పాదులు పాకించే వాళ్ళు. తేలిగ్గా ఓ పట్టాన తెంపుకు పోవడానికి వీల్లేకుండా. అక్కడే మాకు పెద్ద పెద్ద బూడిద గుమ్మడి కాయలు, మంచి గుమ్మడి కాయలు కనబడేవి. అంత  పెద్దవి అక్కడికి ఎలా వచ్చాయో అని ఆశ్చర్యపడేవాళ్ళం. నాకు పొట్ల పందిరి ఇష్టం. పందిరి మీద అల్లుకున్న తీగె నుంచి పొట్ల కాయలు పాముల్లా వేలాడుతుండేవి. పొట్లకు పొరుగు గిట్టదు అనేది మా బామ్మ. పొరుగున మరో కూరగాయల పాదు వుండకూడదట.
బచ్చల పాదులు అంటే కూడా పిల్లలకు ఇష్టం. ఎందుకంటె వాటికి నల్ల రంగుతో చిన్న చిన్న పళ్ళు (విత్తనాలు) కాసేవి. వాటిని చిదిమితే చేతులు ఎర్రపడేవి. నెత్తురు కారుతున్నట్టు ఏడుస్తూ పెద్దవాళ్ళని భయపెట్టే వాళ్ళం. బెండ కాయలు, దొండ కాయలు దొడ్లోనే కాసేవి. దొండ పాదు మొండిది అనేవాళ్ళు. ఒకసారి వేస్తే చచ్చినా చావదట. ఇందులో యెంత  నిజం వుందో తెలవదు. పాదుల గట్ల మీద  ఆ పెరడు మధ్యలో రాణీ గారి మాదిరిగా కరివేపాకు చెట్టు వుండేది. నిజంగా చెట్టే. చాలా పెద్దగా, ఎత్తుగా  వుండేది. ఊరి మొత్తానికి అదొక్కటే కరివేపాకు చెట్టు కావడం వల్లనేమో ఊరందరి దృష్టి దానిమీదనే. మా బామ్మగారిది నలుగురికీ పంచి పెట్టె ఉదార స్వభావమే కాని, మడి పట్టింపు జాస్తి. మైల గుడ్డలతో కరివేపాకు చెట్టును ముట్టుకోనిచ్చేది కాదు. దాంతో ఎవరూ చూడకుండా ఎవరెవరో దొంగతనంగా కరివేపాకు రెబ్బలు తెంపుకు పోయేవాళ్ళు.   

బావి పక్కనే కంచెను ఆనుకుని విశాలమైన ఖాళీ స్థలం వుండేది. వెనుక వైపు దక్షిణం కొసన బండ్లు వెళ్ళడానికి రాళ్ళు పరచిన ఏటవాలు దారి వుండేది. అక్కడే జుట్టు విరబోసుకున్న రాక్షసి లాగా పెద్ద చింత చెట్టు. పగలల్లా ఆ చెట్టు కిందనే ఆడుకునే వాళ్ళం కాని పొద్దుగూకేసరికి చిన్న పిల్లలం ఎవరం ఆ ఛాయలకు పోయేవాళ్ళం కాదు. చింత చెట్టుకు ఓ పక్కన ఎరువుల గుంత వుండేది. గొడ్ల సావిట్లో పోగుచేసుకు వచ్చిన చెత్తనూ, పేడను అందులో వేసేవాళ్ళు. సాలు చివర్లో వాటిని జల్ల బండ్లకు ఎత్తి పంట పొలాలకు ఎరువుగా వేసేవాళ్ళు. కనీసం యాభయ్, అరవై  బండ్ల ఎరువు పోగు పడేది. (ఇంకా వుంది)

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (3) - భండారు శ్రీనివాసరావు


తరువాత సరస్వతక్కయ్యకు సంబంధాలు చూడడం మొదలయింది. మా వూరిలో చలువాది నరసింహం అనే షావుకారు వున్నారు. ఆమెకు ఒక్కటే కూతురు. ఆమెతో మా పెద్దక్క య్యలు ఇద్దరికీ తగని స్నేహం. ఆమె పేరు తిరుపతమ్మ. పొద్దునలేచిన దగ్గరనుంచి రాత్రి పొద్దుపోయేదాకా మా ఇంట్లోనే వుండేది. ఆమెను నందిగామ తాలూకాలోని తుర్లపాడు ఇచ్చారు. ఆ వూళ్ళో తిరుపతమ్మ అత్తగారి ఇల్లు, ఆ వూరి కరణం గారయిన  తుర్లపాటి భైర్రాజు గారి ఇల్లు పక్కపక్కనే వుండేవి. ఆ కరణం గారికి ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు సత్యనారాయణకు పెళ్ళయి ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత పొలంలో పాము కరచి చనిపోయాట్ట. రెండోవాడు బియ్యే పాసయి ఎమ్మే చదువుతాను అన్నాట్ట. కాని కరణం గారు మాత్రం ‘నీ చదువు ఇక నా వల్లకాదు, పెళ్లి చేసుకుని మీ మామగారు చదివిస్తే చదువుకో అభ్యంతరం లేదన్నా’రట. చదువు మీది మమకారంతో కరణంగారి ఆ రెండో కొడుకు హనుమంతరావు కారేపల్లి సంబంధం  చేసుకున్నారు. పెళ్ళయిన కొన్నాళ్ళకు  పైచదువుల ప్రసక్తి తండ్రిదగ్గర తెస్తే ‘మన ఇంటి పరిస్థితులు నీకు తెలవనివి కావు కదా. ముందు ఏదన్నా నౌకరీలో కుదురుకుని ఆ తరువాత చదువుకో లేకపోతే మీ మామను అడుగు’ అని సలహా ఇచ్చారట. మామగారిని డబ్బు అడగడం ఇష్టం లేక ఇంట్లో చెప్పకుండా ఆయన సైకిల్ అమ్ముకుని కాశీ వెళ్ళి ప్రైవేట్లు చెప్పుకుంటూ ఎమ్మేలో చేరారు. ఫైనల్ పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో కారేపల్లిలో గర్భవతిగా ఆయన భార్య పురుడు కష్టమై పెద్ద ఆపరేషన్ చేయించినా ఉపయోగం లేక తల్లీ పిల్లాడు ఇద్దరూ పోయారట. పరీక్షల ముందు ఈ కబురు చెప్పడం ఇష్టం లేక, భార్య చావు కబురు  ఆయనకు తెలవనివ్వలేదు. పరీక్షలు రాసి ఇంటికి వచ్చిన తరువాత చింతపల్లి వేంకటేశ్వర రావు అనే అతడిని పంపి ఆయన్ని కారేపల్లి తీసుకువెళ్ళారు. అక్కడికి పోయినదాకా ఆయనకు ఆ వార్త తెలవదు. ఆ షాకునుంచి కోలుకోవడానికి ఏడాది పట్టింది.
ఇంతలో ఆయన తండ్రి గారు  మాత్రం మళ్ళీ పెళ్ళంటూ వొత్తిడి మొదలు పెట్టారు. కారేపల్లిలో ఈయనకు పిల్లనిచ్చిన రంగారావు గారికి కూడా బాగా చదువుకున్న ఈ అల్లుడు అంటే ఎంతో అభిమానం. ‘మా అల్లుడు కాశీ వెళ్ళి పెద్ద పట్టా ఫస్టుక్లాసులో పాసయాడు తెలుసా’ అని అందరితో గర్వంగా చెప్పుకునే వాడు. చిన్న వయస్సులో భార్యాపిల్లలను పోగొట్టుకున్న ఈయనను చూసి ఆయన జాలిపడి మళ్ళీ   పెళ్ళిచేసుకోమని పోరు పెట్టేవారట. చివరకు భీమవరం అమ్మాయితో ఈయనకు రెండో పెళ్లి జరిగింది. ఆ అమ్మాయికి మనస్తిమితం లేని సంగతి దాచిపెట్టి పెళ్లి చేశారు. ఆమె పుట్టింటి వాళ్లు కూడా ఏదో గతిలేక అబద్ధం చెప్పి పెళ్ళయితే చేశారు కాని వారికీ మనసులో గుబులు అనిపించిందో యేమో ఒకరోజు వచ్చి పిల్లను తీసుకువెళ్ళి పోయారు. వాళ్ళూ మంచివాళ్ళే. ‘మిమ్మల్ని మోసం చేయాలని మాకూలేదు. ఏదో అలా జరిగిపోయింది. పెద్దమనస్సుతో మన్నించడ’నే అన్నారు. కానీ ఇదంతా ఆయన మనస్సును చీకాకు పరిచింది. ఉద్యోగ ప్రయత్నాలకు స్వస్తి చెప్పి, బెజవాడలో ప్లీడరు ప్రాక్టీసు మొదలు పెట్టాలని తీర్మానించుకున్నారు.  మొదట్లో ఓ నాలుగు నెలలు మాచవరంలో తుర్లపాటి సంగమేశ్వర రావు అనే దూరపు బంధువు  దగ్గర పనిచేసి ఆ తరువాత సొంతంగానే ప్రాక్టీసు పెట్టారు. గవర్నర్ పేటలో లక్ష్మీ టాకీసు, జైహింద్ టాకీసు నడుమ రాజగోపాలచారి వీధిలో చక్రవర్తి గారి తెల్లమేడ ఎదురుగా సోవమ్మగారి ఇంట్లో మూడుగదుల వాటా   ఇరవై రూపాయల అద్దెకు మాట్లాడి దిగిపోయారు. సున్నం ఇటుకలతో కట్టిన ఆ ఇంటికి గోడలు గిలాబు కూడా చేయించలేదు. బాతు రూము వుండేదికాదు. నాలుగు వాటాల వాళ్ళకీ కలిపి ఒకటే నీళ్ళ పంపు. బావి లేదు. బోరింగు లేదు. ఆ ఇంట్లో ఆయనా, తుర్లపాడులో తెలిసిన  స్నేహితుడు గురవయ్య కలసి వుండేవారు. ఈయన్ని గురించీ, ఈ ఇంటిని గురించి ఇన్ని వివరాలు మాకు యెలా తెలిసినవన్న అనుమానం రావచ్చు. మా అక్కయ్యకు  పెళ్లి సంబంధం తీసుకువచ్చిన తిరుపతమ్మే  ఈ విషయాలన్నీ మా వాళ్లకు చెప్పిందట.          
తుర్లపాడులో వుండే  ఆ తిరుపతమ్మ మావూరు  వచ్చి ‘మా కరణంగారి అబ్బాయికి పెళ్లి చేస్తారుట. ఇరవైఎనిమిది ఏళ్ళు. బాగా చదువుకున్నాడు. బుద్ధిమంతుడు. బెజవాడలో ప్లీడరీ చేస్తున్నాడు. మీ అమ్మాయిని అయితే తప్పకుండా చేసుకుంటారు’ అని మా నాన్నతో  చెప్పింది. రెండో సంబంధం అనగానే ఆయన ఇష్టపడలేదు.
ఇట్లావుండగానే ఆ తిరుపతమ్మ మొగుడు రమణయ్య,  పిల్లాడి తండ్రి భైర్రాజుగారు మా వూరు వచ్చి షావుకార్ల ఇంట్లో దిగి మా ఇంటికి కబురు పెట్టారు. మా నాన్న  వెళ్ళి వారిని ఇంటికి తీసుకువచ్చారు.
‘అతికితే గతకదు. మీఇంట్లో భోజనం చేసేది లేద’ని  ముందే చెప్పారు. అందుకని మా ఇంటికి పక్క వీధిలో వున్న గూడా రామచంద్రయ్యగారింట్లో వాళ్లకు భోజనం  ఏర్పాట్లు చేశారు. తరువాత  మా అక్కయ్యను చూపించారు. అప్పుడు మా ఇల్లు ఒక పెండ్లివాళ్ళ ఇల్లులాగా వుండేది. మా బామ్మ,  ఆమె తల్లి, మా మేనత్త, మా అమ్మ, పది మంది పిల్లలు. (అప్పటికి మా ఇంట్లో అందరికంటే  చిన్నవాడినైన నేను పుట్టనేలేదు). ఇంకా మా సీతంబామ్మ, సుబ్బయ్య తాతయ్య, జీతగాళ్ళు ఇట్లా ఇంతమందితో ఇల్లంతా ఎంతో సందడిగా వుండేది.  ఇదంతా చూసి  పిల్లాడి తాలూకువాళ్ళు ముఖ్యంగా పిల్లాడి తండ్రి భైర్రాజు గారు ‘ఈ సంబంధం  నాకు నచ్చింది’ అని అక్కడికక్కడే చెప్పేసారు.  ‘మా అబ్బాయిని పంపుతామ’ని చెప్పి వెళ్ళిపోయారు. తరువాత పది  రోజులకు తుర్లపాడు సంబంధం అబ్బాయి వచ్చవాయి వచ్చి జగన్నాధం బాబాయిని,  ఇంగువ రామకృష్ణయ్యగారిని, గురవయ్య గారిని వెంటబెట్టుకుని  కంభంపాడు వచ్చి మా అక్కయ్యను చూసారు. చూసి వెళ్ళిన తరువాత ఆయన తండ్రిగారు ‘మా అబ్బాయికి ఇష్టమయింది’ అని కబురు పంపారు. మా నాన్న వెంటనే బెజవాడ వెళ్ళి దోర్భల శేషాద్రి గారనే ప్లీడరును కలుసుకుని పెళ్లి కుమారుడి గురించి వాకబు చేశారు. ‘పిల్లాడు  మంచివాడు, బుద్ధిమంతుడు, తెలివికలవాడు’ అని ఆయన చెప్పారు. తరువాత కారేపల్లి  వెళ్ళి మొదటి సంబంధం వారిని కూడా మంచి చెడ్డలు కనుక్కున్నాడు. మా బామ్మ పెత్తల్లి కూతుర్ని కారేపల్లి రంగారావుగారి  బాబాయికి  ఇచ్చారుట.  అందుకని కంభంపాడు, కారేపల్లి కుటుంబాల మధ్య రాకపోకలు వుండేవి.  నాన్న  వెళ్ళి ‘తుర్లపాడు కరణంగారి పిల్లాడికి మా అమ్మాయిని ఇద్దామనుకుంటున్నాము’ అని చెప్పగానే వాళ్ళూ ఎంతగానో  సంతోషపడి  ‘వెంటనే వెళ్ళి లగ్గాలు పెట్టుకోండి. మీ అమ్మాయి ఇక మీ అమ్మాయి కాదు మా అమ్మాయి’ అని అన్నారుట.  ఆ భరోసాతో మా నాన్న కంభంపాడు వచ్చి లగ్గం  పెట్టుకోవడానికి రమ్మని తుర్లపాడు కబురు చేశారు. కార్తీక మాసంలో కంభంపాడులోనే ఇంటిముందు పందిరి వేసి పెళ్లి చేశారు. ఆ పెళ్ళికి  కారేపల్లి నుంచి మా బావగారి మొదటి సంబంధం మామగారు  రంగారావు గారు, అనంతరాములు గారు, దుర్గాప్రసాదు గారు అంతా మా వూరు వచ్చారని మా అక్కయ్య చెప్పింది.

(ఇంకా వుంది)

6, ఆగస్టు 2017, ఆదివారం

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (2) - భండారు శ్రీనివాసరావు


ఆ రోజుల్లో ఆడపిల్లలకు పదో ఏటినుంచే పెళ్లి ప్రయత్నాలు చేసేవాళ్ళు. మా ఇంట్లో పెద్దాడపిల్ల రాధక్కయ్య. ఆమెకు పదేళ్లు నిండకుండానే సంబంధాలు చూడడానికి తొందరపడేవాళ్లు. ఈ సంగతులు గురించి  సరస్వతక్కయ్య కొన్ని సరదా ముచ్చట్లు చెబుతూ వుండేది. పెళ్లి సంబంధాల వాళ్లు ఎవరు వచ్చినా సరే మా పెద్దక్కయ్యతో పాటు రెండోది శారదక్కయ్య కూడా పక్కనే కూర్చుని స్వాములవారు చెప్పిన హిందీ రామాయణం గడగడా చదివేసేది.
మావూరికి కొద్ది కోసులదూరంలో వున్న ఖమ్మం జిల్లా వల్లభినుంచి ఓ సంబంధం వచ్చింది. వరుడి పేరు రాంరావు. ఇంటిపేరు అయితరాజువారు. పెద్దమోతుబరులకింద లెక్క. పెళ్ళిచూపుల్లో ఇద్దరు అక్కయ్యలు కలసి మళ్ళీ హిందీ రామాయణం వినిపించారు. అంత పల్లెటూరులో హిందీ  తెలిసిన పిల్లలు వుండడం విచిత్రమనిపించిందో యేమో కాని మొత్తానికి మా రాధక్కయ్యకు వల్లభి సంబంధమే ఖాయమయింది. అయిదువందల రూపాయల కట్నం, అయిదు రోజుల పెళ్లి వొప్పుకుని వెళ్ళిపోయారు.
సంబంధం అయితే కుదిరింది కాని మా నాన్నకు కాలూ చేయీ ఆడని పరిస్తితి. చివరికి మూడెకరాలు అమ్మి పెళ్ళిచేశారు. పిల్లకు నూటయాభై కాసుల బంగారం పెట్టారు. పల్లెటూరు. దొంగల భయం ఎక్కువ. అంత బంగారం ఇంట్లో పెట్టుకుని ఎలారా అని మా నాన్న  భయపడుతుండేవాడు. మొత్తం మీద ఎలాటి అవాంతరం లేకుండా పెళ్లి ఘనంగా జరిగిపోయింది.
సంవత్సరం గడిచింది. రెండో అక్కయ్య శారదక్కయ్యకు  పెళ్లి సంబంధాలు అంటూ ప్రత్యేకంగా చూడలేదట. మేనరికం ఇద్దామనుకున్నారు. మా పెద్ద మేనత్త గారు  శారదక్కయ్య   పుట్టగానే ‘ఇది నా కోడలు’  అని  డిక్లేర్ చేసింది.  రాధక్కయ్య పెళ్లి కావడం ఆలస్యం, వాళ్ల పెద్ద అబ్బాయి రామచంద్రరావుకు శారదను చేసుకుంటానని కబురుచేసిందిట. ఇంట్లో పెళ్లి హడావిడి మొదలయింది కాని ఏదో గుబులు. ఆ రోజుల్లో శారదా చట్టం వుండేది. చిన్నపిల్లలకు పెళ్లి చేయకూడదు. ఆరోజుల్లో మా లక్ష్మయ్య తాతయ్యకు మా కుటుంబానికీ నడుమ దాయాది తగాదాలు, ఏవేవో  కీచులాటలు వుండేవి. సంగతి తెలిసి ఆయన ఏమైనా పిటీషన్ పెడితే గోల అవుతుందనే భయంతో ఖమ్మం జిల్లా రెబ్బారం వెళ్ళి పెళ్లి చేసుకువచ్చారు. శారదక్కయ్యకు కూడా యాభయ్ కాసుల బంగారం పెట్టారు. పెద్దక్కయ్య పెళ్ళప్పుడు దొంగల భయం గుర్తు ఉందేమో, ఈసారి నాన్న బెజవాడ వెళ్ళి లల్లూరాం కంపెనీ వాళ్ల ఇనప్పెట్టె కొనుక్కుని వచ్చాడు.
పెద్ద రంగయ్య అనే మాస్టారు  పొరుగున వున్న పెనుగంచిప్రోలు నుంచి మా వూరు స్కూలుకు బదిలీపై  వచ్చారు. ఆయన దగ్గర కూడా మా అక్కయ్యలు  హిందీ నేర్చుకునేవాళ్లట.  ప్రాధమిక, మాధ్యమిక హిందీ పరీక్షలు రాయడానికి మా బామ్మ బండి కట్టించి వాళ్ళను మాచినేనిపాలెం తీసుకువెళ్ళి వచ్చేది. ఆడపిల్లలకు చదువెందుకు అనేరోజుల్లో మా ఇంట్లో పెద్దవాళ్ళు చదువు గురించి తీసుకున్న శ్రద్ధాసక్తులు అలాటివి.
మా పెద్దవాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఆ తరువాత కొంత మార్పు వచ్చింది. పిల్ల సంవర్త అయినా పెళ్ళికి తొందరలేదనేవారు. అందువల్ల మా ఇంట్లో మిగిలిన ఆడ పిల్లల వివాహాలు పదహారేళ్ళు వచ్చిన తరువాతనే జరిగాయి. ఏడుగురు అక్కయ్యల్లో అయిదుగురి పెళ్ళిళ్ళు నేను పుట్టకమునుపే మా నాన్న చేతుల మీదుగానే జరిగాయి. ఇంట్లో చిన్నవాడిని కావడంవల్ల అనేక సంగతులు వాళ్ళు చెప్పుకునే ముచ్చట్ల ద్వారానే నాకు తెలిసాయి.
పెనుగంచిపోలు నుంచి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. అక్కడ చినకరణం గారు కొమరగిరి లక్ష్మీ కాంతారావు గారు. ఆయనకు ఒక్కడే కొడుకు. వెంకట అప్పారావు. బోలెడు ఆస్తి. అతగాడేమో ఇంట్లో చెప్పకుండా మిలట్రీలో చేరాడు. చేరినవాడు అక్కడ కాలు నిలవక తప్పించుకుని వచ్చాడు. మిలట్రీ నుంచి పారిపోయి రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వారంటు జారీ అయింది. తెలిసిన వాళ్లు కాబట్టి మా నాన్న ఆయన్ని తీసుకుని వెళ్ళి కృష్ణమూర్తి అని పేరు మార్చి రెబ్బారంలో మా రెండో అక్కయ్య ఇంట్లో వుంచాడు. అక్కడి నుంచి కూడా మార్చి కొన్నాళ్ళు కేసు ఎత్తివేసేదాకా ఎలకలపల్లి అనే పల్లెటూర్లో పెట్టారు. అప్పారావు తలిదండ్రులు కాంతయ్య గారు, రంగమ్మ గారు. మా నాలుగో అక్కయ్య సరస్వతిని వాళ్ల పిల్లవాడికి చేసుకుంటామని కబురు చేశారు. కానీ మా నాన్న  సుతరామూ దానికి వొప్పుకోలేదు. ‘కేసు పూర్తిగా ఎత్తివేసినట్టు గవర్నమెంట్ నుంచి కాగితం వచ్చేదాకా పిల్లనిచ్చేది లేదని, పెళ్లి ప్రసక్తి తేవద్ద’ని  తెగేసి చెప్పాడు. (ఇంకా వుంది)

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ......భండారు శ్రీనివాసరావు


“ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండది తప్పుగా దలచెనో విచ్చేయునో ఈశ్వరుం
డనుకూలింప దలంచునో దలచడో ఆర్యా మహాదేవియున్
నను బాలింప నెరుంగునో నెరుగదో నా భాగ్యమెట్లున్నదో”

రుక్మిణీ  కళ్యాణంలో  పద్యం శ్రావ్యంగా వినబడుతోంది. పాడుతున్న అమ్మాయికి పన్నెండేళ్ళు వుంటాయేమో. వింటున్న వాళ్లు మాత్రం ఆరుపదులు దాటిన  వాళ్ళే. పుస్తకం అవసరం లేకుండా కంఠతా వచ్చిన పద్యాన్ని రుక్మిణీ దేవే స్వయంగా ఆవహించి పాడుతున్నదా అన్నట్టుగా ఆలపిస్తున్నది మా అన్నపూర్ణక్కయ్య. మధ్యలో మంచంలో చేతిలో తావళంతో మా బామ్మ, కొంత దూరంలో మరో మంచంలో మా  బామ్మ అమ్మ చెల్లాయమ్మ అమ్ముమ్మ. ముక్కాలిపీట  పై కాలు మీద కాలువేసుకుని తన్మయంగా వింటున్న మరో శ్రోత మా లలితమ్ముమ్మ. వొంటింట్లో పనిచేసుకుంటూనే ఓ చెవి ఇటు వేసి వింటున్నది మా అమ్మ.  ఈ దృశ్యం ఆ ఇంట్లో పరిపాటే.
ఆ ఇల్లే నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు. చిన్నప్పటి ఈ సంగతులు గురించి మా అక్కయ్యలు, అన్నయ్యలు  చెప్పగా వినీ వినీ  అవన్నీ నా మనసులో ముద్రపడి పోయాయి. అరవై ఏళ్ళ కిందటి ముచ్చట్లు, ఏళ్ళు గడిచినా మనసులో అలా పచ్చగా వుండిపోయాయి.
ఇప్పటికీ కుగ్రామంగా వున్న మా వూరు కంభంపాడు అప్పుడు  ఎలావుండి వుంటుందో  వూహించుకోవాల్సిందే.
మా నాన్నగారు వూరికి కరణం. పేరుకు బోలెడు ఆస్తి. వూరిచుట్టూ ఎటు చూసినా ఎంతదూరం వెళ్ళినా మా పొలాలే. ఐదో అక్కయ్య అన్నపూర్ణ అక్కయ్యను పక్కవూరు పెనుగంచిప్రోలు  పెద  కరణం గారి అబ్బాయి అప్పారావుకుకు  ఇచ్చి పెళ్లి  చేశారు. ఈ సంగతి  ఇప్పుడెందుకంటే కొత్త అల్లుడు పొరుగూరు నుంచి  గుర్రం మీద అత్తగారింటికి మా ఊరు  వచ్చినప్పుడు ఆ గుర్రాన్ని మేతకు వొదిలేవారు. ఇక  అది తిరిగి మేసినంత మేరా మా పొలాలే. కానీ ఏం లాభం? వందల ఎకరాల భూమి మీద వచ్చే అయివేజు మాత్రం అంతంత మాత్రమే. కరణీకం మీద వచ్చే జీతం రాళ్ళు నాలుగే, ఇంటి ఖర్చుకు ఆధారం. వర్షాలు లేక పంటలు పండక రైతులు సర్కారుకు శిస్తుకట్టలేక ఇళ్ళూ పొలాలు వొదులుకుని వూళ్ళు వొదిలి వెళ్ళే రోజులవి.
అలాటి రోజుల్లో మా బాల్యం గడిచింది. అలాటి పల్లెటూరిలో మా చిన్నతనం నడిచింది.
మా నాన్నకు  ఏడుగురు ఆడపిల్లలు.  నలుగురు మగపిల్లలం.
ఇంతమందికే కాదు, ఇంకా ఇంతమంది ఇంట్లో  విస్తళ్ళు వేసే సమయానికి భోజనాలకు సిద్ధంగా వుండేవారు. పూటకూళ్ళ ఇల్లు లేని వూరు. ఎవరొచ్చినా చేయి కడిగేది వూరి కరణం గారింట్లోనే.
మా అమ్మా నాన్న, బామ్మ, ఆమె తల్లి గారు, పెనిమిటి వొదిలిపెట్టిన ఒక మేనత్త, ఇద్దరు జీతగాళ్ళు, వచ్చిపోయేవాళ్ళు ఇంతమందికి మా అమ్మే వండి వార్చేది. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పొద్దుపోయేవరకు నడుం వాల్చే వీలు వుండేది కాదు. దీనికి తోడు నిప్పులు కడిగే ఆచారం మా బామ్మది. వూరి పొలిమేరలో చెరువుకట్ట దగ్గర వున్న మంచినీళ్ళ బావినుంచి తడి చీరెకట్టుకుని బిందెలతో నీళ్ళు పట్టుకురావడంతో మా అమ్మ డ్యూటీ మొదలయ్యేది. మైలకు పనికొచ్చే నీళ్ళు ఆడపిల్లలు తీసుకువచ్చేవాళ్ళు.
మా ఇంటి వెనుక ఉసిగె వాగు. దాన్ని ఆనుకుని శివాలయం. అందులోనే హనుమంతుడి గుడి. పక్కనే పూడిపోయిన కోనేరు. దాని వెనుక లక్ష్మయ్య తాతయ్య పొలాలు. దాన్ని ఆనుకుని మా అప్ప పొలం నల్లగడ్డ. దానిపక్కనే తుమ్మల వాగు. ఆ వాగు దాటుకుని వెడితే సుబ్బయ్య తాతయ్య గరప చేను. అందులో స్వాములవారి ఆశ్రమం. శివుడి గుడి. అందులో కాశీ నుంచి తెచ్చి స్వాములవారు ప్రతిష్టించిన శివలింగం.
ఇంట్లో పెద్దవాళ్ళు నా చిన్నతనంలో చెప్పుకునే మాటలు  ఒకటీ అరా అలా గుర్తుండి పోయాయి. పెద్దక్కయ్యలు రాధక్కయ్య, శారదక్కయ్య హిందీ నేర్చుకోవడానికి వూరి పొలిమేరల్లో వున్న స్వామి గారి ఆశ్రమానికి వెళ్ళేవాళ్లు. చిన్నక్కయ్యలు సరస్వతక్కయ్య, అన్నపూర్ణక్కయ్య  బామ్మతో తోటకు వెళ్ళి కూరలు కోసుకువచ్చేవాళ్ళు.  శివరాజు నాగభూషణం గారి అరుగు బడిలోనే అందరి చదువులు. ఆయన పొద్దున్నే లేచి, స్నానాదులు ముగించుకుని –
హరి యను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా|
అంటూ కంచుకంఠంతో కృష్ణ శతకం వూరంతటికీ వినబడేటట్టు ఎలుగెత్తి చదివేవారు.
అదే మా  క్లాసు బెల్లు.
(ఇంకా వుంది)

5, ఆగస్టు 2017, శనివారం

శ్రద్ధాంజలి – కృతజ్ఞతాంజలి



ఈ రోజు మా అమ్మగారు శ్రీమతి వెంకట్రావమ్మ గారి ఆబ్దీకం.


ఆమె కాలం చేసి రెండు దశాబ్దాలకు పైగా గడిచిపోయాయి. ఆమె చనిపోయిన రోజు ఇంకా కళ్ళకు కట్టినట్టు వుంది.  శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం. ఆవిడకు వొంట్లో బాగా లేదని తెలిసి అంతా వచ్చారు. ఇంటి కోడళ్ళు అందరూ శుక్రవారం నోములకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆవిడ వారి నోములకు, వాయినాలకు ఆటంకం కలిగించకుండా అన్నీ పూర్తయ్యేవరకు వుండి ఆ తరువాత కన్ను మూసింది. దహన సంస్కారాలు పూర్తికాగానే, మా పెద్దన్నయ్య పర్వతాలరావుగారు ఆమె అపరకర్మలు కాశీలో జరపాలని ప్రతిపాదించడం, అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్లు, బావగార్లు అందరం వారణాసి వెళ్లి ఆ పవిత్ర ప్రదేశంలో గంగా తీరంలో పిండ ప్రదానాలు చేసి తర్పణాలు విడవడం అంతా ఓ కలలా జరిగిపోయింది.
మా నాన్నగారు రాఘవరావు గారు చనిపోయి అనేక దశాబ్దాలు దొర్లిపోయాయి. నా చిన్నతనంలోనే కన్నుమూయడం వల్ల,  ఆయన రూపం కూడా నాకు గుర్తు లేదు.  ఆయన ఆబ్దీకాలను మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు అత్యంత శ్రద్దాసక్తులతో  ప్రతియేటా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వచ్చారు. మా స్వగ్రామంలో వరుసగా నలభయ్ యాభై ఏళ్ళపాటు జరుగుతూ వచ్చిన  ఈ ఆబ్దీకాలు,  కాలక్రమంలో  వాస్తవంగా ఒక పండుగ మాదిరిగా మారిపోయాయి. ఎక్కడెక్కడి నుంచో చుట్టపక్కాలందరూ ఓ శుభకార్యానికి వచ్చినట్టు హాజరయ్యేవారు. పిల్లలు, వారిపిల్లలు, వారి పిల్లలు  ఇలా అందరూ,  అదొక తద్దినం అనే  కన్నా కూడా నలుగురు కలిసి  పెద్దలను సంస్మరించుకునే ఒక అవకాశంగా భావించి,  ఒకరికొకరు  కూడబలుక్కుని  ఆరోజుకల్లా అంతా ఠంచనుగా ఓ దారీతెన్నూ లేని  ఆ చిన్న పల్లెటూరు మా వూరు  కంభంపాడు చేరుకునేవారు. నిజానికి ఈ యావత్ కార్యక్రమానికి వెన్నుదన్ను మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు గారు. ఆయన మా వూరు కరణీకం చేసేవారు. ప్రతియేడూ మా నాన్న తద్దినానికి పెళ్ళికి పంపినట్టు అందరికీ పేరుపేరునా  వర్తమానాలు పంపేవారు. మా నాన్న ఆబ్దీకం అంటే మా వూళ్ళో ఓ సందడి. వూరబంతి పెట్టేవాళ్ళు. మా ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళ కంటే తద్దినాలు ఘనంగా జరిగేవని చెప్పుకునేవారు.
ఇన్నేళ్ళ తరువాత కొన్ని విషయాలు చాలా బాధాకరంగా అనిపిస్తాయి. అన్ని సంవత్సరాలుగా అంత శ్రద్ధగా ఘనంగా మా అమ్మానాన్నల తద్దినాలను బాధ్యతగా  నిర్వహిస్తూ వచ్చిన మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు, మూడో అన్నయ్య వెంకటేశ్వర రావుగారు ఈ నాడు మా మధ్యన లేకపోవడం మేమందరం  తట్టుకోలేకపోతున్న ఓ విషాద పరిణామం. మూడో అన్నయ్య ఏకంగా మా వూరిలో అమ్మానాన్నల గుడినిర్మించి చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడా గుడి పక్కనే వారిద్దరి స్మారక చిహ్నాలు నిర్మించి మా అన్నయ్య పిల్లలు ఆయన ఋణం కొంతమేర తీర్చుకున్నారు.
పోతే, చావంటే ఏమిటో తెలియని రోజుల్లోనే తండ్రిని పోగొట్టుకుని, తద్దినం అంటే ఏమిటో అర్ధం కూడా తెలియని స్తితిలో పెరుగుతూ వచ్చిన నేను,  వూహ తెలిసే నాటికే తద్దినం పెట్టే కర్త  తమ్ముడి పాత్రలో వొదిగిపోయాను. మా రెండో అన్నయ్య  రామచంద్రరావు గారు దత్తు పోవడం వల్ల, చివరికి మిగిలింది నేనే కావడం వల్ల ఏటా మా అమ్మానాన్నల తద్దినాలు కర్తగా కూర్చుని  పెట్టే అవకాశం, ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి, నాకు లభించింది. దాదాపు కాపురానికి వచ్చింది లగాయతు మా పెద్ద వొదినె గారు శ్రీమతి  సరోజినీ దేవి, రెండో వొదినెగారు శ్రీమతి  విమలాదేవి, మూడో వొదినెగారు శ్రీమతి  అరుణా దేవి మడికట్టుకుని  తడిబట్టలతో ఎంతో శ్రద్ధతో  ఈ పవిత్ర కార్యానికి తోడ్పడుతూ వచ్చారు. గత కొన్నేళ్ళుగా ఈ బాధ్యతను  మా ఆవిడ నిర్మలాదేవి నెత్తికెత్తుకుంది.
దాదాపు   అరవై ఏళ్ళుగా  మా నాన్నగారి ఆబ్దీకం, సుమారు రెండు దశాబ్దాలకు పైగా మా అమ్మగారి తద్దినం క్రమం తప్పకుండా నిర్వహించే భాగ్యం   నా పూర్వజన్మ సుకృతం.  కొన్నేళ్ళ క్రితం అమెరికా వెళ్ళినప్పుడు కూడా మా పెద్దవాడు సందీప్  పూనుకుని ఏర్పాట్లు చేయడం వల్ల అక్కడ కూడా ఏలోటూ రాకుండా ఈ పవిత్ర కార్యాన్ని నిర్వర్తించగలిగాను.
ఇందుకు సహకరిస్తూ వచ్చిన అందరికీ కృతజ్ఞతాంజలి. గతించిన పెద్దలకు శ్రద్ధాంజలి.


1, ఆగస్టు 2017, మంగళవారం

ఆంధ్రపత్రిక మళ్ళీ వస్తోంది!


యాభయ్ అరవై ఏళ్ళ క్రితం, మా వూళ్ళో గూడా సత్యనారాయణ సిద్ధాంతిగారనే ఏజెంటుకి మూడున్నర రూపాయలు చందా కడితే నెల రోజులపాటు ఆనాటి ఆంధ్రపత్రిక మా ఇంటికి వచ్చేది. కానీ, అది మా వూరు చేరేసరికి మర్నాడు  సాయంత్రం అయ్యేది. అయినా, సరే అది చదువుతుంటే  ఏ రోజు వార్తలు, ఆరోజే తెలుసుకుంటున్న ఫీలింగ్‌ కలిగేది. ఊరు మొత్తానికి కలిపి ఇద్దరు ముగ్గురు మాత్రమే చందా కట్టి పత్రిక తెప్పించుకునేవారు. పోస్ట్ మాన్ చేతిలో ఆంధ్రపత్రిక కనబడగానే మా అందరికీ ప్రాణాలు లేచొచ్చేవి.
‘అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఫిట్జరాల్ద్  కెనెడీ ఎన్నిక, ఓటమి అంగీకరిస్తూ నిక్సన్ ప్రకటన’ అంటూ పత్రికలోని వార్తలను స్కూలు మేష్టరుగారు శివరాజు అప్పయ్య పంతులు గారు ఉచ్చైస్వరంతో చదివి వినిపిస్తుంటే ఊరి వారందరూ పోగయి చెవులప్పగించి వినేవారు.
బెజవాడ గాంధి నగరంలో ఆంధ్రపత్రిక ఆఫీసు వుండేది. దాన్ని మద్రాసు నుంచి బెజవాడ తరలించినప్పుడు మా దగ్గరి బంధువు పినపాక ప్రకాశరావు గారు పత్రిక సంపాదకత్వ బాధ్యతలు చూస్తుండేవారు. ప్రముఖ రచయిత వీరాజీ కూడా అప్పుడే  మద్రాసు నుంచి మకాం బెజవాడకు మార్చుకున్నారు. బెజవాడలో సమాచార శాఖ అధికారిగా పని చేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారి ఆఫీసుకు వస్తుండేవారు. సి.కనకాంబర రాజు (సికరాజుగా, ఆంద్ర భూమి వారపత్రిక సంపాదకుడిగా ప్రసిద్ధుడు) కూడా నాకు అక్కడే పరిచయం.
తదుపరి నేను హైదరాబాదులో రేడియోలో చేరిన తరువాత బషీర్ బాగ్ చౌరస్తాలో ఆంధ్రపత్రిక ఆఫీసుకు వెడుతుండేవాడిని. సీ.వీ. రాజగోపాలరావు గారు రెసిడెంట్ ఎడిటర్. బ్యూరో చీఫ్ ముక్కు శర్మగారు, పాపయ్య శాస్త్రి గారు, సుందరం, (ఇప్పుడు లేరు), పాశం యాదగిరి, కే.వేణుగోపాల్, ములుగు రాజేశ్వర రావు, చుట్ట రాంప్రసాద్, విద్యారణ్య అక్కడ పనిచేస్తూ వుండేవారు. ఆ భవనం అంతెత్తున ఒక రాజ మహల్ ని తలపించేదిగా వుండేది. అంతటి భోగం అనుభవించిన ఆంధ్రపత్రిక చివరికి  గగన్ మహల్ లో ఒక  అద్దె ఇంటిలో తలదాచుకోవాల్సి వచ్చింది. అప్పటికే అది అవసాన దశకు చేరుకున్నట్టే. కాశీనాధుని నాగేశ్వరరావు, శివలెంక సంభుప్రసాద్, శివలెంక రాధాకృష్ణ చేతుల్లో పెరిగి పెద్దదయిన తెలుగువారి మొట్టమొదటి పూర్తిస్థాయి దినపత్రిక  ఆంధ్రపత్రిక, విద్యారణ్య మాటల్లో చెప్పాలంటే, ‘శివ సాయుజ్యం’ పొందింది.

ఆంధ్రపత్రిక లేకుండానే తెలుగు పత్రికారంగానికి  ఏండ్లు గడిచిపోయాయి. ఆ పత్రికలో పనిచేసి పేరు తెచ్చుకున్న జర్నలిష్టులందరూ వేరే పత్రికలకు మరలిపోయారు.  మళ్ళీ ఇన్నాళ్టికి ‘మహానగర్’ అనే ఓ చిన్న పత్రికను యజ్ఞంలా నడుపుకుంటున్న మనసున్న మారాజు ‘పాంచజన్యం’,  పెద్ద మనసు చేసుకుని ఆంధ్రపత్రికకు ఊపిరులూదాడు. ఆంధ్రుల కొత్త రాజధాని అమరావతిలో ఈ మధ్యనే వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభమై  మళ్ళీ జనం మధ్యకు వస్తోంది. సంతోషం!