31, మే 2017, బుధవారం
నిమిషం ఓపికలేని జీవితాలు
మండుటెండలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర
కారు ఓ బస్ స్టాప్ పక్కన ఆగింది. మూడు
నాలుగు నిమిషాలన్నా వేచి ఉండక తప్పదు. కారు ఏసీ అయినా ఎండ పీడ తగ్గించుకోవడానికి సీట్లోనే
పక్కకి జరిగి కూర్చుంటుంటే ఆ దృశ్యం కళ్ళబడింది. ద్విచక్ర వాహనం మీద మొగుడూ పెళ్ళాం,
ఇద్దరు చిన్న పిల్లలు, ఎడ పిల్ల మరీ చంటిది. తల్లి బండి దిగి పిల్లల్ని కాసేపయినా
నీడను నిలుపుదామని బస్ స్టాప్ షెల్టర్ కిందకు వెళ్ళింది. ఎండ దెబ్బకు తట్టుకోలేక చంటిది
గుక్కపట్టి ఏడుస్తోంది. ఆ పిల్ల నెత్తికి ఓ గుడ్డచుట్టి తెచ్చుకున్న సీసాలో నీళ్ళు
ఆ పసిదాని మాడు మీద చల్లుతోంది. పెద్ద పిల్ల దప్పిక ఆపుకోలేక అమ్మ చేతిలో సీసా
లాక్కుని ఆబగా తాగుతోంది.
ఈ లోగా పచ్చ లైటు వెలిగింది. తండ్రి
సైగ చేయడంతో తల్లి గాభరాగా పిల్లలతో వచ్చి ఆ బండి ఎక్కలేక అవస్థ పడుతోంది. వెనక
నుంచి అదేపనిగా హారన్లు. దాంతో అవిడ గాభరా మరింత పెరిగింది.
మరి యెంత అవసరం వుండి ఇంత ఎండ పూటన
ప్రయాణం పెట్టుకున్నారో తెలవదు. ఆ బాధ కంటే, వెనుకవాళ్ళ అసహనం మరింత బాధ
పెట్టింది. నిమిషం తాళలేని ఓపికలేని జీవితాలాయె!
లేబుళ్లు:
నిమిషం ఓపికలేని జీవితాలు
26, మే 2017, శుక్రవారం
మోడీ మూడేళ్ళ పాలన
(PUBLISHED IN ANDHRAPRABHA TELUGU DAILY ON 27-05-17, SATURDAY)
“మోడీ లాంటి మొగాడు దేశానికి అవసరం”
ఈ మాట చెప్పింది మోడీ అభిమానీ కాదు, బీజేపీ కార్యకర్తా కాదు.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా
వున్నరోజుల్లో, ప్రత్యేకించి గోద్రా మారణ హోమం
నేపధ్యంలో ఆయనను పూర్తిగా ఖండిస్తూ పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసిన
వ్యక్తి. పేరు సుహేల్ సేథ్.
గుజరాత్ లో గోద్రా మారణహోమం అనంతరం
నరేంద్ర మోడీ అభినవ హిట్లర్ అంటూ పలు విమర్శలు చేసిన చరిత్ర ఈయనకు వుంది. ఆ సంఘటన
మోడీ జీవితంలో మాయని మచ్చ అన్నారు. అంతే కాదు, ఆ కారణంగా భారత రాజకీయ వ్యవస్థ
భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అయితే, నరేంద్రమోడీ ప్రధాన మంత్రి
కాగానే సుహేల్ సేథ్ మహాశయులు తన బాణీ తానే మార్చుకుని ‘ఈ దేశం అవసరం మోడీకి లేదు, మోడీ వంటి మొనగాడి అవసరం దేశానికే
వుందంటూ గొప్ప కితాబు ఇచ్చారు.
“ఆయనలో కొన్ని లోపాలు వున్నాయి, కాదనను. కానీ మోడీ వంటి మరో నేత
ఈరోజు దేశంలో మరొకరు లేరు. ఇది వాస్తవం. అయన ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి.
ఇది మరో వాస్తవం’ అంటారు
సుహేల్ సేథ్.
ఈయన మాటల్ని విశ్వసించాల్సిన అవసరం
వుందనుకోను. ఆయనే స్వయంగా చెప్పుకున్నట్టు ఆయన ఒక ప్రచారకర్త. తనను తాను
పెంచుకునే వ్యూహంలో భాగంగా మోడీ, సోషల్ మీడియాలో సేథ్ వంటి వ్యక్తులను
ఉపయోగించుకుంటూ వుంటారని మోడీ రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపిస్తూ వుంటారు.
కేవలం ప్రచార ఆర్భాటంతో మోడీ తనకులేని ప్రతిభను అలా చాటుకుంటూ వుంటారని వారి
ఉద్దేశ్యం.
కానీ ఇది పూర్తిగా నిజం కాదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆ
రాష్ట్రం రూపురేఖల్ని ఆయన ఎలా మార్చగలిగిందీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయనలో
దాగున్న సమర్ధ రామదాసు మనకు కనబడతాడు.
సరే! సేథ్ ఒక ప్రచార కర్త. ఆయన సంగతి
అలా ఉంచుదాం.
గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మోడీ
పనితీరు గురించి ఒక మిత్రుడు పంపిన సమాచారం ఇది.
“మోడీ గుజరాత్ సీతయ్య. కాకపొతే కొంత తేడా వుంది. మన
తెలుగు సీతయ్య ఎవడి మాటా వినడు. ఈ గుజరాత్ సీతయ్య అందరి మాటా వింటాడు కానీ చివరకు
తాను అనుకున్నదే చేస్తాడు. ”
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు
ఆయన్ని గురించి వినవచ్చే కధలన్నీ ఇలాగే వుండేవి. మోడీ లాంటి నాయకులు అయిదుగురు
వుంటే చాలు, యావత్ ప్రపంచంలో భారత దేశం అగ్రగామి
కావడానికి ఎంతో కాలం పట్టదు’ అంటూ గుజరాత్ ని సందర్శించిన వాళ్ళు చెప్పేవాళ్ళు.
ఇదిగో, సరిగ్గా ఇలాంటి ప్రచారమే గత
సార్వత్రిక ఎన్నికల్లో మోడీని దేశ ప్రజల దృష్టిలో మొనగాడిని చేసింది. మోడీ అనే
రెండక్షరాలు ఆసేతు హిమాచలం మారుమోగి పోయాయి. మూడేళ్ళ నాడు జరిగిన సార్వత్రిక
ఎన్నికల్లో అద్భుతమైన విజయం ఆయన ఒళ్లో పడింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు.
చూస్తుండగానే మూడేళ్ళు గడిచిపోయాయి.
ఇంకా మిగిలింది రెండేళ్ళు. చివరి ఏడాది ఎటూ ఎన్నికల సంవత్సరమే. మిగిలింది ఒక్క
ఏడాదే. రెండో ఏడు కేవలం లెక్కకే. ఏమి చేయాలన్నా, చేసింది చూపించి జనాలను
ఒప్పించాలన్నా , మెప్పించాలన్నా ప్రధాన మంత్రి
నరేంద్ర మోడీకి ఈ ఒక్క ఏడాదే మిగిలివున్న వ్యవధి. సరయిన సమయం కూడా.
అందరికీ గుర్తుండే వుండాలి. ఏడాది పాలన
పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు మోడీ ఒక బహిరంగ లేఖ రాసారు.
“సేవా పరమో ధర్మః” అనే సూక్తితో మోడీ ఆ లేఖను మొదలు
పెట్టారు. ప్రజలకు సేవ చేయడంలో వున్న తృప్తినీ, ఆనందాన్ని తను ఏడాది కాలంగా
అనుక్షణం ఆస్వాదిస్తూ వచ్చానని ఆయన అందులో పేర్కొన్నారు.
“అంతులేని అవినీతి
రాజ్యమేలుతున్నప్పుడు, నిర్ణయాలు తీసుకోలేని అసమర్ధ పాలనతో జాతి
నవనాడులు కుంగిపోయి వున్న నేపధ్యంలో మీరు నాపట్ల ఎంతో నమ్మకంతో నాకు పగ్గాలు
అప్పగించారు. మీ ఆశలను నిజం చేయడానికే గత ఏడాదిగా నేను అహరహమూ కష్టపడుతూ వచ్చాను’ అన్నారాయన ఆ లేఖలో ఆనాడు.
పేదల అభ్యున్నతికోసం ‘అంత్యోదయ’, పరిశుభ్రత, పారిశుధ్యం కోసం స్వచ్చ భారత్
మొదలయిన ప్రభుత్వ పధకాల జాబితాను ఏకరువు పెట్టారు.
ఈ మాటలు చెప్పిన తరువాత మరో ఏడాది కాలగర్భంలో కలిసింది.చూస్తుండగానే
మూడేళ్ళు గతంలో కలిసి పోయాయి. ప్రజల
ఆకాంక్షలను నెరవేర్చడానికి మోడీ అహరహమూ పడుతున్న కష్టం ఏమన్నా ఫలితాలు ఇచ్చిందా
అంటే చప్పున జవాబు చెప్పడం కష్టం.
లోకం చుట్టిన వీరుడు అని పేరు
తెచ్చుకుంటున్న మోడీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రధానమంత్రి హోదా వున్నప్పుడు, విదేశీ ప్రభుత్వాల ఆహ్వానాలు, దేశ విదేశాల్లో పర్యటనలు, ఎర్ర తివాచీ స్వాగతాలు, మీడియాలో ప్రచారాలు ఇవన్నీ
సహజాతిసహజం. వాటివల్ల సొంతగడ్డకు యెంత మేలు జరిగిందన్నదే ప్రధానం.
మూడేళ్ళుగా ఎలాంటి మచ్చా లేకుండా స్వచ్చమైన
పాలన అందించామని ఎన్డీయే నాయకులు చెబుతున్న దాంట్లో వాస్తవం వుంది. అయితే యూపీఏ
మొదటి విడత మన్మోహన్ సింగ్ పాలన కూడా ఇలాగే స్వచ్చంగా సాగిందన్న నిజాన్ని కూడా
గుర్తు పెట్టుకోవాలి. పతనం మొదలు కాకూడదు. మొదలయితే ఆ వేగం వడీ యెంత ఉధృతంగా
ఉంటాయనేది యూపీయే రెండో విడత పాలన మనకు విడమరచి చెబుతోంది.
గత ప్రభుత్వాల వైఫల్యాల పాత జాబితాలను పదేపదే వల్లె వేస్తూ
పొతే, ప్రజలు కొంతకాలంపాటే అరాయించుకుంటారు. కాలం
గడుస్తున్న కొద్దీ, తరువాత కూడా పాత పల్లవే అందుకుంటూ వుంటే, ప్రజలు విసిగిపోయి, మరొకర్ని పల్లకీ ఎక్కించే ఆలోచన మొదలు
పెడతారు.
రాజకీయాల్లో వున్నవాళ్ళు రాజకీయం చేయక
తప్పదు. కానీ ప్రజలు, పరిపాలన కూడా పాలకులకు అంతే ప్రధానం. ఈ
సత్యం ఎరుకలో వుంచుకుంటే పాలకులకూ మంచిది, ప్రజలకూ మంచిది.
25, మే 2017, గురువారం
ఇక్కడిలా! అక్కడలా!!
మిట్ట మధ్యాన్నం, ఎర్రటి ఎండలో కారు
ఆగిపోయింది. ఆగిపోలేదు, డ్రైవర్ ఆపాడు. ముందు రెండు కార్లు ఆగివున్నాయి. ఒక కార్లో
నుంచి దిగిన యువకుడు, రెండో కార్లో డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తిని బయటకు లాగే
ప్రయత్నం చేస్తున్నాడు. అసలే ఆ జంక్షన్లో ట్రాఫిక్ ఎక్కువ. నాలుగు వైపుల నుంచి
ఎవరి దారి వారిదే అన్నట్టు వెడుతుంటారు.
ముందు వెడుతున్న కారు వెనుక భాగానికి దెబ్బ తగిలింది. వాడు
ఊరుకుంటాడా! వెనక కారు వాడితో పేచీ పెట్టుకుంటాడు. అదే అక్కడి సీను. రెండూ ఏసీ
కార్లే. కానీ వాళ్ళ ఖర్మ. ఎర్రటి ఎండలో తగాదా పడుతున్నారు. అది ఎప్పటికి తేలేనో!
ఇది చూసిన తరువాత అనేక ఏళ్ళ క్రితం
అమెరికాలో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది. మా పిల్లలతో కలిసి ఎటో టూరు వెళ్లి
తిరిగి వస్తున్నాము. దారిలో మెక్డొనాల్డ్ వద్ద కారు పార్కు చేసి వెళ్ళాము. తిరిగి
వచ్చేసరికి, మరో కారువాడు రివర్స్ తీసుకుంటూ మావాడి కారుని కొట్టాడు. దెబ్బ బాగానే
తగిలింది. చిత్రం! దెబ్బ కొట్టిన పెద్దమనిషి కారు దిగి సెల్ ఫోన్ లో దెబ్బతిన్న
భాగాన్ని, కారు నెంబరు ప్లేటు ఫోటో తీసుకున్నాడు. అలాగే మా వాడూ. ఇద్దరూ వారి వారి
భీమా కంపెనీలకి ఫోటోలు, మెసేజ్ ద్వారా
విషయం ఎరుక పరిచారు. అంతే! వాళ్ళ దారిన వాళ్ళు, మా దారిన మేము.
వారం తిరక్కముందే కారు దెబ్బ
తిన్నందుకు పరిహారం చెక్కు రూపంలో మా వాడి బ్యాంకుకు పంపినట్టు భీమా కంపెనీ నుంచి వర్తమానం వచ్చింది.
లేబుళ్లు:
ఇది ఇండియా.. అది అమెరికా.
20, మే 2017, శనివారం
ఈవీఎం లు, విలేకరిగా ఓ జ్ఞాపకం
1983 అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రత్యేకత
వుంది. అదేమిటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్
మిషన్లను మొదటిసారి ప్రయోగాత్మకంగా షాద్ నగర్ నియోజకవర్గంలో ఉపయోగించారు.
ఇంకోటేమిటంటే తొలిసారి ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో పోటీ
చేసింది.
షాద్
నగర్ లో ఈవీఎం కౌంటింగ్ కావడం వల్ల గంటల్లోనే ఫలితం వెలువడింది. కాంగ్రెస్
అభ్యర్ధి డాక్టర్ పి. శంకరరావు సమీప ప్రత్యర్ధి, టీడీపీ అభ్యర్ధి పుట్టపాగ
రాధాకృష్ణపై విజయం సాధించారు. రిటర్నింగ్ ఆఫీసరు అధికారికంగా ప్రకటించిన ఆ సమాచారాన్ని మొదట హైదరాబాదులోని ప్రాంతీయ వార్తా విభాగానికి, తరువాత ఢిల్లీ
ఆలిండియా రేడియో కేంద్రానికీ అందించాను. మధ్యాన్నం ప్రాంతీయ వార్తలతో పాటు
గంటగంటకూ వెలువడే ఎన్నికల ప్రత్యేక బులెటిన్లలో కూడా ఆ వార్తను ప్రసారం చేసారు.
అలాగే సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే ఇంగ్లీష్, తెలుగు వార్తల్లో కూడా
శంకరరావు గెలిచిన వార్త ప్రసారం అయింది. మిగిలిన చోట్ల సాధారణ పద్దతిలో బ్యాలెట్
పత్రాలను లెక్కించడం వల్ల తెలుగు దేశం అభ్యర్ధుల ఆధిక్యతలకు సంబంధించిన సమాచారం
మినహా ఫలితాలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనలు రాలేదు. ఆ రోజుల్లో రేడియోలో
ఆధిక్యతలు ప్రకటించే సాంప్రదాయం లేదు. అనధికారికంగా టీడీపీ విజయపధంలో
దూసుకుపోతున్నట్టు సమాచారం వస్తున్నా ఆ వివరాలను ప్రసారం చేయలేని పరిస్తితి.
ఇప్పటిలా వేరే వార్తా మాధ్యమాలు లేకపోవడం వల్ల అందరూ రేడియో వార్తల మీదనే
ఆధారపడాల్సిన రోజులవి. షాద్ నగర్ లో ఈవీఎం లు వాడి కాంగ్రెస్ ఏదో గందరగోళం
చేసిందని వదంతులు బయలుదేరాయి. దరిమిలా కొన్ని గంటల తర్వాత మాన్యుయెల్ గా కౌంటింగ్
జరిగిన ప్రాంతాల నుంచి ఫలితాలు రావడం మొదలయింది. టీడీపీ విజయ పరంపర గురించి అ
తర్వాత రేడియోలో వార్తలు ప్రసారం అయ్యాయి. టీడీపీ అధికారంలోకి రావడానికి అవసరమైన
మెజారిటీ రాగానే టేప్ రికార్డర్ పుచ్చుకుని ఎన్టీ రామారావు గారి స్పందన కోసం
ఆబిడ్స్ లోని ఆయన గృహానికి ఆదరాబాదరాగా వెడితే అక్కడి సిబ్బంది చెప్పిన మాట ఇది.
“సారు మేడ మీదకు వెళ్ళిపోయారు,
చాలాసేపయింది నిద్రపోయి”
లేబుళ్లు:
ఈవీఎం లు,
ఎన్టీ రామారావు,
విలేకరిగా ఓ జ్ఞాపకం
16, మే 2017, మంగళవారం
శిక్షలు మరో రకంగా వుండాలి
ఎంత కష్టం ఎంత కష్టం
ఆరు నెలల కిందట మేము ఈ
ప్రాంతంలో అద్దెకు వచ్చినప్పుడు మా అపార్ట్ మెంటుకు ఐ మూలగా ఓ ఖాళీ
స్థలం వుండేది. కొద్ది రోజుల్లోనే అక్కడ ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. హైదరాబాదు
లాంటి నగరంలో ఇది కొత్త విషయం ఏమీ కాదు. కానీ కొత్తగా ప్రస్తావించుకోవడానికి కొత్త
నేపధ్యం ఒకటి కలిసి వచ్చింది. కరెంటు లేకపోవడం వల్ల ఎండ గాలో వడ గాలో ఏదో ఓ గాలి
వస్తే చాలనుకుని పడక గది కిటికీ తెరిచాను. ఆర్నెల్ల కిందట ఆకారం కూడా లేని ఆ
నిర్మాణం చిత్రంగా రెండంతస్తులు లేచింది. మూడో దానిమీద పిల్లర్లు
వేస్తున్నారు. ఓ యాభయ్ అరవై మంది కూలీలు ఆడా మగా సుశిక్షితులయిన వారి మాదిరిగా
నిర్విరామంగా ఆ ఎర్రటి ఎండలో పనిచేస్తున్నారు. కొందరు కంకర ఎత్తి పోస్తుంటే
మరికొందరు ఇసుక, సిమెంటు కొలిచి గుండ్రంగా తిరుగుతున్న ఓ మిక్సింగ్ యంత్రంలో
పోస్తున్నారు. అలా తయారయిన కాంక్రీటును ఓ చిన్న లిఫ్ట్ లాంటి యంత్రం మూడో
అంతస్తుకు చేరుస్తోంది. అక్కడ దాన్ని దించుకున్న కూలీలు బొచ్చెల్లో తీసుకు
వెళ్ళి పిల్లర్లను నింపుతున్న కూలీలకు అందిస్తున్నారు. అంతా ఒక క్రమ పధ్ధతి
ప్రకారం జరిగిపోతోంది. బోలెడు కష్టపడిపోతున్న ఫీలింగు కూడా వారిలో వున్నట్టు దూరం
నుంచి గమనిస్తున్న నా దృష్టికి ఆనలేదు. సరిగ్గా వొంటి గంట కాగానే గంట
కొట్టినట్టు పనులు ఆగిపోయాయి. ఎవరికి వారు అక్కడ డ్రమ్ముల్లో వున్న నీళ్ళతో
మొహం కాళ్ళూ చేతులూ కడుక్కుని ఇళ్లనుంచి తెచ్చుకున్న భోజనాలు చేశారు. చూడగలిగిన
కళ్ళు వుండాలే కాని చుట్టూ వున్న ప్రపంచంలో చూడగలిగినవి ఎన్నో వున్నాయి. అయినా
ఇంకా ప్రపంచం చుట్టిరావాలన్న యావ చావడం లేదు, ఎందుకో అర్ధం కాదు.
కరెంటు వచ్చింది. ప్యాను
తిరిగింది. వొళ్ళు చల్లబడింది. కానీ ఎర్రటి ఎండలో కూలీల చుట్టూ తిరిగొచ్చిన మనసు
మాత్రం ఇంకా వేడిగానే వుంది. ఆవిర్లు కక్కుతూ నే వుంది.
అసలు విషయం ఇప్పుడు
విప్పుతాను. మొదట్లో నేపధ్యం ఒకటుంది అని చెప్పాను గుర్తుంది కదా! అదే ఇది.
నగరంలో అక్రమ నిర్మాణాల
పేరుతొ పెద్ద పెద్ద భవనాలను కూల్చివేస్తున్న వార్తలు వింటున్నాము. నిబంధనలకు
విరుద్ధంగా ఎటువంటి నిర్మాణాలను
అనుమతించకూడదని నమ్మే వారిలో నేనూ వున్నాను.
అక్రమ కట్టడాలను తొలగిస్తున్న ఫోటోలను పత్రికల్లో చూసినప్పుడు, ఇదిగో
ఇప్పుడు చెప్పానే మా ఇంటి దగ్గర నిర్మాణంలో వున్న ఇంటికంటే అవి చాలా పెద్దవిగా
అనిపించాయి. ఆరునెలల నుంచి కడుతున్నా ఇది ఇంకా పూర్తి కాలేదు. అలాటిది ఆ
కూల్చేసిన ఇళ్లు కట్టడానికి కనీసం ఏడాది పట్టి వుంటుంది. అన్నాళ్ళు అధికారులు, అనుమతులు
లేకుండా జరుగుతున్న ఆ నిర్మాణాలను గమనించలేదా! లేదా కళ్ళుండి కూడా నేను
గమనించనట్టు వాళ్ళూ చూడలేదా! ఒక్క ఇల్లు కట్టడానికే ఇంతమంది ఇంతటి ఎండాకాలంలో తమ
రక్త మాంసాలను ఫణంగా పెట్టి ఎంతో శ్రమ పడుతున్నారు. ఇసుక
సిమెంట్ కంకరతో పాటు వారి స్వేదం కూడా ఆ నిర్మాణం అణువణువులో వుంది. ఎంతో
కష్టపడి కట్టిన ఇళ్లను ఏమాత్రం కష్టపడకుండా యంత్రాల సాయంతో కూల్చివేయడం ఏం న్యాయం? ఎలాటి
న్యాయం అనిపించుకుంటుంది. అంత డబ్బు అది ఎవరిదయినా కావచ్చు పూర్తిగా నీళ్లు
వొదులుకున్నట్టే కదా! ఇన్నాళ్ళు
అనుమతి లేని నిర్మాణాలను కాసులకు కక్కుర్తిపడి అనుమతిస్తూ వచ్చిన అధికారులను, సిబ్బందిని
వారు ఎవరయినా సరే, వారి వెనుక ఎవరు వున్నా సరే, కనీసం
ఓ యాభయ్ మందిని
నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలనుంచి ఉన్నపెట్టున శాశ్వితంగా తొలగిస్తే
మళ్ళీ ఇలాటి నిర్మాణాలు జరుగుతాయా!
దయచేసి, మిగిలిన అన్ని
విషయాలు పక్కనబెట్టి ఆలోచించండి.
లేబుళ్లు:
Demolition of illegal constructions
12, మే 2017, శుక్రవారం
ఈ స్థాయి నాది కాదు.........
సైకిల్ పైనా, సిటీ బస్సుల్లోను తిరిగే
ఏకాంబరానికి చిన్న ఉద్యోగం వచ్చింది. యేవో చిన్నపనులు చేసిపెట్టి ఓ స్కూటరు
కొనుక్కున్నాడు. అందులో సుఖం తెలిసివచ్చింది. ఆ హాయిని నిలుపుకోవడానికి కొంత అదనపు
ఆదాయం కావాల్సి వచ్చింది. అందుకోసం అవకాశాలు వెతుక్కున్నాడు. ఆ అవకాశాల పేరే ఆమ్మామ్యా!
అదే లంచం!
ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. కారు
కొనుక్కున్నాడు. ఆ సుఖమయ జీవితాన్ని మరింత పదిలం చేసుకునేందుకు ‘అవకాశాలు’ పెంచుకున్నాడు.
జీతం పెరిగింది, జీవితమూ పెరిగింది. ‘అవకాశాలూ’
పెరిగాయి. దాంతో పట్టుబడే అవకాశాలు పెరిగాయి. పట్టుబడిపోతాననే భయమూ పెరిగింది.
పట్టుబడకుండా ఏం చేయాలనే ఆలోచనలూ పెరిగాయి.
ఉద్యోగం ఒదిలేసాడు. కంట్రాక్టర్ అవతారం
ఎత్తాడు. లంచాలు తీసుకున్న చేతులతోనే లంచాలు మేపాడు. కోట్లకు పడగలెత్తాడు. అయినా
పడగనీడన బతికే బతుకులో సుఖం
లేదనిపించింది. రక్షణ కవచం కావాలనుకున్నాడు. సంపాదించిన సొమ్మునే పెట్టుబడిగా
పెట్టి రాజకీయాల్లో ప్రవేశించాడు. అధికార పదవులు చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు ‘అవకాశాలు’
మరింత పెరిగాయి. జీవితంలో స్థాయి కూడా ఎంతో పెరిగింది. పట్టుపడతాననే భయం
తగ్గిపోయింది. ఎందుకంటే పట్టుకునేవారే ఇప్పుడు తన గుప్పిట్లో వున్నారు.
అయినా సరే! ఏదో ఆందోళన! ఏదో భయం. ఇలా
ఎన్నాళ్ళు ? పైకి చెప్పుకోలేడు.
ఒకప్పటి స్థాయిని గుర్తు తెచ్చుకోలేడు. ఇప్పుడున్న స్థాయిని
వదులుకోలేడు.
లేబుళ్లు:
ఈ స్థాయి నాది కాదు.........,
లంచాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

